గెలిచిచూడు - మౌద్గల్యస

gelichi choodu

అప్పుడే స్కూలు నుంచి వచ్చిన తరుణ్ .. పుస్తకాల బ్యాగును విసిరేసి పెద్దపెట్టున ఏడ్వటం ప్రారంభించాడు.

‘‘అమ్మా ... నన్ను అందరూ గేలిచేస్తున్నారు. ఎవరూ పేరు పెట్టి పిలవటం లేదు. సొట్టోడా అంటారు. నాతో ఎవరూ స్నేహం చేయరు. దగ్గరకు వెళ్లినా తొలిగిపోతున్నారు.. ఇది నన్ను చాలా బాధపెడుతోంది. రేపట్నుంచి స్కూలుకు వెళ్లను.’’ చీరకొంగుతో వాడి కన్నీళ్లు తుడిచి తలనిమురుతూ చెప్పింది.

‘‘ కన్నా... మనల్నందర్ని ఆ భగవంతుడే సృష్టించాడు. కొందరిని పేదవారిలా, మరికొందరిని డబ్బున్న వాళ్లలా...కొందరిని అందమైన వాళ్లలా.. ఇంకొందరిని అందవిహీనంగా...

అయితే పుట్టిన అందరికీ సమానమైన శక్తి సామర్థ్యాలిచ్చాడు. కష్టపడితే ఎవరయినా గెలుపును అందుకోవచ్చు.

నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివయితే...

ఈ రోజు నిన్నుచూసి నవ్విన వాళ్లే .. నిన్ను పొగుడుతారు.

నీతో స్నేహం చేయటానికి ముందుకొస్తారు. పనిచేయటానికి భయపడే పిరికివాడు .. ఏడుస్తూ కూర్చునేవాడు... ఎప్పటికీ గెలవలేడు... గుర్తుంచుకో ’’

తరుణ్ మనసులో ధైర్యాన్ని నూరిపోసింది.

‘‘ అది కాదమ్మా... ఈ రోజు గ్రౌండ్ కెళ్లాను. అక్కడ క్రికెట్ సెలక్షన్లు జరగుతున్నాయి. ఓ పక్కగా నిలబడి చూస్తున్నాను. అందరూ నన్ను ఆటపట్టించారు.

నీకిక్కడేం పనిరా.. కనీసం బంతి అందించటానికి కూడా పనికిరావు అని ఒకడంటే మిగిలిన వాళ్లంతా పగలబడి నవ్వారు. ఎగతాళిగా రోజూ ఏదొకటి అంటున్నారు. నేను స్కూలుకు ఎలా వెళ్లేది?’’.

అప్పుడు అమ్మ అనునయంగా చెప్పింది.

‘‘ నీకు లేని దాన్ని గురించి ఆలోచించకు. నీకున్న దానితో నువ్వేం చెయ్యగలవో ఆలోచించుకో. నిన్ను నువ్వు నిరూపించుకో... అందరితో శభాష్ అనిపించుకో. ఇలాంటివి నిన్ను బాధపెట్టని స్థాయికి చేరుకో’’.

విజయం సాధించిన కొందరు వ్యక్తుల గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తెల్లవారుఝూమున ఎప్పుడో వాడికి నిద్ర పట్టింది.ఆ రోజే కాదు.. తరుణ్ పడుకోబోయే ముందు ప్రతిరోజూ ఆమె ఇలాంటి కథలే చెప్పసాగింది.

కొన్నేళ్లు గడిచాయి.

తరుణ్ కొత్త ప్యాంటు, షర్టు తొడుక్కుని స్కూలు కొచ్చాడు.

ఆ రోజు స్కూలులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రాంగణం అంతా విద్యద్దీపాలతో కళకళలాడుతోంది.

వేదికపై ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తదితర పెద్దలు కూర్చున్నారు.

మైక్ లో పిలవగానే తరుణ్ ని కూడా తీసికెళ్లి వాళ్లపక్కన కూర్చోబెట్టారు.

‘‘ మన పాఠశాల విద్యార్థి పదోతరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సంపాదించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ విద్యార్థిని అభినందించటానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అతన్ని ఆశీర్వదించటానికి ప్రముఖలు విచ్చేశారు. పెద్ద ఎత్తున బహుమతులు ప్రకటించారు. ఇదంతా మాకు గర్వకారణంగా ఉంది. ’’ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడటం ప్రారంభించగానే అందరి చూపు తరుణ్ వైపు మళ్లాయి.

‘‘ ఈ అబ్బాయి చదువు పూర్తయ్యే వరకూ అందుకయ్యే పూర్తి ఖర్చు మేమే భరిస్తాం. ఇంజనీరింగ్, మెడిసిన్, ఛార్టర్డ్ ఎక్కౌంటెన్నీ .. అతను ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే... ’’ పేరొందిన స్వచ్ఛంద సంస్థ వేదికపైకి వచ్చి ప్రకటించింది.

ఆడిటోరియంలో చప్పట్లు మారుమోగాయి.

మళ్లీ చప్పట్లు..

‘‘తరుణ్ ని ముఖ్యమంత్రి ఆహ్వనించారు. క్యాంపు ఆఫీసుకు తీసుకురావలసిందిగా సూచించారు.”

‘‘ తను ఇన్నాళ్లు పడిన శ్రమ వృథా కాలేదు. మట్టిముద్దను శిల్పంగా మార్చినట్టే బలహీనుడిగా అవమాన భారంతో తల్లడిల్లే తన బిడ్డను తను తీర్చిదిద్దుకుంది. వింటినుంచి వదిలిన బాణంలా అతను లక్ష్యంవైపు దూసుకుపోతున్నాడు.’’ తృప్తిగా అనుకుంది అమ్మ తరుణ్ వైపే చూస్తూ.

కారులో వెనక సీట్లో తరుణ్.. ఆ పక్కనే కూర్చుని ఉంది ఆమె. మరోనాలుగు కార్లు సీఎం క్యాంపు కార్యాలయం దిశగా సాగుతున్నాయి. వేదికపైన వక్తల ప్రసంగాలు, తన బిడ్డను ప్రశంసలతో ముంచెత్తటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.‘‘ అమ్మా.. నేను స్టీఫెన్ హాకింగ్ లా పెద్ద శాస్త్రవేత్తను అవుతా..’

నాల్రోజుల క్రితం వాడు చెప్పిన మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి.

‘‘వాడు నిజంగా గెలుస్తాడు. నాకా నమ్మకం ఉంది’’ అనుకుంది దృఢంగా.

తరుణ్ కిటికీలో నుంచి బయటకు చూస్తు కూర్చున్నాడు.

అతని చూపుల్లో కొండంత ఆత్మవిశ్వాసం...

గెలవగలనన్న నిండైన నమ్మకం...

పోలియోతో చచ్చుబడిపోయిన అతని రెండు కాళ్లు సీటు పై నుంచి కిందకు వేలాడుతున్నాయి. దేన్నీ లెక్కచెయ్యనట్టుగా.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి