ఆమాల్ కు చాలా నెర్వస్ గా వుంది. జీవితంలో యింత టెన్షన్ ఎప్పుడూ అనుభవించ లేదు. టెన్త్ పరిక్షలు రాసి కూల్ గా అమ్మమ్మ వాళ్ళ వూరు వెళ్లి కజిన్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసోచ్చాడు. ఇంటర్, ఎంసెట్, ఐ ఐ టి పరిక్షలన్ని ముగించి ఢిల్లీ లో వున్న మామయ్య వాళ్ళింట్లో వుండి ఇండోర్, ఔట్డోర్ గేమ్స్ తో పాటు సినిమాలు, షికార్లు చేసి,రిసల్ట్ గురించి ఒక్క సారి కూడా ఆలోచన చేయలేదు, ఐ ఐ టి చెన్నై లో సీట్ వచ్చాక నాలుగేళ్ళలో చదువు కూడా ఏనాడు ఇబ్బంది పెట్టలా! వుద్యోగం వెంట పడి వచ్చింది ....ఆపై.వుద్యోగం లో కూడా చెప్పుకోదగ్గ సమస్య లేదు...నాలుగేళ్ళలో రెండు ప్రమోషన్లతో...మంచి జీతం తో చాలా కంఫర్టబుల్ గా వున్నాడు ....ఏ రకమైన వత్తిళ్ళు లేని అతని జీవితం లోకి ...ఈ తన్వి వచ్చి ఆమాల్ ను కష్టాల సుడిగుండం లోకి నెట్టింది. కాలేజి లో స్నేహితులంతా ప్రేమలో పడి కొట్టుమిట్టాడుతుంటే ఆమాల్ నవ్వుకునే వాడు . ప్రియురాళ్ళ ముచ్చట్లు తీర్చలేక అప్పుల పాలయ్యే స్నేహితులకు కొంతలో కొంత సహాయం చేసి...ఆపై ఎంత హితబోధ చేసినా...మారని స్నేహితుల్ని చూసి జాలి పడే వాడు. అమ్మాయిల వెంట తిరుగుతూ చదువు ఎత్తిపెట్టి పేపర్లన్నీ పెండింగులో పెట్టె వాళ్ళను తిట్టేవాడు...'నీకూ మాలా భాధలు కలుగుకాక' అని చాలా మంది శపించినా, ఆమాల్ కు అంట్లాంటి వికారం కలగనే లేదు. స్నేహితులంతా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని ...నీ సంగతేంటని అమ్మా నాన్న అడిగితే ఆలోచనలలో పడ్డాడు అమాల్.
జీవిత భాగస్వామి పై అతనికి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు వున్నాయి.బాపు బొమ్మలా కాకపోయినా బాపు సినిమాలో హీరోయిన్ లా నిండుగా వుండి, బారెడు వాలుజడ ఖచ్చితంగా వుండాలని ,జీరో సైజ్ అంటూ ఎముకల గూడులా కాకుండా చబ్బి చీక్స్ తో పాటు డింపుల్ చిన్ కాకపోయినా బుగ్గ మీద మాత్రం నవ్వితే సొట్ట పడాలని ఎప్పుడో నాన్న చూస్తున్న 'అనుపమ' సినిమా లో షర్మిలా టాగోర్ ని చూసి నిర్ణయించుకున్నాడు. అతని క్లాసు మేట్స్ లో ఆ లక్షణాలు వున్నాయో లేవో అతను గమనించనే లేదు. అతని ధ్యాసంతా చదువు పైనే వుండేది , అమ్మాయిలతో మాట్లాడినా అతనికి పెద్ద జెండర్ ఫీలింగ్ వుండేది కాదు. చదువుకు సంభందించిన డిస్కషన్ కు అతను అమ్మాయిల్నిఅబ్బాయిల్ని ఒకేలాచూడటం అతనికి 'ఐ ఐ టి' నేర్పిస్తే, అమ్మాయిల్ని గౌరవంగా చూడటం, అతి చనువు ప్రదర్శించకుండా వుండడం అతని కుటుంబం నేర్పింది. అమాల్ కు తనకు కావాల్సిన లక్షణాలు వున్న అమ్మాయి ఎక్కడా కనపడలా! తనతో పాటు పని చేసే వాళ్ళలో చీర తో అటుంచి చుడిదార్ వేసుకునే వాళ్ళేలేరు. అమాల్ అతని అమ్మలా, వదినలా భారతీయత కల్గిన స్త్రీ కోసం వెతికి వెతికి దిగులు పడిపోయాడు. తనకు నచ్చిన తర్వాత, పరిచయం చేసుకుని ..అభి ప్రాయాలు తెలుసుకుని తర్వాత ప్రపోస్ చేసి, ఆమె అమ్మ నాన్నలకు, ఇతని అమ్మ నాన్నలకు తెలియ చేసి, ఆ తర్వాత ప్రేమ లేఖలు లాంటి మేసెజ్ లు ఇచ్చుకుని, విరహం లాంటి ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేసి, కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకోవాలనే అతని వూహ ఊహగానే ఉండిపోయింది. చేసేదిలేక ఇక అన్న వదిన, అమ్మానాన్నలకే అమ్మాయిని వెతికే పని అప్పచెప్పాడు.
ఈలోగా ప్రాజెక్ట్ వర్క్ కోసం రెండు నెలలు చికాగో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే అతని వదిన సుజన అనే అమ్మాయి ఫోటో నెట్ లో పంపారు.అమ్మాయి బావుంది కానీ బాపు హీరొయిన్ లా లేదు ...చుడిదార్ వేసుకున్నాఆ హెయిర్ స్టైల్ చూడగానే జీన్స్ లో వుంటుంది, పెళ్లి చూపుల ఫోటో కి అలా తీసి పంపారు అనిపించింది. వదిన రమ తో ఆ మాట అంటే,
"ఇంక ముత్యాల ముగ్గు హీరొయిన్ సంగీతకు కూతురుందేమో చూద్దాం. పెళ్లి పుస్తకం హీరొయిన్ దివ్యవాణికి, ఆమనికి, స్నేహ కు కూడా పెళ్ళైపోయింది, .ఇంకా బాపు శ్రీ రామరాజ్యం హీరోయిన్ నయన తార , ప్రభుదేవాను వదిలేసింది ,.ఇంకా చార్మికూడా బాపు హీరోయిన్ ట్రై చేద్దామా నీ వయసే " అంది.
"వద్దు బాబోయ్....ఆ నయనతార .... చార్మి..వద్దు వద్దు" అన్నాడు.
"బాపు గారి సినిమాలో మేకప్ లో అలా వుంటారు,ఈ అమ్మాయి ని నీకిష్ట మైనట్లు మలుచుకోవచ్చు కదా"అంది.
ఏదో అసంతృప్తి వెంటాడినా ..నా ఇష్టాలు తెలిసిన వాళ్ళే కదా నాకు నచ్చేట్టు ఉంటేనే కదా వీళ్ళు కూడా ఒప్పుకునేది అనిసరి పెట్టుకున్నాడు.
మళ్ళి "నేను వచ్చి చూసాక చెబుదాం" అన్నాడు
"నీవు వచ్చే వరకు ఆగమంటే ఎలా ? నచ్చింది కదా మళ్ళి రెండు నెలలవరకు వాళ్లకు ఏమీ చెప్పక పోతే ఎలా? ఓకే చెప్పేద్దాము, నీకు తప్పకుండా నచ్చుతుంది ...కావాలంటే సుజన తో మాట్లాడు" కోప్పడింది వదిన.
ఆమాల్ కు సుజన తో మాట్లాడి నప్పుడు కూడా ఏదోలా అనిపించింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే బాగానే మాట్లాడింది.కొంచం కొంచం ఇష్టం అయ్యింది సుజన అంటే, ఎంతయినా కాబోయే భార్యకదా ఫీలింగ్స్ తెచ్చుకోవాలి అనుకున్నాడు.
"సుజన ఎలా వుంది?" అడిగాడు వదినతో.
"ఇంప్రూవ్ అయావు.. ఎయిర్ పోర్ట్ కి తీసుకురానా ?"అంది.
"వస్తుందా!" "ఆశగా అన్నాడు.
" ట్రై చేస్తా.. మీ అన్నయ్య తొ నేను వస్తే తీసుకు వస్తా .."అంది.
కానీ ఎయిర్ పోర్ట్ కి ఆమాల్ అన్నయ్య ఒక్కడే రావడం తో ఆమాల్ కాస్త నిరాశ పడ్డాడు.
కార్ దిగి లగేజ్ సంగతి కూడా చూడకుండా ఆమాల్ ఇంట్లోకి పరుగు తీసాడు అమ్మని చూడక ఎంతో కాలమైనట్లుంది. ఎదురుగా వస్తున్న అమ్మాయి కి డీ కొట్టాడు ..తల పట్టుకున్న అమ్మాయి కోపంగా చూసింది ఆ తర్వాత ఆమాల్ ఆ ఇంటి అబ్బాయే అనుకుని సారీ చెప్పి మెల్లిగా ప్రక్కకు తప్పుకుని వెళ్లి పోయింది. ఒక్క క్షణంలో ఆమాల్ కు తల తిరిగింది. డీ కొట్టడం వలన కాదు ...తన ఊహల ఊర్వశిని క్షణంలో వెయ్యోవంతులో గుర్తు పట్టాడు .ఒక వేళ ఈమే సుజన కాదుకదా ... వుహూ ..ఆ పెద్ద జడ ..ఆ గుండ్రటి ముఖం ఆ పెద్ద బొట్టు, నవ్వలేదే... నవ్వితే బుగ్గలపై డింపుల్ పడుతుందా! చుట్టూ అందరూ చేరి కబుర్లు మొదలెట్టినా ఆమాల్ గుండె వాలుజడ చిన్న దానితో వెళ్లి పోయి, అన్య మనస్కంగానే వున్నాడు. సుజన చర్చ రానే లేదు,వదిన ను ఆ అమ్మాయి ఎవరో అడుగు దామని అనుకున్నాడు కానీ రమ ఒంటరిగా దొరక లేదు.
అమ్మ వొడిలో పడుకుని ముచ్చట్లు చెబుతున్నఆమాల్..".రమక్క లేరా ఆంటీ ?" అని సంశయంగా ఆగిన ఆ అమ్మాయిని చూసి గభాల్న కూర్చున్నాడు.
"ఈ అమ్మాయి రమ కు డిస్తంట్ కజిన్, తన్వి, మైక్రోబయాలజీ లో PhD చేస్తోంది, మా అబ్బాయి ఆమాల్ బెంగుళూర్ లో జాబ్ చేస్తాడు " తల్లి పరిచయం చేయడంతో
"హలో'అన్నాడు.
"హలో "..అని డీ కొట్టింది గుర్తు వచ్చి కాబోలు నవ్వింది.
హిప్ .హిప్ హుర్రే అని గట్టిగా అరవ బోయి తమాయించుకున్నాడు. నవ్వగానే ఆమె ఎడమ బుగ్గపై పడిన డింపుల్ అతన్నిఆకాశo లో విహరింపచేసి, ఈ మగువ సుజన కాదు అన్న తలపు దభాల్న భూమ్మీద వచ్చి పడేసింది.
రమ, తన్వి గొంతు విని గది లోపలి నుండే, "రా లోపలి, నోట్స్ రాస్తున్నా "అంది .'ఎక్జ్క్యూజ్ మీ" అని లోపలి వెళ్ళింది తన్వి. లోపలి నుండి ఒకటే నవ్వులు .సుజన ను తీసుకొస్తానని చెప్పిన వదిన ఆ ఊసే తేలేదేమిటి అనుకున్నాడు. ఆమాల్ కు ప్రపంచమంతా తన్విలా అనిపించసాగింది. దేని మీద ద్యాస కలగలా! వదిన తన్విని అలా గదిలోనే ఉంచేయడం నచ్చలేదు , తన్వి బయటికి వస్తుందేమోనని అతని కళ్ళు రమ గది కేసి చూస్తూండిపోయాయి.అతనికి అర్థమైంది ప్రేమ అంటే ఎలావుంటుందో ! స్నేహితుల శాపాలు ఫలించాయి. తొలి చూపులో ప్రేమ లో పడ్డం సాధ్యమా! అనుకునే వాడు ఏదీ తన వరకు వస్తే గాని అర్థం కాదు. ఇపుడు అర్థమైంది ప్రేమంటే ! మనసంతా ఆమే! ఆలోచనలన్నీ ఆమె గురించే ...తన్వి ఎంత మంచిపేరు ! కానీ సుజన తో పెళ్లి కి వొప్పుకున్నాడే ...ఇప్పుడు ఇంకో నచ్చిన అమ్మాయి కనపడిందని, మాట ఇచ్చిన అమ్మాయికి మోసం చేయడం తగునా! మధన పడుతున్నాడు ఆమాల్.
బోజనానికి తన్వి కూడా కూర్చుంది ఆమాల్ కి ఎదురుగా. రమ ఆమాల్ ఫీలింగ్స్ కనిపెట్టింది... ఏదో తేడాగా వున్నాడనుకుంది. "తన్వి... మా ఆమాల్ ఇంకో వారం ఉంటాడు పాపం ఎవరూ స్నేహితులు లేరు, నేను మీ బావ కాలేజ్ కి పోతే మామ గారు ఆఫీసుకు వెళితే అత్తయ్య ఒక్కటే వుంటారు, ఎలాగూ నీవు కూడా ఉంటావుగా ఇంకో వారం, కొంచం కంపెని ఇవ్వు"
"ష్యూర్ అక్కా" అంది కానీ తన్వి పెద్దగా మాట్లాడ లేదు.
రమ తీరిగ్గా వుండగా "సుజన రాలేదా మీరు చెప్పారుగా నేను వస్తున్నానని ..తను రాలేదేం ?" అన్నాడు."ఓహ్ మర్చిపోయా! తను వూర్లో లేదు ఏదో మారేజ్ కి వెళ్ళింది. రాగానే కాల్ చేస్తానన్నది. అంది."
తన్వి, రమ,క్యారమ్స్ ఆడ దామన్నారు, ఆమాల్ అమ్మగారుకూడా ఓకే అన్నారు. ఆమాల్ ని కూడా ఆడమన్నారు. తన్వి ఆమాల్ ఒక జట్టు, రమ, అమ్మగారు ఒక జట్టు ...ఎప్పుడూ వోడిపోయే ఆమాల్ విజ్రుంభించి ఆడాడు. తన్వి కూడా కమాన్ ఆమాల్ బ్లాక్ వెయ్యి, రెడ్ వెయ్యి అంటుంటే వేసేయ్య గలిగాడు. అతనికి తన్వి మాట వేదంగా అనిపించింది. జీవితం అంతా క్యారమ్స్ గేం ఆడుతూ ..తన్వీని చూస్తూ గడిచిపోతే చాలనిపించింది ఆమాల్ కు. వారం గడిచి పోయింది. తన్వి హైదరాబాద్ వెళుతున్నానని చెప్పింది ..ఇంట్లో ఆందరూ తన్వి ని ఇష్టపడతారు అందరితో సరదాగా వుంటుంది.ఆమాల్ కి కూడా జాయినింగ్ టైం అయిపోతోంది ..ఆమె అంటే ఇష్టమని తన్వి తో చెప్పెయ్యాలి...అనుకున్నాడు. కానీ సుజన.. ? తను చూడని, కలవని అమ్మాయి కోసం తన కలల కన్యను వదులు కోవడమా! ధర్మ సందేహం ఒక ప్రక్క, ప్రేమించిన అమ్మాయికి ప్రేమ వ్యక్త పరచలేని నిస్సహాయత ఒక ప్రక్క ...సంఘర్షణ, అనిశ్చిత స్థితిలో...మరీ ఆలోచించడానికికూడా సమయం లేదు .... తన్వి రేపు వెళ్లి పోతుంది.ఇవాళ చెప్పలేక పోతే ..ఇంక అంతే ఫోన్ లో ఆమెకు ఆన్ని వివరాలు చెప్పడం, ప్రపోస్ చెయ్యడం అబ్సర్డ్ గా ఉంటుందేమో కూడా ...! ధైర్యే ....సాహసే...తన్వి అనుకున్నాడు.
"మీతో మాట్లాడాలి" ...రమ లేనప్పుడు అన్నాడు.
"చెప్పండి " అంది.
"ప్లీజ్ ఇక్కడ కాదు బయట"
తన్వి బెదురు కళ్ళతో "ఎందుకు?" అంది.
అది చూసి అంత టెన్షన్ లోను నవ్వు వచ్చింది ఆమాల్ కు, "మరేం లేదు..ప్లీజ్..కంగారుపడకండి, మిమ్మల్ని డ్రాప్ చేయమని అడగండి " అన్నాడు.
తల ఊపింది తన్వి ... ఉత్సాహంగా వెళ్లి తయారయ్యి వచ్చాడు."వెళ్లొస్తాను అక్కా....ఆంటీ రేపు మార్నింగ్ వెళుతున్నా హైదరాబాద్ కి ,ఆమాల్ సీ యు,బాయ్ "అంది.అందరూ వీడుకోలు పలికారు రోజూ ఆమె నడిచే వెళుతుంది, వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి. కానీ తన్వి డ్రాప్ చేయమని అడగ లేదు.
కాసేపు తటపటాయించి "..తన్వి నేను బయటికి వెళుతున్నావుండు డ్రాప్ చేస్తా" అన్నాడు.
రోజూ బైక్ లో బయటికి వెళ్ళే ఆమాల్ కార్ తీసి డోర్ తీసి పెట్టి తన్వి కూర్చున్నాక వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. నవ్వుతూ చూస్తున్న వదిన్ని చూసి కొంచం బెదిరాడు. కార్ ను వూరికి దూరంగా వున్న పురాతన ఆలయం దగ్గర ఆపాడు.
"మీరు నాస్తికులని చెప్పింది అక్క" అంది తన్వి.
"గుడికి భక్తులే రానక్కర లేదు ..నాకీ కోవెల చాలా ఇష్టం ఆ ప్రక్కనే లోటస్ పాండ్ వుంటుంది మా నాన్న చిన్నప్పుడు ఇక్కడికి తీసుకోచ్చేవాడు."
"ఆహా ..చాలా బావుంది నేను క్రొత్త కదా ఈ వూరికి .. చెప్పండి..ఏదో మాట్లాడాలన్నారు!."మౌనంగా వున్న ఆమాల్ ని చూసి తన్వికి కూడా ఎమీతోచలేదు. టెన్షన్ తో అతనికి చమటలు పట్టాయి.ఆమాల్ పడే టెన్షన్, తనతో ప్రత్యేకంగా మాట్లాడాలంటే అతను ప్రపోజ్ చేసేదానికే అని అర్థమైంది తన్వికి. ఆమాల్ లాంటి అందగాడు,మంచి జాబ్ లోవున్నవాడు,'చాలా మంచివాడు' అన్న ట్యాగ్ వున్నవాడు ...కానీ అతనికి పెళ్లి ఫిక్స్ అయినట్లు చెప్పినట్టు అమ్మ చెప్పిందే మరి ..రమక్క మాత్రం చెప్పలేదు కానీ మరి మరి.. ఆలోచనలలో పడింది తన్వి.
నేలపై నున్నగడ్డిపరకల్ని లాగుతున్న ఆమె చేతివేళ్లు చూసాడుఆమాల్. గోర్లు పెంచని, నాజూకైన ఆ వేళ్ళకు నైల్పాలిష్ కూడా లేదు..అతనికి గోర్లు పెంచుకోవడం అంటే ఇష్టం లేదు, లేత గులాబి రంగు చుడిదార్ లో ఆమె పచ్చటి ఛాయ మెరిసిపోతోంది.. ముందు ఆమె మనసులో ఎవరూ లేరని తెలిస్తే అప్పుడు తన ప్రేమను తెలపోచ్చు, తొందర పడరాదు అనుకున్నాడు.
"తన్వి మీరు ఎవరి నైనా ప్రేమించారా? "
"లేదు, ఎందుకలా అడిగారు?"
"యింత అందమైన మిమ్మల్ని ఎవరూ ప్రపోజ్ చేయలేదా "
"నేనెవ్వరిని ఇష్టపడలేదు "
"ఎందుకు?"
"నాక్కొన్ని ప్రిన్సిపుల్స్ వున్నాయి, వాటిని అంగీక రించే వ్యక్తి నాకు కనపడలేదు"
"ఎలాంటివి ?"
"ఖచ్చితంగా..ఇవని ..చెప్పలేను"
"నేను చికాగోలో వుండగా ఒకమ్మాయి ఫోటో వదిన పంపారు ..నాకు నచ్చిన అమ్మాయి దొరకక వీళ్ళ నిర్ణయానికే వదిలేసాను ఆ అమ్మాయి పేరు సుజన, వదిన ఫ్రెండ్ చెల్లలే అట, ఫోటో చూసి ఓకే అన్నా, రెండు సార్లు ఫోన్లో మాట్లాడా ..కానీ ...మిమ్మల్ని చూడగానే నేనుకోరుకున్న స్త్రీ మీరే అనిపించింది ..మీ రంటే నాకు ..చాలా ఇష్టం... ..మీకు ఇష్టమైతే, నేను వదినకు అమ్మా నాన్నకు చెబుతాను...సుజన తో జీవితం ఊహించుకోలేకపోతున్నా ...ఇందులో మిమ్మల్ని నొప్పించే విషయం ఏమైనా వుంటే సారీ ..." "నేనంటే ఎందుకిష్టం ?" విప్పారిన కళ్ళను మరింత పెద్దవిగా చేస్తూ అంది
"మీరు కోప్పడకూడదు..."
"వుహూ "..నవ్వునాపుకుంటూ అంది
"మీ పెద్ద జడ, నవ్వితే పడే డింపుల్ ..మొత్తంగా మీరు నచ్చారు నా ఊహల్లో వున్న రూపం మీరు "
"నాక్కూడా మీరు ఇష్టం...కానీ మా అమ్మ మీకు త్వరలో పెళ్లి అంటే నేనేమి ఆ దృష్టి లో చూడలేదు..రమక్కమీ గురించి చెప్పినప్పుడు ..మీ ఆలోచనలు ,అమాయకత్వం చెప్పినప్పుడు , మిమ్మల్ని మిస్ అయ్యాను అనుకున్నా...నేను కూడా మీలాంటి వ్యక్తినే
కోరుకున్నా.. ఆకర్షణలకు, డబ్బు, హోదాలకు కాక నాలాంటి సామాన్యమైన వ్యక్తిని మీరు ఇష్టపడు తున్నా రంటే ...అది నా అదృష్టం ." "అయితే..నేను మీకు ఐ లవ్ యు చెప్పొచ్చా.... ?"
రెండు చేతుల్లో ముఖం దాచుకుంది ...తన్వి ..ఆ సిగ్గు తెరలలో ఆమెను చూస్తూ ... "ఇ లవ్ యు.."అన్నాడు.జీవితంలో మొట్టమొదటి సారిగా ఆ వాక్యాన్ని పలకడానికి అతని హృదయం ఉప్పొంగిపోయింది. తొలి ప్రేమ జ్వరం లాంటిది అన్నాడొక కవి ...ఆ జ్వరం నూటయిదు డిగ్రీలతో తాకింది ఆమాల్ కు.
జరిగినదంతా చెప్పాడు వదినతో ...
"అయితే సుజనను ఏంచేద్దాం ?" అంది కోపంగా
"తన్వి మీ చెల్లెలేగా... చూసారుగా...ఆమె ఫోటో పంపకుండా ఇంకెవరో సుజన ఫోటో ఎందుకు పంపారు?" ..
"సుజన కంటే తన్వి బాగుందా!..."
"చాలా.... అచ్చు నా ఊహల ఊర్వసి...వదినా... ప్లీజ్ ఎలాగోలా నాకు తన్వి తో పెళ్లి జరిపించు....కావాలంటే ఆ సుజనకు మంచి వరుడ్ని చూద్దాం "
"ముందు చూడు, కట్నం వగైరా నువ్వే ఇవ్వు ..పెళ్లి కూడా జరిపించు ...తర్వాత మీ పెళ్లి సంగతి చూద్దాం .."
"ప్లీజ్ వదినా నాన్నకు తెలిసిందంటే నా మెడలు వంచి సుజన తోనే పెళ్లి జరిపిస్తాడు..."
"మరి నాకేంటి లాభం ?"
"అంటే ..లాభం కోసం ..."
" అవునయ్యా .....లాభం లేనిదే నేనెందుకు రిస్క్ తీసుకోవాలి ?"
"సరే చెప్పండి ...."
"నాకు డైమండ్ సెట్ కావాలి..పెళ్లి లో మా అమ్మావాళ్ళు పెట్టలేదు ,మీ వాళ్ళు పెట్టలేదు .. మీ అన్నను సాధిస్తే డైమండ్ సెట్ సంగతి తెస్తే కాశికి వెళ్లి సన్యాసం స్వీకరిస్తానని బెదిరిస్తున్నాడు ఇంక ఇప్పుడు నీవు తెచ్చిస్తానంటే ఆ రిస్కేదో తీసుకుని ఆ ముచ్చట తీర్చు కుంటా. " "వదినా జోక్స్ వేయకండి ...ప్లీజ్ .."
"ఓకే...ఓకే ...సుజనని మన దారి లోంచి తప్పించాలి... తన్విని సీన్ లోకి తేవాలి అంతేనా ...ఒక పని చేద్దాం ...సుజన భర్తకి చెప్పేద్దాం ...""సుజన భర్త ఏంటి .... ? " కంగారుగా అన్నాడు.
"లక్కీ ఫెలో ...సుజనకు పెళ్లి అయిపోయింది ...నీవు వచ్చే రోజే...ఎన్నాళ్ళు గానో ఆ అమ్మాయిని ఇష్ట పడ్డబ్బాయి, నీతో పెళ్లి ఫిక్స్ అయిందనగానే వచ్చి ఏడ్చాడట ..ఆ అబ్బాయి అంటే సుజన కు కూడాఇష్టమట... వచ్చి నాకు చెప్పింది... ఏమి చేయను ? అలాంటి అమ్మాయిని చూసావేంటి అని అందరూ అడుగుతారని హడలి చస్తున్నా ...ఇంతలోనే తన్వి వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద రావడం తో తన్వి ని నిజానికి నీకు చూడాలని అనుకుంటున్నా, అయితే సుజన సంగతి నీవు పదే పదే అడిగాక..కొంచం కంగారు పడ్డా !..బ్రతికించావు బాబు...తన్విని ఇష్ట పడి, లేక పోతే,అందరితో ఆశ్చింతలు, మీ అన్న తో నాకుండేవి అంతం లేని సాంత బాణీలు .."
"తన్వి సంగతి తర్వాత ... ముందు సుజన సంగతి చెప్పకుండా ఉండడానికి ముందు నాకు షరతులున్నాయి .."
"అదేంటి..."
"మీరు మా హానీమూన్ ఖర్చు భరిస్తానంటేనే... ఈ విషయం అన్న వరకు పోకుండా వుంటుంది ..."
"అమ్మో అమ్మో ఇవి నీ తెలివితేటలు కాదు "
"అవును ... మీవే....మిమ్మల్ని చూసి నేర్చుకున్నా... "
గట్టిగా నవ్వుకుంటున్న వదిన మరిదిని చూసి...లోపలి వచ్చిన అత్త మామల్ని చూసి రమ నవ్వాపింది. నవ్వుకుంటూ వాళ్ళమ్మను నీకో విషయం చెప్పాలంటూ పక్కకు తీసికెళ్ళా డు ఆమాల్