అంచనా - హైమా శ్రీనివాస్

anchanaa

పెళ్ళి బాజాలూ బాగా మ్రోగుతున్నాయి. ముహూర్తం దగ్గర పడింది. అతిధులంతా వచ్చి కుర్చీలన్నీ ఆక్ర మించారు. అందిస్తున్న కాఫీ గ్లాసులు అందుకుని త్రాగుతూ పెళ్ళి మంటపం వైపు చూస్తూ మెల్లిగా కబుర్లాడుకోసాగారు. నేనూ నాపక్కనే ఉన్న ఉమ చెవిలో, "చూడవే ! మంటపానికి దగ్గరగా నిల్చు నున్నా విడ చీర? చాలా పాతగా లేదూ! చీప్ క్వాలిటీ అనుకుంటా, ఐనా పెళ్ళికలావస్తారేంటే ఎవరైనా?" అంటూ కఫీ సిప్ చేయసాగాను.

" ఔనుసుమా ! ఐనా ఆవిడ అంత నల్లగా ఉందేంటే! అంటు కుంటే అతు క్కుంటుందేమో అన్నట్లుంది బొగ్గు మసి, అలాంటి వాళ్ళ మనసూ మహా గట్టిగా కట్టెపేడులా , కంకర్రాయిలా ఉంటుంద నుకుంటా. " తుసుక్కున నవ్వింది ఉమ .

"అలా దగ్గరగా, పెళ్ళిపెద్దలా నిల్చోక పోతే మనలా వచ్చి కూర్చో వచ్చుగా!"

"కొందరం తేనే! అన్నీపూసు కుంటారు, ఫోటోల్లో పడతా మనేమో!"

" ఈవిడ ఫోటోల్లో పడితేకానీ పెళ్ళి జంటకు కళ రాదను కుంటున్న దేమోనే!"

" ఆపక్కనే ఉన్నావిడ్ని చూడూ! ఎంత మంచి రంగో ! అచ్చం బంగారం! మనం కూడా అంత రంగులో లేము. అసూయగా ఉందే! పెళ్ళికొడుకు దగ్గరి బంధువై ఉంటుంది. బహుశా అతగాడి అక్కేమో!"

"ఔను సుమా లేక పోతే అలా స్టేజ్ మీద ఉండదుగా!"

"ఆ చీరకూడా చూడూ ఆమె వంటి రంగుకు బాగా అతికింది. గంధం కలర్!"

"మెడలో నెక్లెస్ చూడవే ! కొత్త డిజైన్ కదూ! ఆ రాళ్ళు ఎంత బాగున్నాయో! నవరత్నాల నెక్లెస్ "

" మా ఆయనా ఉన్నారెందుకూ! ఎంతోకాలంగా అడుగుతున్నా నవరత్నాల నెక్లెస్ చేయించమని. ఊ లేదు ఉప్పురాయీ లేదు. "" అటుచూడూ ! ఆపళ్ళెం అందిస్తున్న ఆమె జెడ ఎంత పెద్ద దో !"

"ఔనే ! నాకూ చిన్నప్పుడు అంత పెద్ద తలకట్టు ఉండేది. నగర నాగరి కతని మా ఆయన ఈ క్రాఫ్ పెట్టుకో మన్నాడు. నాముఖానికి ఈ బాబ్డ్ హేరే బావుంటుందిట!"

"ఆ పచ్చ పట్టు చీరావిడ ముక్కు బుళాకీ చూడవే! ఎంత బావుందో వజ్రపు ముక్కుపుడకే! మెర్సి పోతోం దికదూ!"

" ఆ నల్ల లావుపాటావి డెందుకే అలా నిల్చుకుంది? అందరికీ అడ్డంగా? అదేనే ఇందాక మనం అనుకున్న చీప్ శారీ ఆవిడే! బహుశా వాళ్ళ పని మనిషై ఉంటుంది.అందుకే అలా చేతులు కట్టుకుని నిల్చునుంది , ఎవరే మైనా అడుగుతారేమోని."

" ఏమోనే ఆవిడ మాటిమాటికీ ఆ వజ్రాల నెక్లెస్ తో ఏదేదో చెప్తోంది , ఆవిడేమో అన్నింటికీ తలూపుతూంది కూడానూ. ఆనల్లా విడకు పెళ్ళిళ్ళు చూసిన అనుభవం ఉందేమోనే , అందుకే అన్నీ చెప్తున్నట్లుంది. ఆ వజ్రాల నెక్లెస్ బాగా చదువుకున్న దై ఉంటుంది అందుకే నే అంత సంస్కారం! ఏదో పెద్ద ఐటీ కంపెనీలో నెల కు ఐదారు లక్షల జాబ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే అంత ఖరీదైన చీరా నగలూ ఎలా వస్తాయీ! "

"ఇంతకూ పెళ్ళికొడుకు తల్లీ తండ్రీ ఏరే! "

"ఏమోనే ! మన మానస రానీ అడుగుదాం, ఐనా దీని కెందుకే అంత బిజీ! వాళ్ళ పెదనాన్నకూతురి పెళ్ళికి" "సరే కానీ పె ళ్ళికూతురెనకాల నిల్చున్నావిడ మెడలో ఆసన్న చైనేంటే ! అది వెండి చైనో లేక ఇమిటేషన్ వెండో ఐఉంటుంది. మరీ పేద రాలులా లేదూ! ఆ నేత చీరానూ ! వెళ్ళి వెనకెక్కడో కూర్చోక అలా నిల్చుందేమే! "

" చూడూ ! ఆ నల్ల కళ్ళద్దాల వాడు , పోజేస్తూ మనల్నే చూస్తున్నాడే! ఇలాంటి వెధవలు పోజులుకొట్ట నే వస్తారు పెళ్ళిళ్ళకు, పోయి నాలుగు వాయించి రానా!"

"వద్దు లేవే గొడవ లెందుకు? నీవు అందంగా నా జూగ్గా ఉన్నావుగా! అందుకే నల్ల అద్దాల్లోంచీ తెగ చూస్తు న్నట్లున్నాడు. పెళ్ళి కాలేదను కుంటున్నాడేమో! మీ ఆయన వచ్చుంటే బావుండేది నాలు గంటిచ్చి వచ్చే వాడు. ఐనా నీవు పెళ్ళికాని పిల్లల్లే వయ్యారాలుపోతున్నావాయె ! ఎవరికైనా చూడాలని పిస్తుంది. ఖర్మ కాలి నేను ఆడపిల్లనై పోయాను కానీ లేక పోతేనా! " "ఛా పోవే నీవు మరీనీ! " ఇద్దరం నవ్వుకుంటుండగా మా నెచ్చెలి ,పెళ్ళికూతురు చెల్లి చిన్మయి వచ్చింది.

"ఏమే కూర్చున్నారా! విసుగేసి వెళ్ళి పోయారను కుని కంగారుపడి చచ్చాననుకో.”

"ఔనే ! ఇద్దరమై పోయాం మానస కూడా కంటికి కనిపించనే లేదు."

"అది మా అక్కకు అలంకారం చేసి తన మేకప్ పాడై పోయిందని అలంకరించు కుంటోందిలే, వస్తుంది. ముహూర్తం ఐందంటే అంతా టిఫిన్స్ కెళతారు , మీరూ దొరకరు కదా! అందుకే సందు చూసుకుని వచ్చా." " బోరు కొట్టి చస్తున్నాం. ఇంతకీ స్టేజ్ మీ దున్న వాళ్ళంతా ఎవరెవరో చెప్పవే.."

"అందుకే గా వచ్చాను. చూడండీ ! అక్కడ పాత తరహా చీరలో ఉన్న లావుపాటి నల్లరంగులో ఉన్నావిడ కోటీశ్వరురాలు , కోమలమ్మ మనస్సు దొడ్డది. తన సొమ్ముతన కోసం ఏమీ ఖర్చుచేసు కోదు. అంతా పేద లకే! ఆచీర తన పెళ్ళినాటిదిట! ఒళ్ళుకప్పుకోనేగా బట్టలు, దానికోసం ఖర్చెందుకూ అంటుంది. మా అక్క పెళ్ళికి ఖర్చంతా కోమలమ్మే పెట్టుకుంది, మనస్సు మనోహరం , చాలా మంచిది. ఎందరో పేద కన్యల వివాహాలకు, కులమతాలు చూడకుండా ఖర్చంతా పెడుతుంటుంది. మా నాన్న పెళ్ళి ఖర్చు కూడా పెట్టు కో లేకేగా ఇంత కాలం మా పెళ్ళిళ్ళు చేయలేంది. ఆస్టేజ్ మీదున్న గంధం రంగు చీర కట్టుకున్నది ఈమె సర్వెంట్! ఆచీర ఈమే కొనిచ్చింది. నగలన్నీ నకిలీవే! మా అక్క అదే , పెళ్ళి కూతురెన కాల నిల్చున్నా విడ పెళ్లి కొడుకు అక్క, అమేరికాలో మిలియనీర్!ఎంత సాదా సీదాగా ఉందో చూడూ! ఆపచ్చ పట్టుచీ రా విడ పురోహితుని భార్య ! ఆయనకు ఏదైనా అవసర మవుతుందేమోని నిల్చునుంది." చిన్మై ఆపకుండా చెప్తుండగా మా నోర్లు కాస్త కాస్త ఎండుతుండగా , ఉండబట్టలేక అడిగాను."ఆముక్కు పుడక రవ్వలదే కదూ!"

"నీముఖం ! అదీ నకిలీదే! “చిరునవ్వు నవ్వింది అందగా చిన్మై. ఆ అంటూ నోళ్ళు తెరిచాం ఇద్దరమూనూ!

“ఆ పెద్ద జడావిడ ఎవరే! ఏంత మంచి తలకట్టే! !”ఆశ్చర్యంగా ఉమ అడిగింది చిన్మై ని. చిన్మై పెద్దగా నవ్వి “ అది మా బాబాయ్ కూతురు, రత్న! దానిది జుట్టుకాదు సవరమే! దానిదీ మీలాగే బాబ్డ్ హేర్!” మళ్ళీ ఉమ , నేను ఇద్దరం ముఖాలు చూసుకున్నాం. “ఇహ ఆ నల్లకళ్ల జోడు అతడు చూడండీ! చాలా నాజూగ్గా , మంచి రంగు లో లేడూ! అతడి మీద మీ అభి ప్రాయమేంటే!" అడిగింది చిన్మై." వట్టి రౌడీలా ఉన్నాడే! ఇందాకటి నుంచీ మావైపే చూస్తున్నాడు." కోపంగా అంది ఉమ.

" అతడికి కంటి చూపు లేదే! చిన్నప్పుడు దీపావళి టపాసులు పడి చూపు పోయింది. ఐనా చూపు లేని వాళ్ళ భాష ‘ బ్రైలీ ‘లో డిగ్రీ , ఎంబీ.ఏ చదివి, పీహెచ్ డీ చేసి , పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు . స్వంత కంపెనీ పెట్టుకున్నాడు. మా బావ అదే పెళ్ళికొడుకు అక్క అమెరికా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిస్తుందిట. ఇక్కడ కంటే అమేరికాలో అతడి కళ్ళకు ఆపరేషన్ చేసే మంచి డాక్టర్స్ ఉన్నారుట!.దీని కంతా ఖర్చు మా పాలిటి దేవత ఆ కోమలమ్మే పెడుతుందిట! దానికి ముందే మాపెళ్ళి జరుగుతుంది. అతడే నాక్కాబోయే భర్త! " అంది సిగ్గుపడుతూ చిన్మై.మా నోళ్ళు పడి పోయాయి. చిత్తరువుల్లా చూస్తూ ఉండి పోయాం .

చిన్నప్పుడు మా బామ్మ చెప్పినమాట గుర్తొచ్చింది.'మనిషిని చూడగానే ఒక అభిప్రాయం ఏర్పర్చుకోడం తప్పు ' అని. మా ‘ బరావఱ్ఱు ‘ అదేమా ‘అంచనా’ అంతా తప్పైపోయింది కదా! మెరిసే దంతా మేలిమీ కాదు , మెరవని దంతా మురికీ కాదు అని అర్ధమై తలలు వంచుకున్నాం, మా మనస్సుల్లోని మురికిని చూసుకుంటూ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు