ఆరోజు పన్నెండేళ్ళ రాజు పుట్టిన రోజు.
రంగు రంగుల రిబ్బన్ లతో, బెలూన్లతో అలంకరించిన హాల్ బంధుమిత్రులు, రాజు స్నేహితులతో నిండి వుంది.
సాయంకాలం చాక్లెట్లతో, పళ్ళతో అలంకరించిన టేబుల్ మీద బర్త్ డే విష్ రాసిన అందమైన పెద్ద కేక్ ముందు నుంచుని వున్నాడు రాజు. ఇరువైపులా అతని తల్లిదండ్రులు వున్నారు.
‘కేక్ ఎప్పుడు కట్ చేస్తాడా, ఎప్పుడు అతన్ని ఆశీర్వదించాలా’ అని పెద్దలు, ‘నోరూరించే పదార్ధాలు ఎప్పుడు తినొచ్చాని’ పిల్లలూ ఎదురుచూస్తున్నారు.
అనుకున్న సమయం రానేవచ్చింది.
రాజు కేక్ కట్ చేశాడు. అందరూ"హ్యాపి బర్త్ డే టూ యూ, రాజు! మే గాడ్ బ్లెస్ యు" అని రాగయుక్తంగా పాడారు.
రాజు ఆనందంగా కేక్ కట్ చేశాడు. తల్లీ, తండ్రి రాజు తలపై అక్షతలు వేసి ఆశీర్వదించి కేక్ ముక్కలు అతని నోట్లో పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ రాజుకి గిఫ్ట్స్ ఇచ్చారు.
రాజు తల్లి అందంగా పేర్చిన కేక్ ముక్కలు, చాక్లెట్లు వున్న పేపర్ ప్లేట్లను, కూల్ డ్రింక్ గ్లాస్ లను ట్రే లో సర్ది ఇవ్వగా, అవి అందుకుని అందరికి వినమ్రతగా అందించాడు రాజు.
ఆ తర్వాత సగం కేకును ఒక పాలిథీన్ బ్యాగులో సర్దుకుని, తనకొచ్చిన గిఫ్ట్స్ ని మరో బ్యాగులో వేసుకుని తన సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళిపోయాడు.
అది అతని తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యపరచింది.
ముప్పావుగంట తర్వాత వచ్చిన రాజుని వాళ్ళ నాన్న "ఎక్కడికెళ్ళావు రాజూ?" అని ప్రేమగా అడిగాడు.
"డాడీ మరే, మన కాలనీకి ముందు కొంతమంది గుడిసెల్లో వుంటున్నారు కదా! పాపం వాళ్లకి బర్త్ డే సెలబ్రేషన్ వుండదు, కేక్ కట్ చేయరు. అందుకని వాళ్లకి కేక్ ఇచ్చి, ఆడుకోవడానికి గిఫ్ట్స్ ఇచ్చి వచ్చాను. నేనెలాగూ అన్నింటితో ఆడుకోను. వాళ్ళు ఎంత హాప్పీగా ఫీల్ అయ్యారో తెలుసా?"అన్నాడు సంతోషంగా!
వాడి పెద్ద మనసుకి అందరూ ఎంతో ముచ్చటపడ్డారు. అలాంటి పిల్లవాణ్ణి కన్నందుకు రాజు తల్లిదండ్రుల్ని అందరూ మెచ్చుకున్నారు.ఆ ఫంక్షన్ కి వచ్చిన పిల్లలు, ఇహ నుండి తమ పుట్టినరోజు కూడా రాజు లాగానే అందరి మన్ననలు అందుకునేలా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
***
చూశారా, పిల్లలూ! పువ్వు పుట్టగానే పరిమళించడమంటే అదే! చిన్న వయసులోనే మంచితనంతో, సంస్కారంతో ‘మనుషులందరూ సమానమే’ అని రాజు చాటాడు. అందరి అభినందనలూ అందుకున్నాడు. అలాగే మీరూ మీ పుట్టినరోజును అనాధ శరణాలయాల్లో, వృద్ధుల శరణాలయల్లో జరుపుకుని మీకు తోచినంత సహాయం చేసి వాళ్ల అభినందనలూ, ఆశీర్వచనాలు అందుకుంటారు కదూ.