మాలావు యుద్ధం - లక్ష్మీ సుజాత

maalaavu yuddham

చిన్నప్పట్నించి నా స్థూలకాయం మీద నేను యుద్ధం ప్రకటిస్తూనే వున్నా..అలాగే ఓడిపోతూనే వున్నా. ఆ విషయంలో గజనీమహమ్మదే నయం. అసలు చిన్నప్పట్నించీ నేను లావే! పిల్లాడిగా వున్నప్పుడు బొద్దుగా వుంటే అందమే కానీ పెద్దై స్కూల్లో చేరాక..నన్నందరూ లావుగా వున్నానని వెక్కిరిస్తూ వుండేవారు. అప్పుడు నాలో నేను ఉడుక్కుని లావు మీద యుద్ధం ప్రకటించేవాణ్ణి. ఓ పదిరోజులపాటు విపరీతమైన వాకింగ్ చేసేవాణ్ణి. తర్వాత కాళ్ళ నొప్పులు బద్ధకంతో మానేసేవాణ్ణి.

అలా అలా లావు మీద యుద్ధం ప్రకటిస్తూ..ఓడిపోతూ..చదువు పూర్తి చేసుకుని ఉద్యోగస్తుడినయ్యాను. నా లావు పెళ్ళి సంబంధాల విషయంలో కూడా అడ్డొచ్చింది. కట్నాలు కానుకలూ, జాతకాల తర్వాత ముఖ్యంగా చూసేది ఈడూ జోడు. బక్కగా వున్న అమ్మాయి నా పక్కన పీలగా వుండేది. లావుగా వున్న అమ్మాయి హిడింబిలా భయానకంగా వుండేది. సరే ఎలాగో ఓ మోస్తరు పిల్లతో పెళ్ళయింది.లావు తగ్గి స్లిమ్ గా వుండాలని ఎవరికి మాత్రం వుండదు..కానీ ఎలా?

***

ఒకరోజు నాక్కాస్త కళ్ళు తిరిగాయి. డాక్టర్ కి చూపించుకున్నాను. "మీకు చాలా హై బీపీ వుందండీ! మీరు లావు తగ్గాలి లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్కానీ, హార్ట్ ఎట్టాక్ కానీ, బ్రెయిన్ హేమరేజ్ కానీ, పెరాల్సిస్ స్ట్రోక్లాంటివేవైనా రావచ్చు."అని డాక్టర్ కృష్ణుడిలా మెడికోపదేశం చేశాడు.

దాంతో నా గుండె జారిపోయింది. మళ్ళీ లావు మీద యుద్ధం ప్రకటించాను. ఇంటికొచ్చి నా శ్రీమతితో "చూడు..వాణీ! నేను హఠాత్తుగా లావు తగ్గకపోతే నీ మంగళసూత్రానికి హాని జరిగి నీకు నా ఇన్సురెన్స్ వచ్చేస్తుంది. అంచేత మాంగళ్యం కాపాడుకోవాలంటే ఇంట్లో నూనె వినియోగం, ఉప్పుకారాలు తగ్గించు..లేదంటే వచ్చే ఇన్సురెన్స్ డబ్బు బ్యాంకులో వేసుకుని పొదుపుగా కాలం గడపండి"అన్నాను.

"ఆపండీ..మీ అమంగళపు మాటలు..మీరు కల్పవృక్షం లాంటివాళ్ళు. ఎవరన్నా కల్పవృక్షం కుప్పకూలిపోవాలని చూస్తారా? ఎప్పటికైనా ఇన్సురెన్స్ నాకు రావలసిందే కదా..అప్పటిదాకా ఎదురుచూస్తా..అంతేకాని మిమ్మల్ని పైలోకానికి ఇంత తొందరగా చేరనివ్వను"అంది పదానికి పదానికీ మధ్య చాలా గ్యాపిస్తూ ముఖకవళికలు మారుస్తూ..టీ వీ సీరియల్ లోని పాత్రలా..

ఆరోజు నుంచి నాకు మాత్రం నేచర్ క్యూర్ హాస్పిటల్ లోని ఫుడ్..పిల్లలకీ తనకీ మాత్రం ఆవకాయ, మాగాయ, నూనెలో తేరట్లాడే వడియాలు, వేపుళ్ళూ..రుచికరమైన వంటకాలు. నాకు ఆ గడ్డి తినాలంటే బాధగానే వుంది..కానీ ఏం చేస్తాం? ‘నేను త్వరలోనే స్లిమ్ అవడం ఖాయం..నా పర్సనాలిటీతో అందమైన అమ్మాయిలకి లైనేస్తే అప్పుడు తెలుస్తుంది దానికి’ కసిగా మనసులో అనుకున్నాను(ఎందుకో?).విధి ఎలాంటిదంటే..సరిగ్గా అప్పుడే..పెళ్ళిళ్ళు శుభకార్యాలకి చాలా ఆహ్వానాలందుకున్నాం. ఆ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆకర్షించేవి ఆహారపదార్ధాలే..ముక్కుపుటాలదరగొట్టే ఘుమఘుమలే! నిజానికి ‘పేరు దేవుడిది..నైవేద్యం మనకీ’ లాగా..శుభకార్యాలకి వెళ్లేది కమ్మటి పదార్ధాలు తినడానికే కదా! నన్ను నేను వాటిదగ్గరకి వెళ్ళకుండా కట్టేసుకోవడానికి..నాలికని మడతేసుకుని నోటిలో మూసేయ్యడానికి మహా కష్టపడాల్సొచ్చింది. పైగా "ఏమిటండీ..మీరేం తినట్లేదు" అని ఎవరన్నా అంటే "మా ఆయన స్ట్రిక్ట్ డైటింగ్ లో వున్నాడు. టెంప్ట్ చేయకండి.. అయినా ఆయన అవడనుకోండి..ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే ఆయన!" అని పదిమందిలో కితాబిచ్చేది మా ఆవిడ. అలా ఇన్ స్ట్రక్షన్ ఇచ్చింది నేనే, కాకపోతే..మనసులో ఏమిటో తెలియని బాధ సుళ్ళు తిరిగేది. అందరూ సుఖ పడుతుంటే నేనొక్కడినే వెలివేయబడినట్టు అనిపించేది.

ఒక పెళ్ళిలో..అక్కడి పదార్ధాలు నా కట్లు తెంపేశాయి. గట్టుదాటిన వరదలా..పొలంగట్టు దాటిన దున్నలా పదార్ధాల మీద పడిపోయాను. వీటినా? ఇన్నాళ్ళూ వదిలి..ఋషిపుంగవుడిలా ఆకులూ అలములూ తింటూ తిరిగింది?..కాకిలా కలకాలం బ్రతికేకన్నా..హంసలా కొద్దికాలం బ్రతికినా చాలు (ఈ సామెత ఇక్కడ వర్తిస్తుందో లేదో అప్రస్తుతం) అనుకుని నన్ను నేను సమాధానపరచుకున్నాను. మా ఆవిడా పిల్లలు వింతగా..విడ్డూరంగా చూస్తున్నారు. "ఏంట్రా అలా చూస్తున్నారు?"కోపంగా ప్రశ్నించాను.

"డాడీ..నువ్వు ఇన్నాళ్ళూ మానేసినదంతా ఇవాళే తినేశావు"అన్నాడు మా రెండోవాడు.

నిజమే..ఇన్నాళ్ళ డైటింగ్ తో..కొద్దిగా లోపలికి వెళ్ళిన పొట్ట..ఇప్పుడు పేద్ద బెలూన్లా ఉబ్బింది.

"సర్లే..సర్లే"అని ఇంటికి బయల్దేరాను. ఆరోజుతో డైటింగ్ సరి.

ఆతర్వాత పక్కవాటాలోకి పరమేశం ఫ్యామిలీ దిగింది.

అందులో కొట్టొచ్చినట్టు కనబడింది పరమేశం. నా బరువు మహా అయితే ఓ వంద కే జీలుంటుంది..కానీ పరమేశం నూటేభైకి తక్కువుండడు.నేనతనితో పరిచయం పెంచుకుని "ఏవండీ..మన లావు చూశారుగా! అందరూ దిష్టి కొట్టడానికి తప్ప దీనితో ఏముపయోగం? పైగా మనమీద పగబట్టినట్టు రోగాలు అదనుకోసం ఎదురుచూస్తుంటాయి. డాక్టర్లకయితే పండగే..అంచేత మనం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేద్దాం. ఒకరికొకరం అయితే టైం టేబుల్ తప్పం."అన్నాను.

"నేనూ కంపెనీకోసమే చూస్తున్నానండీ..తప్పకుండా చేద్దాం" అన్నాడు. నిజానికి నాకు కుక్కలంటే భయం. అందుకనే ఇన్నాళ్ళూ తోడు కోసం చూశాను. లక్కీగా దొరికాడీయన.

మరుసటిరోజు మూడు గంటలకి లేచి ట్రాక్ సూట్ లో సిద్ధంగా వున్నాను. నాలుగింటికి ఆయన తలుపు తట్టాడు.

"నేను మూడు గంటలకే లేచి ప్రిపేరయి ఉన్నానండీ" నేనెంత డిటర్మినెంటో తెలియజేసాను.

ఇద్దరం వారం పాటూ క్రమం తప్పకుండా చేశాం. ఎనిమిదో రోజు ఆయన వచ్చి మా తలుపు తట్టలేదు. నేనే పదినిముషాలు చూసి వాళ్ళ తలుపు తట్టాను. ఆయన విసుగ్గా బయటకొచ్చి"నేను రాత్రి ఆఫీసునుండి బాగా ఆలస్యంగా వచ్చాను. నిద్ర సరిపోలేదు అంచేత మీరెళ్ళోచ్చేయండి"అని ముఖంమీదే తలుపేసేసాడు.

‘పోన్లే..ఒక్క రోజు వెళ్ళకపోతే ఏమవుతుంది’ అనుకుని లోపలికొచ్చి మంచంమీద వాలిపోయాను. మా ఆవిడెందుకో నిద్రలో నవ్వినట్టనిపించింది.

అలా ఆ వాకింగ్ కాశీకెళ్ళిపోయింది.

ఆ తర్వాత జిమ్..వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్..స్లిమ్ క్యాప్సూల్స్..సైక్లింగ్..వాట్ నాట్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంచ్ కూడా తగ్గలేదు. వెయిట్ లో ఒక్క గ్రామ్ తేడాలేదు.

‘ఓడిపోయాను..లావుతో చేసిన యుద్ధంలో ఓడిపోయాను. సైంటిస్ట్ లు ఇన్నన్ని కనుక్కుంటుంటారు..ఎయిడ్స్ ..క్యాన్సర్ మహమ్మారుల్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంటారు కాని..అమాంతం లావుని తగ్గించే ఒక చిన్న ట్యాబ్లెట్ కనుక్కోలేకపోతున్నారు! అసలు అలాంటి రోజోకటి వస్తుందా?’ మా ఆవిడందించిన చిక్కటి కాఫీ తాగుతూ...పొట్టనిమురుకుంటూ బాధగా అనుకున్నాను.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ