సత్యభామ@నెట్ - జి.ఎస్.లక్ష్మి

satyabhama@net

అప్పుడే పొద్దున్న పనంతా పూర్తి చేసుకుని, టీవీ చూద్దామా, పుస్తకం చదువుదామా లేకపోతే వదినకి ఫోన్ చేద్దామా అనుకుంటున్నాను. అవిడ అసలు వదిన కాకపోయినా నాకు వరసకు వదిన. రాకపోకలు బాగానే వున్నాయి. స్నేహం కూడా బంధుత్వం కంటే ఎక్కువే. అందుకే రోజూ కాసేపైనా మాట్లాడుకోపోతే మాఇద్దరికీ తోచదు. ఇంతలో చెప్పా పెట్టకుండా వదినే వచ్చేసింది మా ఇంటికి. తలుపు తీయగానే వదిన్ని చూసి ఆశ్చర్యపోయాను.

“ఏవైంది వదినా..అంతా బానే ఉన్నారు కదా..” అనడిగాను ఆదుర్దాగా.

“ఆ అంతా బానే వున్నారు కానీ..ఇదిగో.. ఇదేంటో చూడూ.. నాకర్ధం కాక ఫోన్ లో అడిగితే సరిగ్గా తెలీదని, మీ అన్నయ్య ఆఫీసుకెళ్ళగానే నేనే వచ్చేసా..” అంటూ తను కొత్తగా కొనుక్కున్న స్మార్ట్ ఫోను నా చేతిలో పెట్టింది.

“దేని గురించి?” అనడిగాను దాన్ని తీసుకుంటూ. నాకు తెలుసు.. మా వదిన చాలా చురుకైంది. ఇలా అందిస్తే అలా అల్లుకు పోతుంది. కొత్తగా వస్తున్న టెక్నాలజీని మా వదిన వాడుకున్నంతగా ఎవరూ వాడుకోరేమో. అందుకే అన్నయ్య ఈ మధ్యనే వదినకి స్మార్ట్ ఫోన్ ఒకటి బహుమతిగా కూడా ఇచ్చాడు. అది వచ్చినప్పట్నించీ వదిన అందులో వున్న ఫీచర్స్ అన్నీ ఆకళింపు చేసేసుకుని, కొత్త కొత్త వన్నీ డౌన్ లోడ్ చేసేసుకుంటూ, దాని వాడకంలోనాకు గురువై పోయింది. అలాగ అన్నీ తెలిసున్న వదిన స్మార్ట్ ఫోన్ పుచ్చుకుని నా దగ్గరికి వచ్చిందంటే నాకే ఆశ్చర్యమనిపించింది.

“ఏవిటిది స్వర్ణా..నిన్న రాత్రనగా యాడ్ ఇస్తే ఇప్పటి దాకా ఒక్కళ్ళూ కాంటాక్ట్ చెయ్యలేదూ.. “అనడిగింది.

వదిన్ని మధ్యలోనే ఆపి, స్థిమితంగా కూర్చోబెట్టి, కాఫీ ఇచ్చి.. “దేని గురించి వదినా..”అనడిగాను.

“అదే..నిన్న నువ్వు చెప్పేవు కదా.. మొబైల్ లోయాడ్ ఇస్తే మనింట్లో వున్న పాత సామానంతా యాంటిక్ లాగా ఇట్టే అమ్ముడు పోతుందనీ. అందుకే నిన్న మీ అన్నయ్య ఆఫిసుకి వెళ్లగానే ఆ ఆప్ డౌన్ లోడ్ చెసుకుని నేను కూడా ఒకటి అమ్మకానికి పెట్టేను..”

“ఏదమ్ముదావనుకున్నావూ?”

“అదే మా ఇంట్లో ఎప్పటిదో నరసరావుపేట పడక్కుర్చీ ఒకటుంది కదా.. మీ అన్నయ్య దాన్నొదల్రు.. ఎప్పుడో వాళ్ల తాతగారు, నాన్న గారు అందులోనె కూర్చునే వాళ్ళుట, అందుకని ఈయనా అందులోనే కూర్చుంటానంటారు..అదా.. విక్రమార్కుడి సింహాసనమంత ఉంటుంది.. డ్రాయింగ్, డైనింగ్ కలిసున్న మా ముందు హాల్లో సగానికి పైగా చోటు అదే ఆక్రమించేసింది. కొత్త ఫ్లాటు, కొత్త ఫర్నిచరూ..అన్నీ కొత్తగా వున్న ఆ హాల్లో అదొక్కటీ అసహ్యంగా మాసి పోయి కనిపిస్తోంది. బెడ్ రూమ్స్ లో మంచాలు తప్ప మరేవీ పట్టవు కదా.. ఉత్తినేనైనా ఎవరికైనా ఇచ్చెయ్యండీ అంటే ఈయన వినరాయె.. అప్పుడెప్పుడో నువ్వు చెప్పేవు కూడా కదా..పాత వస్తువులని యాంటి క్లంటూ కొనే వాళ్ళుంటారని. అందుకే ఈ మొబైల్ లో ఆ ఆప్ డౌన్ లోడ్ చేసుకుని, ఆ పడక్కుర్చీ ఫొటో తీసిపెట్టి, దాని మీద ఎంతెంత గొప్ప వాళ్ళు కూర్చున్నారో రాసేను. మీ అన్నయ్యకి తెలిస్తే ఊరుకోరని తనకి చెప్పకుండానే యాడ్ అప్ లోడ్ చేసేను. ఇప్పటికొచ్చి ఒక్కళ్ళు కాంటాక్ట్ చెయ్యలేదు..” గుక్క తిప్పుకోకుండా చెప్పిన వదిన ఆయాసం తీర్చుకుందుకు ఓ నిమిషం ఆగింది.

నేను వదిన మొబైల్ అందుకుని ఆ యాడ్ చూసి ఉలిక్కిపడ్డాను. తెలుగులోకి మారిస్తే దాని అర్ధం ఇలా ఉంది. “ఆలసించిన ఆశా భంగం. ఎంతో పేరు ప్రతిష్ఠలున్న వంశం వారిది. ఇప్పుడు పాతగా అయినా విలువ ఏ మాత్రం తగ్గదు. నేను ఇంత రేటు అనుకుంటున్నాను. మీకు ఎంతకు కావాలో చెప్పండి..”అని రాసి, దాని కింద అన్నయ్య ఫొటోవుంది. కెవ్వుమన్నాను.

“ఏంటి..ఏవయింది?” వదిన ఖంగారు పడింది.

“నువ్వు అన్నయ్యని అమ్మకానికి పెట్టేసేవ్..”

“ఛ..ఛ..నేను మీ అన్నయ్యని అమ్మకానికి పెట్టడవేవిటి? ఏదీ.. “అని చూసి, వెఱ్ఱి మొహం వేసింది.

“లేదు స్వర్ణా, నేను మీ అన్నయ్య వంశం గొప్పతనం చెప్పడానికి ఆయన ఫొటో పెట్టి, కింద పడక్కుర్చీ ఫొటో కూడా పెట్టేను..ఆ పడక్కుర్చీ అప్ లోడ్ అవ లేదేమో..”

నాకు కోపం, నవ్వూ కలగలిసి వచ్చేసాయి. సందు దొరికింది కదా అని వదిన్ని ఆటపట్టించడం మొదలు పెట్టాను. “ఏవమ్మా సత్యభామా..మా అన్నయ్యని అంత దాసాను దాసుడుగా చేసేసుకోవాలనా ఏకంగా అమ్మకానికే పెట్టేసావ్..మా అన్నని కొనగలవారున్నారనే ఈప్రపంచంలో..” అంటూ గర్వంగా మొహం పెట్టాను.

వదినేవన్నా తెలివి తక్కువదా యేవిటీ..జరిగినది తెలుసుకుని, “నిర్మలా..అసలు విషయం ఇప్పుడు తెలిసింది.” అంది. ఏవిటన్నట్టు ముందుకు వంగాను.

“ఈ ప్రపంచంలో మీ అన్న లాంటి వారిని కొనుక్కునేంత తెలివి తక్కువదాన్ని నేనొక్కదాన్నేనన్నమాట.” అంది.

ఏం మాట్లాడను?

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు