లవ్ గురు - మౌద్గల్యస

love guru

‘‘ చెరువులోని చేప ఆ చెరువుతోనే ప్రేమలో పడింది.

‘నువ్వు నా కన్నీళ్లను చూడలేకపోతున్నావు. దేనికంటే నీలోనే నేను ఉన్నాను కాబట్టి’’ అంది.

దానికి చెరువు బదులిచ్చింది.

‘ నేస్తమా... నిజంగా నువ్వు నాలోనే ఉన్నావు. అందుకే నీ కన్నీళ్లను నేను ఫీలవగలుగుతున్నాను.

చెరువు, చేపల ప్రేమానుబంధం బలే గమ్మత్తుగా ఉంది కదూ..’’

ఏకదంతం చెప్పుకుపోతున్నాడు ఏకధాటిగా.

‘‘ఏం చెప్పావురా... అద్భుతంగా ఉంది...’’ పక్కనున్నవాళ్లంతా కేరింతలు కొట్టారు.

fఅదే ఊపుతో ఏకదంతం చెప్పాడు.

‘‘ప్రేమ అజరామరం. అద్వితీయం.. ప్రేమకు మరణంలేదు. జీవితంలో ప్రేమను పొందలేనివాడంత దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. చరిత్రలో ఎన్నెన్ని ప్రేమ కథలున్నాయో...

ఆంటోనీ-క్లియోపాత్రా, రోమియో-జూలియట్, షాజహాన్- ముంతాజ్, ఆల్బర్ట్- క్వీన్ విక్టోరియా, లైలా-మజ్ను, దేవదాసు-పార్వతి... ఒక్కొక్కరిది ఒక్కో ప్రేమ కథ...

వాడు చెప్పేది ఆసక్తికరంగా అనిపించింది.

‘‘ చివరి ఇద్దరి గురించి మాకు తెలుసు. మిగిలిన వాళ్ల గురించి చెప్పరా బాబూ...’’ అడిగాడు సుబ్బు.

వాడు అడగటం పూర్తికాలేదు. ఏకదంతం అందుకున్నాడు.

‘‘బతుకులోనే కాదు, మరణంలోనూ సహజీవనం అన్న సూత్రం ఆంటోనీ,క్లియోపాత్రాలకు వర్తిస్తుంది. ఆంటోనీ ,క్లియోపాత్రాలు తొలిచూపులోనే ప్రేమలో పడతారు. ఈజిప్టులో వారి నివాసం. రోమన్లకు వారి ప్రేమ కంటగింపుగా మారుతుంది. అందుకే అనేక అవాంతరాలు సృష్టిస్తారు.. ఇవేం లెక్కచెయ్యని ఆ జంట పెళ్లిచేసుకున్నారు. ఈలోగా యుద్ధం వచ్చింది. క్లియోపాత్రా యుద్దంలో చనిపోయిందన్న అబద్ధం ప్రచారం చేస్తారు. అది ఆంటోనీ చెవిలోపడుతుంది. అది వాస్తవమో కాదో అని ఏమాత్రం నిర్ధరించుకోకుండా కత్తిమొన పైన కూలపడి ప్రాణం విడుస్తాడు. ఆంటోనీ కన్నుమూసిన వార్త క్లియోపాత్రా చెవిన పడుతుంది. ఆమె కూడా దేహత్యాగం చేస్తుంది. నిజ జీవిత పాత్రలయిన ఆంటోనీ, క్లియోపాత్రాలకు ప్రసిద్ధ రచయిత షేక్స్ పియర్ చిరస్మరణీయమైన కీర్తిని సంపాదించిపెట్టారు’’

అనర్గళంగా చెప్పుకుపోతున్న ఏకదంతం వైపు విస్మయంగా చూస్తుండిపోయాం.

‘‘ షేక్స్ పియర్ రాసిన మరో ట్రాజెడీ నవలలో రోమియో, జూలియట్ పాత్రలు కనిపిస్తాయి . బద్ధవిరోధులయిన రెండు కుటుంబాలకు చెందిన వారసులు వీళ్లిద్దరు.

ప్రేమ, పెళ్లి, అన్యోన్యదాంపత్యం, ఒకరికోసం మరొకరు ప్రాణత్యాగానికి సిద్ధపడటం వంటివి ఇందులో ఉంటాయి. ప్రేమ కోసం ఇద్దరు ప్రాణ త్యాగం చేస్తారు. చివరికిపెద్దలకు కనువిప్పు కలుగుతుంది. ప్రేమ త్యాగాన్ని కోరుతుందని ప్రతి ప్రేమికుడు భావించటం వెనుక ఈ పుస్తకం కలిగించిన ప్రేరణ అని చెప్పవచ్చు. నిజమైన ప్రేమకు నివాళిగా ఈ పాత్రలు మిగిలిపోయాయి’’.

ఆ నిముషంలో మా అందరి మనసుల్లో ప్రేమ పట్ల గౌరవభావం పెరిగింది.

‘‘ ప్రేమస్మారకం తాజ్ మహల్ గురించి మీకు తెలుసుగా..

మొగల్ చక్రవర్తి షాజహాన్ తన జీవిత భాగస్వామి పేరు చిరస్థాయిగా నిలిచిపోవటానికి యమునా నది ఒడ్డున ఈ కట్టడాన్ని నిర్మించారు. 20 ఏళ్లపాటు దాదాపు 20 వేల మంది కార్మికులు దీని నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. వెయ్యి ఏనుగుల్ని ఉపయోగించి వస్తువుల్ని రవాణా చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటిగా మిగిలిపోయింది’’.

మాకు తెలిసిన విషయమే అయినా-

వాడు చెప్పింది వింటుంటే గమ్మత్తుగా అనిపించింది.

‘‘పదిహేనేళ్ల వయసులో షాజహాన్, టీనేజిలో ఉన్న ముంతాజ్ (అసలు పేరు అర్జుమన్) ను పెళ్లాడాడు. వారి ప్రణయం అజరామరం. ఇద్దరు కలిసి పదిహేడు సంవత్సరాలు దాంపత్యజీవితాన్ని అనుభవించారు. 14 మంది పిల్లల్ని కని ఆమె కన్నుమూసింది. ఆమె జ్గాపకంగా తాజ్ మహల్ నిర్మాణానికి సంకల్పించిన షాజహాన్ తనకు కూడా అందులో ఓ గోరీని కట్టుకోవాలని సంకల్పించినా అది సాధ్యపడలేదు. ఆయన తర్వాత అధికారంలోకొచ్చిన ఆయన కుమారుడు ఔరంగజేబు తండ్రిని చెరసాల పాలు చేశాడు. ఆగ్రా రెడ్ ఫోర్టులో శిక్ష అనుభవిస్తూనే షాజహాన్ గంటల కొద్దీ సమయం తాజ్ మహల్ చూస్తూ గడిపేవాడు. మరణానంతరం షాజహాన్ ను ముంతాజ్ సమాధి పక్కనే పూడ్చిపెట్టారు.

తాజ్ మహల్ ఓ సమాధి అని చెప్పటం దాని స్థాయిని తగ్గించటమే అవుతుంది ’’.

‘‘ అది సరేరా.. క్వీన్ విక్టోరియా గురించి చెప్పు...’’ మాటల మధ్యలో అడ్డు పడ్డాడు ఇంకో రూమ్మేట్.

‘‘ బ్రిటన్ చరిత్రలో క్వీన్ విక్టోరియా ప్రేమ సుస్థిరంగా నిలిచిపోయింది...’’ అన్నాడు ఏకదంతం...

ఇది పూర్తిగా కొత్త విషయం కావటంతో చెవులు రిక్కించి మరీ విన్నాం.

‘‘ క్వీన్ విక్టోరియా 1837లో ఇంగ్లాండు పీఠాన్ని అధిరోహించింది. ఆమెకు చిత్రలేఖనం అంటే విపరీతమైన ఇష్టం. అధికారం చేపట్టిన మూడేళ్లకు ఆమె తన సమీప బంధువు ఆల్బర్టును వివాహమాడింది. ఇద్దరూ అన్యోన్యంగా గడిపేవారు. వారి ప్రేమకు గుర్తుగా తొమ్మిది మంది సంతానం కలిగారు. ఆల్బర్ట్ జర్మన్ కావటంతో సహజంగానే అతనిపైన కుటుంబంలో వ్యతిరేకత ఉండేది. విక్టోరియా మాత్రం అతని వ్యక్తిత్వాన్ని ఇష్టపడేది. పాలనలో అతని సలహాలను స్వీకరించేది. 1861లో ఆల్బర్టు హఠాత్తుగా కన్నుమూశాడు. అంతే విక్టోరియా కుంగిపోయింది. మూడేళ్లపాటు బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా గడిపింది. తర్వాత ప్రధాన మంత్రి సలహాతో పాలనబాధ్యతలు స్వీకరించి జనరంజకంగా పాలించింది. ‘రవిఅస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం’ అన్న నానుడి ఆమె హయాంలోనే మొదలయ్యింది. భర్త జ్గాపకాలతో జీవిస్తూ తను మరణించేవరకూ నల్లటి దుస్తులనే ధరించేదట . ’’

ఏకదంతానికి ఇదంతా మామూలే. హాస్టల్లో మమ్మలందర్ని పోగేసి గంటల కొద్దీ సమయం ప్రేమ గొప్పతనం గురించి మాట్లాడుతూంటాడు. అందుకే ముద్దుగా మేమంతా వాడిని లవ్ గురు అని పిలుచుకుంటాం. వాడు చెప్పే ప్రేమ కథలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

‘‘ నేను ముందుగా ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించి... ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకుంటా...’’ అన్నాడోసారి.

‘‘ ఇంత పెద్ద కాలేజీలో నీకు నచ్చినమ్మాయి దొరకలేదా?’’ ఎవరో అడిగారు.

‘‘ లేదు రా బాబూ... మిగతా వాళ్ల ప్రేమ వ్యవహారాలు చక్కదిద్దటానికే నా సమయం అంతా సరిపోతోంది...’’ విచారపడుతున్నట్టుగా చెప్పాడు ఏకదంతం.

అవతలున్న వ్యక్తి కవ్వింపుగా చెప్పాడు.

‘‘ ఫైనల్ ఇయర్లో ఉన్నాం. ఇంకో రెండు నెలలయితే పరీక్షలయి పోతాయి. ఆ తర్వాత ఉద్యోగాల వేటకే సరిపోతుంది. ప్రేమకు చోటెక్కడుంటుంది. ’’

‘‘ సరైన వ్యక్తి దొరికేవరకూ నా అన్వేషణ కొనసాగుతుంది. ప్రేమపైన నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ’’ ధీమాగా చెప్పాడు ఏకదంతం.‘‘మేం ప్రేమించుకున్నాం. తల్లిదండ్రులు మా ప్రేమను అంగీకరించటంలేదని ఎవరయినా చెబితే చాలు... ఏకదంతం ఆఘమేఘాలమీద బయలుదేరతాడు.

నలుగురైదుగురు స్నేహితులను వెంటేసుకుని మరీ...

రెండ్రోజుల క్రితం సెకండియర్లో ఉన్న జ్యోత్స్న,పాల్ రాజులు ప్రేమించుకున్నామంటూ ఏకదంతం దగ్గర కొచ్చారు.

ఒకరు చర్చిలో పెళ్లి చేసుకుందామంటే... మరొకరు ఆర్యసమాజ్ అయితే నయం అన్నారు. గొడవ ఎంతకీ కొలిక్కిరాలేదు.

‘‘ నీకు తెలుసా... అమ్మాయి తండ్రికి పొలిటికల్ లింకులున్నాయి. ఫ్యాక్షనిస్టు ముద్ర కూడా ఉంది. లేనిపోని వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ప్రాణంమీదకు తెచ్చుకోకు’’ రిస్కని తెలిసి ముందుగానే వాడికి సలహా ఇవ్వబోయాను.

ఏకదంతం ససేమిరా అన్నాడు.

‘‘అవతల వాడు ఎంత పెద్దవాడయినా సరే... ప్రేమికుల జంటను ఒకటి చేసి తీరతాను’’ పట్టుదలగా చెప్పాడు.

‘‘ అదికాదురా..లేనిపోని విషయాల్లో తలదూర్చి కష్టాలు కొనితెచ్చుకోవటం దేనికి? అసలే మీ పేరెంట్స్ మొన్న గట్టిగా చెప్పారన్నావు కూడా. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో... ’’

‘‘ ఆలోచించటానికేం లేదు. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసేద్దాం... సాక్షి సంతకాలు పెట్టాలి. నువ్వూ రా...’’ అంటూ బలవంతంగా నన్నూ లాక్కుపోయాడు.

అంతకు ముందు ఏం చేశాడో తెలీదుగానీ..

మర్నాడు అటు అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడికొచ్చి కొత్త జంటను తమ వెంట తీసికెళ్లారు.

రెండ్రోజుల తర్వాత భారీస్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

‘‘ ఏకదంతం లేకపోతే మేము ఒకటయ్యేవాళ్లం కాదు. నిజంగా మేం తనకి రుణపడిఉన్నాం’’ - పెళ్లి కుమార్తె సభాముఖంగా చెప్పినప్పుడు ప్రేమను గెలిపించిన తృప్తి వాడిలో కనిపించింది.

మా కాలేజీలో ఉన్న ప్రేమికులంతా వాడిని ఏదో సందర్భంలో కలసి సలహాలడుగుతూంటారు.

‘‘ గురూ.. ఎన్ని ప్రేమలేఖలు రాసినా పట్టించుకోవటం లేదు.. మొహాన్నే ఛీకొడుతోంది’ అనో..

‘‘ నన్ను ప్రేమించమని వేధిస్తున్నాడు. రక్తంతో ప్రేమలేఖ రాశాడు అన్నయ్యా..’’ అనో .. అబ్బాయిలు, అమ్మాయిలు కలసి చెబుతూండటం..వాడే మంత్రం వేసేవాడో తెలీదుగానీ..

కొట్టుకునే జంట కాస్తా పరస్పరం ప్రేమించుకునే పరిస్థితి వచ్చేసేది.

నాకిదంతా విచిత్రంగానూ, అద్భుతంగానూ అనిపించేది.

‘‘ గురూ... వాలంటైన్సుడే సందర్బంగా తాజ్ లో ప్రేమజంటల పరిచయకార్యక్రమం పెట్టారు. దానితో పాటు వక్తృత్వ పోటీ కూడా ఉందట. ‘ప్రేమ ఎంత మధురం’ అన్న పేరుతో. నాకు తెలిసి ప్రేమ గురించి నీకంటే గొప్పగా చెప్పగలిగిన వ్యక్తులెవరూ లేరు. దాదాపుగా ప్రధమ బహుమతి నీకే...’’ బీకామ్ స్టూడెంటొకరు వచ్చి చెప్పటంతో చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఎవరు దారిన వాళ్లం వెళ్లిపోయాం.

-------------------------------------------------

ఆ రోజు ప్రేమ గురించి చాలా అద్భుతంగా మాట్లాడాడు ఏకదంతం..

వాడు చెప్పిన విషయాలు కొత్తగా అనిపించాయి. బోలెడన్ని సంఘటనలు ప్రసిద్దుల సూక్తులతో రంగరించి కార్యక్రమాన్ని రక్తకట్టించాడు.‘‘టాప్ టెన్ రొమాంటిక్ మూవీస్ మీకు తెలుసా...?’’ అంటూ చర్చ ప్రారంభించాడు.అందరూ ఆలోచనలో ఉండగానే..‘‘ దినోట్ బుక్, ఎ వాక్ టు రిమెంబర్, టైటానిక్, స్టెప్ అప్, ప్రైడ్ అండ్ ప్రెజ్యుడిస్, 50 ఫస్ట్ డేస్, రోమియో అండ్ జూలియట్, డియర్ జాన్, ట్విలైట్, ఎటర్నల్ సన్ షైన్ ఆఫ్ ది స్పాట్ లెస్ మైండ్...’’ అంటూ వాడే చెప్పేశాడు.

‘‘ ప్రేమ పైన ఆరుపదాలను ఎనిమిది రకాలుగా ఉపయోగించి ఓ బీటిల్ రూపొందించాడు కోల్ పోర్టర్. 1921లో రూపొందించిన ఈ గీతం విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఒకసారి మీరూ ఆస్వాదించండి...

అంటూ.. వాడు చెబుతుంటే ఆడిటోరియంలో చప్పట్లు మారుమోగాయి.

What? is this thing called love...
What is this thing called... LOVE
what is this thing? called love
What .. Is this thing called love
what IS this thing called love...
what is THIS thing called, Love..
what is THIS THING CALLED... love...’’


‘‘ప్రేమ లేకపోతే జీవితం శూన్యం. రోజులు తమ ఉనికిని కోల్పోతాయని చెబుతూ ఓ ప్రేమికుడు తన ప్రేమికురాలికి ఇలా ఎస్ ఎమ్ ఎస్ పంపాడు.

With out love, dayz are,
Saddy, moonday, Tearday, Wasterday, Tlurist day, Fright day, shatter day
so be in LUV every day.
wish you a very happy valentine day.’’


మళ్లీ చప్పట్లు...

‘‘ప్రేమ విద్యను నాశనం చేస్తుందంటారు గానీ.. నిజమైన ప్రేమికులు తమ వృత్తిలోనూ ముందడుగు వేస్తారు.

ఈ మాట మీకు ఆశ్చర్యం కలిగించవచ్చుగానీ.. మేరీ క్యూరీ,పేరీ క్యూరీ ల గురించి మీరు విన్నారా?

‘ఆ.. విన్నాం.. వాళ్లిద్దరు శాస్త్రవేత్తలు కదా...’’ ముందువరుసలో ఎవరో అరిచారు.

ఏకదంతం మెచ్చుకోలుగా వాళ్లవంక చూశాడు.

‘‘పోలండ్ యూనివర్సిటీ ఆడవాళ్లను చేర్చుకోటానికి నిరాకరించటంతో మేరియా స్లోండ్ స్కా క్యూరీ పారిస్ తరలివచ్చింది. ప్రయోగశాలలో ఎక్కువ సమయం గడిపేది. అదే సమయంలో ఆమెతో పాటు అధ్యయనంలోనూ, వివిధ ప్రయోగాల్లో భాగస్వామి అయిన పేరీ క్యూరీని ఆమె ఆకర్షించింది. ఇద్దరి ప్రేమ మధ్య ప్రేమ వికసించింది. పేరీ పెళ్లి ప్రతిపాదన చేశారు. కొన్నేళ్లు వేచి చూశాక ఆమె అంగీకరించింది. 1895 లో ఈ ఇద్దరు ప్రేమికులు జీవిత భాగస్వాములయ్యారు. పరిశోధనల్లో అవిశ్రాంతంగా కృషి చేశారు. పోలోనియం, రేడియం కనుగొన్నారు’’.

సైన్సు విద్యార్ధులు ఇదంతా తమకు తెలిసిన విషయమే అన్నట్లు చూశారు.

‘‘మరో శాస్త్రవేత్తతో కలసి రేడియోధార్మికత కనుగొన్నందుకు గానూ, పేరీ భౌతిక శాస్త్రంలో నోబుల్ ప్రైజ్ సాధించారు. మరో రెండేళ్లకు ఆయన మరణించాడు. భర్త మరణించిన తర్వాత కూడా మేరీ తన పరిశోధనలు కొనసాగించారు. ఆమెకు నోబుల్ ప్రైజ్ లభించింది. రసాయనశాస్త్రంలో తొలినోబుల్ ప్రైజ్ సాధించిన మహిళగా చరిత్రకెక్కింది. మేరీ, పేరీ క్యూరీ జంట శాస్త్రవేత్తలయిన ప్రేమికులుగా చిరస్మరణీయులు.’’

మరో మూడు నిముషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

‘‘ప్రేమ ఉదంతాలన్నీ విషాదాంతాలు కావలసిందేనా?

ప్రేమికులు ఒకటి కాకూడదా? పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకోకూడదా?

రచయితలు, దర్శకులు ఇలా ఎందుకు సినిమాలు తీస్తున్నారు?

ప్రేమ త్యాగాన్ని కోరుతుంది లాంటి డైలాగులు ట్రాష్... ’’

హాలంతా ఈలలు, చప్పట్లు... నిర్విరామంగా.

జడ్జిలు మెచ్చుకోలుగా చూశారు.

మేమంతా ఊహించినట్టుగానే ప్రథమబహుమతి కొట్టేశాడు ఏకదంతం.

అదే రోజు రాత్రి బ్లూమూన్ రెస్టారెంట్లో భారీ పార్టీ ఇచ్చి మమ్మల్ని ఆనందింప చేశాడు కూడా.

ఈ కథ ఇలాగే కొనసాగితే ఎలా ఉండేదో సరిగ్గా రెండు నెలలకి అనుకోని మలుపు తిరిగింది.

ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఎవరి ఊళ్లకి వాళ్లు వెళ్లిపోయాం.

ఓ రోజు ఉదయానే సుబ్బు నాకు ఫోన్ చేశాడు.

‘‘ ఒరే.. ఏకదంతం పెళ్లట... మొన్నామధ్య వాళ్ల నాన్న మా ఫాదర్ కి కనిపించి ఈ విషయం చెప్పాడట...’’ ఉత్సాహంగా అన్నాడు.ఎందుకో తెలీదు. ఏకదంతం చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.

ఖచ్చితంగా ఆ అమ్మాయి వాడు ప్రేమించిన వ్యక్తే అయి ఉంటుంది.

నిజంగా ఆమె అదృష్టవంతురాలు.. మనసులో ఆలోచించుకుంటూనే ‘‘... పెళ్లి కూతురు వివరాలు తెలుసా? అనడిగాను.

‘‘ ఫిబ్రవరి 14న పెళ్లి అన్నంత వరకే తెలుసు. మిగిలిన వివరాలు నేనడగలేదు. ’’

వాడు చెప్పటం పూర్తికాలేదు.

‘‘ వ్వావ్.. వాలెంటైన్సు డే రోజునన్నమాట...

మొత్తానికి మన వాడు అనుకున్నట్టుగా ప్రేమకి పట్టాభిషేకం చేస్తున్నాడు .. శభాష్...’’ అన్నాను గట్టిగా.

‘‘ సరే గానీ... మనం వాడి రూమ్మేట్లం కదా.. .కార్డు ఎందుకు పంపలేదంటావ్..’’ సందేహంగా అడిగాడు సుబ్బు.

‘‘ వాడి స్నేహితులం మనం. కార్డు రాలేదని ఆగిపోతామా? ఒక రోజు ముందెళ్లి అక్కడ వాలిపోదాం.. మిగిలిన ఫ్రెండ్సుకి కూడా ఎస్ ఎమ్ ఎస్ పెట్టు’’ సలహా ఇచ్చాను.

అంతే.. 13వ తారీఖు ఉదయానికల్లా ఐదుగురు స్నేహితులం ఏకదంతం ఇంటి గుమ్మంలో ఉన్నాం.

ఆశ్చర్యకరంగా..ఇంత మంది కాలేజీ స్నేహితులు వచ్చారన్న సంతోషం వాడి మొహంలో ఏ కోశానా కనిపించలేదు.

‘‘ నేను పిలవకుండా మీరెలా వచ్చారు?’’అన్నట్లుగా చూశాడు.

మొహం గంటుపెట్టుకుని కూర్చున్నాడు.

బలవంతంగా తప్పదన్నట్టు ఒకటి రెండు మాటలు మాట్లాడి ఎప్పుడు అక్కడి నుంచి తప్పుకుంటామా అని ఎదురుచూశాడు. అందంగా తీర్చిదిద్దిన నాలుగు అంతస్థుల భవనం.. మందీ మార్బలం, ఇంటి నిండా నౌకర్లు, ఇంటి ముందు బారులు తీరిన కార్లు... ఇలా పురమాయిస్తే చాలు పనివాళ్లు అన్ని పనులు చక్కపెడుతున్నారు.

అంతస్థులపరంగా వాడికీ, మాకూ చాలా అంతరం ఉందన్న విషయం అప్పుడే గ్రహించాం.

అవుట్ హౌస్లో కొన్ని గదులు అతిథులకు కేటాయించారు. అందులో ఓ చివర గదిలో మేం సర్దుకున్నాం.

‘‘ ఒరే తిరిగి వెళ్లిపోదాం... మనం ఏదో అనుకుని సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని మరీ ఇంత దూరం వచ్చాం. ఇక్కడ మనల్ని అందరు పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారు. అంతా పచ్చనోట్ల మీద నడుస్తున్నారు. ’’... సుబ్బు కోపంగా అన్నాడు.‘‘ ఊరుకోరా.. ఆవేశపడకు.. సంభాళించుకో... రేపు ఉదయం పెళ్లికాగానే వెళ్లిపోదాం’’ నచ్చచెప్పబోయాను.

పళ్లు పట పట కొరుకుతూ అన్నాడు పక్కనున్న మరో స్నేహితుడు. ‘‘ వాడికెంత పొగరో చూశావురా... మనతో కాసేపు గడపలేదు. కనీసం వాళ్ల అమ్మనాన్నలకు మనల్ని పరిచయ చేయలేదు. పనివాళ్లని పిలిచి అంతా వాళ్లనే చూసుకోమన్నాడు. మంచినీళ్లు కూడా వాళ్లే తెచ్చిచ్చారు చూశావా ’’... కోపంతో వాడి ముక్కుపుటాలు ఎగసిపడుతున్నాయి.

‘‘ డబ్బున్న వాళ్లంతా అంతేరా బాబూ..’’ సుబ్బు .

‘‘ నువ్వు గమనించావా? మీరెందుకు ఇక్కడికి తగలడ్డారు అన్నట్లు చూస్తున్నాడు వాడు...’’

‘‘ అవునవును... ’’

ఇద్దరూ రాయటానికి వీల్లేని భాషలో ఏకదంతాన్ని బండబూతులు తిట్టుకున్నారు.

నేను ఏకదంతాన్ని సమర్థించలేకపోతున్నాను.

అలాగని వాడిని తిడుతున్న మిగిలిన స్నేహితులతో శ్రుతి కలపలేకపోతున్నాను.

‘‘ వేచి చూద్దాం..’’ అన్న ధోరణితో ఉండిపోయాను. ఆ రాత్రి మిగిలిన వాళ్లంతో గదిలోనే ఉండి పేకాటలో మునిగిపోతే...నేను మాత్రం మండపం డెకొరేషన్ పర్యవేక్షించే పనిలో నిమగ్నమయ్యాను.అదీ నాకు నేను కల్పించుకున్నదే.పెళ్లి కొడుకు గదికి అతి సమీపాన వేదిక ఉంది. దాని పక్కనే నిలబడ్డాను. పనివాళ్లు అలంకరణ పనులు చూస్తున్నారు.లోపల నుంచి మాటలు నా చెవిలో పడుతున్నాయి.అంతకు ముందు ఏం జరిగిందో తెలీదు గానీ.. సంభాషణను బట్టి తేలిగ్గా అర్ధం చేసుకోగలిగాను.‘‘కాలేజీలో ప్రేమ వివాహాలు చేసేవాడినని... నేనూ అదే దారిలో వెళతానని ఎందుకనుకున్నావ్? బాబాయ్...’’అది ఏకదంతం స్వరం. నేను చాలా తేలిగ్గా గుర్తుపట్టగలను.‘‘ అదేంట్రా.. అంత తేలిగ్గా మాట్లాడతావు’’ .అవతల పెద్దాయన ఏదో చెప్పబోతున్నాడు. ఏకదంతం ఆయనను మాట్లాడనివ్వటం లేదు. ‘‘ నేనేమయినా వెర్రిబాగులవాడినా? ప్రేమించి పెళ్లి చేసుకోటానికి...

కోట్లాది రూపాయల ఆస్తి, వారసత్వంగా వచ్చే బోలెడంత సంపద ఉన్నప్పుడు కూటికి ఠికాణా లేని ఏ పేద అమ్మాయినో ఎలా కట్టుకుంటాను పెద్దవాళ్లు ఇంట్లో నుంచి గెంటేస్తే జీవితాంతం కష్టాలను కొనితెచ్చుకోటానికి నేనేమయినా తెలివితక్కువ వాడినా...

డబ్బు డబ్బుని ఆకర్షిస్తుంది అన్న జీవితసత్యం మీకు తెలీదా...’’

ఏకదంతం చెప్పుకుపోతున్నాడు. నా చెవులను నేనే నమ్మలేకపోయాను.

అత్తవారి తరఫున వచ్చే వందల కోట్ల ఆస్తితో తండ్రికి దీటుగా... తనెలా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించదలచాడో అతను చెబుతుంటే నా కళ్లు గిర్రున తిరిగిపోయాయి.

‘‘అందాన్ని కొరుక్కుతింటామా? ఆస్తిపాస్తులుంటే కొండ మీద కోతినయినా అందంగా అలంకరించచ్చు...’’ అన్నాడు మధ్యలో. అంటే... బహుశా పెళ్లి కూతురు అంత అందమైనది కాదేమో.. డబ్బు కోసమే ఆమెను కట్టుకున్నాడేమో అని కూడా అనుకున్నాను.

ఆ తర్వాత మాటలు నేను వినదలుచుకోలేదు.

అప్పటికప్పుడు స్నేహితులను బలవంతంగా బయలుదేరతీయించి ..

పెళ్లికి రెండు గంటల ముందే ఆ ప్రాంగణం నుంచి బయటపడ్డాం...

ఏళ్లుగడిచినా ...

ఆ సంఘటన నా జ్గాపకల నుంచి తుడిచిపెట్టుకుపోలేదు.

ప్రేమ గొప్పతనం గురించి ఎవరయినా మాట్లాడుతుంటే

నాకు లవ్ గురు..

ఏకదంతం గుర్తుకొస్తాడు.

నిలువెల్లా ముసుగేసుకున్న స్వార్థపరుడు కళ్లముందు కదలాడతాడు.

రక్తం సలసల కాగిపోతుంది.

కడుపులోంచి అసహ్యం తన్నుకొస్తుంది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు