పడమటి కొండల దిగువున శర్మిష్టుడనే ముని తన శిష్యులతో పాటు నివసిస్తూండేవాడు..
ఆయన శిష్యులు ఆశ్రమానికి చుట్టుప్రక్కల కొంత ప్రాంతాన్ని సాగు చేసి తమకు కావలసిన అంపరాలు పండించేవారు. ఆ కారణంగా వారికి భిక్షకంటూ గ్రామాల్లోకి వెళ్ళవలసిన అవసరం కలిగేదికాదు. ప్రశాంతంగా ధ్యాన, జపాది కార్యక్రమాలు నిర్వర్తించబడుతూండేవి. కాని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు మాత్రం తరచుగా ముని దర్శనానికి వస్తుండేవారు. వచ్చిన వాళ్ళు తమకుగల సమస్యలను ఏకరువు పెట్టి తగిన పరిష్కారం సూచించమని కోరుతుండేవారు.
శర్మిష్టుడు వారి సమస్యలు వినడం ఒక బాధ్యతగా భావించేవాడు. నిజానికి వారి సమస్యలు అంత జఠిలమయినవీ, పరిష్కరించుకోనలవి గానివి గా వుండేవి కావు. శర్మిష్టుడు ఎవరినీ ఏవిధమయిన పరిష్కారాలు, పరిహారాలు గట్రా సూచించేవాడు కాదు. కాకపోతే, ఎవరంతట వారే తమ సమస్యలను పష్కరించుకునే పరిజ్ఞానం మాత్రం కలిగిస్తుండేవాడు. అందుకు ఆయన వారికి ఏదో ఒక పని అప్పగిస్తుండేవాడు. ఒకసారి వేర్వేరు గ్రామాల నుండి రామేశం, వీరేశం అనే వ్యక్తులు ముని దర్శనానికి వచ్చారు. మొదట రామేశం మునితో తన సమస్యను ఇలా విన్నవించుకున్నాడు. " స్వామీ ! నేనొక మధ్యతరగతి గృహస్తుడ్ని. ఒక కచేరీలో గుమాస్తా ఉద్యోగం చేస్తూ వచ్చిన దానితో తృప్తిగా జీవిస్తుండేవాడిని. కానీ, ఈమధ్య ఎలా జరిగిందో తెలీదు, పని చేస్తున్న చోట కొంతమంది దుస్ట స్నేహితులు నాకు జత అయ్యారు. దానితో త్రాగుడూ, జూదము వంటి దురలవాట్లు నాలో చోటు చేసుకున్నాయి. ఇంకేముంది, పూర్తిగా అప్పులపాలయిపోయాను. ఇక గృహంలో శాంతి సౌఖ్యాలు కరువయి పోయాయి. ఈ చెడు సావాసాలు మానుకొని, పూర్వంలా బ్రతకాలని నాకెంతో కోరికగా వుంది. కాని అది ఎలా సాధ్యమవుతుందో తెలియడంలేదు.! దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.!!" అని ముగించాడు.
తర్వాత వీరేశం తన వంతు అందుకున్నాడు. " నాకు రాఘవుడని పన్నెండేళ్ళ కొడుకున్నాడు. ఒక్కగానొక్క నలుసని వాడిని ఎంతో గారం చేశాము. చిన్నప్పటినుండి వాడు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. దానితో వాడు ఏకుమేకై కూర్చున్నాడు. చదువు సంధ్యల మాట ప్రక్కనుంచి, బొత్తిగా ఆకతాయిగా తయారయాడు. నాకు కాస్త కోపం ఎక్కువ. ! సహనం తక్కువ!! ఈ మధ్య వాడి ఆగడాలు భరించలేక చేయి చేసుకోవడం మొదలెట్టాను. దానితో వాడు అలిగి ఇల్లు వదిలి వెళ్ళడం, తిరిగి వెతికి పట్టుకరావడం, ఆనవాయితీగా మారింది. నా కుమారుడ్ని మంచి మార్గంలో పెట్టే ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామీ !" అని కళ్ళనీళ్ళపర్యంతం అయ్యాడు.
అంతా శాంతంగా విన్న శర్మిష్టుడు మొదట రామేశాన్ని తీసుకొని, ఒక బీడు పట్టిన పొలం వద్దకు వెళ్ళాడు. పొలంలోని కలుపు మొక్కలను ఏరివేయమని ఆదేశించాడు. తర్వాత వీరేశం చేతికి ఒక గొడ్డలి ఇచ్చి, కొండ సానుపులో పిడుగుపాటుకు గురై ఎండి మ్రోడయిన పెద్ద మ్రాను వద్దకు తీసుక వెళ్ళి, ఎండు కొమ్మలు నరికి, ఆశ్రమానికి కావలసిన వంట చెఋఅకు చేరవేయమని చెప్పాడు. పచ్చని చెట్టును పొరపాటున కూడా నరకవద్దని హెచ్చరించి వెళ్ళాడు.
ముని ఆదేశం మేరకు రామేశం, పొలంలోని కలుపును చకచక ఏరివేయడం ఆరంభించాడు. వీరేశానికి మాత్రం మ్రాను కొమ్మ నరకడం మహా ప్రయాసగా మారింది. కొండ ప్రాంతంలో ఇన్ని చెట్లు ఉండగా, ముని ఈ చెట్టే నరకమని ఎందుకన్నాడో ! తనకేదైనా పరిష్కారం దొరుకుతుందని వస్తే, ఆశ్రమానికి వంట చెఋఅకు అందించే పని తగిలింది.అని వీరేశం విసుక్కున్నాడు. అయినా ముని ఆజ్ఞాపించాడు కనుక లేని ఓపిక తెచ్చుకుని మెల్లిగా నరకడం ప్రారంభించాడు. ఇలా వాళ్ళిద్దరు మరో రెండు రోజులు తమకప్పగించినపని చేయవలసి వచ్చింది.మూడవరోజు పొలం వద్దకు వచ్చిన రామేశానికి, అంతవరకు తను కలుపు ఏరివేసిన ప్రాంతంలో మంచిమొక్కలు ఏపుగా పెరిగి నవనవలాడుతూ కనిపించాయి. ఔరా.! ఈ కలుపు మొక్కలు మంచిమొక్కలకు ఎంత చేటు తెచ్చాయి!! ఈ కలుపు మొక్కల లాంటి వాళ్ళే కదా తన చెడ్డ స్నేహితులు !! వాళ్ళని మొహమాటం లేకుండా దూరంగా వుంచగలిగితే తన జీవితం బాగుపడుతుంది కదా! ఈ విషయం తెలుసుకోవడానికే ముని తనకీపని అప్పగించాడు అని అతనికి అర్థమయింది.
ఇక వీరేశం కూడా మూడవరోజు తాను నరికిన పెద్ద కొమ్మల మోపు చూసి, తనేనా, ఇన్ని కొమ్మలు నరక గలిగింది?! తనలో ఇంత ఓపిక ఎలా వచ్చిందని తెగ ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ ఎండిన మ్రాను లాంటి వాడే తన ఎదిగిన కొడుకు కూడాను.! మొక్కై వంగనిదే మ్రానై వంగునా అని వూరికే అన్నారా? చిన్నతనంలోనే వాడిని దారిలో పెట్టకపోవడం తను చేసిన పెద్ద పొరపాటు. ఇప్పుడు వాడ్ని మంచిమార్గంలో పెట్టాలంటే తనకెంతో ఓపిక, సహనం అవసరం.!! ఈ విషయం గ్రహించాక అతడు తేలిక పడ్డ మనసుతో ముని వద్దకు వచ్చాడు.
అదే సమయంలోనే రామేశం కూడా ముని వద్ద సెలవు తీసుకోవడానికి వచ్చాడు. శర్మిష్టుడు ఇద్దరివైపు చూసి, " నాయనలారా! ఈ ప్రపంచంలో పరిష్కరించలేని సమస్య అంటూ వుండదు. సమస్య అంటూ వుంటే దాని పరిసరాల్లోనే పరిష్కారమూ వుంటుంది. కాకపోతే ఎవరంతట వారే దాన్ని వెతికి పట్టుకోగలగాలి. ! అది మీకు తెలియాలనే, మీకు తగిన పనులు అప్పగించాను.! అన్నాడు చిరునవ్వుతో. రామేశం, వీరేశం, మునికి కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నారు.