పరుగు - రామదుర్గం మధుసూదనరావు

parugu

చాలా మంది లాగే...అమ్మానాన్నల కలలు తీరేలా ఇంజనీర్ లో డిగ్రీ సాధించాను. వెంటనే ఓ యూ ఎస్ కంపెనీలో జాబ్ వచ్చింది. రంగురంగుల జీవితాన్ని ఊహించుకుంటూ కొత్తరెక్కలు కట్టుకుని యూ ఎస్ గడ్డపై వాలిపోయాను. మంచి ఉద్యోగం, డాలర్లలో జీతం, సంతృప్తిగా జీవితం, ఓ మనిషి ఆనందంగా ఉండడానికి ఇంతకన్నా ఏం కావాలి? వృత్తిలోనూ ఆశించిన ఎదుగుదల. ఓ అయిదేళ్ళు ఇక్కడ కష్టపడితే చాలు, సొమ్ము మూటగట్టుకుని ఇండియాకు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత దర్ఝాగా కాలిపై కాలేసుకుని బతికేయొచ్చు అనుకున్నాను.

నాన్న గవర్నమెంటు ఉద్యోగి. రిటైర్ అయ్యాక ఆయన సాధించినదల్లా ఓ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్. నాన్న జీవితాన్ని బాగా చూసినందు వల్లనో చిన్నప్పట్నుంచి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నందుకో...నాన్న కన్నా బాగా బతకాలనిపించింది. ఎక్కువ డబ్బు, మాంచి ఇల్లు, దేనికీ వెదుక్కోనక్కర్లేకుండా జీవించాలని కలలు కన్నాను. వాటిని నిజం చేసుకోవడానికి కష్టించడం ప్రారంభించాను. మొదట్లో బాగానే ఉన్నా రాన్రానూ ఇంటిబెంగ పట్టుకుంది. వారానికి కనీసం రెండుసార్లయినా అమ్మానాన్నతో మాట్లాడేవాడ్ని. ( అఫ్ కోర్స్.....చవగ్గా దొరికే అంతర్జాతీయ ఫోన్ కార్డుల్ని వాడే వాడ్ననుకోండి...) పిజ్జాలు, బర్గర్లు తింటూ రెండేళ్ళు గడిపేసాను. ఈ మధ్య కాలంలో ఎప్పుడు రూపాయి విలువ తగ్గుముఖం పట్టినా తెగ సంతోషించేవాడ్ని.

సంపాదన బాగానే ఉంది కానీ ఒంటికొమ్ములా ఎంతకాలమని బతుకుతాం..? అందుకే పెళ్ళి చేసుకోవాలని డిసైడైపోయా. అమ్మానాన్నలకు ఫోన్ చేసినపుడు ఈ విషయం ప్రస్తావించాను. వాళ్ళూ చాలా ఆనందించారు. అయితే ఓ పదిరోజులు సెలవుపై ఇండియా వస్తున్నాను. అమ్మాయిని చూడ్డం, పెళ్ళి, అంతా జరిగిపోవాలని ప్రకటించా, చవగ్గా దొరికిన టికెట్ బుక్ చేసుకున్నా. ఇంటికెళ్ళాలని అనుకున్నప్పట్నుంచీ మనసు దూది పింజలా హాయిగా ఎగురుతోంది. బంధువులు, స్నేహితులు అందరినీ గుర్తు చేసుకుని వారి వారి అభిరుచులకు సరిపడా కానుకలు షాపింగ్ చేశా. ఏ ఒక్కరినీ మర్చిపోయినా కొంప కొల్లేరేగా. అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేశా. ఇండియాలో ఓ వారం ఇట్టే గడచిపోయింది. అమ్మాయిల ఫోటోల దొంతరలు ఓపిగ్గా చూడ్డంతోనే పుణ్యకాలం కాస్త అయిపోయేలా ఉంది. యూ ఎస్ కు వెళ్ళే టైం దగ్గరయ్యే కొద్దీ కంగారు మొదలయ్యింది. ఏదో ఓ సంబంధం ఖరారు చేయక తప్పని పరిస్థితి. ఉన్న ఫోటోల్లో మనసుకు నచ్చిన దాన్ని ఫైన చేసాను.

నా హడావుడి సరే, అమ్మాయి తల్లిదండ్రులు కూడా రెండ్రోజుల్లో పెళ్ళి చేసేస్తామనడంతో ఆశ్చర్యపడడం నా వంతైంది. బహుశ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటే ఇదే కామోసు. పెళ్ళి పేరుతో ఉష నా జీవితంలోకొచ్చేసింది. పసుపు పారాణి ఆరిందోలేదో అలా ఫ్లైట్ ఎక్కి యూ ఎస్ కు వెళ్ళాం. వెళ్ళెముందు ఇంటి చుట్టుపక్కల వారితో మాట్లాడి అమ్మానాన్నలని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరాను. అమ్మానాన్న వద్దంటున్నా వినకుండా చేతిలో నోట్లుంచి కదిలా.

ఉషకు యూ ఎస్ తెగ నచ్చేసింది. ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యేలా కొత్త ప్రదేశాలన్నీ చూపించేశా. ఏంటో జీవితం మళ్ళీ పాతబడుతోంది. అయినా కొత్త ఎంతసేపుంటుంది? ఇవాళ రేపటికి పాతేగా.... క్రమంగా ఉషకు ఇంటి బెంగ పట్టుకుంది. మొదట్లో వారానికి రెండు సార్లయితే ఇప్పుడు మూడు నాలుగు సార్లు ఇంటికి ఫోన్ చేస్తోంది. పాపం అమ్మానాన్నలకు దూరంగా ఉంటోంది కదా, బాగా అలవాటు పడ్డాక నాకే విసుగనిపిస్తుంటే తనకు ఇంకా కష్టమేగ...అందుకే ఖర్చయినా ఓర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. మరో రెండేళ్ళు కళ్ళ ముందు నుంచి కదలిపోయాయి. ఇంట్లో ఇద్దరు కొత్త సభ్యులు చేరారు. పాప, బాబు, వారితోటే లోకంగా బతికేస్తున్నాం. ఆఫీసులో ఏ మాత్రం వెసులుబాటు దొరికినా ఇంటికి వచ్చేస్తున్నాను...ఉష కూడా పిల్లల పెంపకంలో బిజీ అయిపోతోంది. ఎంత బిజీగా ఉంటున్నా అమ్మా నాన్నలకు ఫోన్ చేయడం మాత్రం వదల్లేదు. ఫోన్ చేసిన ప్రతీసారీ వాళ్ళు మనవల్ని పిలుచుకు రమ్మని ప్రాధేయపడేవారు. ఆ చిన్నారుల్ని చూడాలన్న వారి తపన నాకు అర్థమయ్యేది కానీ, ఇండియాకు వెళ్ళడానికి వీలుపడేది కాదు. కుటుంబం పెద్దదయింది. ఖర్చులూ పెరుగుతున్నాయ్. జీతం పెంచుకునేందుకు ఎక్కువ శ్రమ పడాల్సొస్తుంది. ఇండియాకు నన్ను వెళ్ళకుండా సంకెళ్ళు వేస్తున్నవి ఈ బాధ్యతలే... కాలం తన పని తాను చేసుకుపోతోంది. ఏళ్ళు అలా గడిచిపోతున్నాయ్.

ఉన్నట్టుండి ఓ రోజు నాన్నకు చాలా సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. ఒక్కసారి కలవరపాటు...అమ్మ పోయి ఏడాది కాలేదు. అప్పుడే నాన్నకిలా ......మనసేదో కీడు శంకిస్తోంది. అమ్మ ఉన్న రోజులలో నాన్న ' ఒరేయ్....మీ అమ్మతో నాకు ఎప్పుడూ తగాదే కానీ ఆమె లేకపోతే ఉండలేనురా...జంట పక్షుల్లో ఒకటి పోతే రెండవదానికి బతుకు నరకమే......' అంటుండేవాడు. అయితే ఆయన భయాన్ని నిజం చేస్తూ అమ్మ వెళ్ళిపోయింది. ఆ రోజు నాన్న ఫోన్ చేసినపుడు ఆయన గొంతులో ధ్వనించిన బాధ నా గుండెను పిండేసింది. చాలా బేలగా మాట్లాడాడు. ' చిన్నా మీ అమ్మ వెళ్ళిపోయిందిరా చివరి నిమిషం దాకా నిన్నే కలవరించింది....ఎలాగైనా వచ్చి చివరి తంతు ముగించ.....' వాక్యం ముగియలేదు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న చప్పుడు... నాకు ఆక్షణం ఏం చేయాలో తోచలేదు. ఇండియాకు సకాలంలో చేరుకోవడానికి సర్వశక్తులొడ్డాను. కానీ అమ్మ చివరిచూపు నాకు దక్కలేదు. ఒంటరిగానే వెళ్ళా.. పదిరోజులు కార్యక్రమాలు ముగిశాక నాన్నను మాతో వచ్చేయమన్నాను. తను నిర్జీవంగా నవ్వారు. కోడలు, మనవళ్ళు రాలేదేంటని మాటమాత్రంగా కూడా అడగలేదు. అమ్మతోటే అన్నీ ముగిశాయనుకున్నాడో ఏమో. ఆ తర్వాత నాన్న నుంచి ఫోన్లు రావడం తగ్గిపోయాయి. మేమే గుర్తుంచుకుని పదిహేనురోజులకొకసారి మాట్లాడేవాళ్ళం. ఆ సంభాషణల్లోనూ ఏదో వైరాగ్యం ధ్వనించేది. ఒక వ్యక్తి పోతే జీవితం ఇంత ఖాళీ అయిపోతుందా...? వారి నిష్క్రమణ మనపై ఇంత ప్రభావం చూపుతుందా?? ఆ ప్రశ్నలకు నాకు జవాబు దొరకలేదు అనడం కన్నా అంతగా ఆలోచించే సమయం దొరకలేదనడమే సబబు. చూస్తుండగానే నెలలు గిర్రున తిరిగిపోయాయ్. ఇదిగో ఇప్పుడు నాన్నకు బాగా లేదని కబురు. ఇప్పుడూ అంతే.. సెలవు దొరుకుతుందో లేదోనని భయం.

నా దురదృష్టం.. రెండ్రోజులయ్యాక మరో మెస్సేజ్. నాన్న పోయారని. కోలుకోలేని షాక్. అలా వుండిపోయాను. ఆ క్షణం తెలీని నిర్వేదం నన్ను ఆవరించింది. సమయానికి ఎవరూ లేకపోవడంతో కాలనీ సొసైటీ వారే అంత్యక్రియలు చేశారు. అమ్మను నాన్న సాగనంపాడన్న తృప్తయినా ఉండేది. కానీ, నాన్న.....నేనున్నా దిక్కూ మొక్కూ లేని అనాధగా..ఈసారి చాలా డిప్రెస్ అయ్యాను. అమ్మానాన్న మనవల్ని చూడకుండానే కన్నుమూశారు.

జీవితం ఎంత దుర్మార్గం....అయినవాళ్ళు దూరమైతే కనీసం వారిని తలుచుకుని దు;ఖించే పాటి టైం కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ పరుగు మొదలు. ఇదివరకటి ఊపు లేకపోయినా అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి. రెండేళ్ళు గడవగానే యూ ఎస్ లో ఉండడం ఇక అసాధ్యం అనిపించింది. అందుకే ఉషకు, పిల్లలిద్దరికీ ఏమాత్రం ఇష్టం లేకున్నా ఇండియా వెళ్ళడానికి మూటా ముల్లే సర్దుకున్నా.. ఇండియాకు వచ్చాక ఓ డబుల్ బెడ్ రూం ఇంటికోసం వేట ప్రారంభించాను. ఇండ్ల ధరలు బాగానే పెరిగిపోయాయి. నేను కూడబెట్టుకున్న డబ్బుతో డబుల్ బెడ్ రూం ఇల్లు దొరకడం కష్టమనిపించింది.చిన్నపాటి ఇంటికోసం రాజీ పడాలనిపించలేదు. పోనీ బ్యాంక్ లోన్ తీద్దామంటే అప్పుచేసి ఇల్లు కొనడానికా ఇన్నాళ్ళు అమెరికాలో కొలువు వెలగబెట్టిందని మనసు వెటకారం చేసింది. ఎలాగైనా సరే, పైసా అప్పు లేకుండా ఇల్లు కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మళ్ళీ యూ ఎస్ కు వెళ్ళడమే సరైన మార్గం అనిపించింది. ఉషతో ప్రస్తావిస్తే రానని ఖరాఖండీగా చెప్పేసింది. ఓ రెండంటే రెండేళ్ళే వర్క్ చేసి మళ్ళె వచ్చేస్తానని ఉషతో బతిమాలాను. ఆమె మౌనంగా ఉండిపోయింది.

అదే అంగీకారమనుకున్నా. మరి నా అవసరం అలాంటిది. పిల్లలు మాత్రం ఎగిరి గంతేశారు. వారిద్దరినీ వెంటబెట్టుకుని మళ్ళీ ఫ్లైటెక్కాను. పట్టువదలని విక్రమార్కుడిలా. అదే పరుగు....అలసటను పట్టించుకోని జీవితం కొత్త లక్ష్యాలను శాసిస్తున్న ఆశ. రెండేళ్ళనుకున్నా...మరో అయిదేళ్ళు ఇట్టే గడచిపోయాయి. పిల్లలు బాగా ఎదిగారు. పాప ఓ అమెరికన్ ను పెళ్ళి చేసుకుంది. అబ్బాయి అమెరికా జీవితాన్ని తలమునకలుగా ఆస్వాదిస్తున్నాడు. కొద్దికాలం తర్వాత ఇండియాకు వెళ్ళిపోదామని అనుకున్నా.. డబుల్ బెడ్ రూం ఇల్లు ఒనడానికి సరిపడా డబ్బులున్నాయి. ఓ మంచి ప్రాంతంలో కొనాలి. హ్యాప్పీగా ఉండాలి అని మనసారా అనుకున్నా.

ఇప్పుడు నేను అరవయ్యో పడిలో ఉన్నాను. పరుగులు తీసీ తీసీ అలసిపోయిన వయసు, మనసు నాది. రోజులో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుంటాను. సాయంత్రం వేళ కాలనీలోని గుడికి మాత్రం వెళుతుంటాను. కష్టమో నిష్టురమో, ఇష్టమో అనిష్టమో తప్పనిసరిగా నా వెన్నంటి ఉన్న ఉష కూడా వెళ్ళిపోయింది. పిల్లలు అప్పుడప్పుడూ అకేషనల్ గ్రీటింగ్ కార్డులు పంపడానికే పరిమితమయ్యారు. ఇప్పుడు నేను ఒంటరిని. భౌతికంగానూ..మానసికంగానూ.

ఒక్కోసారి ఆలోచిస్తూంటే నా జీవితం నాకే విచిత్రమనిపిస్తుంది. వెనుదిరిగి చూసుకుంటే పరుగులు తీస్తున్న నా అడుగుల చప్పుడు..ఆయాసంతో రొప్పుతున్న నా మనసు... ఇంతే... ఇంతకంటే ఇంకేం కనిపించడం లేదు. ఎందుకో నాన్న గుర్తొచ్చాడు. అవునూ నాన్న ఇండియాలోనే ఉన్నాడు...సొంత ఇంటిలోనే జీవితాన్ని అనుభవించాడు. మరి నేనెందుకిలా...కేవలం ఒక అదనపు గది ఉన్న ఇంటికోసం మనసులో అన్ని బంధనాల గదుల్నీ కూల్చేసుకున్నాను. పెదాలపై నిస్సహాయత. జాలితో కూడిన సన్నటి నవ్వొకటి కదలాడింది. రవ్వంత సుఖం కోసం ఇంత దు;ఖాన్ని ఆహ్వానించాలా? ఇప్పుడు నేను చనిపోతే నా చుట్టుపక్కల వాళ్ళే అంతిమ సంస్కారాలు చేస్తారేమో ..నాన్నకు చేసినట్టు..

...ఇంత అవసరమా...? ఈ ఆలోచన సముద్ర మధనం నుంచి చివరగా ఈ ప్రశ్న ఒకటే నా మనసులో తేలింది. సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉన్నాను. ఒక్కటైతే నిజం....జీవితం కేవలం పరుగు పందెం కాదు...ఆలోచించడానికి..ఆస్వాదించడానికి అర్థం చేసుకోవడానికి కాసింత సమయం కేటాయించాలి. మళ్ళీ ఈ దారిలో వస్తామో లేదో....ఒకే జీవితం.. జీవంతంగా జీవించాలి....జన్మ జన్మాంతాల దాకా గుబాళించే అనుభూతుల ఇంగువను ఇక్కడే గుడ్డకట్టడం ప్రారంభించాలి.....!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు