ఆలోచనకి అటూ ఇటూ - కె. శ్రీలత

alochanaki atu itu

ఎనిమిదవ తరగతి చదువుతున్న కొడుకు వినోద్ అడిగిన ప్రశ్నతో నోటమాట రానట్టయ్యి అవాక్కయ్యి, ఆలోచనలో పడింది సుమతి. నిన్న జరిగిన సంఘటన్ గుర్తు చేసుకుంది..

*************

క్లినిక్ ముందు ఆగిన ఆటో లోంచి దిగారు సుమతి, భాస్కర్ లు. నీరసంతో అడుగులు వేయలేక ఇబ్బంది పడుతున్న భర్త భాస్కర్ చేయిని పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ వెయిటింగ్ రూం లో వున్న కుర్చీలో కూర్చోబెట్టింది సుమతి.

రెండు నెలలుగా విపరీతమైన ఒళ్ళునొప్పులు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు భాస్కర్.కానీ, పారాసెటామాల్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ మెడిసన్స్ వేసుకోవడంతో, తాత్కాలికంగా జ్వరం తగ్గుతూ మళ్ళీ రెండు-మూడు రోజులకు విపరీతంగా వస్తూ బాగా నీరసించిపోవడంతో భయం వేసి, ఆఫీస్ కి లీవ్ పెట్టించి భర్తను తీసుకుని హాస్పిటల్ కి వచ్చింది సుమతి.

డాక్టరు గారు రాసిచ్చిన అన్ని టెస్టులూ చేయించేసరికి మధ్యాన్నం పన్నెండు దాటింది. అన్ని టెస్టుల రిపోర్ట్ లు చూసిన డాక్టరు గారు టైఫాయిడ్ అని కంఫర్మ్ చేసి, రెండు నెలలుగా గుర్తించకపోవడం వల్ల బాగా నీరసించి పోయిన భాస్కర్ ని మందలించి నెలరోజులు పూర్తిగా రెస్టు తీసుకోవాలనీ, అలాగే మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలనీ చెప్పి మెడిసన్స్ రాసి పంపిచివేసారు.

ఇద్దరికీ బాగా ఆకలి వేస్తూండడంతో ప్రక్కనే వున్న హోటల్లోకి వెళ్ళి వేడి వేడి పాలు ఆర్డర్ చేసి బ్రెడ్ ప్యాకెట్ కొని ఇద్దరూ తిన్నారు. కొంచం ఓపిక వచ్చింది ఇద్దరికీ. ఆ తరువాత ఆటో మాట్లాడుకుని ఇంటికి తిరిగి వచ్చారు.

వచ్చీరాగానే జావ ఇచ్చి టాబ్లెట్స్ వేసింది సుమతి.

వెంటనే మగతలోకి జారుకున్నాడు భాస్కర్. కానీ సుమతికి నిద్రపట్టలేదు. అన్యమన్స్కంగా ఇంటి పనులు పూర్తి చేసింది.

భాస్కర్, సుమతి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. భాస్కర్ పనిచేసేది ప్రైవేట్ కంపెనీ కావటాన, వచ్చిన జీతాన్ని పొదుపుగా ఖర్చు చేసుకుంటూ గుట్టుగా సంసారం చేస్కుంటున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలు, వినోద్, లలిత. వినోద్ ఎనిమిదవతరగతి, లలిత ఐదవ తరగతి. చదువుతున్నారు.

ఆ రాత్రి భోజనం చేయగానే నిద్రపోయింది లలిత. వినోద్ మాత్రం స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ చేసుకుంటున్నాడు. తల్లిదండ్రుల దగ్గర కూర్చుని.

మౌనంగా కూర్చుని వున్న భార్యను చూస్తే జాలేసింది భాస్కర్ కి.

" డాక్టర్లు అలానే అంటారు సుమతీ! నెలరోజులపాటు రెస్టు తీసుకుంటూ ఇంట్లోనే వుంటే జీతం ఎలా వస్తుంది? అందులోనూ నేను చేసేది ప్రైవేట్ జాబ్ " అన్నాడు...

" వద్దండీ, ఆఫీసుకి లీవ్ పెట్టేయండీ ఇప్పటికే పాపం, ఒంట్లో బాగోలేకున్నా లెక్కచేయకుండా శ్రమపడడం వల్ల బాగా నీరసించిపోయారు. ఇప్పుడుకూడా మీరు డాక్టర్ చెప్పినట్టు వినకుండా ఆఫీసుకు వెళితే ఇంకేమన్నా వుందా?" అంది సుమతి.

" అలా అంటే ఎలా సుమతీ, మనకు ఈ జీతం కాక వేరే ఆదాయ మార్గాలేవీ లేవు కదా " అన్నాడు భాస్కర్.

మౌనంగా ఉండిపోయింది సుమతి. అవును, భర్త చెప్పింది నిజమే, తమలాంటి మధ్యతరగతి వాళ్ళూ, చిన్న-చితకా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకు బండిలాగే వాళ్ళూ, అనారోగ్యం వల్ల కానీ, అనుకోని అవాంతరాల వల్ల కానీ, పంలోకి వెళ్ళకపోతే అంతే, ఆ నెల జీతం ఇవ్వరు....కానీ...

జీతం రానంత మాత్రాన నిత్యావసరాలు, ఖర్చులు ఆగిపోతాయా? పాలకీ, ఇంటద్దెకీ, కరెంట్ బిల్లులకీ, నెలవారీ సామాన్లకీ అన్నింటికీ డబ్బులు కావాలి అన్ని ఖర్చులూ తప్పనిసరివే!

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సుమతికి. తను జాగ్రత్తగా పొదుపు చేసి దాచుకున్న డబ్బులు మహా అయితే పది రోజులు సరిపోతాయి. ఆ తర్వాత ఎలా..? ఏమీ పాలుపోవడం లేదు.

అమ్మానాన్నలను అడుగుదామన్నా వాళ్ళ పరిస్థితీ అంతంత మాత్రమే. అందుకే, భర్తకు చేదోడు-వాదోడుగా వుంటుందని తను కూఒడా ఏదైనా స్కూళ్ళో జాయిన్ అవుదామని ఎంతో ప్రయత్నించింది కానీ, ఆమె చదివింది తెలుగు మీడియం అవటానైప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం చదివిన వారికే ప్రయారిటీ ఇవ్వటాన తను ఎన్ని స్కూళ్ళల్లో అప్లై చేసినా ఇంటర్వ్యూ కాల్స్ రావటంలేదు.భార్య తీవ్రంగా ఆలోచిస్తుందని గ్రహించి, మెల్లగా వచ్చి ఆమె భుజంపై చేయి వేసి అన్నాడు భాస్కర్..

" సుమతీ ! మందులు వేసుకుంటూ టైముకి భోజనం చేస్తూ వుంటే రోజూ ఆఫీసుకి వెళ్ళినా ఏమీ కాదు. నాకు ఇప్పుడు చాలా హుషారుగా వుంది. బహుశా, మెడిసన్స్ వేస్కున్నాను కదా, రేపు నేను ఆఫీసుకు వెళ్తాను..." అన్నాడు.

ఓపిక లేకపోయినా తాము ఎక్కడ ఇబ్బంది పడతామో అని, లేని ఓపిక నటిస్తున్న భర్తను చూసి బాధేసింది సుమతికి.

" అసలు ఇదెక్కడి న్యాయమండీ? మనిషన్నాక రోగాలు, జబ్బులూ రానే రావా? అంత మాత్రాన ఒక నెల రోజులపాటు ఆఫీసుకు లీవ్ పెడితే ఆ నెల జీతం కాస్తా కట్ చేస్తారా? ఇదెంతవరకూ సబబు? ఇదసలు కరెక్టేనా?కావాలని ఎవరూ ఇంట్లో ఖాళీగా కూర్చోరుగా...కనీసం ఆరోగ్యం బాగోలేదని జెన్యూన్ కేసుల్లో అయినా చూసీ-చూడనట్టు యాజమాన్యం ప్రవర్తిస్తే ఎంత బాగుంటుంది? " అని ఆవేశంగా మాట్లాడింది సుమతి.చిన్నగా నవ్వి ఊరుకున్నాడు భాస్కర్. ఎందుకంటే సుమతి ఆవేశం అర్థం లేనిది అనిపించింది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఇదే అనారోగ్యం కారణంగా నెలరోజులచొప్పున లీవులు పెడుతూ జీతాలు కావాలంటే వాళ్ళ కంపెనీలు బాగుపడ్డట్టే..అనుకున్నాడు మనసులో.చేసుకుంటున్న హోం వర్క్ ఆపేసి అమ్మానాన్నల మాటలన్నీ అక్కడే వుండి వింటున్న వినోద్, తల్లి ఆవేశం చూసి నిజమేకదా నెలనెలా వచ్చే జీతం రాకుంటే ఆ నెల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. " రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు తమవి..." అని అని కూడా అనిపించింది పాపం ఆ చిన్ని మనసుకి. ఎలాగైనా కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. రాత్రంతా కలత నిద్రతోనే వున్నాడు....

మర్నాడు ఉదయం....

స్కూలుకి వెళ్ళడానికి తయారవుతూ తల్లి, గిన్నెలు తోమడానికి వచ్చిన పనిమన్షి రంగమ్మను అరుస్తుంటే ఏమిటాని వినసాగాడు." ఏంటి రంగమ్మా ఇది..? పదిరోజులుగా పన్లోకి రాలేదు..కనీసం మాటమాత్రమైనా చెప్పలేదు..." కోపంగా అంది సుమతి.

"అస్సలు పది రోజులుగా పానం బాగోలేదమ్మగోరూ ఒకటే జరం..నిన్ననే గవుమెంటు ఆసుపత్రికి ఎల్లి మందులు తెచ్చుకుని ఏసుకున్నాను...కొంచెం ఓపికొచ్చింది....అందుకే గబగబా వచ్చాను" మెల్లిగా అంది రంగమ్మ్.

" ఏమో..అదంతా నాకు తెలీదు...ఈ పదిరోజులు డబ్బులు కట్ చేసి ఫస్టుకి మిగతాడి యిస్తాను. అంతే కాదు ఇంకోసారి ఇన్నిరోజులు ఎగ్గొడితే వేరే మనిషిని పెట్టుకుంటాను, నీ ఇష్టం " అని కటువుగా చెప్పేసి " చ...కొంచెం అలుసిస్తే చాలు నెత్తికెక్కుతారు ఈ అలగా జనం...." అని మెల్లగా గొణుక్కుంటూ ముందు గదిలోకి వచ్చింది సుమతి.

" అమ్మా, పనిమనిషి మాత్రం మనలాంటి మనిషి కాదా? " అని సూటిగా ప్రశ్నించాడు వినోద్.

" నాన్నగారి జీతం కట్ చేస్తారని నువ్వు రాత్రి ఎంతో బాధపడ్డావు. మరి అదే అనారోగ్యం కారణంగా రాలేకపోయిన రంగమ్మను ఎందుకు అరుస్తున్నావు?" అని అడిగి తల్లి ఏం చెబుతుందో కూడా వినకుండా వెంటనే తయారు చేసి వుంచిన లంచ్ బాక్స్ అందుకుని గబగబా బైటకు వెళ్ళి స్కూల్ బస్ ఎక్కేశాడు వినోద్.

" చ...ఎంత తొందరపడింది తను రంగమ్మ పట్ల...? ఎంత చక్కగా వివరించాడు తనకొడుకు తను చేసిన తప్పుని..." అనుకుంది సుమతి.వెంటనే ఇంటివెనుక అంట్లు తోముతున్న రంగమ్మ దగ్గర్కొచ్చి " ఇప్పుడెలా వుంది రంగమ్మా ఒంట్లో..." అని అడిగి తాము తినగా మిగిలిన ఉప్మా ఆమెకి తినమని ఇచ్చింది.

పని పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న రంగమ్మతో " పదిరోజుల డబ్బులు కట్ చేయనులే...కంగారు పడకు..." అని నవ్వుతూ చెప్పిన సుమతి వంక విస్తుపోతూ చూసింది రంగమ్మ....అంతేకాదు, తనదగ్గరున్న వంద కాగితం ఆమెకిచ్చి మందులు కొనుక్కోమని చెప్పింది." చల్లగా వుండాలమ్మా" అని దణ్ణం పెట్టి వెళ్ళింది రంగమ్మ.....

************

నీరసంతోటే ఆఫీసుకి వెళ్ళిన భాస్కర్ లంచ్ టైం లో ఇంటికి తిరిగి వచ్చాడు ఆనందంగా. అప్పుడే వచ్చారేంటి..? అని అడిగిన సుమతితో, " పదిగంటలకు టీటైం లో కళ్ళుతిరిగి పడిపోవడంతో మా ఎం డీ గారు చూసి, నాకు ఇరవై రోజులు లీవ్ శాంక్షన్ చేసారు. వితవుట్ లాస్ ఆఫ్ పే...ఆ ఇంకో గుడ్ న్యూస్...అనుకోకుండా లాభాలు రావడంతో రెండునెలల జీతం బోనస్ గా ఇస్తామని మా బాస్ చెప్పరు..." అని సంతోషంగా చెబుతున్న భర్తని చూసి ఎంతో ఆనందం కలిగింది సుమతికి. రెండు వైపులా పారదర్శకంగా చేసే మంచి ఆలోచనలకు భగవంతుడెప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాడు అని మనసులోనే భగవంతుడికి దణ్ణం పెట్టుకుంది...చిన్నవాడైనా ఎంతో పెద్ద సత్యాన్ని తనకు ఒకచిన్న మాట ద్వారా తెలియజేసిన తన కొడుకుని మనసులోనే అభినందించింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు