కథ మారింది - - రాజేష్ యాళ్ళ

katha marindi

"చేస్తావా? లేదా?!" బిగ్గరగా గద్దించింది వరలక్ష్మి.

"నాకు అలవాటు లేదు వరం..." ఇంకా గారాలు పోతున్నాడు బుచ్చిబాబు.

"నేను మాత్రం పుట్టగానే చేతిలో గరిటెతో పుట్టానా ఏంటీ?!" అంతకంతకూ వరలక్ష్మి స్వరం పెద్దదవుతోంది.

"నీకు మీ అమ్మ నేర్పి ఉంటుంది వరాలూ! అయినా తను కూడా వంట అదరగొడుతుంది కదా!" కాకామార్గంలో పనవుతుందేమోనని ప్రయత్నించాడు బుచ్చిబాబు.

"చూడు బుచ్చీ! నన్ను బుట్టలో వేసుకునే ప్రయత్నాలన్నీ మానుకుంటే మంచిది. పెళ్ళై మూడు నెలలు కావస్తోంది కానీ ఇప్పటి వరకూ పెళ్ళిచూపుల రోజు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. ఏదో నాకూ సెలవు ఉంది కాబట్టి, నువ్వూ సెలవు పెట్టావ్ కాబట్టి, అడపాదడపా వంటింట్లోకి వచ్చి సాయం చేస్తున్నావ్ కాబట్టి ఇన్నిరోజులూ ఏదో వండి పెట్టాను. రేపటినుండీ మాత్రం స్టవ్ మీద నేను పెట్టే పప్పులుడకవ్! నీవు పెట్టాల్సిందే." అల్టిమేటం ఇచ్చింది వరలక్ష్మి.

"ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం కదా వరం!" బ్రతిమాలుతూ గడ్డం పట్టుకోబోయాడు బుచ్చిబాబు.

"అలాంటపుడు పెళ్ళిచూపుల రోజే మీ గురించిన నగ్నసత్యాలు నాకు చెప్పేసి ఉండాలి కదా. మూణ్ణెల్ల కాపురం దాకా కూడా వచ్చి ఉండేది కాదు పరిస్థితి! గడ్డమే కాదు... కాళ్ళు పట్టుకున్నా సరే ముందు చెప్పిన మాటలే ఖాయం." ఖచ్చితంగా కత్తితో కోసినట్టు చెప్పింది వరలక్ష్మి."ఇంట్లో పని, వంట పని వచ్చా అని అడిగితే అవసరార్థం వచ్చని అబద్ధమాడాను కానీ ఆ పనులు రాకపోవడం కూడా నగ్నసత్యాలేనా వరం?!" జాలిగా అడిగాడు బుచ్చిబాబు.

"మరి కాక ఇంకేంటి? ఇది జీవితాలతో ముడిపడిన సమస్య బుచ్చీ! రేపటినుండి నేనూ ఆఫీసుకెళ్ళాల్సినదాన్నే! ఇన్నిరోజులూ ఎలాగో పోనీలే అని వంటింట్లో కుస్తీలు పడ్డాను కానీ ఇక నా వల్ల కాదు."

"పోనీ వంట చేసేటపుడు నువ్ నా దగ్గరుంటావా?!" ఆశగా అడిగాడు.

"ఉహూ... ఉదయం పూట చెయ్యాల్సిన పనులు నాకూ చాలా ఉంటాయి. కుదరదు. కావాలంటే ఆ షెల్ఫ్ లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అన్నీ వంటల పుస్తకాలే. చదివి ఒక్కో ఐటం ట్రై చేస్తూ ఉండు. అదే వచ్చేస్తుంది." సలహా పడేసింది వరలక్ష్మి.

"కుదరకపోతేనో?!" అనుమానంగా అడిగాడు బుచ్చిబాబు.

"వారం రోజులు చూస్తాను. ఆ తర్వాత కోర్టులో కేసేసేస్తాను." కోపంగా చెప్పింది వరలక్ష్మి.

"కోర్టులో కేసే?! విడాకులకా?!" బెదురుచూపులు చూస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"కాదు ఫోర్ ట్వంటీ కేసు. చీటింగ్ చేసావని."

"వంట చెయ్యకపోవడం కూడా చీటింగ్ కేసే?!"

"మరి కాదా?! ఆ రోజు నువ్వు చేసి పెడతానన్న అన్ని పనులకూ అగ్రిమెంట్ తీసుకున్నాకేగా మా నాన్నకు తాంబూలాలు ఇచ్చుకోవచ్చని నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?!" దర్పంగా చెప్పింది వరలక్ష్మి.

"కానీ వరం, నేను కూడా ఉద్యోగం చెయ్యాలి కదా?!" అడగొచ్చో లేదో అన్నట్టుగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"కానీలూ కాసులూ మూణ్ణెల్ల క్రితం చెప్పాలి. ఇప్పుడు కాదు! అయినా ఇంకొక్క నెలే గడువు ఉంది అని మన పెళ్ళై రెండు నెలలు దాటగానే నీకు చెప్పాను. అయినా నువ్వు ఏమీ కానట్టుగా నవ్వి ఊరుకునేవాడివి. అప్పుడు కూడా వంట రాదని మాత్రం చెప్పలేదు." కస్సుమంటూ భర్తను కసిరి దుప్పటి పైకి లాక్కుని మరో వైపు తిరిగి పడుకుంది వరలక్ష్మి.

బుచ్చిబాబుకేం చెయ్యాలో తోచడంలేదు. పెళ్ళిచూపుల రోజు వరలక్ష్మిని చూడగానే తెగ నచ్చెయ్యడంతో ఆ రోజు తనేం చెప్తే దానికి గంగిరెద్దులా తలాడించేశాడు. పైగా ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ కరోడ్పతి ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్లా చకచకా చెక్కి పడేశాడు.అప్పుడు ఊ అనేసి ఆ తర్వాత ఏదో నచ్చచెప్పొచ్చులే అనుకున్నాడు కానీ వరం మాటంటే శిలాశాసనమని పెళ్ళయిన నెలరోజులకే తెలిసిపోయింది తనకు. చిన్నప్పటినుండి మంచినీళ్ళ కోసం కూడా వంటింట్లోకి అడుగు పెట్టకుండా పెరిగిన తనకు ఇలాంటి భార్య దొరుకుతుందని కానీ, వంటకు కూడా వంతులవారీ పద్ధతి ఉంటుందని కానీ కలలో కూడా అనుకోలేదు!

ఆలోచిస్తూ అల్మరా వైపు నడిచి అక్కడ ఉన్న వంటల పుస్తకాలు తీశాడు బుచ్చిబాబు. కూర్చుని ఒక్కో పుస్తకాన్నీ చదవడం ప్రారంభించాడు.

***

"థూ! ఇది పప్పా?! కనీసం కుక్కలైనా ముట్టుకుంటాయా?!" గుడ్లురుముతూ ముఖమంతా వికారంగా పెట్టుకుని అడిగింది వరలక్ష్మి."మొదటిరోజు కదా వరం! రాత్రంతా కష్టపడి చదివి, తెల్లవారే మళ్ళీ పుస్తకాన్ని చదివి మరీ చేశాను. నాకూ కొత్త కదా, కొంచెం సర్దుకో వరం!" భార్యను అనునయించే ప్రయత్నం చేశాడు బుచ్చిబాబు.

"ఏంటి సర్దుకోవడం? నీ భయంకరమైన వంటతో మూడ్ ఆఫ్ చేశావ్!" చెయ్యి కడిగేసి చెప్పింది వరలక్ష్మి.

"అలా అంటే ఎలా వరాలూ! ఇవాళే కదా ఫస్ట్ టైం నేను వంట చేసింది! అందుకే సరిగ్గా కుదిరినట్టు లేదు. ఇంకేమైనా మోడిఫై చెయ్యాలంటే చెప్పు. చేస్తాను."

"బాబూ బుచ్చీ... నీకో నమస్కారం. మధ్యాహ్నం మా క్యాంటీన్లో హాయిగా భోజనం చేసేస్తాను కానీ క్యారేజ్ కూడా సర్దకు." హుకుం జారీ చేసింది వరలక్ష్మి.

"సరే అలా పేచీలు పెట్టకు కానీ, రేపు చేసే వంటను బాగా చదివి నేర్చుకుంటాలే!" సర్దిచెప్పాడు బుచ్చిబాబు."మరి సాయంత్రం సంగతేంటి?!" బాణంలా ప్రశ్నను సంధించింది వరలక్ష్మి.

"సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి వండాలంటే నాకూ కష్టమే వరం! కర్రీ పాయింట్ కెళ్ళి మంచి కూరలేవైనా తెస్తానులే."

"మళ్ళీ అదొక ఎగస్ట్రా ఖర్చా?!" కసిరింది వరలక్ష్మి.

"మరేం చేస్తాం చెప్పు? అయినా ఖర్చు పెట్టేది నేను కదా. నీ జీతంలోంచి ఇవ్వొద్దులే!" మనసులో కారాలు మిరియాలూ నూరుతూ, పైకి మాత్రం నవ్వుతూ చెప్పాడు బుచ్చిబాబు.

"సరే ఏదో ఒకటి చెయ్యి. ఏం చేస్తాం!" నిట్టూర్పు ఒకటి వదులుతూ దయతలచింది వరలక్ష్మి.

ఆ తర్వాతి రోజు కూడా అదే తంతు!

"చిక్కుడుకాయ కూర వండడం కూడా రాదా నీకు?! మా అమ్మైతే ఎంత బాగా వండేదో!" బాధగా చెప్పింది వరలక్ష్మి వంట రుచి చూస్తూ."మీ అమ్మ బ్రతికుండగా నువ్ ఆ చిక్కుడుకాయ కూర ఎలా చెయ్యాలో నేర్చుకుని ఉంటే బావుండేది వరాలూ! పాపం ఇప్పుడావిడ స్వర్గంలో దేవతలందరికీ చిక్కుడుకాయ కూర్చ వండి వడ్డిస్తూ ఉంటుందేమో!" బుచ్చిబాబు చెప్పాడు.

"వెటకారానికేమీ తక్కువ లేదు. కూరలో మాత్రం కారం ఎంత వెయ్యాలో కూడా తెలీదు." కోపంగా చెప్పింది వరలక్ష్మి.అలా మరో నాలుగు రోజులు గడిచాయి.

"ఏం కూర బుచ్చీ ఇది?" మొదటి ముద్ద నోట్లో పెట్టగానే వరలక్ష్మి ముఖంలో రంగులు మారాయి. గబగబా మంచినీళ్ళ గ్లాసందుకుని గటగటా మొత్తం తాగేసింది.

"దొండకాయ కూర వరం! ఉల్లికారం పెట్టాను." చెప్పాడు బుచ్చిబాబు.

"ఉల్లికారమా ఉత్త కారమా?! ఏంటీ వంట బుచ్చీ?!" కారం నషాళానికంటుకున్న ఉద్రేకంతో వరలక్ష్మి గొంతు ఇంటి పై కప్పును ఎగరగొట్టేస్తోంది."అలా అరిస్తే నేనేం చెయ్యగలను వరాలూ?! తిరుపతి హుండీలో వేసిన డబ్బుల్ని, కూరలో వేసిన కారాన్నీ మళ్ళీ వెనక్కి తియ్యలేం కదా?!"

"దరిద్రపు లాజిక్కులకేమీ తక్కువ లేదు. బుచ్చీ... రేపే ఆఖరి రోజు! రేపు కనుక కూర చక్కగా వండి పెట్టకపోయావో ఫోర్ ట్వంటీ కేసే నీ మీద! గుర్తుంచుకో!" వార్నింగ్ ఇచ్చి సగం అన్నాన్ని కంచంలోనే వదిలి లేచిపోయింది వరలక్ష్మి. అనుమానం వచ్చి వెనక్కు వచ్చింది వరలక్ష్మి. "అవునూ నువ్వు అన్నం తిన్నావా?!"

"ఈరోజు మంగళవారం కదా వరం! నేను ఉపవాసం." తడుముకోకుండా చెప్పాడు బుచ్చిబాబు, మనసులో ఆంజనేయస్వామికి క్షమాపణలు చెప్పుకుంటూ.

"సరే, గుర్తుంది కదా, రేపే ఆఖరి రోజు నీకు!" విసవిసా నడుస్తూ వెళ్ళింది వరలక్ష్మి.

'హమ్మయ్య సాయంత్రం రెండు ప్లేట్ల ఛాట్ తినేసి రావడం మంచిదయింది!' అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు బుచ్చిబాబు.తెల్లవారింది. వరలక్ష్మి స్నానం చేసి, పూజ ముగించుకుని, బెడ్రూంలో కూర్చుని పేపర్ చదువుకుంటోంది.

"గుడ్మాణింగ్ వరం డార్లింగ్! ఇదిగో 'ఆనంద్ ' సినిమాలాంటి చక్కని కాఫీ!" నాటకీయంగా చెబుతూ కప్పును ఆమె ముందుంచాడు బుచ్చిబాబు.

"బుచ్చీ, ఏంటి ఇవాళ ఇంత సువాసన వచ్చేస్తోంది కాఫీ?! ఉండు రుచి చూస్తాను." అంటూ కొంచెం త్రాగి ఆశ్చర్యంతో కనుబొమలెగరేసింది వరలక్ష్మి. "నువ్వే చేశావా?!" నమ్మశక్యం కానట్టుగా అడిగింది.

"ఇదొక్కటేనా? వంటింట్లోంచి వస్తోన్న జీడిపప్పు ఉప్మా వాసన రాలేదా?!" నవ్వుతూ అడిగాడు బుచ్చిబాబు.

"ఇందాకటినుండీ వస్తోంది కానీ పక్కింట్లోంచి అనుకున్నా బుచ్చీ! ఒక్కరాత్రిలో నువ్వు వలలుడంత వంటకాడిగా మారిపోతావనుకోలేదు!! పద... ఉప్మా ఎలా వండుతున్నావో చూస్తాను!!" ఆశ్చర్యానందాలు కలగలసిన స్వరంతో చెప్పి వంటింటి వైపు దారి తీసింది వరలక్ష్మి.తెల్లవారింది. వరలక్ష్మి స్నానం చేసి, పూజ ముగించుకుని, బెడ్రూంలో కూర్చుని పేపర్ చదువుకుంటోంది."గుడ్మాణింగ్ వరం డార్లింగ్! ఇదిగో 'ఆనంద్ ' సినిమాలాంటి చక్కని కాఫీ!" నాటకీయంగా చెబుతూ కప్పును ఆమె ముందుంచాడు బుచ్చిబాబు."బుచ్చీ, ఏంటి ఇవాళ ఇంత సువాసన వచ్చేస్తోంది కాఫీ?! ఉండు రుచి చూస్తాను." అంటూ కొంచెం త్రాగి ఆశ్చర్యంతో కనుబొమలెగరేసింది వరలక్ష్మి. "నువ్వే చేశావా?!" నమ్మశక్యం కానట్టుగా అడిగింది.

"ఇదొక్కటేనా? వంటింట్లోంచి వస్తోన్న జీడిపప్పు ఉప్మా వాసన రాలేదా?!" నవ్వుతూ అడిగాడు బుచ్చిబాబు."ఇందాకటినుండీ వస్తోంది కానీ పక్కింట్లోంచి అనుకున్నా బుచ్చీ! ఒక్కరాత్రిలో నువ్వు వలలుడంత వంటకాడిగా మారిపోతావనుకోలేదు!! పద... ఉప్మా ఎలా వండుతున్నావో చూస్తాను!!" ఆశ్చర్యానందాలు కలగలసిన స్వరంతో చెప్పి వంటింటి వైపు దారి తీసింది వరలక్ష్మి.

ఆమె వెనుకే తనూ వెళ్ళాడు బుచ్చిబాబు. వంటింట్లో కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది వరలక్ష్మి."కంగారు పడకు వరం! తను వనిత అని మనకు సాయంగా ఇవాళే పనిలో చేరిన వంటమనిషి! ఇంటిపనులు కూడా చాలా బాగా చేస్తుంది." పరిచయం చేశాడు బుచ్చిబాబు.

"నమస్తే అండీ!" రెండు చేతులూ జోడించింది వనిత. సాటి స్త్రీ అయినా కాసేపు కళ్ళు తిప్పుకోకుండా ఆమె వైపే వరలక్ష్మి చూస్తూ ఉండిపోయిన అందం ఆమెది! "నమస్తే. ఇంక నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళిపోమ్మా. అవసరమైతే అయ్యగారు నీకు కబురు పంపిస్తారులే!" అని చెప్పి వనితను పంపించేసింది వరలక్ష్మి.

ఆమె వెళ్ళిపోగానే తేరుకుని బుచ్చిబాబ్ మీద గయ్యిమంటూ అరిచింది వరలక్ష్మి. "వంటమనిషిని పెట్టమని నేను చెప్పానా?!""కానీ ఇవాళే ఆఖరి రోజని, వంటలు రుచిగా లేకపోతే నా మీద ఫోర్ ట్వంటీ కేసు పెడతానని చెప్పావ్ కదా... అందుకని..." నసిగాడు బుచ్చిబాబు."అందుకని వంటమనిషిని పెట్టేసుకుంటావా?! అదీ అంత అందమైన అమ్మాయిని!" వరలక్ష్మి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి.భార్య చెప్పిన రెండో వాక్యానికి ఉప్పొంగిపోయాడు బుచ్చిబాబు. మనసులో నవ్వుకుంటూ, "ఏమయింది వరం?! రాత్రి ఏడున్నర వరకూ పని చేసొచ్చే నీకు ఉదయాన్నే లేచి వండుకునే ఓపిక లేదు. నాకేమో వండడం రాదు. చూశావుగా నా కూరలన్నీ ఎంత చెత్తగా ఉంటున్నాయో?! అందుకే వంటమనిషిని పెట్టుకుంటే ఎలాంటి సమస్యా ఉండదని ఇలా చేశాను. నువ్వలా తనను పంపించేస్తావనుకోలేదు." చెప్పాడు బుచ్చిబాబు.

వంటమనుషుల్లో 'వనిత ' తీరు వేరయా అన్నట్టున్న ఆమెను గురించే ఆలోచిస్తోంది వరలక్ష్మి. అంత అందంగా ఉన్న అమ్మాయిని వంటమనిషిగా పెట్టుకున్నాక భర్త ఆమెతో వెధవ్వేషాలు వెయ్యడన్న నమ్మకం తనకెంత మాత్రమూ లేదు!

తాననుకుంటున్నది ముఖంలో కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ, "వంటమనిషి జీతం నువ్వే ఇచ్చినా సరే, పోయేది మాత్రం మన ఇంట్లోంచే కదా! కాబట్టి మనకు వంటమనిషి అవసరం లేదు."

"కానీ నా వంటలు రుచి చూస్తున్నావ్ కదా!"

"అవుననుకో. నీకు సరిగ్గా వంట చేయ్యడం రావడంలేదు కాబట్టి ఇంకొన్నాళ్ళు నేనే చేస్తాను. ఈలోపుగా నా దగ్గర బాగా నేర్చుకో." చెప్పింది వరలక్ష్మి.

"సరే. నీ ఇష్టం మరి!" ఆనందంగా చెప్పాడు బుచ్చిబాబు, వంటమనిషిగా నటించేందుకు తన చెల్లెలు వనితను పంపిన తన కొలీగ్ కు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ!!

కానీ మరో ఆరునెలలకు కథ మారింది! బుచ్చిబాబుకు వంటొచ్చేసింది! మళ్ళీ అతని చేతికే గరిటొచ్చేసింది!!ఎందుకంటే... వరలక్ష్మి ఆఫీసులో పనిచేసే భాస్కర్ పెళ్ళాడిన అమ్మాయి 'వనితే!'

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ