పునరపి - కె.శ్రీలత

punarapi

" శ్రావణీ...శ్రావణీ..." అని గట్టిగా భార్యను పిలుస్తూ వీధి గుమ్మం లోనుంచి హాల్లోకి వచ్చాడు ఆనంద్.

వంట పనిలో బిజీగా వున్న శ్రావణి, " అబ్బబ్బ..ఏంటండీ ఆ గావుకేకలు ఏవో కొంపలంటుకుంటున్నట్టు...అంటూ నాప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ గబగబా ముందుగదిలోకి వచ్చింది.

" అయినా ఈ వేళప్పుడు ఇంటికి వచ్చారేంటీ? " ప్రొద్దుట తను సిద్ధం చేసినలంచ్ క్యారియర్ భర్త చేతిలో చూస్తూ అంది శ్రావణి.

" పర్మిషన్ అడిగి వచ్చాలే..సిటీలో పనుండి...అద్సరే, ఇంతకీ అమ్మ ఏదీ? కనబడదే?? " చుట్టూ చూస్తూ అడిగాడు ఆనంద్.

" కనిపించకపోవడానికి ఆవిడేమన్నా నల్లపూసా? ఇప్పుడె తన ఫ్రెండ్స్ ని కలవటానికి వెళ్ళారు" ఒకింత చిరాగ్గా అంది శ్రావణి.

" ఎవరా ఫ్రెండ్...? అనసూయ ఆంటీనా..శారద ఆంటీనా " ఆరా తీసాడు ఆనంద్.

" ఆ(..వాళ్ళెవరూ కాదులెండి. ఇప్పుడు మీ అమ్మగారికి " ఫేస్ బుక్ " ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారుగా..ఆవిడెవరో వనజ గారట..ఏదో పనిమీద ఆవిడ విజయవాడ నుండి మన వూరు వస్తున్నారట..ఆవిడ్ని రిసీవ్ చేస్కుని ఇంటికి భోజనానికి తీసుకురావటానికి వెళ్ళారు. .అదిగో... ఇందాకట్నుంచీ ఆ పన్లోనే ఉన్నాను..." విసుగ్గా అంది.

" అయితే నేను చూసింది అమ్మనేనన్నమాట..."స్వగతంగా అనుకుంటూ పైకే అనేశాడు..." ఎవర్ననడీ చూశానంటున్నారు? " అనడిగింది శ్రావణి.

" ఆఫీస్ నుంచి బైక్ మీద వస్తూంటే బస్టాపు దగ్గర్లో లెగ్గిన్, టాప్ వేసుకున్న నడివయసు పెద్దావిడ ఒకామే కంపించింది..అచ్చం ఆవిడ అమ్మలా అంపిస్తే అమ్మేనా, కాదా అన్న సందేహంతో, బండి స్లో చేసి మరీ చూశాను...అచ్చం అమ్మలాగానే వుందికానీ ఆమె వస్త్రధారణ చూసి అమ్మకాదేమో అనుకున్నాడు. అందుకే వచ్చీరాగానే అమ్మ ఏదీ అని అడిగాడు "ఒక్కనిముషం...ఇప్పుడే వస్తాను అని గబగబా బెడ్ రూం లోకి వెళ్ళిన శ్రావణి రెండు నిముషాల్లో తిరిగి వచ్చింది.

" నిజమేనండీ ! నిన్ననే ఇస్త్రీ అబ్బాయి తెచ్చిన బట్టలన్నీ బెడ్ రూం టేబుల్ మీద పెట్టాను. వాటిలో నా టాప్ కనిపించట్లేదు. వంటగదిలో వుండటాన అత్తగారు వెళ్ళేటప్పుడు నేను ఆవిడ్ని గమనించలేదు. " అంది.

మౌనం వహించాడు ఆనంద్.

" చ...చ...మరీ చిత్రంగా ప్రవర్తిస్తున్నారు మీ అమ్మగారు ఎప్పుడూ లేని క్రొత్త అలవాట్లు ఏంటో....? అయినా మావయ్యగారు పోయి ఆరునెలలైనా కాలేదు. ఈవిడిలా ప్రవర్తించడం ఏమన్నా బాగుందా...?"భర్తని ప్రశ్నించింది. " పోనీలే శ్రావణీ..అయినా ఇదంతా నీ చలవే కదా ! వదిలేయ్...." అన్నాడు ఆనంద్.

" అదేంటండీ అలా అంటారు....మావగారు పోయినప్పట్నుంచీ ఆ బాధ తట్టుకోలేక ఒంటరితనంతో ..ఆలోచనలతో దిగులుగా వుంటున్నారు కదా అని కంప్యూటర్ నేర్పించి...ఇంగ్లీషు అక్షరాలు ఎలా టైప్ చేయాలో చెప్పి ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి కొంతమంది ఫ్రెండ్స్ ని పరిచయం చేశాను. అయితే ఇలా వుండమని నేను చెప్పానా ?" ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి.

" లైట్ తీసుకో ప్లీజ్ అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడవద్దు. నాముందు....నిన్నా మొన్నటిదాకా చాలా స్తబ్దుగా అన్నీపోగొట్టుకున్నట్టు వుందికదా, కాస్త డైవర్ట్ అయ్యి వుంటుందిలే....అదీ ఒకందుకు మంచిదేలే ! ఇక తన డ్రెసింగ్ గురించి అంటావా...నేను సమయం చూసి నిదానంగా చెప్తాలే..." అని భర్త బ్రతిమిలాడుతున్నట్టు మాట్లాడడంతో కన్విన్స్ అయ్యింది శ్రావణి.

నిజానికి అత్తగారు ఎప్పుడూ తన లిమిట్స్ దాటేలా వుండరు. ఆలోచనలో పడింది శ్రావణి.

అసలు వాళ్ళింట్లో అందరి ఇళ్ళమాదిరిగా అత్తాకోడళ్ళ లాగా కాక..తళ్ళీకూతుళ్ళ లాగా కాక తళ్ళీకూతుళ్ళలాగా వుండేవారు. కానీ, అనుకోకుండా హార్ట్ ఎటాక్ రావడంతో అకాలమరణం చెందాడు ఆనంద్ తండ్రయిన రాఘవరాం.

అప్పట్నుంచీ షాక్ తగిలినట్లుగా అచేతనంగా వుండిపోయింది భవాని. ముప్పై అయిదేళ్ళ కాపురంలో ఎప్పుడూ భరత్ని విడిచిపెట్టి వుండని ఆమెకు కోలుకోలేని దెబ్బ అది.

రెండు నెలలపాటు పూర్తిగా మౌనం వహించింది. అస్సలెవ్వరితోనూ మాట్లాడలేదు. అన్నం పెడితే తినేది, లేదంటే లేదు. ఎప్పుడూ శూన్యంలోకి పిచ్చిచూపులు చూస్తూ కూర్చునేది.

ప్రాణానికి ప్రాణమయిన మనవడు, మనవరాళ్ళ ప్రేమకూడా ఆమెను కదిలించలేకపోయింది.

ఆమెను మామూలు మనిషిని చేయటానికి అందరూ రకరకాల ప్రయత్నాలు చేసేవారు.

శ్రావణికి అత్తగారంటే ఎంతో ఇష్టం. తను కడుపుతో వుండగా రకరకాల వంటలు చేసి దగ్గర కూర్చుని మరీ తినిపించేది. పిల్లల పెంపకంలో కూడా ఎంతో సాయం చేసిన అత్తగారు అల్లా కృంగిపోవడం చూసి తట్టుకోలేక ఆమెను చిన్నపిల్లలా చూసుకునేది.

రెండునెలల తర్వాత కొద్దిగా అత్తగారు తేరుకున్నాక ఆమెకు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం నేర్పించి ఫేస్ బుక్ క్రియేట్ చేసి ఎలా మెస్సేజ్ చెయ్యాలో టైప్ చెయ్యాలో క్షుణ్ణంగా నేర్పింది.

టీవీలో మిస్సయిన సీరియల్స్ ని యూట్యూబ్ లో చూసేలా చేసింది. అన్నిటికంటే ఫేస్ బుక్ భవానిని ఎక్కువ ప్రభావితం చేసింది. తన వయసు వాళ్ళయిన ఎంతోమంది ఆమెకు నేస్తాలయ్యారు. ప్రతీరోజూ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెస్సేజ్ లు చెయ్యటమూ ఫ్రెండ్స్ అందరితో చాటింగ్ ద్వారా ఎంతో రిలీఫ్ పొందేది.

కాకపోతే ఫేస్ బుక్ అడిక్ట్ అయ్యిందాని చూసేవారికి అంపించేలా ఫేస్ బుక్ స్నేహితులను కలవడానికి ఎక్కడికైనా వెళ్ళటమూ, అలాగే వాళ్ళనందరినీ యింటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేయటంతో పని ఎక్కువైనందున కొంచం కోపం వచ్చింది శ్రావణికి కేవలం చాటింగ్ కే పరిమితమై వుండొచ్చుకదా అందర్నీ డైరక్టుగా కలవాల్సిన అవసరం ఏముందీ ..అని శ్రావణి భావన

***********

గంట తర్వాత ఆటోలో వచ్చారు భవాని, ఆమె ఫేస్ బుక్ నేస్తమైన వనజ ఇద్దరూ...

కోపం పైకి కంపించకుండా..ముఖానికి నవ్వు పులుముకుని వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది శ్రావణి.

ఆ వచ్చినావిడకి కూడా అత్తగారి వయసే ఉంటుంది. చాలా పోష్ గా వుంది. ఖరీదైన టాప్ వేసుకుంది. అత్తగారు కూడా బానే ఉన్నారు ఈ డ్రెస్ లో...అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది శ్రావణి.

ఆ తర్వాత అత్తగారూ, ఆ వచ్చినావిడ ఇద్దరూ చాలాసేపు అత్తగారి గదిలో కూర్చుని ఏమేమో మాట్లాడుకున్నారు.

అత్తగారు రకరకాల పేపర్స్ మీద..డాక్యుమెంట్స్ మీద సంతకాలు చెయ్యటం గమనించింది శ్రావణి.

ఏదో కీడు శంకించింది శ్రావణికి. ఆస్థి మొత్తం అత్తగారి పేరునే వుంది. కొంపదీసి ఈవిడ తమని సంప్రదించకుండా ఏమైనా దానధర్మాలు చేస్తుందా? అనే అనుమానం కూడా వచ్చింది.

కానీ అడగడం మర్యాద కాదుకదా అని సైలెంటుగా చూస్తూ కూర్చుంది.

సాయంత్రం అయిదింటికి స్నాక్సూ, టీ తీసుకున్నాక, ఆ వచ్చినావిడ బయల్దేరింది. ఆవిడను బస్ ఎక్కించి వస్తానని అత్తగారు కూడా ఆమె వెంట వెళ్ళింది.

వాళ్ళు వెళ్ళాక ఆత్రుత ఆపుకోలేక తప్పని తెలిసీ, అత్తగారి గదిలోకి వెళ్ళి అంతా వెతికింది.

అత్తగారు సంతకాలు చేసిన పేపర్స్ కనిపించాయి.

అవేమిటాని ఆసక్తిగా చదివిన శ్రావణి కళ్ళు చెమర్చాయి. అత్తగారంటే ఆమెకి ఉన్న గౌరవం రెట్టింపయ్యింది. అత్తగారి గురించి అపోహ పడ్డందుకు తనని తానే తిట్టుకుంది. గబగబా అవన్నీ ఎక్కడివక్కడ సర్దేసింది.

ఇంతకీ ....

ఆ వచ్చిన వనజ గారు ఎవరో కాదు " మరణించాక కూడా జీవించండి " అనే నినాదంతో ఏర్పాటైనశరీర అవయవ దాతల తాలూకు సభ్యురాలు.

అత్తగారు, తను మరణించాక తన శరీరంలోని ఉపయోగపడే అవయవాలు అన్నీ దానం చేసేందుకు అంగీకారం తెలిపి తను సంతకాలు పెట్టిన పేపర్సూ..డాక్యుమెంట్లూ ఉన్నాయక్కడ.

పాపం...భర్త మరణం తట్టుకోలేక ఇంచుమించు తనుకూడా మరణం అంచులవరకూ వెళ్ళి జీవితంతో పోరాడి ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్న అత్తగారు...సరదాపడి, లేని ఓపిక తెచ్చుకుని తన స్నేహితులను కలుస్తున్నందుకు సంతోషించాల్సింది పోయి, అదేదో పేద్ద తప్పన్నట్లు ఫీలయినందుకు పశ్చాత్తప పడింది శ్రావణి.

" నా జీవితం మోడు అయిపోయింది....అని ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మిగతావారికి మనశ్శాంతి లేకుండా చేసే ఎంతోమందితో పోల్చితే తన అత్తగారు ఎంతో బెటరనిపించిందామెకు.

తను హుషారుగా ఉంటూ తనకు నచ్చిన బట్టలు వేసుకుని తనకి నచ్చినట్టుగా జీవించడం ఆమె ప్రాధమిక హక్కు....ఆవిషయంలో ఆవిడను తప్పు పట్టడమూ....ఆంక్షలు విధించడమూ చాలా తప్పని అర్థం చేసుకుంది.....

ఇంటికి తిరిగి వచ్చిన అత్తగారు " అమ్మా శ్రావణీ..నన్ను క్షమించమ్మా....నా ఫ్రెండ్సందరూ టాప్స్ వేసుకోవడంతో నాకూ వేసుకోవాలనిపించింది...నిన్ను పర్మిషన్ అడక్కుండా నీ టాప్ వేసుకున్నాను." అనగానే...

" దాందేముంది అత్తయ్యా..నేను మీ చీరలు కట్టుకోనా ఏంటి...అయినా నన్ను అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు ఇకపై మనమిద్దరమూ షాపింగ్ చేసి క్రొత్త మోడల్ డ్రస్సెస్ తెచ్చుకుందాం...సరేనా ! అంటున్న కోడలి వైపు ఆనందంగా చూసింది భవాని. అంతా చూస్తున్న ఆనంద్ " హమ్మయ్య! " అని ఊపిరి పీల్చుకున్నాడు...

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు