ఎన్నో సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండక్కి తమ ఊరికి వెళ్ళబోతున్నామని తండ్రి చెప్పగానే ఎక్కడలేని ఉత్సాహమూ కలిగింది ఎనిమిదోతరగతి చదువుతున్న రవికి. ఎప్పుడెప్పుడు సెలవులొస్తాయాని ఎదురుచూడసాగాడు. ఆరోజు రానేవచ్చేసింది..ఉదయాన్నే లేచి ఆటోలో రైల్వేస్టేషనుకి చేరుకున్నారు, రవి, అతడి తల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మి. ట్రైన్ కదలగానే రవికి ఎంతో ఆనందం కలిగింది. "డాడీ, మన ఊరు ఎలా ఉంటుంది? " అనడిగాడు తండ్రిని. శ్రీనివాస్ ఇలా చెప్పసాగాడు. " దేశానికి అన్నం పెట్టే అమ్మల్లాంటివి పల్లెలు. పచ్చని పంటపొలాలకూ, ప్రేమానురాగాలకూ ప్రతీకలు. ప్రత్యేకంగా సంక్రాంతప్పుడు ఎటుచూసినా కనిపించే సంబరాలు చూడడానికి రెండుకళ్ళూ చాలవనుకో...." ఇది వినేసరికి రవిలోని ఉత్సుకత మరింత పెరిగింది. తీరా రైలు దిగి తమ ఊర్లో అడుగు పెట్టగానే కనిపించిన దృశ్యం తండ్రి చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా కనిపించింది. ఏదో అడగబోయిన రవి తండ్రి మొహం చూసి ఆగిపోయాడు. కారణం, శ్రీనివాసే అయోమయంగా దిక్కులు చూడడం గమనించి.
కూలిపోయిన పెంకుటిళ్ళు కొన్ని, ఆధునికంగా వెలసిన అపార్ట్ మెంట్లు కొన్ని, పంటపొలాల సంగతి దేవుడెరుగు, చెట్టూ-చేమా లేవు కనుచూపుమేరలో. వీళ్ళని గుర్తుపట్టేందుకుగానీ పలకరించేందుకుగానీ పాతవారెవరూ లేరు. దాహం కావాలంటే కొనుక్కోవడానికి కూల్ డ్రింక్ షాపులు....మజిలీ చేయడానికి లాడ్జీలు...తాను తిరిగిన పరిసరాలు గానీ, పూరిండ్లు గానీ ఏవీ లేవు....
మధ్యాన్నం దాకా అటూ-ఇటూ తిరిగి అలసిపోయారు ముగ్గురూ. ఏదోక లాడ్జిలో తప్ప ఎక్కడా ఉండే పరిస్థితి లేదు. ఈమాత్రం దానికి ఇక్కడెందుకు, మనింటికే వెళదామని వెనుదిరిగారు.
ట్రైన్ లో కూర్చుని కళ్ళుమూసుకున్న శ్రీనివాస్ కి తమ చిన్నప్పటి పల్లె మనసులో మెదిలింది. చెరిగిపోయిన పల్లె గుర్తులపై వెలసిన ఆధునిక అంతస్థులు ఏదోలా అనిపించింది. మెల్లిమెల్లిగా వాస్తవం అతడికే స్ఫురించసాగింది. కవులూ, చిత్రకారుల వర్ణనల వరకు పల్లెలు బానే ఉంటాయి. వాస్తవానికే పరిస్థితి భిన్నంగా ఉంటుంది....కాలంతో పరిగెత్తే మనిషి ఆలోచన నిన్నటికంటే మిన్నగా ఉండాలని కోరుకుంటుంది. అభివృద్ధి కోసం పట్టణాలవైపు వలస వెళ్ళేలా చేస్తుంది...వీలైనంతకాలం అక్కడే ఉండి ఆర్జన సాగిస్తాడు. మనసు మళ్ళితే తన పల్లె వైపు తొంగి చూస్తాడు... వచ్చినా ఇక్కడ ఉండలేడు. ఉండాలంటే ఇంతకాలం పట్నంలో తాను అనుభవించిన ఆధునిక హంగులను పల్లెకి పరిచయం చేస్తాడు....ఇక విస్తరించిన పట్టణీకరణ పల్లె గుర్తులను చెరిపేసి కొత్త రూపు సంతరించుకుంటుంది. ఒడిదుడుకుల వ్యవసాయం భారమై రియల్ ఎస్టేట్ కు బలైపోతుంది. పంట పొలాలు వెంచర్లై వెలుస్తాయి...తదనుగుణంగా వ్యాపారసముదాయాలు వచ్చివాలతాయి...ఎవరినని ఏం లాభం? ఎవరి లాభం వారిది....ఎవరి స్వార్థం వారిది..ఎవరి అభివృద్ధి వారిది....ఇందులో నాపాత్రా ఉంది..." అనుకున్నాడు తాము అమ్మేసిన పాతకాలం నాటి పెంకుటిల్లు స్థలంలో వెలిసిన అపార్ట్ మెంట్ తలచుకుంటూ...
ట్రైన్ పరిగెడుతూనే ఉంది....పట్నం లాంటి పల్లె నుండి....... పట్నం వైపు..