అయ్యయ్యో...! - అమ్జద్

ayyayyo story by amzad

అం దాల తార ఆర్. ఆర్. లాబ్ లో సీనియర్ సైంటిస్ట్. ఎమ్. ఎస్. సి. కెమిస్ట్రీ లో గోల్డ్ మెడలిస్ట్. నాజూకుగా తమలపాకు కాడలా ఉంటుంది. హైట్ ఫైవ్ సిక్స్. సెక్సీగా ఉంటుంది. రకరకాల బట్టలు వేసుకుంటుంది. టైట్ జీన్స్ పాంట్ లే కాకుండా షార్ట్ స్కర్ట్స్ కూడా వేసుకుని వస్తుంటుంది డ్యూటీలోకి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాశ్చాత్యదేశంలో ఉండే హై సొసైటీ లో గర్ల్ లా ఉంటుంది.

'ఒళ్ళు దాచుకోవడమే కాదు... నోట్లో నువ్వుగింజ కూడా నానదు తారకు' అని ఆమె సహొద్యోగినులు చెప్పుకొంటుంటారు. తార మాత్రం వీళ్ళ మాటలనే కాదు... వీళ్ళను కూడా పట్టించుకోదు. కాని తార రీసెర్చ్ చేస్తున్న కీలకమైన లాబ్ ఇన్ చార్జ్ మాత్రం తార గురించి బాగా పట్టించుకుంటాడు. ఆమె ఆడింది ఆట... పాడింది పాట అంటాడు రఘునాథ్. డాక్టర్ రఘునాథ్, డా.ర.గా చెలామణిలో ఉన్నాడు. నల్లగా భూతద్దాలు లాంటి కళ్ళద్దాల వెనుక గుండ్రని చిన్న కండ్లు, ఎత్తైన పళ్ళుతో! ఆ పైన లావైన పెదాలు. బట్టతల బుర్ర మాత్రం అమోఘం! అమెరికన్ న్యూక్లియర్ సంఘం వారు ఎన్నిసార్లు ఆహ్వానించినా, అమెరికాలో చీఫ్ సైంటిస్టుగా, ససేమిరా ఒప్పుకోలేదు!?

అదే లాబ్ లో పనిచేస్తున్న జూలీ మాటల్లో అర్ధం చేసుకోవాలనుకుంటే ఆ నల్ల పీనుగు తార ఎత్తు - పల్లాల శరీరాకృతిలో ఎప్పుడో సమాధి అయిపోయాడు అని అక్కసు వెళ్ళ బుచ్చుకొంటుంది. ఆమె చుట్టుప్రక్కల వాళ్ళు జూలీ మాటలు విని ఎంజాయ్ చేస్తుంటారు.

కొన్ని రోజుల క్రితం డా.ర. అహొరాత్రులు శ్రమించి, చేసిన రిసెర్చి ఫలించడంతో, సంతోషంతో తనకు తానే మైమరచి ఎదురుగా ఉన్న తారను గట్టిగా ముద్దుపెట్టుకొన్నాడు, స్టాఫ్ ఎదురుగానే! 'సైంటిస్ట్ కదా!' ఎంతో విలువైన విషయాన్ని కనిపెట్టాడు. దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా డా.ర. గారు తీసుకున్నది ముద్దే కదా! పట్టించుకోనక్కర్లేదు.' అని మగ ఉద్యోగస్తులు సరిపుచ్చుకున్నారు. కాని ఆడ ఉద్యోగస్తులు, అందులో జూలీ బాగా నొచ్చుకుంది... తార కంటే డా.ర. గారికి అందుబాటులో తనే ఉన్నదని... కాని తనను కాకుండా తారనందుకున్నాడని వాపోయింది!

ఈ గొడవంతా తెలిసి ఉన్న 'స్మార్ట్ యిన్ ల్యాబ్' గా టైటిల్ అందుకున్న గోపతికి మాత్రం డాక్టర్ కనుగొన్నదేమిటి? కనిపెట్టింది ఏమిటి? అనే కుతూహలం తారాస్థాయికి చేరుకుంది.

లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్, క్లబ్బుల్లో తిరిగి, పేరొందిన హోటళ్ళలో విలువైన కాఫీలు తాగి, గంటల తరబడి ఏకాంతంలో గడిపి, భవిష్యత్తు ప్లాన్ లు వేసుకున్న తార తనతో ఉండగా ఇదెంత పని అని అనుకొన్నాడు గోపతి. తార డాక్టర్ రఘునాథ్ కు చీఫ్ అసిస్టెంట్ కూడా. తన పరిశోధనలన్నీ తారకు వెల్లడిస్తుంటాడు. అడపాదడపా ఆమెను బుజ్జగించి లో విషయం బయటికి తీస్తుంటాడు గోపతి.

గోపతి ఓ రిసెర్చ్ జర్నల్ పేజీలను త్రిప్పుతూ తార కోసం ఎదురు చూడసాగాడు. డ్యూటీ టైం పూర్తయి గంటకు పైబడింది. తార తన వర్కింగ్ టేబుల్ వదలట్లేదు.

గోపతి సహనం కోల్పోయాడు. తన చాంబర్ వదిలి తార గదివైపుకు వెళ్ళసాగాడు. ఇంతలో డాక్టర్ రఘునాథ్ తార గదిలోకెళ్ళి ఏదో సైగ చేశాడు. ఆమె తన బీరువా తెరచి, అందులో ఉన్న లాకర్ తెరిచింది. డా.ర. తన వైట్ కోట్ జేబులో నుంఛి ఏదో చిన్న డబ్బాలాంటిది తీసి అందించాడు ఆమెకు. తార దాన్ని తెరచి చూసింది. ఇద్దరు నవ్వుకున్నారు. తార లాకర్ లో ఆ చిన్న డబ్బాను పెట్టి లాక్ చేసింది. గోపతి ఇదంతా అద్దాల తెర నుంచి గమనించి, వాళ్ళ దృష్టి తనపై పడకముందే అక్కడ్నుంచి తప్పుకున్నాడు.

**** **** **** ****

ఫిబ్రవరి 14, వాలన్ టైన్ డే! ఇంతకంటే మంచి సమయం, సందర్భం దొరకదు. తార కాదనదు. విలువైన బహుమానం... ఆమెకు పెట్టుబడిగా ఇస్తున్నాడు లక్షల ఖరీదు చేసే వజ్రాల ఉంగరం!

చక్కగా తీర్చి దిద్దిన, నైపుణ్యంగా చెక్కబడిన వజ్రం, ఎర్ర వజ్రం పొదిగిన ఉంగరం. ఎదురుగా, డిమ్ లైట్ లో, ఫ్లవర్ పేజ్ లో ఎర్ర గులాబి తార కోసం ఘడియ లెక్కిస్తుంది.

తన దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం విత్ డ్రా చేసి విలువైన తన నాన్నగారి చేతి గడియారాన్ని అమ్మేసి, తన గదిలో ఉన్న ఖరీదైన సామాగ్రిని బేరం పెట్టి పోగు చేసుకున్న డబ్బులన్ని తార కోసం, లవ్ డే సందర్భంలో తీసుకొన్న బహుమానం తన దుర్ధినాలను హరించేసుకొంటుంది! అని అనుకున్నాడు గోపతి.

తార ఎర్ర రంగులో వెలసింది. మసక మసక ఎర్ర రంగు కాంతి లో ఆమెను వాటేసుకున్నాడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కాఫీ టేబుల్ గది లాంటి గదిలో. తన లాంటి ప్రేమ జంట లెందరో ఉన్నారా హోటల్లో... ప్రత్యేకంగా జంటల కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లో!

ఒకరి కొకరు ప్రేమ పాఠాలు వల్లించాక, గోపతి అసలు విషయం పై రంగం సిద్దం చేశాడు. రెండు రోజుల క్రితమే లాబరేటరీస్ క్యాంటీన్ లో మధ్యాహ్నం లంచ్ సమయంలో డాక్టర్ రఘునాథ్ కనిపెట్టిన సీక్రెట్ ను తారను బుజ్జగించి కక్కించాడు.

ఆ రాత్రంతా ఒక్క క్షణం నిద్రపోలేదు. ప్లాన్ పై ప్లాన్ లు వేసుకో సాగాడు.

తారను తన సీసాలో దింపాలి! ఎలా? కొన్నాళ్ళ నుంచి తారతో తన స్నేహం మరీ చొరవ చేసుకుంది. పెళ్లి చేసుకోవడం వరకు వెళ్ళింది. కానీ రాజీ తమకు అడ్డుగోడై నిలిచింది.

తార ససేమిరా ఒప్పుకోవడం లేదు పెళ్ళికి. రాజీ సమక్షం భరించలేనంటుంది.

తార లేని తన జీవితం కటిక చీకటీలా ఉంది!? రాజీతో తనకు పెళ్ళికాక ముందు నుంచే తారతో తనకు సంబంధం ఉంది. ఒకే కాలేజీలో చదివారు తార మరియు గోపతి.

గోపతి చిన్నప్పడ్నుంచే గారాబంగా పెరిగిన తమ తల్లిదండ్రులకు ఏకైక బిడ్డ.

కాలేజీ రోజుల వరకు జీవితం లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిపాడు. తండ్రి పట్టణం లో పేరొందిన బిజినెస్ మ్యాన్. ఇంటి ముందు ఇంపోర్టెడ్ మెర్సిడెస్ ఉండేది. కాలం హాయిగా గడుస్తున్న రోజుల్లోనే గోపతి నాన్నగారు, కారు యాక్సిడెంట్ లో పోయారు. గోపతి అమ్మ భర్త అకాలమరణాన్ని మరవలేక మంచం పట్టి సంవత్సరం పూర్తవ్వకుండానే తనువు చాలించింది.

తను ఏకాకి అయ్యాడు. ఆ రోజుల్లోనే తార తనకు దగ్గరైంది. ప్రేమ జీవితంలో చాలా దూరం వరకు ప్రయాణించాడు. గమ్యం చేరుకొంటుండగానే మేనమామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది గోపతికు. తార లాంగ్ లీవ్ తీసుకుంది. జీవితం మరో మలుపు తీసుకుంది!

రాజీ కోట్లాధికారి అయిన గోపతి మేనమామకు ఒక్కగానొక్క కూతురు. ఆయనకు ఉన్నదంతా రాజీకే దక్కేది! కాని తన చేతికి చిల్లిగవ్వ తగలట్లేదు. రాజీ పొగరుతనం, నడవడిక తనకు నచ్చలేదు. రాజీతో పెళ్ళయ్యాక గోపతికి మనశ్శాంతి కరువైంది.

తారతో మళ్ళీ లింక్ కుదిరింది ఆమెతో మనస్పర్ధలు తగ్గాయి. మంచి కొలీగ్స్ గా మసలుకోసాగారు.

ఈ నేపధ్యంలో గోపతి తారకు నచ్చజెప్పాలని నిశ్చయించుకొనే ఈ ఏర్పాటు చేసాడు. 'వేలంటైన్ డే' ఆమెతో గడపడం కేవలం తన ప్లాన్ ను అమలు పరచడమే!

"నేనో మంచి అమ్మాయిని కాదని నాకు బాగా తెలుసు! కాని నువ్వు చెప్పుతున్న, నన్ను బలవంతం చేస్తున్న పనికి నా మనసు ఒప్పుకోవడం లేదు? ఒక్క చుక్క కూడా ఏ టెర్రరిస్టుల చేతికి అందినా వందల వేల సంఖ్యలో జనాలు తమ ప్రాణాలను కోల్పోతారు.

"ఏ క్రిమినల్స్ చేతికి తగిలిన ... ఎవ్వరినైన హత్య చేయవచ్చు ఒక చుక్క వెయ్యి లీటర్ల నీటిని విషద్రవం లా మారుస్తుంది! ఏ ఎఫ్. బి. ఐ. యో లేదా సి. బి. ఐ లాంటి ఏజెంట్స్ కు పండుగే... పండుగ. అంతర్జాతీయ కల్లోలాలను సృష్టించగలరు!

"సో... అబ్బాయిగారు... తమరు ఈ విషయానికై వేధించకండి!" అని రెండు చేతులను జోడించి చిన్నగా నవ్వింది.

" మీ బాస్ కనిపెట్టిన ద్రవం కొన్ని కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. నేను కాదనటం లేదు. నాకు కావలసింది ఒకే ఒక చుక్క... డ్రాప్... ఓన్లీ! దానికి.. ఒక లక్ష నేను నీకు సమర్పిస్తున్నాను!! ఆలోచించుకో... అదృష్టం కలిసొస్తే నా కొచ్చే కోట్ల ఆస్తికి వారసులవుతావు! నా జీవిత భాగస్వామి కాగలవు.

"ఒక వేళ నా ప్లాన్ అనుకున్న విధంగా ఫలించలేదనుకో... నువ్వు ఏలాగో లక్షాధికారివే! ఆలోచించుకో... కేవలం ఒకే ఒక చుక్క... నేను తెచ్చిన హేండ్ బ్యాగ్ లో క్యాష్ లక్ష రూపాయలు ఉన్నాయి!"

"నీ ప్లాన్ సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఐ డోంట్ కేర్! ఒక చుక్క దొంగిలించిన నేరానికి నా బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా...?" కండ్లు మిటకరిస్తూ అంది తార.

"ఒకే ఒక చుక్క ఆ సీసాలో నుంచి మాయమైనా ఎవరికి ఏమి తెలియదు ఈ చుక్క వల్ల నీ.. నా అదృష్టం తారాస్థాయికి చేరుకొంటుంది. పైగా టి. బి రోగంతో బాధపడుతున్న మీ అమ్మ, పై చదువులకు వెళ్ళాలని తహతహలాడుతున్న మీ తమ్ముడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆపేసి... పెండ్లి కోసం ఎదురు చూస్తున్న మీ చెల్లాయి... రిటైరైన మీ నాన్నగారు తీవ్ర గుండెపోటుతో ఇంకెంత కాలం అని బాధపడతారు... ఆలోచించుకో! ఇలాంటి శుభఘడియలు మళ్ళీ... మళ్ళీ రావు!? అని బుజ్జగించాడు, నచ్చ జెప్పాడు, చేతులో చెయ్యేసి వాగ్దానం చేశాడు. తార చేతిని తన తలపై పెట్టుకొని ప్రమాణం చేశాడు. తార పెదవులపై చిన్న చిరునవ్వు విచ్చుకుంది!?

**** **** **** ****

అర్ధరాత్రి... రెండు గంటలు గోడగడియారం కొట్టింది. దబదబా గట్టిగా తలుపు పై కొట్టుతున్న శబ్దం. చిన్న అలజడికే గోపతి నిద్ర భంగమయ్యేది! ఇంత గట్టిగా తలుపు చప్పిడి అవుతుందంటే పని అయిపోయిందన్న మాట..? అనుకొంటూ పడకలో నుంఛి లేచి తన గది తలుపు తీశాడు. ఎదురుగా నర్స్?

"డాక్టర్ గారు, మీ మావయ్య గారు వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారు." అని అంది గాబరాపడుతూ.

"ఏమైంది? ఏమైనా సీరియసా? నిదానంగా అడిగాడు

"మేడమ్ గారు నిద్రలో చాలా అవస్థలు పడుతుంటే... డాక్టర్ గారిని పిలిచాను. మీతో మాట్లాడుతారట..? అంటూ పరుగెత్తుకొంటు వెళ్ళిపోయింది నర్స్.

రాజీ నూరు ఆరైన.. ఆరు నూరైన ఫ్యామిలీ డాక్టర్ గారు చెప్పిన ప్రకారం రాత్రి... నిద్రపోయే ముందు ఓ క్యాప్ సూల్ తప్పక వేసుకొంటుంది. అదును చూసి ఆమె మంచం ప్రక్కనే స్టూల్ మీద ఉన్న మందు సీసాలో మిగిలి ఉన్న నాలుగు క్యాప్ సూల్ ను తీసి ఒకదానిలో తాను తెచ్చిన బొట్టు అందులో వేసి తిరిగి క్యాప్ సూల్ ను మూసివేశాడు. ఓ రెండు క్షణాల కోసం రాజీకి అనుమానం కలిగినా... తెల్లారాక ఆరా తీద్దాం లే అనుకునే గుణం కాబట్టి అంతగా పట్టించుకోదు పైగా విధిగా... ఉన్న ఆ ఒక్క క్యాప్ సూల్ మాత్రం మింగేస్తుంది... అందుకే ఈ హడావుడి అయి ఉంటుందనుకొంటు హాలు దాటి రాజీ పడక గదిలో ప్రవేశించాడు గోపతి.

లోపలికి ప్రవేశించగానే రాజీ మొహం వైపు చూశాడు గోపతి. రాజీ గాఢ నిద్రలో ఉన్నట్లనిపించింది. రాజీ పాదాలను నర్స్ తన చేతులతో మసల సాగింది.

గోపతి మరియు రాజీ ఇద్దరి వైపు చూస్తూ "గోపతి... రాజీకి మైల్డ్ అటాక్ వచ్చింది. నీ కసలే టెన్షన్ ఎక్కువ... పైగా నువ్వు డిప్రెషన్ పేషంట్ వి. ఇందా ఈ క్యాప్ సూల్ వేసుకో నీకు ఉపశమనంగా ఉంటుంది" అని ఫ్యామిలీ డాక్టర్ అందించాడు.

గోపతి గాబరా పడుతున్నట్లు నటిస్తూ పొరపాటులో డాక్టర్ ఇచ్చిన క్యాప్ సూల్ మింగేశాడు. నర్స్ ఓ గ్లాసులో మంచినీళ్ళు అందించింది. గోపతి నీళ్ళు త్రాగుతూ ఖాళీగా ఉన్న క్యాప్ సూల్ సీసాపై కన్ను పడింది.

హమ్మయ్య అనుకొంటూ గట్టిగా ఓ ఊపిరి పీల్చాడు గోపతి. "అయ్యో... పాపం... తెల్లారే వరకు రాజీ ఎలా ఉంటుంది? ఎందుకైనా మంచిది డాక్టర్ గారు అంబులెన్స్ తెప్పించి, పెద్ద ఆస్పత్రిలో చేరిస్తే బాగుంటుందేమో! మామ గారు... ఏమంటారు మీరు?" అంటూ కన్నీరు తడబెట్టుతూ అడిగాడు గోపతి.

"నువ్వేం బెంగ పడనక్కర్లేదు. అమ్మాయి ఈ రోజు చాలా అలసిపోయింది. గదినంతా తనే శుభ్రం చేసి చక్కగా తీర్చిదిద్దింది. రాత్రి భోజనం కూడా చేయలేదు. పైగా తను విధిగా తీసుకునే క్యాప్ సూల్ కూడా తీసుకోలేదని నర్స్ చెప్పింది! అని" ముగించారు గోపతి మేనమామగారు.

"మరి... క్యాప్ సూల్ సీసా ఖాళీగా ఉంది కదా...?" గాబరా పడుతూ అడిగాడు గోపతి.

"ఆ మిగిలి ఉన్న క్యాప్ సూల్ నీకు కూడా బాగా పనిచేస్తుందని ఇచ్చాను!" అని చెప్పారు డాక్టర్ గారు ధీమాగా.

తనకు చావు కబురు చల్లగా తగిలింది!

"అయ్యయ్య... యో..!? అంటూ గోపతి కుర్చీలోనే పూర్తిగా చల్లారి పోయాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు