భానుమామయ్య - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

bhanumamayya

భానుమామయ్య మా ఇంటికొస్తున్నాడు.

మా అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. వుండదూ మరి రక్తసంబంధమాయే. పైగా తోడపుట్టిన నలుగురిలో మిగిలింది వీళ్ళిద్దరే! అంతేకాకుండా మొదట్నుంచి అమ్మకి మామయ్య అంటే ప్రాణం. ఇంట్లో ఏ చిన్న ఆరోగ్య..అర్ధిక సమస్య వచ్చినా మామయ్యకి తెలియాల్సిందే! ఆయన ఏ పరిష్కారం చూపించినా అది మర్యాదరామన్న తీర్పే..తు.చ. తప్పకుండా మా కుటుంబం పాటించాల్సిందే!

నా చిన్నప్పట్నుంచీ రామాయణ..మహాభారతాల్లోని కథలెలా విన్నానో అలాగే మా అమ్మనోటివెంట మామయ్య సంగతులు వినేవాడిని! వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఎలా వుండేవారు..మామయ్య మా అమ్మ ఆడుకోవడం కోసం తెచ్చిచ్చే ఆటవస్తువులు..దగ్గరుండి చదివించడం.. ఎవరితోనన్నా గొడవొస్తే తనని వెనకేసుకు రావడం అన్నీ పూస గుచ్చినట్టు చెప్పేది.

ఒకసారి ఆటల్లో మునగచెట్టు ఎక్కిన మా అమ్మ క్రింద పడిపోయి..ప్రాణం రెళ్ళపోతే చనిపోయిందనుకుని గుండెలు బాదుకున్నాడట. ఆ తర్వాత వైద్యుడు ఫరవాలేదని చెప్పి మూడు రోజులు వైద్యం చేస్తే పాఠశాలకి వెళ్ళడం మానుకుని అమ్మ పక్కనే కన్నీళ్ళతో కూర్చున్నాడట. మా అమ్మ కళ్లుతెరచి చిన్నగానవ్వంగానే ముందుగా ముత్యలమ్మ గుడికెళ్ళి నూటొక్క టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడట. తోడబుట్టిన వాళ్ళలో మిగతా వారికన్నా వీళ్ళిద్దరి బంధమే ఆప్యాతానురాగాలతో ముడిపడివుండేదట. మా అమ్మకి పెళ్ళిచేస్తున్నారంటే బెంగపడిపోయాడట..తనని మా నాన్న దూరంగా తీసుకుపోతాడని. ఇంట్లోని అందరూ పదె పదే ‘ఆడపిల్లకి పెళ్ళి తప్పనిసరి..పెళ్ళికొడుకు చాలా మంచివాడని’ సర్ది చెప్పిన మీదట మనసు నెమ్మది చేసుకుని పెళ్ళికి అంగీకరించాడట.

పెళ్లై పట్నంలో కాపురం పెట్టాక కూడా చెల్లెలి కళ్లలో విచారఛాయలేమన్నా కన్పిస్తాయేమోనని పదే పదే వచ్చి చూసేవాడట..గుచ్చి గుచ్చి అడిగేవాడట. మా అమ్మ అదృష్టం ఏమిటంటే మా నాన్న కూడా చాలా మంచివాడవడం. అందుకే మా అమ్మని అభిమానించినంతగా మా నాన్ననీ అభిమానించి గౌరవించడం మొదలెట్టాడట.

మా మామయ్యకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి దూరప్రాంతంలో వుండాల్సిరావడం, అప్పట్లో సెల్ ఫోన్లు అవీ లేకపోవడంతో ఉత్తరాలతో క్షేమ సమాచారాలు తెలుసుకోవడం చేసేవాడట. ఆ తర్వాత తనకి పెళ్ళై మరిన్ని బాధ్యతలు ఎక్కువవడంతో రాకపోకలు తగ్గాయి కానీ అప్పుడప్పుడు పండగలూ.. పబ్బాలూ.. శుభకార్యాల్లో కలిస్తే మాత్రం అమ్మమీద బోలెడంత ఆప్యాయత కురిపించేవాడు. అమ్మా అంతే!నాకైతే మామయ్య ఆహార్యం చూస్తే బెరుకుగా అనిపించేది. నిజానికి అమ్మముందు పసివాడయ్యే వాడు గాని బయట మాత్రం స్ఫురద్రూపంతో గంభీరంగా వుండేవాడు. అందుచేత నా కెందుకో మావయ్యని చూస్తే అకారణంగా తిడతాడని భయం వేసేది. తనని తప్పించుకు తిరిగేవాడిని. నన్ను ఎప్పుడన్నా ముద్దు చేయడానికి దగ్గరకి తీసుకున్నా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఆయన ఒళ్ళో కూర్చుని వదలంగానే తుర్రున బయటకి పరిగెత్తే వాడిని. నా తొమ్మిదో తరగతిలో అనుకుంటా నాకు పచ్చకామెర్లు వచ్చి ముదిరితే.. అమ్మ ఏడుస్తు నన్ను కాపాడమని మామయ్యా వాళ్ళింటికే తీసుకెళ్ళింది. మామయ్య వైద్యం చేయించి నన్ను భద్రంగా మా అమ్మకి అప్పజెప్పాడు. ఇంటికి రాగానే ‘మా అన్నయ్య వుండగా నాకందుకే భయం వెయ్యదు. వాడు మన కోసం యముడితో నైనా పోరాడుతాడు’ అంది నాన్నతో.

మామయ్యకి ఇద్దరు మగపిల్లలు..ఒక్కతే ఆడపిల్ల. దాన్ని నాకిచ్చి పెళ్ళి చేయాలని ఒకటే తపన పడేవాడు. నా మరదలు ఓ మోస్తరు అందమైనది! తెలివైనది కూడా! నా కన్నా ఒక్క క్లాసు తక్కువ దానిది. మా చుట్టాలందర్లో చదువులో నాతో పోటాపోటీగా చదివి మంచి మార్కులు తెచ్చుకునేది. నేను మాత్రం దానిని పెళ్ళి చేసుకోననేవాడిని. ఎందుకంటే, ఎనిమిదో తరగతిలో మా సైన్స్ మాస్టారు మేనరికాలు చేసుకుంటే మానసిక ఎదుగుదలలేని..అంగవైకల్యం వున్న పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువని చెప్పడంతో.. అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. అంతే కాకుండా మా చుట్టాలలోనే మేనరికం చేసుకున్న వాళ్లకి మానసికవికలాంగుడైన పిల్లాడు పుట్టాడు. వాడితో వాళ్ళు క్షణ క్షణం అనుభవించిన నరకం కళ్లారా చూశాను. దాంతో మనసు వికలమై మరదలితో పెళ్ళికి ‘ససెమిరా’ అన్నాను. మామయ్య చేసేదేం లేక తన కూతుర్ని ఏ జీ ఆఫీసులో పనిచేసే అబ్బాయికిచ్చి పెళ్ళి చేశాడు. ఆరోజు మా అమ్మ కొంగుతో మామయ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ ‘మన రక్త సంబంధం, బంధుత్వంగా మారుతుందని ఆశపడ్డానే..కానీ విధి నన్ను ఓడించింది’ అనడం నాకిప్పటికీ గుర్తే!నేను రెండేళ్ళక్రితం భద్రాచలం పిల్ల వీణని చేసుకున్నాను. మా నాన్నగారు నా పెళ్లైన ఏడాదికి పరమపదించాడు. అమ్మనీ, మామయ్యని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. తర్వాతి సంవత్సరంలో పుట్టిన బాబుకి నాన్నపేరే పెట్టుకున్నాను.

కాలగమనంలో మామయ్య ఇద్దరు కొడుకుల్లో ఒకడు అమెరికాలో స్థిర పడిపోతే ఇంకొకడు ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రిటైరయ్యాక వాడిదగ్గరే మామయ్య వుండేది.

మధ్య మధ్యలో మామయ్య మా ఇంటికొచ్చి అమ్మని చూసి వెళుతుండేవాడు. అయితే ఈ మధ్య మామయ్యకి చాదస్తం బాగా పెరిగింది. అడపాదడపా మా ఇంటికి రావడమే కాకుండా..కుర్చీలో కూర్చుని తనకి కావలసిన పదార్ధాలు అమ్మచేతా మా ఆవిడచేతా ఆజమాయిషీ చేసి మరీ వండించుకు తింటున్నాడు. అదే నాకు నచ్చట్లేదు. మా ఆవిడకూడా ఈ విషయం నాతో రెండుమూడు సార్లు అంది. మామయ్యకి అమ్మంటే ప్రాణమే కాదనను..కానీ అమ్మకీ ఓపిక వుండడం లేదు. అర్ధంచేసుకోవాలిగా!..అలా గొంతెమ్మ కోర్కెలు కోరితే మా ఆవిడ మాత్రం అప్పటికప్పుడు ఎలా చేయగలుగుతుంది? పెద్ద వాడిగా వచ్చి పెద్దమంతరహాగా వ్యవహరించి వెళ్ళిపోవాలి గానీ అలా సతాయిస్తే ఎంత చిరాగ్గా వుంటుంది ఎవరికైనా!

ఈ సారైనా అమ్మకి తెలియకుండా మామయ్యకి చెప్పెయ్యాలి ఆయనవల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతూందో! ఎలా చెబితే బాగుంటుందో మనసులో రక రకాలుగా మననం చేసుకున్నాను.

మామయ్య వచ్చాడు.

అమ్మ ఆనందం షరామామూలే!

ఎప్పటిలాగానే తనకి నిమ్మకాయల పులిహార తినాలనుందని, త్వరగా చేసి పెట్టమని ఆర్డరేశాడు. మా ఆవిడ నా వంక కొర కొర చూసింది. నాకూ చిరాగ్గానే వుంది మళ్ళీ మొదలెట్టాడని. అమ్మ మాత్రం ’ఒరే నానీ, కాస్త బాగా రసముండే పెద్ద నిమ్మకాయలు తీసుకురారా, మామయ్య జిహ్వకి రుచిగా పులిహార చేసి పెడదాం’ అంది. ఇంక చేసేదేం లేక బైక్ బైటకి తీసి దగ్గరలో వున్న కూరగాయల షాపుకి వెళ్లాను. నిమ్మకాయలు లేవు. మూడు నాలుగు షాపులు తిరిగాను నిమ్మకాయలు కనిపించలేదు. నాకు అసహనం.. విసుగూ కలుగుతోంది. ఇంటికెళ్ళిపోదామనుకున్నాను..కానీ అమ్మ గుర్తుకొచ్చింది. మామయ్య తృప్తిగా తిని మెచ్చుకుంటే తనకి చాలా సంతోషం. మూడుకిలోమీటర్లదూరంలో వుండే మార్కెటుకి రయ్యిన పోనిచ్చాను బండిని. నా అదృష్టం. ఒక షాపులో వున్నాయి..కాకపోతే చిన్నవి. ‘ఏవో ఒకటి దొరకడమే గొప్ప’ అనుకుని తీసుకుని ఇంటికొచ్చాను.

మా అమ్మ ముఖం చాటంతయింది "నిమ్మకాయలు దొరకట్లేదు కదట్రా..పక్కింటి వనజ గారు చెప్పారు. నువ్వు తేవేమో అనుకున్నాను. .వాడి కోరిక తీరుతోంది.’ అని నిమ్మకాయలు తీసుకుని కత్తిపీటతో కోసి రసం తీయడంలో మునిగిపోయింది. నాకు మాత్రం తెగ చిరాగ్గా వుంది. మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మార్కెట్టుకి నిమ్మకాయల కోసం భైకుమీద వెళ్ళొచ్చే వెంగళాయిని నేను తప్ప ఇంకెవరూ ఉండరనిపించింది. వెళ్ళి నా గదిలో కూర్చుని టీ వీ చూడసాగాను. కొద్ది సేపటికి అమ్మ గదిలోకొచ్చి ‘పులిహార పూర్తయింది కాళ్లూ చేతులూ కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తే వడ్డన ప్రారంభిస్తానని’ చెప్పింది. నేను వెళ్లేసరికీ మామయ్య కూర్చుని వున్నాడు. అమ్మ వడ్డించింది. మామయ్య ఆవురావురు మంటూ లొట్టలేసుకుంటూ తింటున్నాడు. మధ్య మధ్యలో ‘చిన్నీ(అమ్మకి మామయ్య పెట్టుకున్న ముద్దుపేరు) పులిహార చెస్తే నువ్వేచెయ్యాలే! అచ్చం అమృతంలా వుందనుకో. పాడె మీదున్న వాడు కూడా దీని కమ్మటివాసనకి ప్రాణం పోసుకుని వచ్చేయాల్సిందేనే!’ అన్నాడు. ‘పొగడ్డూ మరి..నేను అంత దూరం వెళ్ళి నిమ్మకాయలు తెచ్చాను..అమ్మేమో ఒళ్ళు హూనం చేసుకుని క్షణాల్లో సిద్ధం చేసింది. మహారాజుగారు కదా, తిని ఆ మాత్రం ప్రశంసల జల్లులు కురిపించాల్సిందే!’ మనసులో వెటకారంగా అనుకున్నాను.

మామయ్య రెండు రోజులున్నాడు చంటి పిల్లాడిలా ‘అవి కావాలి ఇవికావాలి’ అని చాలా విసిగించాడు.

ఈసారైనా తనవల్ల మేమెంత విసిగిపోతున్నామో నిర్మొహమాటంగా చెప్పెయ్యాలనుకున్నాను. ఎప్పుడూ మామయ్య తనే వచ్చి, వెళ్ళిపోతాడు. కానీ ఈసారి మొహమాటం లేకుండా కుండబద్దలుకొట్టాలి కాబట్టీ నేనే రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళి రైలెక్కిస్తానన్నాను. దానికెంతో పొంగిపోయాడు.

నేనూ, మామయ్యా ప్లాట్ ఫాం మీద వున్న బెంచి మీద కూర్చుని రైలు బండి కోసం ఎదురుచుస్తున్నాం. బండి రావడానికి ఇంకా అరగంట వుంది. ఆయనతో విషయం ఎలా ప్రారంభించాలో మనస్సులో రక రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ఇహ మాటలుగా నోటినుండి వెలువడడమే తరువాయి.

అప్పుడు హటాత్తుగా నా వైపు తిరిగాడు మామయ్య. ఎప్పుడూ గంభీరంగా వుండే మామయ్య ముఖం సజలనయనాలతో చిన్నబోయివుంది..

’ నానీ..మీ అమ్మంటే నాకు పంచప్రాణాల్రా..నువ్వంటే కూడానూ. పెద్దవాణ్ణయిపోయాక మావాళ్లకెవరికీ కాకుండాపోయాన్రా. మీ అత్తయ్య పైలోకం‍లో ఏదో కొంపలుమునిగే పనున్నట్టు ఆదరబాదరాగా నన్ను అనాధని చేసి పదేళ్ల క్రితం వెళ్ళిపోయింది. దాంతో నా అతీ గతీ పటించుకునే వాళ్ళు కరువైపోయార్రా! నాకు నచ్చేవి వదిలిపెట్టు, తిండికి కూడా మొహం వాచిపోతున్నాను. వృద్ధాప్యం శరీరానికొచ్చింది కాని జిహ్వకి రాలేదురా! అరటిచెట్టుని చూస్తే పువ్వు..దూట..కాయలతో చేసే కమ్మని కూరలు గుర్తొస్తాయి. పనసపొట్టుకూర..ఇంగువపోపుతో ఘుమ ఘుమలాడే పప్పు..ముక్కలపులుసు..పచ్చళ్ళూ గుర్తుకొచ్చినప్పుడు నోరూరుతుంది. కనీసం వాటిని తినకూడని రోగమొచ్చినా బాగుణ్ను నోరు కట్టుకునేవాణ్ణి..కానీ ఏ రోగం లేకుండా నిక్షేపంలా వున్నాను. ఇంట్లో నేనొకడిని వున్నానని పట్టించుకోని వాళ్ళు, ఇంక నాకోసం ఏం చేసి పెడతారు? చనిపోయినప్పుడు శ్రాద్ధ కర్మల్లో నాకిష్టమైనవి చేసి అందరికీ పెట్టడం కాదురా, నాకు..నాకు బ్రతికుండగా పెట్టాలి. పాపం మీ అమ్మ..నోరు తెరచి నేనేదడిగినా అప్పటికప్పుడు చేసి పెడుతుంది. అది నాకు తల్లిరా..తల్లి. ఆ తల్లిచేతుల్తో చేసినది తింటుంటే..అచ్చం మా అమ్మ నా చిన్నతనంలో వండి పెడుతున్నట్టే వుంటుందిరా..ఇలా మీ ఇంటికొచ్చి నాలుగు ముద్దలు తృప్తిగాతింటే..అది తలుచుకుంటూ కొన్నాళ్ళు హాయిగా..ప్రశాంతంగా గడపగలుగుతానురా..నాకు తెలుసు మిమ్మల్ని నేను ఎంతగా ఇబ్బంది పెడుతున్నానో..కాని నా ఆజమాయిషీని ఆనందంగా భరించే ఓర్పుని ఆ భగవంతుడు మీకిచ్చాడ్రా! ఒరే, నాలో శక్తి సన్నగిల్లుతోంది..రేపు నేను మంచాన పడవచ్చు..మీ ఇంటికి రాలేకపోనూవచ్చు..అప్పటివరకూ మీ ఇంటి తలుపులు నాకోసం తీసే వుంచండి. ఎప్పటికప్పుడు నీతో ఈ విషయాలు చెబుదామనే అనుకుంటాను..కానీ ఏకాంతంలో నిన్ను కలిసే అవకాశమే రాదాయే! ఇవాళ దేవుడు మనని ఇలా కలిపి నా మనసులోని బరువుని దూరం చేశాడ్రా? మీరు పది కాలాలపాటు చల్లగా వుండాలి..అదిగో రైలుబండొస్తోంది..ఇవన్నీ చిన్నికి చెప్పకు..పాపం బాధపడుతుంది.."అన్నాడు.

నా కళ్లలో ఆపుదామనుకున్నా కన్నీళ్ళగడంలేదు. కొద్ది సేపటి క్రితం వరకూ ఎంత అధమంగా ఆలోచించాను? నైతికంగా ఎంత పతనమయ్యాను? తల్చుకుంటుంటే గుండె కోతకి గురవుతోంది. మామయ్య కాళ్లకి దణ్ణం పెట్టి ‘మామయ్యా..అది నీ ఇల్లే! నువ్వెప్పుడు కావలిస్తే అప్పుడు రావచ్చు. కావాలంటే శాశ్వతంగా వుండిపోనూవచ్చు..తినాలనుకున్నవి అడిగి మరీ చేయించుకోవచ్చు నీకా స్వేఛ్చ వుంది. నువ్వొస్తున్నావని తెలియజేస్తే నేనే స్టేషనుకి వస్తాను."అన్నాను డగ్గుత్తికతో.

"అలాగే లేరా? రాకుండా, మిమ్మల్ని చూడకుండా నేను వుండగలనా? మరి వస్తానే"అని రైలుబండి ఎక్కాడు.

నేను అక్కడే వున్న బెంచిమీద కూలబడిపోయి రైలుబండి వెళ్ళేవరకూ చూస్తూండిపోయాను మసకబారిన కళ్లతో.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు