రచ్చ గెలిచన వాడు - -మౌద్గల్యస

rachha gelichina vadu

అప్పటికింకా సెమినార్ ప్రారంభం కాలేదు. ఆడిటోరియం పలచగా ఉంది. సినిమా వాళ్ల కార్యక్రమమో, మ్యూజికల్ నైట్ లాంటిదో అయితే ఈ పాటికి కుర్రకారంతా అక్కడ మూగేవాళ్లే.

విద్యాసంబంధమైన అంశాలంటే సహజంగా ఉండే అనాసక్తి అక్కడ కనిపిస్తోంది. అన్ని వరసల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఓ మూలగా ఫ్యాన్ కింద సీటు వెతుక్కుని కూర్చున్నాను.

రిసెప్షన్ దగ్గర ఇచ్చిన బ్రోచర్ తిరగెయ్యటం ప్రారంభించాను. వచ్చే అతిథులంతా ప్రతిభాసంపన్నులే. తమ రంగంలో విశేష కృషి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారే. ప్రారంభ కార్యక్రమానికి తక్కువ సమయం కేటాయించటం నాకు నచ్చింది. సాధారణంగా ఓ పూట అంతా ఉపన్యాసాలకే కేటాయించి, భోజన విరామం తర్వాత పత్రాల సమర్పణ, చర్చ లాంటి వాటికి వినియోగించటం అదో ఆనవాయితీ.దీనికి భిన్నంగా నేరుగా అంశాల్లోకి వెళ్లిపోవటం సమయాన్ని సద్వినియోగం చేయటమే అనిపించింది.

ఒక్కొక్కరు వస్తున్నారు. బహుశా వారంతా పరిశోథక విద్యార్దులనుకుంటా. ముందు వరసల్లో సర్దుకుంటున్నారు.

మన రాష్ట్రంలో పరిశోధక విద్యార్ధుల అవస్థలు తలుచుకుంటే నాకెప్పుడూ ఆందోళన కలుగుతూంటుంది. నాలుగేళ్లో, అయిదేళ్లో కష్టపడి డాక్టరేట్ తెచ్చుకున్నా వారిని ప్రతిభావంతులుగా గుర్తించరు. ఉపాధిపరంగా పెద్దగా అవకాశాలుండవు. సాధారణంగా ఏ ఇంజనీరింగో చేసి సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చేరితే వేలకు వేలు జీతాలు వస్తాయి. ఇతర సాంప్రదాయక కోర్సులు చేసినవారు ఏదో ఉద్యోగాల్లో సర్దుకుంటారు. పాపం ఈ డాక్టరేట్లే.. యూనివర్శిటీల్లో పోస్టులు భర్తీ చేసే పరిస్థితి లేక, ఉద్యోగాలురాక, ట్యూటర్ల గానో, టీచింగ్ అసిస్టెంట్లగానో బతకులు లాగించేస్తూంటారు. ఇంత కష్టపడి చేసిన డాక్టరేట్ వల్ల ఫలితం ఏమిటో అర్ధం కాదు. పేరుకి ముందు ‘డీఆర్ ’ అని రాసుకోవటం తప్ప ... చాలా మంది కుమిలిపోవటం నేనెరుగుదును.

‘‘ ఏం రీసెర్చి లేద్దూ. వీళ్లు చేసి కృషి ఏముంటుంది. అంతకు మందు వచ్చిన రీసెర్చి మెటీరియల్ ని కత్తిరించి అతికించటం తప్ప..’’ అని పెదవివిరవటం...

‘‘ గైడ్ ని సంతృప్తి పరిస్తే చాలు. అతగాడే అన్నీ చూసుకుంటాడు. డాక్టరేట్ వచ్చి చేతిలో పడుతుంది’’ అని నిర్ధారించటం...ఆర్థికంగా, మానసికంగా సంవత్సరాల తరబడి ఒత్తిడి ఎదుర్కొని చిట్టచివరి మజిలీని విజయవంతంగా అధిగమించి డాక్టరేట్ పట్టా చేతికందుకున్న వారి చెవిన తరచూ పడే మాటలివి. మేథను గౌరవించని స్వభావం చుట్టూ ఉన్న సమాజంది. అది చదువుకున్నవాళ్లని చిన్నతనం చేస్తూంటుంది.

‘‘ ఒరే.. మనోడు వచ్చినట్టు లేడురా...’’ ఎవరో అరుస్తుంటే తలెత్తి ముందు సీట్ల వైపు చూశాను. నలుగురు కుర్రాళ్లు. ఒకటి రెండు మాటలు విన్నాక అర్ధమైంది. వాళ్లు మాట్లాడుకుంటున్నది తమ రీసెర్చి గైడ్ గురించని.‘‘ పిల్లలను స్కూలు నుంచి తేవటం నుంచి బ్యాంకుపని, ఇంట్లో సరుకులు తెచ్చే పని.. ఒకటేమిటి... పెద్దపాలేరులా అన్ని పనులు చేస్తూనే ఉన్నా. అయినా మా వాడు కనికరించటం లేదురా... నాలుగేళ్లయి పోయింది. సినాప్సిస్ సబ్మిషనే కావటం లేదు’’ నిర్వేదంతో అతను చెబుతున్నాడు.

‘‘ నీ సంగతి సరే.. మా ప్రొఫెసర్ మాత్రం మనసులో ఏమనుకుంటాడో తెలీదు. ఒకసారి చెప్పిందానికి, రెండోసారి చెప్పేదానికి పొంతన ఉండదు. అసలు మెటీరియల్ కలెక్షన్ ఏ దిశగా సాగాలో అర్ధమై చావటం లేదు.’’ పెదవి విరిచాడు పక్కనున్నతను.‘‘ నువ్వేదో ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటావు. ఇక్కడే మగ్గే మా లాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి?’’ ఇంకో అతను అందుకున్నాడు.‘‘ డాక్టరేట్ అనిపించుకోవాలన్న దురద కొద్దీ ఇందులోకి దిగాను గానీ... రీసెర్చి చేయటం అంత బుధ్ది తక్కువ పని ఇంకోటి లేదు’’... గొంతు పెంచి మరీ అన్నాడు మొదట మాట్లాడిన విద్యార్థి.

ఈ లోపు ఓ వ్యక్తి అటుగా రావటంతో నలుగురు విద్యార్దులు లేచి గౌరవపూర్వకంగా అతనికి నమస్కారం చేశారు. అతను వారి వైపొక సారి చూసి తలపంకించి ముందుకు సాగి పోయాడు.

‘‘ ఈ ప్రొఫెసర్లంత కక్కుర్తి గాళ్లు ఇంకోళ్లు లేరు. డబ్బులిస్తే థీసిస్ అంతా రాసిచ్చే ప్రొఫెసర్లున్నారట. మొన్నామధ్య ఒకతను చెప్పాడు. బొటనీలో పిహెచ్ డి చేశాడు.

ప్రొఫెసరుకి బంగారు కడియం ఇచ్చానని... ’’

‘‘అవునోయ్... జూనియర్ కాలేజీ,లేదా డిగ్రీల సైన్సు లెక్చరర్లయితే ట్యూషన్లు చెప్పి సంపాదిస్తారు. ప్రాక్టికల్ మార్కులుంటాయి... కాబట్టి విద్యార్థులు భయభక్తులతో ఉంటారు. సంపాదనకు మార్గంలేదని ఆర్ట్సు డిపార్టుమెంట్లు వాపోవటం నాకు తెలుసు. మరి ఈ ప్రొఫెసర్లను పట్టించుకునేవారెవరు?’’

‘‘ బలేవాడివే. వీళ్లకేం జీతాలకు కొదవా... లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు. పాఠాలు చెప్పినా చెప్పకపోయినా...

అప్పుడుప్పుడు పేపర్లు ప్రజెంట్ చేస్తూ మేం ఉన్నాం... అని చాటుకుంటూంటారు.

కొందరు ప్రొఫెసర్లకు ఆడపిచ్చి ఎక్కువ. తమకు లొంగితే తప్ప ఆడపిల్లల థీసిస్ సినాప్సిస్ దశ కూడా దాటనివ్వరు. ఏదో కొర్రీలు వేస్తూ పోతారు. చివరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. కొంత మందికి ఎక్సె స్ టెన్షన్ కూడా ఇవ్వరు. మరికొందరు ప్రొఫెసర్లుంటారు. డిపార్టుమెంటులో ఒకరో ఇద్దరో అమ్మాయిల్ని ...వీళ్లంతా చెడిపోయారని కాదు నా ఉద్దేశం... ఎదురుగా కూర్చోబెట్టుకుని సొల్లు కబుర్లు చెబుతూంటారు. బయటకు పోయినప్పుడల్లా వీళ్లని పక్కన వేసుకుని పోతూంటారు. ఇక స్త్రీత్వం పెట్టుబడి పెట్టి మరీ కొందరు త్వరగా డాక్టరేట్ పొందాలనుకునేవాళ్లుంటారు. అలాంటి వాళ్ల కోసం వెదికే ప్రొఫెసర్లున్నారు.’’

‘‘ ఏమో గురూ... ఈ గొడవలేమీ నాకు తెలియవు. ఎక్కడో ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాను. ప్రొఫెసరు రమ్మనప్పుడల్లా వచ్చేవాడిని. రూంలో నాలుగయిదు రోజులుండి ఆయన చెప్పినట్టల్లా చేసేవాడిని. ఈ లంచగొండితనం, పీడించటం లాంటి ప్రభావాలేమీ నాపైన పడలేదు. డాక్టరేట్ నా చేతిలో పడింది. అది నా ఉద్యోగానికి ఏ మాత్రం ఉపయోగపడకపోయినా ... పూర్తిచేయగలిగానన్న తృప్తి మాత్రం నాకు మిగిలింది.

ఇవన్నీ నా చెవిన పడుతున్నాయి. సమయం భారంగా గడుస్తోంది. ఉద్యోగ ధర్మంగా ఇక్కడికొచ్చాను. సాధారణంగా సెమినార్లు లాంటి వార్తలకు దినపత్రికల్లో పెద్దగా చోటు కల్పించరు. ప్రకటనలు బాగా ఇచ్చే సంస్థ కాబట్టి మా ఇన్ ఛార్చి స్వయంగా హాజరై చిన్న వార్త కవర్ చేయమని పంపాడు.

విలేకరి ఉద్యోగంలో కనుక ఇలాంటివి ఓపిగ్గా భరించాలి.

చేతిలో ఉన్న బ్రోచర్ ని పక్కన పడేసి నా చూపుని చుట్టుపక్కల సారించాను.

పదినిముషాల క్రితంతో పోలిస్తే పరిస్థితి మెరుగు. చాలా మటుకు ప్రాంగణం విద్యార్థినీ విద్యార్థులతో నిండి ఉంది.

‘‘ మీకు ఒక్క పని చేతకాదు... ఏది పట్టుకున్నా అంతే’’

ఆడగొంతు వినపడటంతో చటుక్కున వెనక్కి తిరిగి చూశాను.

పక్కనే ఉన్న వ్యక్తిని ఆమె తూలనాడుతోంది. వారిద్దరూ భార్యభర్తలని క్షణాల్లో పోల్చుకోగలిగాను.ఆమె వదలకుండా మాట్లాడుతూనే ఉంది. ఆయన మౌనంగా వింటున్నాడు.‘‘ అంత పరధ్యానమయితే ఎలా? పొద్దున వెళ్లేటప్పుడు చిలక్కి చెప్పినట్టుగా చెప్పాను కదా... ఒక్క విషయం గుర్తుండదు. పదే పదే చెప్పాలి’’ ఆమె పోరుతూనే ఉంది.

‘‘ అన్ని మరిచిపోతారనే.. కాగితం పైన రాసికెళ్లమన్నా గదా.. అదీ మరిచిపోయారు. మీ మతిమరుపుతో చస్తున్నాను.’’‘‘ఈ వయసులో మొగుడు పెళ్లాలు.. ఇంటిదగ్గర కొట్టుకోక.. ఈ సెమినార్ దాకా రావటం దేనికో?’’ మనసులోనే విసుక్కున్నాను.వాళ్లని చూడగానే రిటైరయిన వ్యక్తులనిపించింది.

మైక్ లో పేరుపెట్టి పిలవగానే అతను హఠాత్తుగా ఆయన లేచినిలబడ్డాడు.

బట్టతల... టక్ చేసుకుని ఉన్నాడు.

ఆయన ఎర్రటి శరీరం .. ఆర్క్ లైటు వెలుగులో మెరుస్తోంది.‘‘వయసులో ఉన్నప్పుడు బాగా అందగాడయ్యుంటాడు. ’’ అనుకోకుండా ఉండలేకపోయాను.

ఆయన డయాస్ వైపు నడుస్తుంటే .. ఆయన పరిచయాన్ని మైక్ లో చదువుతున్నారు.

‘‘ప్రొఫెసరు భరద్వాజ... దేశం గర్వించవలసిన విద్యాధికుడు. ఇప్పటికి 18 డాక్టరేట్లు చేశారు. పరిశోధన పత్రాలు లెక్కలేనన్ని సమర్పించారు. దేశంలో ఏమూల సెమినార్ జరిగినా ఆయన హాజరు కావలసిందే. పత్రం సమర్పించవలసిందే అంటే అతశయోక్తికాదు. రిటైరయి ఇన్నేళ్లయినా ఆయన చదవటం మానలేదు. రాయటం అంత కంటే మానలేదు. పద్దెనిమిది గంటలు నేటికీ పనిచేస్తున్నారు. ఇప్పటి విద్యార్థితరం ఆయనను చూసి నేర్చుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి.

భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణలో కమిటీలో ఆయనను సభ్యునిగా ఎంపిక చేశారు. ఉన్నత విద్యారంగంలో మార్పులకు సంబంధించి ఆయన చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవటం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఈ యూనివర్సిటీ ఖ్యాతిని ఆయన మరింత పెంచారు. అందుకే ఆయనను సన్మానించుకుంటున్నాం’’.

భరద్వాజ వేదిక ఎడమవైపున్న సీట్లో ఒదిగి కూర్చున్నాడు.

పక్కనే యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, కేంద్రమంత్రి, ఢిల్లీ లాబీయింగ్ తో గౌరవడాక్టరేట్ పట్టేసిన ఓ విద్యాసంస్థ ఛైర్మన్, ఓ పత్రికాధిపతి..ఓపికకు పరీక్ష పెట్టే ప్రసంగాలతో పని లేకుండానే ప్రారంభకార్యక్రమాన్ని ముగించారు. సెమినార్లో ఎవరెవరు పాల్గొంటున్నారో వివరాలన్నీ నా దగ్గరున్న నోట్ ప్యాడ్లో నమోదు చేసుకున్నాను.

‘‘ అబ్బబ్బ.. అంత పెద్ద సన్మానం జరుగుతుంటే తలొంచుకుని కూర్చుంటారే.. ఏదో తప్పుచేసిన వాడిలా...

టీవీ కెమెరాలు చుట్టూ ఉన్నాయి. లైవ్ టెలికాస్టు అని మీకు తెలీదా..

నాలుగ్గోడల మధ్య ఏదో గీక్కుంటే ఎవరికి తెలుస్తారు? ఇలాంటప్పుడే గొప్పగా ఉండాలి...’’ ఆమె ఏదేదో చెబుతోంది.భరద్వాజ డయాస్ మీద నుంచి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. భార్య మాటలకి ఏ మాత్రం నొచ్చకుంటున్నట్టులేదు. ఇదంతా అలవాటయిన వ్యవహారమైనట్టు చూస్తున్నాడు.

‘‘మీ కంటే మంత్రి గారే నయం.. బోలెడు విషయాలు మాట్లాడాడు. టీవీ అంతా ఆయనే కనిపించాడు. వీసీ చెప్పింది చెత్తయినా...’’ఆమె ఏదేదో చెబుతోంది.

నాకక్కడ ఉండాలనిపించలేదు. సీట్లో నుంచి లేచాను.భరద్వాజవైపు చూస్తూ అనుకున్నాను.‘‘ఇంతటి మేథావి. పేరు ప్రఖ్యాతులు గడించిన వాడు.. ఇంట మాత్రం గెలవలేకపోయాడు’’ నిట్టూరుస్తూ అనుకున్నాను.

అతన్ని నెత్తిమీద పెట్టుకోవలసిన ఇల్లాలు అడుగడుగునా ఆడిపోసుకోవటం.. చిన్నచితకా విషయాలకు నిష్ఠూరాలాడటం..ఎందుకో తెలీదు.. నా మనసును గాయపరిచింది. ఆయన పట్ల తెలియని సానుభూతి కలిగింది.

‘‘ఈ దేశంలో విద్యావంతులందరి పరిస్థితే ఇంచుమించుగా అదేనేమో..’’ మరికాసేపట్లో సెమినార్ ప్రారంభమవుతుందని మైక్ లో చెబుతున్నారు.

నేను బయటికి నడిచాను...భరద్వాజకు మనసులోనే నమస్కారాలు చెప్పుకుంటూ...

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు