గతం చచ్చిపొమ్మటుంది...
జ్ఞాపకం జీవించమంటుంది...
గతమంతా జ్ఞాపకమైతే బావుండనిపిస్తుంది...
ఏదీ తేల్చుకోలేని నా స్థితి నన్ను వెంటాడి వెంటాడి వేధిస్తుంది...
అందుకే.......
*****
ఆక్షణం నాకెందుకో అపురూపమైపోయింది .
వాడంటే నాకెంత ఇష్టమో వాడికి తెలియదు. కానీ నేనంటే వాడికెంత ఇష్టమో నాకు తెలుసు. వాడు నన్ను ఎంతగా ప్రేమించాడో చెప్పాలంటే...అమ్మో! ఈ జీవితం సరిపోదేమో. వాడు ఎన్ని సార్లు నా వెంటపడ్డాడో ప్రేమించమని కానీ నేను మాత్రం అంగీకరించలేదు. అలానే అనుకున్నాడు వాడు. కానీ వాడంటే నాకెంత ఇష్టమో... మనసు నిండా వాడిమీద ప్రేమే. కానీ ఏ రోజూ వాడికి చెప్పలేదు. ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవు. నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పేస్తే....
వాడి చూపులు నాకిష్టం, వందమందిలో నేను ఎక్కడ ఉన్నా వాడి కళ్ళు మాత్రం నన్ను చూస్తూనే ఉంటాయి. నన్ను వెదుకుతున్న ఆ కళ్ళలో ఆరాటం నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో... చూపుల బాణాలతో వాడు నన్ను తెగ తడిమేస్తాడు, ఆ క్షణం నాకు ఎంత సిగ్గేస్తుందో.
వాడి అడుగులు నాకిష్టం. నిశీథిలో ఉన్నా నన్ను చేరుకుంటూనే ఉంటాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడో నాకోసం. వాడి శరీరం నుంచి కారిన రక్తం కూడా నన్ను బాధించలేదు. ‘నా మీద వాడికున్న ప్రేమను వ్యక్తం చేస్తున్న రాయబారిలా కనిపించిoది.’ అందుకే చూసి నవ్వుకున్నానే కానీ దగ్గరికి చేరుకోలేక పోయాను.
వాడిమాటలు నాకిష్టం. ఎక్కడి నుంచి తీసుకొస్తాడో కానీ నేనే కాదు ఆ మాటలకు ఏ ఆడపిల్లై నా ఇట్టే పడిపోతుంది. కానీ వాడు మాత్రం నాకు పడిపోయాడు. అప్పుడప్పుడు భయమేస్తుంది కూడా, నా వెనుక తిరిగీ తిరిగీ నేను ఒప్పుకోలేదని వేరే అమ్మాయిని చూసుకుంటే. అమ్మో ! నేను బ్రతకగలనా?
అయినా సరే ఎందుకో వాడికి మాత్రం చెప్పలేక పోతున్నాను.
చెప్తే … మళ్ళీ ఆ చూపులు నాకు కనపడవు కదా!
చెప్తే ... మళ్ళీ ఆ అడుగులు నన్ను వెంటాడవు కదా!
చేప్తే ... మళ్ళీ ఆ మాటలు నాతో మాటాడవు కదా!
అందుకే చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నా...
వాడు నా ఫోను నెంబర్ అడిగినప్పుడు నేను ఇవ్వనని చెప్పేశాను. కానీ నా స్నేహితురాలికి ఇచ్చి వాడికిమ్మని నేనే నంబర్ పంపించాను. నేనిచ్చానని చెప్పొద్దని చెప్పి మరీ పంపాను. వాడి ఫోను కోసం ఎంతగా ఎదురుచూశానో నాకే తెలియదు. అమ్మ ,నాన్న చేసే కాల్ కోసం కూడా నేను అంతగా ఎదురుచూడలేదు. విచిత్రం ఏమంటే అమ్మ కాల్ చేస్తే కట్ చేసి మరీ వీడి ఫోను కోసం ఎదురు చూశాను. వీడి ప్రేమ ముందు అమ్మ ప్రేమ కూడా చిన్నబోయిందా అనిపించింది. అయినా వీడి నుంచి ఇంకా ఫోను రాలేదు. ఎదురుచూస్తూనే ఉన్నాను. హాస్టల్ లో అందరూ పడుకున్నారు, నేను పడుకు న్నాను, రాత్రి గడిచిపోతూంది కానీ నిద్రపట్టడం లేదు. అంతలో ఫోను మ్రోగింది. పోతున్న ఊపిరి కాస్త తిరిగి వెనక్కి వచ్చింది. అరచేతుల్లోకి తీసుకున్న... నా ఊపిరిని, అదే... ఫోన్ ని.
గది నిండా నిశబ్దం. ఫోన్ లో కూడా నిశబ్దం. అవతలి నుంచి ఎవరూ మాట్లాడటం లేదు. కాసేపు చూశాను. వాడు గొంతు వినాలని నాకుంది. కానీ వాడు మాత్రం మాట్లాడటం లేదు. అది వాడని నాకు తెలుసు అందుకే మీరు మాట్లాడుతారా, ఫోన్ పెట్టేయమంటారా అని అనే సరికి ‘ అక్కడ ఫోన్ పెట్టేస్తే ఇక్కడ నా ఊపిరి ఆగిపోతుంది.’ అని మొదలు పెట్టాడు.(వాడికి తెలియని విషయమే మంటే వాడి ఊపిరి నా దగ్గర ఉంది. కాబట్టి అంతకంటే ముందే నా ఊపిరి ఆగిపోతుంది.) నా నెంబర్ ఎవరిచ్చారు అని అడిగాను. ఇష్టమైన వాళ్ళ నంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అన్నాడు. “ఇష్టమైన వాళ్ళకి నంబర్ ఇవ్వడం కూడా పెద్ద కష్టం కాదు అని నాకూ అనాలనిపించింది.” కానీ వాడంటే నాకు ఇష్టమనే సంగతి వాడికి తెలిసిపోతుందని నేను ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాను. వాడు మాత్రం మాట్లాడుతూనే ఉండిపోయాడు. నేను వింటూనే ఉండిపోయాను.
నేను మా అమ్మ, నాన్న తరువాత అంతగా ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. దయచేసి నా ప్రేమని అర్ధం చేసుకో. జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను. నిన్ను చూస్తున్న ప్రతిసారి నా హృదయం రెక్కలు విప్పుకు ఎగురుతుంది. నువ్వు వెళ్తున్న ప్రతిసారీ నా ప్రాణం విలవిలలాడిపోతుంది. నువ్వు ఒప్పుకుంటావనే ఆశ లోలోపల ఉన్నా... నువ్వు కాదంటే నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనే నన్ను అనుక్షణం వెంటాడుతుంది. ఇలా వాడు మాట్లాడుతుంటే వాడు నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. నా గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతున్నట్టుగా ఉంది. ‘నా హృదయం ఘనీభవి స్తోంది... నా మనసు ద్రవీభవిస్తోంది.’ ఆ క్షణం నాకెందుకో అపురూపమైపోయింది. కనీసం ఇప్పుడైనా వాడికి నిజం చెప్పి ఉన్నట్టయితే బావుండేది. కానీ చివరి సారిగా ఒక్కసారి వాడిని ఏడిపించాలను కున్నా ను. ఒక్కసారి వాడితో ఆడుకోవాలనుకున్నాను. కానీ నేను ఆడే ఆట నాతోనేనని, నామీద నేనే తాత్కాలికంగా గెలిచి శాశ్వతంగా ఓడిపోతానని తెలియదు. అందుకే వాడితో చెప్పాను, ‘సారీరా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, నాకు ఈ ప్రేమలు, గీమలు అంటే పెద్దగా ఇష్టం లేదు, నమ్మకం కూడా లేదు. అందుకే దయచేసి నన్ను వదిలేయ్. నువ్వు నన్ను ప్రేమించకపోయినా, నేను నిన్ను ప్రేమించకపోయినా కాలం ఏమీ ఆగిపోదు కదా ! కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ మానేసి మంచిగా చదువుకో. అని నీతులు చెప్పాను.’ వాడు కూడా అవును కదా , అనవసరంగా ప్రేమించి సమయాన్ని, చదువుని వృధా చేసుకుంటున్నాను. ఇన్నాళ్లుగా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను ..... ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు ఫోన్ కట్ అయ్యింది. ఐదు నిముషాలు, పది నిముషాలు చూశాను, వాడి నుంచి ఫోన్ రాలేదు. భయమేసింది నిజంగానే వాడు మారిపోయాడా, నన్ను వదిలేస్తాడా అర్ధం కాలేదు. ఇన్నాళ్ళు వాడు పడిన బాధ ఏమిటో ఈ పది నిముషాలలోనే నాకు అర్ధమయ్యింది. వెంటనే వాడికి కాల్ చేశాను. రింగ్ అయ్యి కట్ అయ్యింది. తరువాత ఎంతసేపు ఫోన్ చేశానో, నా జీవితంలో అన్ని సార్లు ఎవరికీ ఫోన్ చేయలేదు. ఎన్ని సార్లు చేస్తున్నా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది, అలా నేను ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు. కానీ వాడి గురించే ఆలోచిస్తూ పడుకున్నాను.
తెల్లవారే సరికి నా ఫోన్ నిండా మిస్డ్ కాల్స్. మెసేజ్ లు. ఆతృతగా తీశాను. అవును వాడే, నాకోసం ఎప్పటినుంచి ఫోన్ చేస్తున్నాడో. నేను మెసేజ్ లు చూడలేదు. వెంటనే ఫోన్ చేశాను. కానీ ఫోన్ తీసింది వాడు కాదు, వాడి ప్రెండ్. తను లేడు టెర్రస్ పైకి వెళ్ళాడు. వాడు వచ్చాక చెప్తాను అని ఫోను పెట్టేశాడు. అలానే చూస్తూ ఉండిపోయాను. కాసేపటి తరువాత నా ఫోను మ్రోగింది. వెంటనే ఫోను తీసి “ఐ లవ్ యు రా...” అనేశాను. కానీ ఫోన్ చేసింది వాడు కాడు. వాడి ఫ్రెండ్. వెంటనే క్రిందికి రమ్మన్నాడు. ఎందుకని అడిగాను? వాడు నీకోసం క్రిందికి వచ్చాడు, వెంటనే క్రిందికి రా... అని ఫోన్ పెట్టేశాడు. నా కోసం వాడు... ఈ రోజుతో మా మధ్య ఉన్న ఈ కాస్త దూరం దగ్గరైపోతుంది. అంటే నేను వాడికి దగ్గరైపోతున్నానా? అయ్యబాబోయ్ ఎంత సిగ్గేస్తుందో... బయటకు వెళ్లగానే అందరూ పరిగెత్తుతున్నారు. కొందరైతే అరుస్తూ పరిగెత్తుతున్నారు. మరికొందరు ఏడుస్తూ పరిగెత్తుతు న్నారు. నాకేమీ అర్ధం కావటంలేదు. ఎవర్నడిగినా ఏమీ చెప్పే స్థితిలో లేరు. నా మనస్సు ఎందుకో వేదనపడుతోంది. వెంటనే ఫోన్ తీసి వాడుపంపిన మెసేజ్ లు చూశాను. “ఐదు నిముషాలలో రిప్లై ఇవ్వకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతాను.” వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అవును వాడే రక్తపు మడుగులో, గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనంత దారుణమైన స్థితిలో వాడిని చూసి నేను తట్టుకోలేకపోయాను. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మసక మసక గా వాడి రూపం కనిపిస్తుంది. ఎంతగా ప్రయత్నించినా నావల్ల కావడం లేదు. ఏడుపు ఆగడంలేదు. అక్కడినుంచి వెళ్లిపోదామనుకుని వెనక్కి తిరగబోతుండగా వాడి చేతిమీద “నువ్వొస్తావని నాకుతెలుసు” అని రాసి ఉండటం గమనిం చాను. వెంటనే రూమ్ కి వచ్చేశాను. వాడి దగ్గరికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. అందుకే ఈ లెటర్ రాసి వెళ్తున్నాను. దయచేసి నా శవాన్ని కూడా వాడి పక్కనే పాతిపెట్టండి. బతికుండగా కలిసుండలేని మేము చనిపోయిన తరువాతైనా కలిసుంటాం.
గమనిక : నా చావుకు నేనే కారణం.ఈ విషయంలో దయచేసి ఎవరినీ బాధపెట్టకండి. ఇక ఉంటా...సెలవు.
ఎంత ఈజీగా చచ్చిపోయారండీ... బిల్డింగ్ పైకి ఎక్కి దూకగానే సమస్యను పరిష్కరించుకోలేని వారి పిరికి గుండె వాళ్ళు నేలను తాకేలోపే ఆగిపోయి ఉంటుంది. చీమ కుట్టిన నొప్పికూడా తెలియ నంత సుఖంగా చనిపోయారు కదా వాళ్ళిద్దరూ... కానీ వారు పోయాక వాళ్ళ కోసం ఎన్ని హృదయాలు బాధపడి ఉంటాయో కదా, ఎన్ని కళ్ళు కన్నీళ్లు కార్చి ఉంటాయో కదా, ఒక్కసారి... ఒక్కసారి వాళ్ళు చావడానికి ముందు చనిపోయిన తరువాత జరిగే సంఘటనలను ఊహించగలిగి ఉంటే చావు ఎంత భయంకరంగా ఉండేదో వాళ్ళకు అర్ధమయ్యేది.
‘ఎండనక, వాననక... రాత్రనక, పగలనక... శ్రమ అనక, సుఖమనక... తినీతినక, త్రాగీత్రాగక, కనీసం కంటినిండా సరైన నిద్రాలేక పైసా పైసా కూడబెట్టి నిన్ను పై స్థితులకు చేర్చాలని తల్లిదండ్రులు తాపత్రయ పడుతుంటే అమ్మాయి ప్రేమించలేదని అబ్బాయి, అబ్బాయి ప్రేమించలేదని అమ్మాయి విలువైన జీవితం యొక్క విలువను గుర్తించక సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ ఇంజనీర్ చదువో చదువుకొని, ఉద్యోగం సంపాదించుకొని కారులోనో, మోటార్ బైక్ లోనో వస్తాడని కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లికి తన ఇంటి ముందే ఆగిన ఆంబులెన్స్ వ్యాన్ చూసి భయం భయంగా దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉన్న వ్యాన్ లోకి తొంగి చూస్తే...
రక్తపు మరకలతో, గుర్తుపట్టలేని స్థితిలో, పోస్ట్ మార్టం పేరుతో నిలువునా కోసిన... పొత్తిళ్లలో పెంచుకున్న కొడుకుని చూసినపుడు ఆ తల్లి స్థితిని ఊహించండి...’
“చావు చాలా భయంకరంగా ఉంది కదూ.... దట్ ఈజ్ చావు”