నా జ్ఞాపకాలన్నీ ... జ్యోతిర్మయం - డా. అప్పారావు పంతంగి

naa jnaapakaalanni jyotirmayam

“మనం మనిషిగా ఆశించగలిగింది ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోగల అభిమానాన్ని మాత్రమే. మనకు మించిన భారాలను, దు:ఖాలను అధిగమించగల శక్తిని ఇచ్చే మానవీయ స్పర్శను మాత్రమే. మహా శిలలను అరగదీస్తే తులం బంగారం దక్కినట్టు మనం నమ్మగలిగే ఒక్క మానవ సంబంధం కోసం, మనదైన బంధం కోసం ఎన్ని ప్రయోగాలు చేస్తాం. అలాంటి వారు ఒక్కసారి మనల్ని మోసం చేస్తే... అలా వాళ్ళు మన మనస్సులో చేసిన గాయాలను, మిగిల్చిపోయిన జ్ఞాపకాలను కన్నీటి చెలమలుగా మార్చుకొని పైకి సతతహరితారణ్యంలా పచ్చగా కనిపిస్తామే కానీ, అణువణువున నిప్పుల వర్షంలో తడిసిపోతున్న భావనతో అంత రంగంలో విషాదాన్ని మనకు మాత్రమే సొంతం చేసుకుంటాం.” అని ఎప్పుడో, ఎక్కడో చదివిన విషయాలు గుర్తుకొస్తు న్నాయి.

*****

నాకు బాగా జ్ఞాపకం

చిన్నప్పుడు బడికి వెళ్లాలంటే ఎంతగా ఏడిపించేవాడినో, ఎన్ని దెబ్బలు తినేవాడినో.

“దెబ్బలు కొట్టవద్దని అమ్మ”

“అడ్డు రావద్దని నాన్న”

“రారా బడికి వెళదాం” అని చెల్లి

ఇలా ప్రతిదీ నాకు జ్ఞాపకం. మొత్తం మీద బడికి వెళ్లే వాడిని. చెల్లి చెయ్యి పట్టుకొని. ఆశ్చర్యంగా ఉంది కదూ! అన్నయ్య చెల్లిని బడికి తీసుకువెళ్ళడం విని ఉంటారు కానీ చెల్లి అన్నయ్యను బడికి తీసుకువెళ్లడం ఇదే మొదటిసారి అనుకుంట మీరు వినడం. ఆ అదృష్టం నాకు మాత్రమే దక్కింది. అందుకేనేమో చిన్నప్పటినుంచి ఒకే క్లాస్ లో కూర్చుంటూ ఇంటర్ వరకూ వచ్చాం. చెల్లి లేకుండా ఒక్కరోజు కూడా బడికి వెళ్లలేదు, కాలేజ్ కి కూడా...

చిన్నప్పుడు నాన్న తెచ్చిన కొత్తపుస్తకాలు పంచుకోవడం, ఆ కొత్త వాసనలో మురిసిపోవడం, నెమలి ఈకలు తెచ్చి పుస్తకాలలో పెట్టి పిల్లలు పుట్టాయా?! లేదా?! అని ప్రతిరోజూ చూడటం ... ఇవన్నీ నాకు జ్ఞాపకం. ఆశ్చర్యం చెల్లి పుస్తకంలో నెమలి ఈకలు తగ్గుతూ ఉండేవి కానీ నా పుస్తకంలో నెమలి ఈకలు పెరుగుతూ ఉండేవి. అది ఎలానో ఎదిగిన కొన్నేళ్లకు కానీ నాకు అర్ధం కాలేదు.

మా ఇంట్లో ఓ ఐదు రూపాయల నాణెం ఉండేది. చాలా పెద్దగా, బరువుగా ఉండేది. దాని మీద ఇందిరాగాంధీ బొమ్మ కూడా ఉండేది. దానిని ఎన్ని సార్లు దొంగతనంగా తీసుకెళ్లి చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కున్నామో... ఉదయం కొంటే మధ్యాహ్నం, మధ్యాహ్నం కొంటే సాయంత్రం, సాయంత్రం కొంటే రాత్రి కల్లా ఆ నాణెం తిరిగి మా ఇంటికి వచ్చేది. ఎలా అంటే షావుకారు మా నాన్నకు స్నేహితుడు. వెంటనే విషయం తెలిసేది. నా వీపు విమానం మోత మ్రోగిపో యేది. చెల్లికి తిట్లాభిషేకం జరిగిపోయేది.

ఇలా ఎన్ని జ్ఞాపకాలు... ప్రతిక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

*****

ఇంటర్ లోనే పెళ్లి చేస్తే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన తను, ఇప్పుడు మేము తిరిగిన ప్రతిచోటా, మమ్మల్ని నేను అద్దంలో చూసుకున్నట్లు చూసుకునే ప్రతిచోటా జ్ఞాపకమై పలకరిస్తుంది. తనంటే నాకు ఎంత ఇష్టమంటే నా నిండా తనే నిండి ఉంది. నన్ను తనగా మార్చుకోకుండా, నన్ను నన్నుగా తనలోకి తీసుకున్నా తను లేని నేను అర సున్నాలా, అర్ధరహితంగా మిగిలిపోతున్నానేమో అనిపిస్తుంది. “పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళుతుంటే సూటికేస్ మీద మారిన ఇంటి పేరు చూసి ఒకరినొకరు వాటేసుకొని ఎంతగా ఏడ్చామో... ఎంతమందిని ఏడిపించామో... మీకు తెలిస్తే” తనంటే నాకు ఎంత ఇష్టమో తెలుస్తుంది.

“ఒక మగాడికి భార్యగా, ఒక ఇంటికి కోడలిగా, స్వేచ్ఛను కోల్పోయిన చిన్నారి ముత్తైదువుగా ఉంటూ ఇంటికి వచ్చిన తన అన్నకు కనీస మర్యాద చేయడం కోసం చుట్టూ ఉన్న సంకెళ్ళను తెంచుకున్న తన తెగువ ఊహించగలిగితే” నేనంటే తనకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఇవన్నీ మీతో పంచుకుంటుంటే తనకు నేను బాకీ పడిపోయిన సంగతి కూడా గుర్తుకు వస్తుంది. అది మీకు చెప్పాలనిపిస్తుంది. నెమలి ఈకల నుంచి, ప్రతి రాఖీకి నేను తనకు బాకీ పడుతూనే ఉన్నాను. తను నాకు రాఖీ కట్టే ప్రతిసారీ తన పెదాలపై నవ్వును చూస్తుంటే ... నాకు కూడా కనిపించని నాకళ్ళల్లోని కన్నీళ్లను తను చూసేది.రెప్ప దాటి బయట పడకముందే... దేనికైనా టైమ్ రావాలిరా, ఆ టైమ్ వచ్చినప్పుడు వడ్డీతో సహా అన్నీ వసూలు చేసుకుంటాను లేరా అని ఓ నవ్వు నవ్వేసేది.

ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. మంచి జీతం. తను వస్తే వడ్డీ కాదు, చక్రవడ్డీ, బారువడ్డీ అన్నీ కలిపి తన బాకీ తీర్చేయాలని ఉంది. కానీ తను రాదు, రాలేదు... ఎందుకంటే తను ఈలోకంలో లేదు.

*****

నా చెల్లెలు జ్యోతి.

జ్యోతి తను పేరుకు తగినట్టుగానే మా అందరికీ వెలుగు. ముఖ్యంగా నాకు. ఆ పేరే నను ముందుకు నడిపిస్తుం దనుకున్నాను. కానీ ఆపేరే నను గాఢాంధకారంలోకి నెట్టేస్తుందని ఏ రోజూ ఊహించలేదు. తన మీద నాకు చాలా కోపం.చెప్పకుండా వెళ్లిపోయిందని.అందుకే తను లేని చోట ఉండాలని ఉంది.కానీ ఎక్కడికి వెళ్ళినా తను ఒక జ్ఞాపకమై పలకరిస్తుంది.

తను అత్తారింటి నుంచి వస్తుందంటే చాలు బస్సు దిగిన దగ్గరనుంచి ఇంట్లో అడుగు పెట్టే వరకు మా వీధంతా ఒకటే సందడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పలకరిస్తుంది. తానూ పులకరిస్తుంది గోదారిలా గలగలా నవ్వుతూ వచ్చేది. ఆనవ్వు నాకు బాగా జ్ఞాపకం.

***

ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో నాకు మిగిల్చి తను మాత్రం అందనంత దూర తీరాలకు తను వెళ్లిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేసి.‘తను వద్దన్నా పదహారేళ్లకే పెళ్లి చేసిన జ్ఞాపకం’

‘పద్దెనిమిదేళ్ళకే పాప పుట్టిన జ్ఞాపకం’

‘ఇరవై ఏళ్లకే మరో పాప పుట్టిన జ్ఞాపకం’

‘ఇరవై నాలుగేళ్లకే అందరినీ వదిలి, అన్నీ వదిలి నూరేళ్లూ నింపుకొని వెళ్ళిపోయిన జ్ఞాపకం’

“అప్పుడవన్నీ తీపిజ్ఞాపకాలు ... ఇప్పుడవన్నీ చేదు జ్ఞాపకాలు...”

జ్యోతి... ఎక్కడికి వెళ్ళిందో తెలుసు

ఎందుకు వెళ్ళిందో తెలుసు

ఎలా వెళ్ళిందో తెలుసు

అయినా ఏమీ చేయలేని నిస్సహాయత, తల్లిలేని పిల్లల్ని తండ్రి లేని పి‌ల్లలుగా చూడకూడదన్న పెద్దవాళ్ళ దయార్ద్ర హృదయత మా చేతుల్ని కట్టిపడేశాయి. అయినా తప్పు మాది. ముఖ్యంగా నాది. వద్దన్నా... అన్నా , చిన్న వయసులోనే పెళ్లిచేసి సరిదిద్దుకోలేని తప్పుచేశాం. ఇటు శారీరకంగానూ, అటు మానసికంగాను ఎదగని పిల్లలకు పెళ్లి చేస్తే తన చుట్టూ ఉన్న పరిధిని విస్తృత దృక్పథంతో చూడలేరు. నవమాసాలు మోసినంత తేలికగా వారు కష్టాలు, కన్నీళ్లు మోయ లేరు. వారి ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని భంగపరచే సంఘటనలు అత్తారింటిలో చోటుచేసుకుంటే తనను తాను సహాన పరచుకోలేరు. తమకు తాము సర్ధిచెప్పుకోలేరు. ఫలితం ఈలోకం నుంచి కడతేరిపోవాలనుకుంటారు. నిందలేనిదే బొంది పోదంటారు. అలా ఏదో ఒక నిందతో.... కానీ అసలు కారణాలు అలా అట్టడుగునే ఉండిపోతాయి.

*****

కంటికి రెప్పలా చూసుకునే కూతురు దూరమైతే ఒక తండ్రి పడే బాధ నా కళ్ళముందు కనిపిస్తుంది.

చిన్నప్పుడెప్పుడో బడిలో పంతులుగారు చెప్పిన పాఠం గుర్తుకు వస్తుంది. అమ్మను చూస్తుంటే... “ కంసుడు కడుపులో ఉన్న పిండాన్ని ఖండఖండాలుగా నరికినపుడు ఆ తల్లి పడిన బాధకంటే మా అమ్మ పడుతున్న బాధ వెయ్యి రెట్లు ఎక్కువలా అనిపిస్తుంది.” ప్రేగు తెంచుకు పుట్టిన కూతురు ప్రేమ తుంచుకొని వెళ్లిపోతే... ఏ తల్లైనా ఎలా తట్టుకుం టుంది.

జ్యోతిని తలచుకొని నా ముందు ఏడిస్తే నేనూ ఏడుస్తానని అమ్మ, నాన్న...

అమ్మ, నాన్నల ముందు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారని నేను...

ఇలా నాకు తెలియకుండా వాళ్ళు, వాళ్ళకు తెలియకుండా నేను ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపామో ... ఆనిద్ర లేని కళ్ళల్లో ఎప్పుడూ తనే. తనతో పాటు చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ తను మాత్రం “జన్మాంతర ఋణమేదో తీర్చుకుపోవడానికి వచ్చినట్టు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.” అందుకే ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదు. వాళ్ళని పెళ్లి పేరుతో పరాయి వాళ్ళకు బానిసలుగా మార్చకూడదు. ‘ఉద్యోగాలు చేస్తారా?, ఊళ్ళేలతారా?’ అని వాళ్ళ కాళ్ళకు, చేతులకు సంకెళ్లు వేసి వారి అస్తిత్వాన్ని, అభివృధ్ధిని మనం అనగద్రొక్కకూడదు. స్త్రీ సాధికారితా జిందాబాద్ అనేలా... వాళ్ళను ఎదగనివ్వండి. ఒక రాణీరుద్రమదేవిలా... ఒక ఇందిరా గాంధీలా... ఒక ప్రతిభాపాటిల్ లా... ఎదగనివ్వండి.

*****

క్షమించండి నాలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కానీ మనిషికి ఆవేశమే కాదు ఆలోచన కూడా ఉండాలి. అదే ముఖ్యం. ఆ ఆలోచనే ఆ రోజు ‘కత్తికన్నా కలం గొప్పది’ అనే విషయాన్ని మా వాళ్లకి జ్యోతి గుర్తుచేసింది. ఏప్రిల్ 23, 2008న జ్యోతి వెళ్లిపోయింది. హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యం.ఏ. తెలుగు ఫైనల్ ఇయర్ ఆఖరి పరీక్షకు హాజరవుతున్న నాకు చెప్పకుండా వెళ్లిపోయింది. ఒకరికోసం ఒకరం అన్నట్టుగా పెరిగాం. చివరకు ఒకరినొకరు చూసుకోకుండానే ... కడసారి చూపు కూడా నా కంటికి దక్కలేదు.

“చిన్న తనంలో పెళ్లి చేశానన్న కోపం ఇలా తీర్చుకుంది. అందుకే ప్రస్తుతం నా జ్ఞాపకాలన్నీ జ్యోతిర్మయం.”

******************************************

‘నా జ్ఞాపకాలన్నీ... జ్యోతిర్మయం’ ఇది కథ కాదు వాస్తవం. ఇంటర్ సెకండ్ ఇయర్ లో పెళ్లి చేయడం, అత్తవారింటిలో వచ్చే సమస్యలు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల తనను తాను సర్దిచెప్పుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మా చెల్లెలు జ్యోతి కథ ఈ కథ. 2008లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యం.ఏ తెలుగు చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న నాకు ఈ విషయం తెలిస్తే పరీక్షలు మానేసి వస్తానని నాకు చెప్పొద్దని మావాళ్ళ చేత ప్రామిస్ చేయించుకొని మా చెల్లెలు కన్నుమూసిందట. అందుకే చివరివరకు నాకు ఏ విషయం తెలియకుండా ఉంచారు. పరీక్షలు అయిపోయి నేను ఇంటికి వచ్చే రోజే మా చెల్లెలు పెద్దఖర్మ. తనను చూద్దామని వెళ్ళిన నాకు తనను ఖననం చేసిన చోటు చూపించారు. అప్పుడు.. నా స్థితి, పరిస్థితి మాటల్లో చెప్పలేను.

ఆడపిల్ల గుండెల మీద కుంపటని భావించి వారికి చిన్న తనంలోనే పెళ్లి చేస్తే తద్వారా వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియచెప్పడానికే ఈ నా కథ. “ఆడపిల్లంటే భారం కాదు వరం” ఈ విషయాన్ని గమనించగలరు.

-రచయిత

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు