తాజెడ్డ కోతి - - మౌద్గల్యస

క్.. టక్.. టక్...

తలుపు చప్పుడయ్యింది. మంచి నిద్రలో ఉన్న శార్వరి ఉలిక్కిపడి లేచాడు.

మళ్లీ తలుపుకొట్టిన చప్పుడు.

‘ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఈ సమయంలో వచ్చిన వాళ్లెవరబ్బా’...

కళ్లు నలుపుకుంటూ వచ్చి తలుపు తీశాడు.

ఎదురుగా నలుగురు వ్యక్తులు.

జీన్స్ ప్యాంటు, పైన చారల టీషర్టులు ధరించి ఉన్నారు. వాళ్ల చేతుల్లో బ్రీఫ్ కేసులు.

‘ సీ...బీ..ఐ...’ అన్నారు కోరస్ గా.

శార్వరికి మత్తు దిగిపోయింది.

‘‘ఈ మధ్య సీబీఐ గురించి చాలా సార్లు విని ఉన్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.

ఐ ఎ ఎస్ లు కూడా వీళ్ల దెబ్బకి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

వీళ్ల చూపు నా మీద పడిందేమిటి? ’’


‘‘ మేము లోపలకి రావచ్చా?’’ కరకుగా ప్రశ్నించారు

శార్వరి ఆలోచనలకు అంతరాయం ఏర్పడింది.

గుమ్మం నుంచి కాస్త తప్పుకుని వాళ్లు లోపలకి రావటానికి దారిచ్చాడు.

ఆ నలుగురూ డ్రాయింగ్ రూంలోకొచ్చారు. చేతుల్లో ఉన్న సూట్ కేసుల్ని సోఫాలోకి విసిరేశారు.

‘‘ఏ కాగితాలు చూపించమంటారో? మరేం లెక్కలడుగుతారో?’’

శార్వరి ఆందోళన చెందుతున్నాడు.

భయం వల్ల ఒళ్లంతా చెమట పట్టింది. గొంతు తడారిపోతోంది.

వాళ్లు అవేం చెయ్యలేదు.

నేరుగా వంటింట్లోకి ప్రవేశించారు.

వంటింట్లో కాఫీ పెడుతోంది సమంత.

వాళ్లని చూడగానే ఉలిక్కిపడి... గట్టిగా అరవబోయింది. తన భర్త వాళ్ల వెనగ్గా కనపడటంతో తమాయించుకుంది.

ముందుగా వాళ్లు బియ్యం డ్రమ్ము తెరిచారు. అందులో ఉన్న బియ్యాన్ని తీసి పక్కన కుప్పగా పోసి అడుగున ఉన్న శాటిన్ సంచుల బొత్తి తీశారు.

అందులో నుంచి డజనుకు పైగా బంగారు బిస్కెట్లు, చంద్రహారం, కాసుల పేర్లు, మరికొన్ని ఆభరణాలు బయటకు తీశారు. ఆ తర్వాత వాళ్ల చూపు శనగపిండి డబ్బా పైన పడింది. దానిలోనూ సంచులు, బంగారు ఆభరణాలు... పెసరపప్పు డబ్బా, కందిపప్పు డబ్బా, రవ్వల డబ్బాలు వంటింట్లో దేన్నీ వదలేదు. ఆఖరికి పోపుల డబ్బా కూడా ఖాళీ చేసి దొరికిన బంగారు వస్తువులన్నీ తీసి బయట పడేశారు. ‘‘ ఇన్నాళ్లు కూడబెట్టింది మొత్తం ఊడ్చిపెట్టుకుపోయేటట్టుందే.. అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తుండి పోయే బదులు.. బతిమాలో, బెదిరించో ఈ ఆగడాన్ని ఆపవచ్చు కదా...’’ మనసులోనే భర్తను తిట్టుకుంటోంది సమంత.

‘నీకు బంగారం కావాలా? భర్త కావాలా అంటే.. ఆమె మనసు మొదటి దాని వైపే మొగ్గుచూపుతుంది. ఇంట్లో నగదు కళ్లబడితే దాన్ని బంగారం బిస్కెట్టుగానో, ఆభరణంగానో మార్చేదాకా ఆమెకు నిద్రపట్టదు. ఇప్పుడు కళ్ల ముందు జరుగుతున్నది ఆమెకు భరించరానిదిగా మారింది. శార్వరి అచేతనంగా నిలబడి చూస్తున్నాడు.

వాళ్ల నలుగురూ పూజగదిలోకి ప్రవేశించారు. దేముని మందిరం భారీగా ఉంది.చిన్నపాటి బంగారు సింహాసనం, పళ్లాలు, దీపం కుందులు, అగరొత్తుల స్టాండు, ఉద్దరిణె, గరిటె, గంధం గిన్నె అక్కడున్న వస్తువులన్నీ బంగారంతో చేసినవే.

ఆ వస్తువులన్నీ సర్ది ఓ చోట కుప్పగా పోశారు. తర్వాత బెడ్రూంలోకి నడిచారు. మంచం పైనున్న పరుపును లాగి అవతల పారేశారు.అది స్టోరేజి కోసం ప్రత్యేకంగా రూపొందించింది. పై నున్న అరలను తీసి అందులో ఉన్న సంచులన్నీ బయటకులాగారు.

ఆ మధ్య కేంద్ర మంత్రి కూతురు పెళ్లికి ఆహ్వానం వస్తే సమంత ప్రత్యేకంగా ఆభరణం తయారుచేయించుకుంది. దాదాపు కోటిన్నర విలువైనది. సాధారణంగా ఓసారి ధరించటానికే దాన్ని తయారుచేస్తారు. ఆ తర్వాత జ్యుయెలరీ షాపు వాడికిస్తే మార్చి కొత్తనగగా మార్చి ఇస్తారు. ఇది లేటెస్ట్ ట్రెండు. అయితే అప్పట్లో వీలుకాక ఆ నగని అలాగే ఉంచేసింది.

‘‘ఇది కూడా ఈ వెధవల పాలు పడుతోంది’’ పళ్లు కొటకొట కొరుక్కుంటూ తిట్టుకోసాగింది సమంత.

బీరువా, పుస్తకాల అరలు, వాడేసిన దినపత్రికల అడుగున దేన్నీ వదలటం లేదు. అన్నీ జల్లెడ పట్టి ఎక్కడెక్కడో ఉన్న వాటినన్నింటిని బయటకు లాగుతున్నారు.కుప్పగా పోసిన ఆభరణాలన్నింటిని జాగ్రత్తగా సూట్ కేసుల్లో సర్దుకుంటుంటే.. చేష్టలుడిగి చూస్తుండిపోయాడు శార్వరి.

‘‘ సాయంత్రం ఆఫీసుకొచ్చి వీటన్నింటికి ఆధారాలు చూపించండి. మీరు చెప్పింది సహేతకమనిపిస్తే వాటిని అప్పటికప్పుడే మీకు తిరిగొస్తాం. లేకపోతే కోర్టుకు సమర్పిస్తాం’’.

తిరిగివెళ్లే ముందు గట్టిగా చెప్పారు.శార్వరికి ఏం చేయాలో పాలుపోలేదు.ఇల్లంతా చెల్లాచెదురయిన వస్తువులతో చిందరవందరగా తయారైంది.

ఇప్పుడు పత్రికల వాళ్లు, టీవీల వాళ్లు.. మీడియా అంతా కలసి తన పరువు తీస్తారు.‘‘ఇదంతా అవినీతి సంపాదన... బంగారం ఎంత కూడబెట్టారో చూడండి’’ అంటూ తన ఫొటోతో సహా చూపిస్తారు. గంటలు గంటలు ఇదే సంఘటన మళ్లీ మళ్లీ ప్రచారం చేస్తూ కుటుంబాన్ని మొత్తం బజారున పడేస్తారు’’ కుమిలిపోయాడు శార్వరి. నాలుగేళ్ల క్రితం నాటి సంఘటనలు కళ్లముందు మెదిలాయి. పాత జనరేషన్ కంప్యూటర్లు కుప్పలు తెప్పలుగా గోడౌన్లలో మగ్గుతున్నాయి. వాటిని ఎలాగోలా వదిలించుకోవాలని సదరు కంపెనీ పన్నాగం పన్నింది.ప్రభుత్వంలో కీలకమైన కేబినేట్ సెక్రటరీ స్థాయి అధికారిని పట్టుకుంది. రహస్య మంతనాలు, బేరసారాలు నడిచాయి. ప్రతి వస్తువు కొనుగోళ్లలో సాధారణంగా ముట్టే పది, పన్నెండు శాతానికి అదనంగా ఇంకో పదిదాకా ఇచ్చేందుకు మధ్యవర్తుల ద్వారా ఒప్పందం కుదిరింది.ప్రాజెక్టు విలువ తక్కువేం కాదు. దాదాపు 2, 500 కోట్లు.తిలాపాపం.. తలా కొంచెం.. ఇందులో పాలుపంచుకున్న వాళ్లందరికీ బానే ముట్టింది.

ఓ చిన్న అధికారిగా తను అప్పట్లో డిప్యూటేషన్ పైన ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఫైళ్లు రూపొందించిన తనకి కూడా కొంత పడేశారు.దేశమంతటా కంప్యూటర్ల సరఫరా సాగిపోయింది. ఇంకో పదిశాతం వస్తువులు మిగిలి ఉన్నాయనగా పై స్థాయిలో అధికారమార్పిడి జరిగింది.కొత్తగ వచ్చినతను ఘటికుడు.

‘‘మార్కెట్లోకి కొత్త జనరేషన్ కంప్యూర్లు ఇన్నుండగా..ఇవేం కంప్యూటర్లు... ఇదేం కీబోర్డు.. ఏ...ఎస్..డీ...ఎఫ్ క్రమంలో ఉండాల్సింది ఏ... బీ...సీ ... రూపంలో ఉందేమిటి? ’’ నానాయాగీ చేశాడు.సహచరులంతా నచ్చచెప్పారు.‘‘ బాబూ.. నాలుగయిదేళ్లలో ఉద్యోగాలు వదిలేసి మూటా ముల్లె సర్దుకుని పోవలసిన వాళ్లం. కుటుంబ బాధ్యతలు అనేకం ఉన్నాయి. ఈ లోపు నాలుగురాళ్లు వెనకేసుకుందాం. అనవసరంగా గొడవ చేయక. కంపెనీ వాళ్లతో మాట్లాడి నీకూ ఏదో సర్దుబాటుచేస్తాం’’. అన్నారు.

అతను ససేమిరా అన్నాడు.‘‘ అసలు ఒప్పంద పత్రంలో వాళ్లు చెప్పిందేమిటి? జరిగిందేమిటి? వెంటనే ఒప్పందం రద్దు చేసుకోవాలి. కంపెనీ తన సొంత ఖర్చుతో సరఫరా చేసిన కంప్యూటర్లన్నింటిని వెనక్కి తీసుకోవాలి’’ అంటూ ప్రభుత్వానికి నాలుగు పేజీల లేఖ రాశాడు. ప్రభుత్వం శాఖల్లో ఫైళ్లు, కాగితాలే మాట్లాడతాయి. ప్రశ్నిస్తాయి. నిలదీస్తాయి. చివరికి గుదిబండలై మెడకు చుట్టుకుంటాయి.

కేంద్రంలో ప్రభుత్వం మారింది.. బహుశా ఆ ఫిర్యాదు సీబీఐకి చేరినట్టుంది. ‘‘.. అయినా.. పెద్ద పెద్ద తిమింగలాలను వదిలి తన లాంటి చిన్న చేపకు వలవేశారేంటి?’’ శార్వరి కుమిలిపోయాడు.

ఇద్దరూ తేరుకుని ముందు కాఫీ తాగారు. ‘‘ వీలయినంత త్వరగా దీన్లోంచి బయటపడాలి. సాధ్యమయినంత త్వరగా సీబీఐ ఆఫీసుకు వెళ్లాలి ’’ అనుకున్నారు.

టీవీ ఆన్ చేసింది సమంత. ఏ ఛానల్లోనూ ఈ విషయం రావటంలేదు. గోరంతలు కొండతలు చేసి నానారచ్చా చేసే టీవీవాళ్లు...సీబీఐ దాడులను విస్మరించటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆమెకి.

ఈ విషయం ఇంకా బయటకు పొక్కలేదు. సీబీఐ వాళ్లు ప్రెస్ మీట్ విషయాన్ని కక్కేలోపు తను ఇందులో నుంచి బయటపడాలి. ‘‘ కాళ్లు పట్టుకుని బతిమాలో,బామాలో, లేకపోతే అక్కడున్న అధికారులను డబ్బుతో కొనేశో....’’ దృఢంగా అనుకున్నాడు శార్వరి. అదే మాట భార్యకీ చెప్పాడు.

‘‘ పోయిన బంగారం అంతా తిరిగిచ్చేటట్టు చూడండి.’’ మరికాసేపట్లో వాళ్లిద్దరూ ప్రయాణిస్తున్న కారు రోడ్డెక్కింది.ఆ నగరంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట ఉంటాయి.కారును రోడ్డుకు దూరంగా ఓ మూలగా పార్కుచేసి భార్యాభర్తలిద్దరూ కాలినడకన అక్కడకి చేరారు.తమకు కావలసిన కార్యాలయాల గురించి వెతకసాగారు.

కాంప్లెక్సు అంతా రెండు మూడుసార్లు అటూఇటూ కలియతిరిగారు. ఎక్కడా సీబీఐ పేరుతో కార్యాలయం కనిపించలేదు.ఊరుబయట కొత్తగా కొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలు కట్టిన విషయం గుర్తుకొచ్చింది.అక్కడకి కూడా వెళ్లి వెతికారు.తనను గుర్తించే అవకాశం లేని కార్యాలయం దగ్గర ఆగి నిర్ధారించుకున్న తర్వాత విషయం అర్ధమైంది.‘‘ మీరెందుకు ఈ కార్యాలయం గురించి వాకబు చేస్తున్నారో తెలుసుకోవచ్చా...’’ కఠినంగానే అడిగాడు అక్కడి ఉద్యోగి. ఆ తర్వాత చెప్పాడు.

‘‘ ఈ ఊరిలో సీబీఐ కార్యాలయం ఉండదు’’ స్పష్టం చేశాడు.

తలతిరిగిపోయింది శార్వరికి.

‘‘ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ... సీబీఐ గురించి తనకు తెలియకపోవటమేటి?’’

వచ్చిన వాళ్లు సీబీఐ అన్నారా?

ఏసీబీ అంటే.. తనేమయినా పొరపాటుగా విన్నాడా?’’

ఆ రాత్రంతా ఇద్దరూ కంటిముందు కునుకులేకుండా గడిపారు.

మరో రెండ్రోజులు గడిచాయి.

మూడో కంటికి ఈ విషయం తెలియలేదు.

‘‘ పోనీ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే..’’ పోయిందానిలో కొంచెంకాకపోతే.. కొంచెమయినా వెనక్కితిరిగొస్తుంది’’ భర్తకు సూచించింది.గయ్ మన్నాడు శార్వరి.

‘‘ అమ్మో వద్దొద్దు..

ఈ బంగారం ఎలా కూడబెట్టావని ఆరాతీస్తే..

ఆదాయం పన్ను అధికారులు, ఆ తర్వాత విజిలెన్సు వాళ్లు ...

ఒకరితర్వాత మరొకరు వచ్చి ప్రాణం తీస్తారు.

అసలే నాకు డిపార్టుమెంటులో శత్రువు లెక్కువ.

మూకుమ్మడిగా కలసి సర్వనాశనం చేస్తారు’’ వివరంగా చెప్పాడు.

‘‘ అయితే.. మనం చేయగలిగిందేమీలేదన్నమాట’’ నిస్పృహగా అడిగింది.

అవునన్నట్టుగా తలాడించాడు శార్వరి.

‘‘ సీబీఐ అని చెప్పి.. ఎంత తెలివిగా దోచుకుపోయారు.

వాళ్లు ఇళ్లంతా ఊడ్చిపెడుతుంటే...

తెలివితక్కువగా కళ్లప్పగించి చూస్తుండిపోయాడు తను.

స్టూవర్టుపురం ముఠా ఇలాగే దోపిడి చేస్తుందట.

బీరువాల్లో కాకుండా..పప్పూ ఉప్పు దాచుకునే చోట్లన్నీ గాలిస్తారట.

తమ ఇంట్లో బంగారం ఉందన్న విషయం తెలిసి.. పట్టపగలు వచ్చి దర్జాగా దోచుకుపోయారు ఆ నలుగురూ.’’ కోపం, బాధ, అన్నీ ఒకేసారి దాడిచేశాయి శార్వరిపైన.

‘‘ బంగారం పోతే పోయింది. మళ్లీ సంపాదించుకోవచ్చు...

వచ్చిన వాళ్లు నాలుగుతన్ని కాళ్లూ కీళ్లు విరిచేసుంటే...

హమ్మో ఇంకా ఏమయినా ఉందా?’’

తనకి తనే సర్దిచెప్పుకున్నాడు.

మరికాసేపటికి పోయిన బంగారం గురించి ఆలోచించటం మానేసి.. కొత్తగా సంపాందించటమెలా అన్నది అతని మెదడు ఆలోచించటం ప్రారంభించింది. అతను అవినీతిలో ఆరితేరిన వాడు మాత్రమే కాదు. చాలా తెలివైన వాడు కూడా.

‘‘ అర్జంటుగా ఉన్న సీట్లో నుంచి మారాలి. ఈ మధ్య ఇరిగేషన్ కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్సులిస్తోంది ప్రభుత్వం. ఆ సీటు దక్కితే ఐదారు నెలల్లోనే మళ్లీ సంపాదించవచ్చు.’’ అనుకున్నాడు.

ఎవరెవరిని పట్టుకుంటే పనవుతుందో..

గబగబా లెక్కలేయటం ప్రారంభించాడు. ఇవేమీకాకపోతే ఏదయినా పెద్ద ప్రాజెక్టు పట్టాలి. డిప్యూటేషన్ కి వెళ్లయినా ’’ పట్టుదలగా అనుకున్నాడు. బాగా పరపతి ఉన్న తన ఊరు సర్పంచి మొదలు పెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి పి.ఏ., పేరుమోసిన కాంట్రాక్టర్లు, పొలిటికల్ బ్రోకర్లు.. ఇలా ఎవరినీ విడిచిపెట్టలేదు. అందరికీ తలో మాటా వేశాడు. పని పూర్తయితే తనెంత ఇవ్వగలడో కరాఖండీగా చెప్పేశాడు.

‘‘ఈ ప్రపంచంలో డబ్బుతో పొందలేనిది లేదు. తెల్లవారేటప్పటికల్లా ఏదో ఒకటి వర్కవుట్ అయి తీరుతుంది.’’ ఆ రాత్రి ధీమాగా అనుకున్నాడు శార్వరి.

భర్త చేస్తున్న ప్రయత్నాలు చూసి సంబర పడింది సమంత.‘‘ మరేం ఫరవాలేదు. తన ఇల్లు బంగారంతో మళ్లీ కళకళలాడితీరుతుంది’’ సంతృప్తిగా అనుకుంది.

మళ్ళీ సమాజం మీద దండయాత్రకు బయలుదేరాడు శార్వరి...తాజెడ్డ కోతి వనమెల్ల చెరచడానికి బయలుదేరినట్టు...బురదలో పొర్లాడిన పంది, వీధులన్నీ మురికిమయం చెయ్యడానికి బయలుదేరినట్లు......

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు