కిటికీలో చెయ్యి - సి.ఉమాదేవి

kitikeelo cheyyi

రాత్రి కాస్త నిద్ర తగ్గిందేమో విశ్వానికి ఆఫీసులో కూర్చోవాలంటే ఏడుపు తన్నుకొస్తోంది.బడి వదలడానికి సూచనగా గంటకొడ్తే సంచి భుజానవేసుకుని ఇంటికి పరుగెత్తాలనుకునే పిల్లాడి మనసైపోయింది.ఆఫీసు గడియారం వైపు పదే పదే చూస్తున్నాడు.

“ ఏం సినిమాకు వెళ్లాలా?”ఆ రోజు కొత్త సినిమాలు విడుదలయే రోజు కావడంతో సరదాగా అడిగాడు ప్రక్క సీటులోని రాకేష్.

“కాదు తండ్రీ! ఇంటికెళ్లి నిద్రపోవాలి.”ఆవలిస్తూ చెప్పాడు.

“అదేమిటి,మేము చేసే పని తినేసి పడుకోవడమే కదా!నువ్వేమయినా పహరా కాస్తున్నావా?” దొంగల భయానికి కాలనీలలో ,అపార్ట్ మెంట్లలో వంతులేసుకుని ఎవరైనా ఊరెళ్లి వచ్చేదాకా కాపలా కాస్తారు.విశ్వం ఉండే అపార్ట్ మెంట్ విధివిధానాలు తెలిసిన వాడు రాకేష్. అందుకే అనుమానంగా అడిగాడు.

“అదేం లేదు.” కంప్యూటరు షట్ డౌన్ చేస్తూ,రాత్రి జరిగిన ఉదంతం గుర్తుకొచ్చిన విశ్వానికి నవ్వులు మొగ్గలేసాయి.

“చెప్పి నవ్వరాదా నేను ఆనందిస్తా నీతోపాటు!” టేబిల్ సర్ది ఆ వేళకిక పనికి సెలవు ప్రకటించేసాడు రాకేష్.

“ ఏం లేదు రాకేష్, కిటికీలో చెయ్యి గుర్తుకొచ్చింది.”

ఉలిక్కిపడ్డాడు రాకేష్. ఏదో హారర్ మూవీ చూసొచ్చినట్లున్నాడు, అందుకే కాబోలు ఈ ఆవలింతల పర్వం. విశ్వం చెప్పబోయే కథనానికి ఆసక్తిగా ముందుకు వంగాడు.

“ రాత్రి నిద్ర పట్టక రూఫ్ మీద పచార్లు చేస్తున్నాను.వెలుగు, చీకటుల సమ్మేళనం కష్ట సుఖాలను ఏక కాలంలో ఏకరువు పెడ్తున్నట్టుగా ఉంది వాతావరణం. చల్లనిగాలి వీయడం మొదలయింది. అమ్మయ్య ,ఎండ కాలంలో ఎ.సి.లు లేని బడుగు జీవులకు చల్లని గాలి ప్రకృతి అందించే వరమే.” చల్లని గాలి అందించిన అనుభూతిని వివరిస్తున్నాడు విశ్వం.

“ వర్ణనలు సరే, సీరియల్ గా చెప్పేటట్టున్నావ్ ఇలా అయితే.”రాకేష్ లో చిన్నపిల్లాడిలా ఆతృత!

“ టూకీగానే చెప్తాను విను.”

“ఊ...కానీ...”రాకేష్ మరింత దగ్గరగా జరిగాడు.

“అలా తిరుగుతున్నానా, మెల్లగా నిద్ర కమ్ముకొస్తోంది.నిద్రకు మరింత జోలలా గాలి ఊపుతున్నట్లుగా ఉంది.

అంతలో ఎవరో కీచు గొంతుతో పిలిచిన భావన!”

“కీచురాళ్లేమో.”ఠక్కున అన్నాడు రాకేష్.

“అబ్బ కాదు గురూ, ఆ గొంతులో భయం ఉంది. పిలుస్తున్నట్టుగా ఉంది. నేను తొలుత భయపడ్డా, ఏమిటోననుకున్నాను. మెల్లగా చుట్టు పరికించాను. ఆ...అప్పుడు కనబడింది.” తన కథనం లోని ఉత్కంఠ రాకేష్ ముఖంలో ఎలా ప్రతిఫలిస్తుందో చూడాలని ఆగాడు విశ్వం

“ఏమిటి కనబడింది?”గాభరాగా అడిగాడు రాకేష్.

“కిటికీ లో చెయ్యి!”

“చెయ్యా?”

“ఆ...అవును చెయ్యే. రమ్మంటున్నట్టు, వేళ్లు ముడుస్తూ సైగలు.”

“కిటికీలో చెయ్యా? ఏ దొంగ వెధవో ఇంటిలోకి దూరాక, బయట పడే మార్గం లేక, ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నాడేమో!”“

నీ ఊహలు మాని విను. ఆ చెయ్యి మా ప్రక్క అపార్ట్ మెంట్ లో నుండి మా ఇంటికి నేరుగా కనిపిస్తోంది. గబగబా లిఫ్ట్ దగ్గరకు పరిగెట్టి క్రిందకు దిగాను. ప్రక్క అపార్ట్ మెంట్ వాచ్ మాన్ ను అడిగా, ఏమిటో ఎవరో మీ పైన ఫ్లాట్ లో చేతులూపుతున్నారని.”

“ఎవరూపుతారు సార్,ఏ దోమలో ఏవో దులుపుతుంటారు.” వాడినీ నిద్ర పిలుస్తున్నట్లే ఉంది.

“ కాస్త పైకి చూస్తావా?”గట్టిగా అనేసరికి వాడు పైకి చూసి, అమ్మో కిటికీలో చెయ్యి, తాతయ్యగారి స్నానాల గది అది.

“రండి సార్ చూద్దాం.”గాభరా పడ్డాడు. పరుగు లాంటి నడకతో వాడిననుసరించాను.

“షార్ట్ ఫిల్మ్ తీద్దామా?” సినిమా చూపిత్త మామ అంటున్న మనసును అదుపు చేసుకోలేక అడిగేసాడు రాకేష్.

“పాపం పెద్దాయన బాత్రూంలో చిక్కుకు పోతే నీకు సినిమా తీయాలనుందా!”

“ఏం బోల్ట్ పడిపోయిందా? అయ్యో ఈ కొత్త రకాల గడియలు మనకు సరిపోవు కాని అవే పెట్తున్నారు” అమెరికాలోని తలుపులు గుర్తుకు తెచ్చుకున్నాడు రాకేష్.

“పడిపోలేదు నాయనా వేసేసారు.”

“అదేంటి పనిష్మెంట్ లా!” రాకేష్ ముఖంలో అనుమానపు ప్రశ్నలు.

“ ఏంలేదు,ఆయన గదిలో ఎ.సి. పని చేయకపోతే టెక్నిషియన్ ను పిలిపించింది కోడలు. అంతవరకు ఎ.సి. టెక్నిషియన్ వెనకే తిరిగిన పెద్దాయన ‘ఇప్పుడే వస్తా నీ పని చేసుకో ’ అన్నాడు.

“అయిపోయింది సార్ రెండే నిమిషాలు.” అంటూ పని పూర్తి చేయసాగాడు.

“ఎ.సి. రిపేరు పూర్తయాక స్విచ్ వేసాడు.దాంతోపాటు కూలింగ్ పోతుందని కిటికీలు వేసేసాడు.బాత్రూం తలుపు వేసి ఉంది కాని, దాన్ని ఆనుకుని ఉన్న డ్రెసింగ్ రూం తలుపు తీసే ఉంటే కూలింగ్ సరిగా కాదని తలుపు దగ్గరగా లాగి గడియ పెట్టేసి , బయటకు హాల్లోకి వచ్చాడు. అప్పటికే పొద్దు దాటుతోంది.గది నుండి బయటకు వచ్చిన పెద్దాయన కోడలు,’సార్ వచ్చాక కూలింగ్ చూసి డబ్బులిస్తారు, ఇదిగో’ అంటూ చాయ్ పైసలిచ్చి పంపేసింది.

చాయ్ పేరు వింటూనే ‘తరువాత ఏమైందంటూ?’ విశ్వాన్నడుగుతూ, ఆఫీసు కుర్రాడిని పిలిచి చాయ్ తెమ్మని డబ్బులిచ్చాడు రాకేష్.“ ఏముంది? ఎ.సి. వేసి ఉంటే మామగారు కాసేపు పడుకుంటారేమో అనుకుని చప్పుడు చెయ్యకుండా కూచుంది. ఆయన భోజనం, కొడుకు వచ్చే లోపలే ఏడుగంటలకే పూర్తయిపోయింది, పడుకోనీలే పాపం అనుకుంది కాని ఆ ఎ.సి. కుర్రాడు బాత్రూలోకి వెళ్లిన మనిషి బయటకు రాలేకుండా డ్రెసింగ్ రూం బయట గడియ వేసేసాడని ఊహించలేక పోయింది. ఫ్లాట్లన్నాక ఏవో అరుపులు, చప్పట్లు ఉండనే ఉంటాయి.వాటి నడుమ అరచి అరచి గొంతే కీచురాయిగా మారింది పెద్దాయనకు.”

కదలకుండా, మరో మాట లేకుండా వింటున్నాడు, రాకేష్.. కాదు కాదు.. ఆఫీసులో అందరు.

“ కాలింగ్ బెల్లుతోనే కాదు,తలుపు బాది మరీ ఆమెను పిలిచాం. ఆమె తలుపు తీయడం ఆలస్యం పరిస్థితి వివరించి పెద్దాయనను లోపలినుంచి దాదాపు ఎత్తుకొచ్చాము.ఆయన కిటికీలో ఊపిన చెయ్యి తలచుకుంటుంటే ఇప్పుడు నవ్వు వస్తోంది కాని గాభరా పడ్డ ఆయనకేదైనా అయుంటే అని తలచుకుంటే భయమేస్తుంది.నిజమే చిన్న అజాగ్రత్తలే పీకల మీద కత్తులవుతాయి.ప్రతి సంఘటనా బ్రతుకు పాఠమే కదా. చాలాసేపు మాటల్లో పడ్డాము.అజాగ్రత్తలు జాగ్రత్తలు మా చర్చాంశం అయింది.దాంతో నిన్న రాత్రి నిద్ర కాస్త కరువై ,.. ఆఆ ....”ఆవలిస్తూ లేచాడు విశ్వం.

నమస్కారానికి ప్రతి నమస్కారంలా విశ్వం ఆవులింతకు ప్రతిస్పందనగా తను ఆవలించబోయి చేయడ్డం పెట్టుకుంటూ గలగలా నవ్వేసాడు రాకేష్.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ