మాటలతో కాపురం - పి బి రాజు

matalato kapuram

"మాటలతో కాపురం”

అవును. మీరు సరిగ్గానే చదివారు.

మరీ చోద్యం కాకపోతే ..."కాపురం పెళ్ళాంతో చేస్తారు కానీ మాటలతోనా!" అని ఆశ్చర్యపోకండి.

అది నిజంగా నిజం. అవును మరి!

నాకు కొత్తగా పెళ్ళై కొత్త కాపురం పెట్టానా !... అవును అది మీకెలా తెలుస్తది?

నేను చెబితేగా! అయితే వినండి.

నాకు కొత్తగా ఈ మధ్యనే పెళ్ళయింది. కొత్త పెళ్ళాం కాపురానికి కూడా వచ్చేసింది.

"చిన్న పిల్ల ...గారాబంగా పెంచాం అల్లుడూ! జాగ్రత్తగా చూసుకోండి!" పిల్ల చేతిని నా చేతుల్లో పెడుతూ వలవల ఏడ్చేసింది మా అత్తగారు."మీరేం కంగారు పడకండి అత్తగారూ! కంటికి రెప్పలా కాపాడుకొంటాను " అని భరోసా కూడా ఇచ్చేశాను మెరిసిపోతున్న కొత్త పెళ్ళాం కళ్ళలో మెరుపు చూస్తూ;

"అది కాదు అల్లుడూ! చిన్న పిల్ల కదా వంట చేయడం కూడా సరిగ్గా రాదు ... కొంచెం సర్దుకుపోండి"

"అలాగే అత్తమ్మా! మీరింతగా చెప్పాలా? తనకెలాంటి కష్టం రానివ్వను. మీకెలాంటి ఇబ్బంది పెట్టను. నన్ను నమ్మండి. " అని ఓదార్చాను." అసలే నోట్లో నాలుక లేని పిల్ల ... ఎలా బతుకుతుందో" ఏడుపాపుకుంటూ అంది అత్తగారు."ఇంకోసారి చెప్పమ్మా! నోట్లో నాలుక లేదా? అయ్యో! ...పాపం బావ!" బామర్ది వేళాకోళం.

"రేయ్!" చెయ్యి పైకెత్తింది సిగ్గుల మొగ్గ.

వాడు తప్పించుకుని పారిపోయాడు.

ఆమె నాకు మేనత్త. చిన్నప్పట్నుంచి చనువెక్కువే. ఈ పెళ్ళాం అనే పిల్ల పుట్టినప్పుడే నాదేనని రాసిపెట్టేశారు అక్కడ బ్రహ్మే కాదు ఇక్కడ అత్త,మామ,అమ్మా నాన్నలు కూడా. ఆ చనువుతోనే ఆమె అన్ని జాగ్రత్తలు చెప్తూంది . అందులోనూ మా కాపురం హైదరాబాదులో అదీ ఆమె బాధ. మరి హైదరాబాద్ లో నేను ఉద్యోగం వెలగపెడ్తుంటా లెండి.

అనుకున్నట్టు - అదిగో హైదరాబాద్ లో కాపురం కూడా పెట్టేశాం. నాలుగు రోజులుండి కొత్త కాపురాన్ని కనిపెట్టడానికి; కావాల్సినవి కొనిపెట్టడానికి మా అమ్మా; నాన్నలు కూడా మాతోబాటు వచ్చారు.

వచ్చిన రోజే " అమ్మాయీ! కొద్ది స్ట్రాంగ్ గా కాఫీ పెట్టమ్మా? తలనొప్పిగా ఉంది" అన్నారు మా నాన్నగారు.

ఇంకేముంది? మా ఆవిడ నడుం బిగించి కాఫీ పెట్టి తలా ఒక గ్లాస్ ఇచ్చింది.

ఒక సిప్ చేసి చేదు భరించలేక బయట ఉమ్మేశాను.

"ఏంట్రా?" మా నాన్న అడిగాడు.

షుగర్ లేదు నాన్నా?"

ఆయన గట్టిగా ఒక నవ్వు నవ్వి అన్నాడు - " నాకు షుగరని చక్కెర వేయలేదు కోడలు పిల్ల! పర్వా లేదు. అందరూ అలాగే తాగండి. ఎందుకంటే మన కుటుంబమే షుగర్ ప్రోన్ అట. అందరూ షుగర్ తగ్గించమని డాక్టర్ ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నాడు. "

"మామయ్యికి షుగరనీ" నసిగింది.

"చూడు! అమ్మాయికి అప్పుడే హెల్త్ కాన్షియస్ వచ్చేసింది. ముందుచూపుగా ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తోంది వచ్చీ రాగానే! నువ్వూ… వున్నావు ముప్పై ఏళ్ళుగా ఎప్పుడైనా ఇలాంటి కాఫీ పెట్టావా? నా ఆరోగ్యాన్ని పట్టించుకున్నావా?" అమ్మకు క్లాస్ పీకాడు నాన్న.

పనిలో పనిగా కొత్త కోడల్ని తెగ మెచ్చేసుకున్నాడు. అలా మా నాన్న దగ్గర మంచి కోడలనిపించేసుకుంది.

నాకనుమానం వచ్చి "అవును బంగారం! మీ మామగారికి షుగరని నీకెలా తెలుసు?" అనడిగా. ఎందుకంటే అది మాకే గుర్తు లేదు. ఆయనా పట్టించుకోకుండా ఏ జాగ్రత్తలు తీసుకునే వాడు కాదు. అంతా లైట్ గా తీసుకునే రకం.

జవాబుగా ఒక నవ్వు విసిరి; ఆ వాల్జడను వయ్యారంగా తిప్పుతూ వంటింట్లోకి దూరింది.

ఆ రాత్రి కూరల్లో ఉప్పే లేకుండా చేసింది.

ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని ఊంచేశాను- "ఉప్పే లేదంటూ"

"అత్తయ్యగారికి హై బీ పీ. అందుకే తగ్గించాను." మెల్లగా గొణిగింది.

ఇక అమ్మ మురిసిపోయింది. "మా యమ్మే. నా ఆరోగ్యం గూర్చి ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు." కోడలి తలపైన చెయ్యేసి ప్రేమతో నిమిరింది.

అత్తగారి దగ్గర కూడా అలా మంచి మార్కులు కొట్టేసింది కొత్త కోడలు.

"బీ పీ కంట్రోల్ లో ఉంచుకోవాలి అత్తయ్యగారు! ఉప్పు తగ్గించేసి రోజూ అలా వాకింగ్ చేస్తే చాలు. ఏమీ ఇబ్బంది ఉండదు." సలహా కూడా ఇచ్చేసింది.

"మీరు కూడా మామయ్యగారూ! మందులు రెగ్యులర్ వేసుకుంటూ కొంచెం ఆహార నియమాలు పాటిస్తే ఏం ఇబ్బంది ఉండదు. ఇక మీదట మీరిద్దరూ ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. లేకుంటే నేనూరుకోను" మెత్త మెత్తగానే హెచ్చరించింది.

అంతే కాదు. మర్నాడు ఇద్దర్నీ బలవంతంగా దగ్గర్లోని హాస్పిటల్ కు తీసికెళ్ళి చెక్ చేయించి మాత్రలు తీసుకొచ్చి ఎలా వాడాలో చెప్పి;ఆ పూటకి దగ్గరుండి మరీ వేయించింది. ఏమేమి తినాలో; ఏవేవి తినకూడదో దారి పొడుగునా ఏకరువు పెట్టింది. తమ ఆరోగ్యం పట్ల కోడలు చూపిస్తున్న ఆదరణకు ఇద్దరూ తెగ మురిసిపోయారు.

మూడో రోజు చుట్టు ప్రక్కల అమ్మలక్కలంతా మా ఇంట్లో సమావేశమైపోయారు. మా ఆవిడ కలుపుగోలుతనం అలాంటిది మరి! క్షణం తీరిక లేకుండా వసపిట్టలాగా వాగడం కూడా తెగ నచ్చేసింది వారికి. ఇక ఆమె సమక్షంలో నాకు; నా ఆరోగ్యానికి ఎలాంటి ఢోఖా లేదని గట్టి నిర్ణయానికి వచ్చేశారు అమ్మానాన్న.

మా అమ్మయితే "అబ్బాయి అమాయకుడు. జాగ్రత్తగా చూసుకోమ్మా! మనవాళ్ళు ఇక్కడెవరూ లేదు. మీరే ఒకరికొకరు తోడు.. జాగ్రత్తగా కాపురం చేసుకోండి" నా చేతులు ఆమె చేతుల్లో పెట్టింది. ఇద్దర్నీ చుట్టుపక్కల వారికి అప్పచెప్పింది.

కొంటెగా కళ్ళు గీటి భుజాలెగరేసింది మా ఆవిడ. బుగ్గలు ఎరుపెక్కాయి.కొత్త కాపురానికి కావాల్సినవి కొనిచ్చి; కోడలికి కాపురం మెలకువలు బోధించి నాలుగో రోజే సంతృప్తిగా రైలెక్కేశారు అమ్మా;నాన్నలు. ఇక నా పాట్లు మొదలయ్యాయి.

నాకు రుచి రుచిగా; రక రకాలుగా వంటలు చేసి పెట్టాలని నానా తంటాలు పడేది నా సతీమణి. వంటల పుస్తకాలు; టీ వీ షోలు; అక్కింటి పక్కింటి వాళ్ళ సహాయం తీసుకుంటూ ఆపసోపాలు పడేది.

గ్యాస్ పై పాత్రలు పెట్టేసి, ఫోన్ లో వాళ్ళమ్మ డైరెక్షన్ లో కూరలు చేసే విధం చూసి తరించాల్సిందే.ముఖమంతా చెమటతో "అబ్బ! ఈ రోజు వంట అయిపోయింది" అని గొప్ప రిలీఫ్ తో వంటింట్లోంచి బయటికి వస్తున్న ఆమె అవతారం చూస్తే జాలేస్తుంది.వడ్డించిన తర్వాత చూడాలి ఆమె టెన్షన్ – ఐ ఏ యస్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు. ఆ వంటల్లో ఏదో ఒకటి తక్కువ అవడమో; ఎక్కువ అవడమో జరిగేది.

ఉప్పు తక్కువనో; పులుపు ఎక్కువనో; కారం ఇంకాస్తా వేయాలనో చెప్పాననుకోండి. ఐ ఏ యస్ పరీక్ష తప్పినంత బాధ పడిపోయేది. బాగా నిరుత్సాహపడేది. నేను ఎంత కష్టపడి చేశాను అని మూతి ముడుచుకొనేది. నేను తినక పోతే తను తినేది కాదు. ఈ "అతి" ప్రేమను తట్టుకునేది చాలా కష్టమనిపించేది.

"ఈ రోజు కూరలు చాలా బాగా చేశావు." అంటే ఆ రోజంతా నేలపైన నడిచేదే కాదు. కాకపోతే నా దురదృష్టం ఏమంటే - బాగుందని పొగిడితే ఇక జన్మలో మళ్ళీ ఆ టేస్ట్ రాదు. "అలా చేయరాదే" అంటే "అలాగే చేశానండి" అంటుంది.

"మరి ఆ టేస్ట్ రాలేదేమిటి?" అంటాను.

"ఏమోనండి. మొన్న చేసినట్లే చేశానే..." అంటుంది అమాయకంగా.

ఆమె చేసే ఏ వంటా ఒక రకంగా ఉండదు. రోజుకో రుచి. వాసన. స్వభావం. మాటలు మాత్రం ఏ రోజుకు తగినట్లు ఆ రోజుకు మార్చేసి నవ్వేస్తుంది.అందుకే ఏది తక్కువయినా; ఏది ఎక్కువైనా మందులా మింగడం అలవాటు చేసుకుంటున్నాను.

కాకపోతే వాటికి ఆమె చెప్పే కారణాలు వింత వింతగా ఉంటాయి.

ఉప్పు తక్కువయిన రోజు - " ఉప్పు ఎక్కువైతే బీ పీ వస్తుందండి" అంటుంది.

కారం తక్కువయిన రోజు - " కారం ఎక్కువయితే అల్సర్ వస్తుందండి." అంటుంది.

కాఫీ లో షుగర్ తక్కువయిన రోజు - "షుగర్ కు మంచిదండి" అంటుంది.

ఎక్కువయిన రోజు - "ఎప్పుడూ చప్పిడి కూడేనా? " అంటుంది.

మాటలు నేర్చిన వారికి ఏం చెప్పగలం?

ఒకరోజు ఉడికీ ఉడకని వంకాయ కూర తెచ్చి పెట్టింది.

"ఇదేమిటే" అన్నాను.

"ఈ రోజు మంతెన సత్యనారాయణ టీవీలో చెప్పారండీ ! పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచిదట!"

"పచ్చివే పెట్టలేకపోయావా?" ఆగ్రహం ఆపుకోలేక అరిచాను.

"మీరు మరీను! ఆయనే ఒక కిటుకు చెప్పాడు. మనకి పచ్చివి తినడం అలవాటు తప్పింది కాబట్టి హాఫ్ బాయిల్డ్ చేసుకోమని. అందుకే సగమే ఉడకబెట్టా. పూర్తిగా ఉడకబెడితే ఫోషకాలు పోతాయట. ఇలా అయితే ఆరోగ్యానికి ఆరోగ్యం. గ్యాస్ ఆదాకు ఆదా." ముసిముసిగా నవ్వింది.

"అసలే గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి" ముక్తాయింపుగా నవ్వు.

"ఓ! అలా కూడా ఉందా?" అని నోరెల్లబెట్టడం నా వంతయింది - ఆవిడ పొదుపు మంత్రానికి నవ్వాలో ఏడ్వాలో తెలియక.

మర్నాడు - పూర్తిగా ఉడికిపోయిన వంటకం పెట్టింది.

అదిరిపడి "మళ్ళీ! ఇదేమిటే!" అన్నాను.

"పక్కింటి బామ్మగారు చెప్పారండి. పచ్చి కూరలు మగవారికి మంచిది కాదట. ఆయువు క్షీణిస్తుందట. బాగా ఉడకబెట్టి తింటే బాగా జీర్ణమై ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందట." తన తెలివికి తనే మురిసిపోయింది.

"తెల్లారినట్లే ఉంది తెలివి." విసుక్కున్నాను.

"అదేంటండీ! మీరు నూరేళ్ళు నిండుగా ఉండాలని నా తాపత్రయమంతా!" బొంగురు గొంతుతో మూతి బిగించింది. విసుక్కున్నా; కోపగించినా; సరిగ్గా తినక పోయినా నెత్తి మీదే ఉంటుంది నీళ్ళు. కన్నీళ్ళతో మంచం ఎక్కేస్తుంది.

అసలే కొత్త ప్లేస్, కొత్త కాపురం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనని అనుమానం. భయం కూడా! పైగా అత్తగారికి జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాను. అందులోనూ మాట తప్పని వంశం మాది.

నా భయం నిజమయింది. అనుకున్నదంతా అయింది. ఒక రోజు ఉదయమే మా చిన్న బామర్ది వూడిపడ్డాడు.

"ఏంట్రా? చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు?" అన్నాను.

"ఏం? చెప్పుంటే జాగ్రత్తలు తీసుకునే వాడివా?" అన్నాడు.

నేనవ్వాక్కయ్యాను.

ఇంతలో ఊడిపడింది మహా తల్లి " ఏంట్రా! ఎప్పుడొచ్చావు" అంటూ.

"ఇప్పుడు చెప్పక్కా? ఏమయింది."

"ఏమయిందీ.."

"భయపడకక్కా? నేనున్నాను. ఇలాంటి వార్ని గృహహింస కింద బుక్ చేసి బొక్కలో తోసేయాలి."

"ఏమంటున్నావు రా? గృహహింస ఏంటి? బొక్కలో తోసేయడమేమిటీ? "

"నిజం చెప్పక్కా? నిన్న మధ్యాహ్నం నువ్వెందుకేడ్చావ్?" సూటిగా అడిగాడు.

"ఎప్పుడు రా?"

"నిన్న మూడు గంటలకు ... నాన్న నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? బావ నిన్నేమన్నాడు?"

"అప్పుడా..?" గట్టిగా నవ్వింది. నాకంతా అయోమయంగా ఉంది.

"నిన్న టీ వీ సీరియల్ చూస్తున్నానా? అందులో హీరోయిన్ కష్టాలు చూడలేక ఏడుపు వచ్చింది. అప్పుడే నాన్న ఫోన్ చేశాడు. ఏడుపు కంట్రోల్ కాలేదు. అలాగే మాట్లాడి ఉన్నట్లుంది." చాలా తేలిక గా చెప్పింది. "అంతేనా? ఏదైనా దాస్తున్నావా? చెప్పు!""అంతేరా! పాపం... మీ బావ చాలా మంచోడు రా!"

"మేమంతా ఎంత కంగారుపడ్డామో తెలుసా?" అని మెత్త పడ్డాడు.

అబ్బా! బతికించింది. వాతావరణం తేలిక పడింది.

"లేచి స్నానం చేసి టిఫిన్ తినరా!" అని ఆ ఏర్పాట్లల్లో మునిగింది. నన్ను కొరకొరా చూస్తూ బాత్ రూం కెళ్ళాడు వాడు. వాడి ఏనుగు గున్న రూపం వాడూనూ! అంతే కాదు. నాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళను విచారించి రెండో రోజు రైలెక్కాడు.వాడెళ్ళేంత వరకు నా గుండెల్లో రైళ్ళు పరుగెడుతూనే ఉన్నాయి.వెళ్తూ వెళ్తూ " సారీ! ఏమనుకోకు బావా! మా అక్క చిన్నపట్నుంచీ అంతే! నవల చదివినా...టీ వీ సీరియల్ చూసినా పాత్రలో లీనమైపోద్ది . … మా అక్క ఫీల్ అవుద్దనీ...హీ...హీ...హీ బిల్డప్ ఇచ్చా" అన్నాడు.

"వీడి దుంప తెగా!" ఏడవ లేక నేనూ నవ్వాను.

ఒక రోజు - "పండక్కి మైసూర్ పాక్ చేయనాండీ" గారాలు పోయింది మా ఆవిడ. "చేయడం వచ్చా?" అడిగాను. "వచ్చండి" తల ఊపింది.

"అయితే చెయ్" ఆమె ఉత్సాహాన్ని కాదనలేక సరే అన్నాను. అయితే నేనెంత తప్పు చేశానో సాయంత్రానికి తెలిసింది. ఆఫీస్ నుంచి వచ్చీ రాగానే "వచ్చారా?" అంటూ మైసూర్ పాక్ పళ్ళెంతో రెడీ.

నాకు చాలా ఆనందం వేసింది. కొత్త పెళ్ళాం. కొత్త కాపురం. స్వహస్తాలతో స్వీట్ చేసి ప్రేమగా తీసుకొచ్చిందంటే నేనంటే ఎంత ప్రేమ. చప్పున ము...పెట్టబోయాను కానీ తప్పించుకొని "ముందు స్వీట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి" అంది. ఇక తప్పేదేముంది? ఒక ముక్క తీసి నోట్లో పెట్టుకున్నానంతే! పళ్ళకు గట్టిగా తగిలింది.

"చూడు బంగారం! ఇదేదో చాలా గట్టిగా ఉంది" అన్నా. అంతే!

ఆమెకు ఏడుపు తన్నుకొచ్చేసింది. "అంతేలెండి! ఎంత కష్టపడి చేశాను. ఎంత ప్రేమతో చేశాను.' అంటూ ముక్కు చీదుకుంటూ అలక పానుపు ఎక్కేసింది.

"నా పైన ప్రేముంటే తింటారు. లేకుంటే నా మీద ప్రేమ లేనట్లే" డిక్లేర్ చేసేసింది.

నేనిప్పుడు ఆ రాళ్ళను తిని నా ప్రేమను నిరూపించుకోవాలి. తప్పదు. ఏం చేద్దాం?

"తప్పదా?" చివరిసారిగా అడిగాను మనసు మార్చుకోమని."తప్పదు" అంది. దేవుడి పైన భారం వేసి ఒక ముక్క నోట్లో వేసుకుని గట్టిగా కొరికాను. ఇంకా గట్టిగా కొరికాను. బలాన్నంతా ఉపయోగించి కొరికాను. మైసూర్ పాక్ కు ఏమీ కాలేదు. రెండు పళ్ళు ఊడి చేతికొచ్చాయి. రక్తం బొట బొటా కారి కింద పడింది.

"ఏమయిందండి! రక్తం వస్తోందేంటీ" కంగారుగా పరుగెత్తికొచ్చింది.

"చెప్పాను కదవే! అవి గట్టిగా ఉన్నాయని." దవడని అదుముకుంటూ చెప్పాను.

అప్పుడు ఆమె కూడా ఒక ముక్క నోట్లో వేసుకుని "అవునండీ! ఇలా ఎందుకయ్యిందీ" అశ్చర్యపోయింది.

"అయ్యో! పాపిష్టి దాన్ని! డాక్టర్ దగ్గరికి పోదాం పదండి" హడావుడి చేసింది.

ఫలితంగా - పది వేలు ఖర్చయింది. వారం రోజుల సెలవు పోయింది. . చుట్టుపక్కల వారికి బాత్రూం లో జారి పడ్డట్టు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పదివేలు పోతే పోయింది కాని ఆ వారం రోజులు నన్ను చాలా జాగ్రత్తగా; ప్రేమగా చూసుకుంది. నేను మరీ సన్నగా ఉంటానని... ఈసారి వచ్చేసరికి అబ్బాయి గుండ్రంగా ఉండాలని బామ్మ నూరి పోసి పంపిందట. రక రకాల వంటలు చేసి తినిపించి; తినక పోతే ఏడ్చైనా...అలిగైనా... తినేట్లు చేయాలని సలహా ఇచ్చిందట. వంటల్లో తన ప్రావీణ్యాన్ని అంతా రంగరించి ప్రయోగాలు మొదలెట్టింది. వంట పుస్తకాలు, టీ వీ లలో వంట ప్రోగ్రాములు చూసి చూసి రక రకాల వంటలు చేసి చేసి అలసిపోయింది. నేను గుండ్రం మాట అటుంచి మరింత సన్నబడ్డాను. నీరసించిపోయాను. "ఏంట్రోయ్! కొత్త పెళ్ళికొడుకా! పెళ్ళయితే ఎవరైనా లావెక్కుతారంటారు! నువ్వేం? చిక్కిపోతున్నావు? " అంటూ వేళాకోళం మొదలెట్టారు మిత్రులు.

ఓ మంచి మూడ్ చూసి "బంగారం! నాకో ఉపకారం చేసిపెడ్తావా?" అన్నాను.

"అదేంటండీ! మీ మాటే నాకు వేద వాక్కు. మీ మాట ఎప్పుడైనా కాదన్నానా?" అంది.

"అయితే! ఇలాంటి ప్రయోగాలు ఇక చేయబాకు" అన్నాను నసుగుతూ.

"మొగుడికి ఈ విధంగా వండిపెట్టి మనసు చూరగొనాలని మా బామ్మ చెప్పిందే!"

"మీ బామ్మ అలా చెప్పిందా? అందుకే పాపం ఆమె మొగుడు అంత త్వరగా టపా కట్టేశాడు."

"అయ్యయ్యో! అవునా?..."

"ఇప్పుడు చెప్పు! ప్రయోగాలు...."

"లేదు... లేదండి! ఇక చేయను."

"ఒట్టు."

"ఒట్టు." నెత్తిన చేయి పెట్టుకుంది.

గుడ్." అన్నాను దగ్గరికి తీసుకుంటూ.

అప్పట్నుంచి ప్రయోగాలికి ఫుల్ స్టాప్ పడిపోయింది.

ఒకసారి వూరెళ్ళినపుడు - "మా అమ్మాయి వంటలు ఎలా ఉన్నాయి అల్లుడూ!" అని పరామర్శించారు మామగారు.

ఆమె పాకశాక నైపుణ్యాన్ని వివరించి "ఆమె చెప్పేంత వరకు అది ఏ కూరో నా కర్థం కాదు" అని వాపోయాను. అదేదో ఘనకార్యం అయినట్టు గట్టిగా నవ్వాడాయన.

"ఇంతకీ అమ్మాయీ! ఎన్ని గంటలకు లేస్తావు" అనడిగాడు కూతుర్ని.

ఏడు గంటలకే లేసేస్తాను డాడీ" అంది ఆవిడ గొప్పగా.

"అంత అర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తావు?" అన్నాడాయన వ్యంగ్యంగా- నవ్వుతూ.

"ఏమేవ్! నీ కూతురు ... అర్లీ ఇన్ ద మార్నింగ్ ఏడు కే లేచి..."

"చాల్లేండి వెటకారం! చిన్న పిల్ల ఆ మాత్రం చేసుకుపోతుంది ...సంతోషపడకుండా.." అని అత్తగారి ముసి ముసి నవ్వులు.

"పాపం! బావను చూస్తే జాలేస్తుంది" బామర్ధి జాలి చూపులు.

తమ ఏకైక కూతురి నిర్వాకం వాళ్ళకొక ముచ్చట గా ఉంది.

"ఏం చేద్దాం!" ఇక నా బాధలు ఎవరికి చెప్పుకోను?

ఉద్యోగపరంగా జిల్లాలు; రాష్ట్రాలు దాటి పనిచేశాను. తనకు మాత్రం ప్రాంతాలతో గానీ; భాషలతో గానీ ప్రమేయం లేదు. ఏ రాష్ట్రమైనా; ప్రాంతమైనా; కులమైనా చుట్టుపక్కల వారితో ఇట్టే కలసిపోయేది. అపార్ట్ మెంట్ లలో ని పంజాబ్, ఒరిస్సా, తమిళ్నాడు, కేరళ, కర్నాటక ఎవరైతే నేం? ఈమెకు తెలిసిన భాష ఈమె మాట్లాడేది. వాళ్ళకు తెలిసిన భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళు. సైగలతో అర్థం చేసుకునేవారు. ఈమె వంటలు వారు నేర్చుకునేవారు. వారి వంటలు; పిండి వంటలు ఈమెకు నేర్పేవారు. వచ్చీరానీ భాషలో అన్ని భాషల పదాలు కలిపి వాళ్ళు మాట్లాడుకునే తీరు విని తరించడం ఎంతటి భాగ్యం?

మగవారు ఆఫీస్ లకు పోయాక చుట్టుపక్కల వారితో మహిళా సమావేశాలలో - ఆయా రాష్ట్రాల పండుగలు, పబ్బాలు, సంప్రదాయాలు; ఆచార వ్యవహారాలు; వారి వారి పుట్టింటి; మెట్టింటి గొప్పలు; తిప్పలు ...ఆయా రాష్ట్రాల రాజకీయాలు; సినిమాలు... ఒకటేమిటి? - అన్ని విషయాలు చర్చకు రావాల్సిందే. ప్రతిరోజూ మహిళా సమావేశాలు; చర్చలు; కలసి షాపింగ్స్.

ఇక రాత్రయితే - నేను ఆఫీస్ కు పోయి; తిరిగొచ్చేంత వరకు ఎవరెవరితో ఏమేమి మాట్లాడింది. ఎలా టైం పాస్ అయింది పూస గుచ్చినట్లు చెప్పాల్సిందే.

కాలమే తెలిసేది కాదు. ఏంటో! అలా గడచిపోయింది జీవితం! వెనక్కి తిరిగి చూసే లోపలే రిటైరైపోయాను.

మొత్తానికి ఏదైతే రాకూడదని ఆమె చెబుతూ వచ్చిందో అన్నీ వచ్చేశాయి. బి.పీ, షుగర్,అల్సర్ లే కాదు అదనంగా చెవులకు మిషనూ; చేతికి కర్రా, కళ్ళకు అద్దాలు కూడా వచ్చాయి. అంతా ఆమె ప్రసాదమే అని నేనంటాను. కాదు మీ వయసు ప్రభావం అని తనంటుంది. అయినా... ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. నిజంగానే ... నాకిప్పుడు నల భీమ పాకమైనా రుచించదు. అంటే మా ఆవిడ అలాంటి గొప్ప వంటకాలేవో చేసేస్తుందని కాదు. ముప్పయి ఏళ్ళుగా అలవాటుపడిపోయాను మరి! ఆ వంటలతో...ఆమె మాటలతో!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు