సలహా - ఆకెళ్ళ శివప్రసాద్

Salaha story by Aakella Sivaprasad

"పెళ్ళి చేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏమిటీ?" అని సుబ్బారావుని అతి వినయంగా అడిగాడు నరహరి.
నరహరి పెళ్ళీడుకొచ్చాడు. చదువు పూర్తయింది. క్యాంపస్ సెలెక్షన్ లో వుద్యోగం రాక పోయినా కిందా మీదా పడి ఓ కంపెనీలో వుద్యోగం సంపాదించాడు. నరహరికి టీం లీడర్ గా వున్నాడు సుబ్బారావు. సుబ్బారావుని చూస్తే, చూసిన ప్రతి ఒక్కరికి పెద్దరికం ఇవ్వాలనిపిస్తుంది.

బట్టతలకి అటు ఇటు కార్టూన్ లలో వెంట్రుకలు గీసినట్టుగా జుట్టు వుండడంతోనూ, వయసుకు మించిన వయస్సు కనిపించడం తోను, ప్రతి ఒక్కరు పెద్దరికం ఇచ్చేస్తుంటారు. నిర్మొహమాటంగా పెద్దరికం వచ్చేసరికి మొహమాటపడ్తూనే పెద్దరికం తీసేసుకున్నాడు. అంచేత పాటించినా, పాటించకపోయినా ప్రతి ఒక్కరికీ సలహా అడగాలనిపిస్తుంది. ముఖే ముఖే సరస్వతీ అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ వచ్చేస్తుంది.

నరహరిక్కూడా సుబ్బారావు నేపథ్యం మొత్తం తెలీకపోయినా సలహా అడిగేయాలనిపించింది. అడిగేశాడు.

క్యాంటీన్ లో టీ తాగుతూ మరీ అడిగాడు. టీ తాగుతున్నప్పుడు అడిగాడంటే ఖచ్చితంగా... సిన్సియర్ గా... అడిగి వుంటాడనుకున్నాడు సుబ్బారావు. సుబ్బారావు అనుభవంలో కొన్ని లెక్కలున్నాయి. నోట్లో ఏదో తింటున్నప్పుడో, తాగుతున్నప్పుడో ఆడిగితే నిజాయితీగా అడిగినట్టనుకుంటాడు.

అంచేత నరహరి ప్రశ్నకి జవాబుగా - "..ఏ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావ్...?" అని అడిగాడు.
"మామూలు పెళ్ళేనండీ, భాజాభజంత్రీలు, పురోహితుడు, అక్షింతలు, అన్నీ వుండాలి.."

"అంటే పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధమా?"

"... అంతే అనుకోండి ... "

"..పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధమైతే... మాఫ్రెండ్ విషయం చెప్తా విను....వాడికథవల్ల నీతి నీకే అర్థమౌతుంది. గోపాల్ అని పెద్దల మాట జవదాటని ఒహడు పెద్దలు చెప్పిన సంబంధమే చేసుకొంటానన్నాడు. అనడమే కాదు, నిర్ణయించేసుకున్నాడు. ఏ విషయమైనా పెద్దలనేవాడు. ఆఖరికి అమ్మాయి ఫోటో చూడమని చేతికిచ్చినా, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తేగానీ చూసేవాడు కాడు. మొత్తానికి ఎలాగైతేనేం అమ్మాయి ఫోటో దగ్గర్నుండి పెళ్ళిముహూర్తం వరకు సమస్తం పెద్దలు చెప్పినట్టే చేసాడు. పెళ్ళి అయింది. పెద్దలు పెళ్ళి చేయించగలరేగానీ కాపురం చేయవలసింది వీడేగా...అప్పుడు కూడా పెద్దలు అని మొదలు పెట్టాడు.

అమ్మాయికి చిర్రెత్తుకొచ్చింది. గొడవలు ప్రారంభం. అవి పది సెకెండ్ల ప్రకటనల నిడివితో ప్రారంభమై, 24 గంటల ఛానెల్లా హోరెత్తించాయి. గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం వాళ్ళ పెద్దలు, వీళ్ళ పెద్దలు ఫ్యామిలీ కోర్టులలో తిరుగుతున్నారు..."ప్రత్యక్ష ప్రసారమంత వివరంగా చెప్పాడు సుబ్బారావు.

నరహరి తాగుతున్న టీ మధ్యలో ఆపి నీళ్ళు తాగాడు పెద్దలు చేసే పెళ్ళిలో టెన్షన్ ఇదా అనుకుని , మరుక్షణం...
"మరయితే, శుభముహూర్తం చూసుకుని ఓ అమ్మాయిని లైన్ లో పెట్టుకోమంటారా?"
"అంటే...ప్రేమ పెళ్ళా?"
" ఆ....అంతేలెండి...అదయితే బాగుంటుందిగా..."
బాగానే వుంటుంది. మా కిశోర్ గాడు నీలాగే ఆలోచించాడు. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అన్నిటికంటే బెస్ట్ అనుకున్నాడు. అమీర్ పేట చౌరస్తాలో ఆ స్కీం లో భాగంగానే ఓ కంప్యుటర్ కోర్సులో జేరాడు. ఓ అమ్మాయిని దారిలో పెట్టాడు. ప్రేమికులమని యిద్దరు టిక్కెట్ దొరికిన సిన్మాని చూశారు. చోటు దొరికిన పార్కులో కాలక్షేపం చేశారు. సెల్ ఫోన్ వాళ్ళు కనిపెట్టిన కొత్త కొత్త పథకాలలో చేరి ఎస్సెమ్మెస్ లు, ఫోన్ లు తెగ చేసుకొన్నారు. చివరికి ఓరోజు ఈ ప్రేమకి శుభం కార్డు పెళ్ళిలోనే అవుతుందని బలంగా నమ్మారు. నమ్మడమే కాదు, ఓ ప్రేమ ముహూర్తం లో రిజిష్టర్డ్ మ్యారేజ్ చేసుకొన్నారు. పెళ్ళయిన నెల రోజులు తెగ ప్రేమించేసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడో తేడా వచ్చింది. మోజు, మోహం గట్రా అంటూంటారుగా..అవన్ని తగ్గాయి. ...పెళ్ళి పెద్దలకి చెప్పి చేసుకుంటే బావుండేదని అనేసుకుని పెద్దల దగ్గరికి వెళ్తే, వాళ్ళు మా అనుమతితో చేసుకున్నారా? మీ చావు మీరు చావండి అని చెప్పేశారు. దాంతో నిత్యం నిరంతర యుద్ధం లో కిషోర్ కాపురం ఇహనో, ఇప్పుడో అన్నట్టుగా వుంది. " అన్నాడు ఖాళీ టీ కప్పుని సింబల్ గా చూపెడుతూ సుబ్బారావు.
నరహరి ఈసారి ఇంకా పెద్ద కంఫ్యూజన్ లో పడ్డాడు.
పెద్దలు చేసిన పెళ్ళి నిలబడలేదు.
ప్రేమించి చేసుకున్న పెళ్ళి తేడాగా వుంది.
మరిప్పుడు ఎలా...?
ఆ ఆలోచనలతోనే క్యాంటీన్ నుండి తన సెక్షన్లోకి వచ్చినా పని చేసుకోలేకపోయాడు.

సాయంత్రం అయ్యింది. ఇంటికి బయలుదేరే టైం అయ్యింది. పెళ్ళి ఆలోచనలతోనే పార్కింగ్ చోటుకు వచ్చాడు. బైక్ స్టార్ట్ చేయబోతుంటే,
"ఎక్స్ క్యూజ్ మీ..."అని తియ్యని గొంతు వినిపించింది. ఎదురుగా సన్నగా నాజూగ్గా వున్న అమ్మాయి. పంజాబీ డ్రస్సులో వుంది. "ప్లీజ్...శిల్పారామం దగ్గర డ్రాప్ చేస్తారా...?"అనడిగింది.

కాదనలేక తలూపాడు.

ఆమె వెనక కూచున్నప్పుడు, ఆమె వంటి మీదనుండి వస్తున్న స్ప్రే వాసన మెల్లగా ముక్కుపుటాలని తాకింది.

ఈ అమ్మాయినే ప్రేమిస్తే...? క్షణం నరహరికి ఏదో ఆలోచన కలిగింది. ప్రేమించాకా-
సుబ్బారావు మధ్యాన్నం బుర్ర తినేస్తూ చెప్పింది గుర్తుకు వచ్చింది.
ప్రేమ పెళ్ళా?
పెద్దలపెళ్ళా?
ఒక్క క్షణం ఆలోచించి, మరుక్షణం , భవిష్యత్తు ఎలా వుంటుందో తెలీదు కనుక, ప్రశాంతంగా వుండాలంటే, సుబ్బారావు లాంటి సలహాలు తీసుకోకూడదనే బలమైన నిర్ణయం తీసుకున్నాడు నరహరి.!!!

అందుకే సందర్భం కల్పించుకుని ఆమె వివరాలు అడగాలనుకుంటున్నాడు...!!!

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు