ధర్మ ప్రవర్తన - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

dharmapravartana

ఒకప్పుడు భైరిపురంలో కాంతయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వడ్డీలకు డబ్బివ్వడం, లాభం గడించడం మీదే అతడి ధ్యాస ఉండేది. వడ్డీ ఇవ్వడం ఆలస్యమైనా, అప్పు తీర్చకపోయినా అవతలి వారి పరువు తీసి గంగలో కలిపేవాడు. తనకి పోటీగా ఇంకొక వ్యాపారి రాకుండా జాగ్రత్తలో ఉండేవాడు కాంతయ్య. దాంతో ఎక్కువ వడ్డీ చెప్పినా అప్పుకు వెళ్ళక తప్పేది కాదు జనానికి.

ఒకసారి బసవయ్య అనే రైతు కాంతయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. పంట చేతికి వచ్చాక అది అమ్మి తీరుస్తానన్నాడు. దురదృష్టవశాత్తూ తుపాను వచ్చి పంటలన్నీ నాశనం అయ్యి నష్టం వచ్చింది బసవయ్యకి. కాంతయ్యకి ఇవ్వాల్సిన అసలు, వడ్డీ ఇవ్వలేకపోయాడు. దాంతో కాంతయ్య వెళ్లి బసవయ్యను అప్పు తీర్చమని అడిగాడు. జరిగింది చెప్పి గడువు కోరాడు బసవయ్య.

‘అదంతా నాకు తెలీదు. ఇంకెక్కడయినా తెచ్చి నా అప్పు తీర్చు. లేకపోతే ఒప్పుకోను” అన్నాడు కాంతయ్య.

ఊరులోని జనంకి అది తెలిసి “బసవయ్య పంట పోయిన దుఃఖంలో ఉన్నాడు. ఇలాంటప్పుడు ఎలా తీర్చగలడు నీ అప్పు” అన్నారు. వాళ్ళ మాటలు వినకుండా “అంత అభిమానముంటే మీరే అతని అప్పు తీర్చoడి’ అన్నాడు కోపంగా కాంతయ్య.

ఆ మాటలతో గ్రామస్తులకి కోపం వచ్చి ‘సాటి మనిషి కష్టం అర్ధం చేసుకోని కాంతయ్యని బ్రతిమలాడడం దండుగ. మనందరం కలిసి చందాలు పోగుచేసి అతడి బాకీ తీర్చేద్దాము. ఇక ముందు కాంతయ్యని మనలో ఒకడిగా చూడవద్దు. కేవలం వ్యాపారిగా చూద్దాము. మన కష్టసుఖాలతో పని లేని అతడిని మనమూ పట్టించు కోవద్దు’ అనుకున్నారు.

వెంటనే ఎవరికీ కలిగింది వాళ్ళు చందా ఇచ్చి కాంతయ్యకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసారు. ఇంతకూ మునుపులా కాంతయ్యతో వ్యవహరించడం మానేశారు.

అది చూసి “ఇదీ ఒకందుకు మంచిదే అయింది. ముక్కు పిండి బాకీలు వసూలు చెయ్యవచ్చు” అనుకున్నాడు కాంతయ్య. కొన్నాళ్ళ తర్వాత దగ్గరలోని అడవి నుండి పులి ఊళ్ళోకి చొరబడి పదేళ్ళ వయసున్న కాంతయ్య కొడుకుని ఎత్తుకు పోయింది. తన ఒక్క కొడుకునీ పులి ఎత్తుకుపోతుంటే రక్షించమని కేకలు పెట్టాడు కాంతయ్య. మానవత్వం లేని కాంతయ్య కోసం ప్రాణాలకు తెగించి పులిని ఎదిరించలేదు గ్రామస్తులు. దాంతో కాంతయ్య కొడుకుని పులి చంపేసింది.

అప్పటి నుండి గ్రామస్తుల మీద పగ పెంచుకున్నాడు కాంతయ్య. వూళ్ళో జనానికిచ్చే డబ్బు మీద మరింత ఎక్కువ వడ్డీ వసూలు చెయ్యడం మొదలు పెట్టాడు. అప్పు అడిగే వాళ్ళని పదేపదే తిప్పించేవాడు. గ్రామస్తులని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో అన్నివిధాల ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.

అదలా ఉండగా ఆ వూరి మీదుగా రాజధానికి వెళుతూ ఆ వూరిలో కాసేపు విశ్రమించాడు ఒక ముని. పళ్ళూ పాలూ ఇచ్చి మునికి సేవలు చేసారు కొందరు గ్రామస్తులు. ఆయనకి దయ కలిగి తన ఎదురుగా ఉన్న వికలాంగుడైన యువకుడిని తాకి మామూలు మనిషిని చేసాడు. ఈ విషయం ఊరంతా ప్రాకగానే జనం తండోప తండాలుగా వచ్చి మునిని దర్శించారు. జనాన్ని చూసి సంతోషపడిన ముని “మీ వూరికి ఏదైనా సమస్య ఉంటే తీరుస్తాను” అని మాట ఇచ్చాడు. అది విని జనంలో ఉన్న రంగయ్య అనే ఆసామి ముందుకొచ్చి కాంతయ్య గురించి చెప్పి “అతడిలో మానవత్వం మేల్కొలపండి” అన్నాడు.

అంత చిన్న కోరిక వినగానే ఆశ్చర్య పోయాడు ముని. దివ్యదృష్టితో కాంతయ్య గురించి తెలుసుకుని గ్రామస్తులకు మేలు చెయ్యాలనుకున్నాడు.

అక్కడున్నవారిలో ఒకరిని పిలిచి కాంతయ్య ఇంటికి విందుకి వస్తున్నట్లు చెప్పమని ఆదేశించాడు. అప్పటికే ముని గురించి విన్నాడు కాంతయ్య. ఆ కబురు విని పొంగిపోయాడు. గబగబా విందు ఏర్పాట్లు చేసాడు.

ముని తన ఇంటికి రాగానే ఆయన పాదాలకి నమస్కరించాడు కాంతయ్య. అతడికి శుభం జరగాలని దీవించారు ముని. అది చూసిన గ్రామస్తులు కొందరు ‘కాంతయ్యకి బుద్ధి చెప్పమని అడిగితే శుభం జరగాలని దీవిస్తున్నారేమిటి’ అనుకున్నారు.

కాసేపయ్యాక భోజనానికి లేవమన్నాడు కాంతయ్య. అప్పుడు ముని “నాకు ఉన్న నియమం ప్రకారం ధర్మంగా సంపాదించిన ధనంతో సమకూర్చిన పదార్ధాలనే స్వీకరిస్తాను. మీరిచ్చే విందు ధర్మసంపాదనతో చేసినదేనా?” అని అడిగారు.

కాంతయ్య రెండు చేతులు కట్టుకుని నిలబడి వినయంగా “ఇది నా కష్టార్జితoతో చేసినది. మీరు నిరభ్యంతరంగా భోజనం చెయ్యవచ్చు” అన్నాడు.

అది విన్న ముని ‘కష్టార్జితం అంటే వ్యవసాయం, ఉద్యోగం, ధర్మంగా వ్యాపారం చేసి సంపాదించాలి. నువ్వు అవేమీ చెయ్యలేదు కదా. ధర్మసంపాదన ఎలా అవుతుంది?” అని తిరిగి అడిగారు.

దానికి కాంతయ్య “తరతరాలు నుండి వస్తున్న వడ్డీ వ్యాపారం ద్వారా సంపాదించాను స్వామీ” అని చెప్పాడు.

అప్పుడు ముని “ప్రజల దగ్గర నుండి ధర్మవడ్డీ వసూలు చేస్తున్నావా?” అని అడిగారు. కాంతయ్య మౌనంగా ఉండిపోయాడు.అప్పుడు ముని ‘ మీ ధనం అధర్మంగా సంపాదించినది. అలాంటి ధనంతో చేసిన పదార్ధాలు తింటే నా శక్తులు నశించిపోతాయి. అది నీకూ మంచిది కాదు” అని లేచి నిలబడ్డారు.

అప్పుడు కాంతయ్య ముని కాళ్ళ మీద పడి “ఎంతో కష్టపడి వండించిన ఆహారం వృధా అవుతుంది. మిమ్మల్ని ఆకలితో పంపిన పాపం చుట్టుకుంటుంది” అన్నాడు బ్రతిమలాడుతూ. మునికి కోపం వస్తే తనకి శాపమిస్తారనే భయం కూడా కలిగింది కాంతయ్యకి.అప్పుడు ముని ‘పాపభీతి ఉన్నప్పుడు ముందుగా అధిక వడ్డీకి అప్పులు ఇచ్చే పాపపుపని వదిలెయ్యి” అన్నారు.

దానికి కాంతయ్య ‘నా కొడుకుని పులి చంపుతున్నా ఒక్కరూ కాపాడలేదు. అందుకే అలా చేస్తున్నాను” అన్నాడు. దానికి ముని ‘మీ వూరి జనానికి నువ్వెప్పుడైనా సాయపడి ఉంటే వాళ్ళూ ప్రాణాలకు తెగించి సాయపడేవాళ్ళు. వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే నీ మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు ఎవరికీ. నీ మేలు కోరి చెప్పే మంచి మాటలు విను. నువ్వు అన్యాయంగా సంపాదించే ధనం చనిపోయాక నీతో వస్తుందా? ధనం, ఆస్తులూ అన్నీ ఇక్కడే వదిలేసి వెళతావు. నీ కొడుకు ఎలాగూ చనిపోయాడు కాబట్టి వారసులు లేని నీ భార్యని మోసగించి మీ చుట్టాలు, బంధువులు అన్నీ కాజేస్తారు. అదే నువ్వు ధర్మoగా వ్యాపారం చేస్తే ప్రజల్లో పేరు, గౌరవం వస్తాయి. ధర్మకార్యాచరణ వల్ల చేసుకున్న పుణ్యమూ, మంచి పనుల వల్ల సంపాదించిన కీర్తి కూడా నీ వెనుక వస్తాయి. ఈ రెండూ చివరి వరకూ నిన్ను వదలవు. ఇది తెలుసుకుని ప్రవర్తించు’ అని హితబోధ చేశారు.

కాంతయ్య కళ్ళ ముందున్న పొరలు కరిగి పోయాయి. వెంటనే ముని కాళ్ళమీద పడి క్షమాపణ వేడుకున్నాడు. ఆ రోజు నుండి గ్రామస్తులను సాటి మనుషులుగా గుర్తించి అవసరాల్లో ఆదుకుంటూ మంచిపేరు సంపాదించుకొని శేష జీవితం గడిపాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి