శ్రమవిలువ - వై.శ్రీలత

sramaviluva

రామాపురం అనే గ్రామంలో శంకరయ్య అనే సామాన్య రైతు వుండేవాడు. తనకు వున్న ఆరెకరాల పొలంలో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రాములు., చిన్నవాడు సోములు. తనకు వచ్చే అంతో-ఇంతో ఆదాయంతోనే ఇద్దరు పిల్లల్నీ చదివించి ప్రయోజకుల్ని చేయాలని తెగ తాపత్రయపడేవాడు. కానీ దురదృష్టంకొద్దీ ఇద్దరు కొడుకులకీ శ్రద్ధ లేకపోవడంతో విద్య అబ్బలేదు.

రాన్రానూ అనారోగ్యం కారణంగా శంకరయ్య పోలం పనులు చెయ్యలేకపోయేవాడు. పెద్దకొడుకు అయిన రాములుకి చదువు అబ్బకపోయినా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవాడు. చిన్నవాడైన సోములు అన్నకి పూర్తి విరుద్ధం. ఎప్పుడూ ఆటలూ పాటలంటూ జులాయిగా తిరిగే సోమరి.

చదువెలాగూ తనకు రాదని తెల్సుకున్న రాములు చిన్నతనం నుంచే పొలానికి వెళ్ళి కష్టపడి పని చేసేవాడు. తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి పూర్తిగా బాధ్యతను తీసుకుని ఒళ్ళువంచి పనిచేస్తూ పొలంలో బంగారం పండించేవాడు.

" నువ్వుకూడా అలా ఖాళీగా తిరిగేబదులు అన్నకు సాయంగా వుండు" అని ఎన్నోసార్లు చెప్పేవాడు శంకరయ్య సోములుతో. అసలు లెక్కచేసేవాడు కాదు సోములు. సాయం చేయకపోగా వయసు పెరిగేకొద్దీ పేకాటలు, కోడి పందేలు అంటూ రాములు సంపాదించే ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తుండేవాడు.

తండ్రి ఇచ్చిన ఆరెకరాల పొలాన్నీ పదిహేనేళ్ళు గడిచేసరికి రాములు స్వయంకృషితో ఇరవై ఎకరాలు చేశాడు. చదువు లేకపోయినా కష్టపడే మనస్తత్వం వుంటే విజయం తప్పక వరిస్తుందని నిరూపించిన పెద్దకొడుకుని చూసుకుని ఎంతో పొంగిపోయాడు శంకరయ్య.

ఇద్దరు కొడుకులకూ పెళ్ళి వయసు రావడంతో రెండేళ్ళ తేడాతో రాములుకి, సోములుకి పెళ్ళిళ్ళు జరిపించేశాడు శంకరయ్య. పెళ్ళయ్యాక అయినా చిన్నకొడుకులో పరివర్తన వస్తుందని ఆశపడ్డ శంకరయ్యకి నిరాశే మిగిలింది.

తన బుద్ధి మార్చుకోకపోగా, ఇంకా ఖర్చులు అధికం చేయసాగాడు సోములు. తమ్ముడు చేసే వృధా ఖర్చులు చూసి బాధపడ్డా, పోనీలే తమ్ముడే కదా అని సరిపెట్టుకునేవాడు రాములు పెళ్ళి కాకముందు.

రాములు భార్య పూర్ణ మాత్రం సరిపెట్టుకోలేకపోయేదీ. భర్త రాత్రనకా-పగలనకా కష్టపడి సంపాదిస్తుంటే, మరిదీ-తోటి కోడలూ సుఖపడుతూ ఖర్చుపెట్టడం ఆమెకు నచ్చేది కాదు. అలా ఇంట్లో చిన్నచిన్న గొడవలు ప్రారంభమైనాయి.

రోజురోజుకీ చిన్నగొడవలు పెద్దవవుతూ ఇంట్లో మనశ్శాంతి కరువవ్వడంతో తట్టుకోలేక ఇద్దరు కొడుకుల చేత వేరు కాపురాలు పెట్టించాలని నిర్ణయించుకున్నాడు శంకరయ్య. అనుకోవడమే తరువాయి, ఆస్థి పంపకాలు ఏర్పాటు చేశాడు.

నేను మొదట సంపాదించింది ఆరు ఎకరాలే కాబట్టి చెరో మూడు ఎకరాలు వాటా తీసుకోండి. అని చెప్పాడు శంకరయ్య. ససేమిరా ఒప్పుకోలేదు సోములు. ప్రస్తుతమున్న ఇరవై ఎకరాల పొలంలో తన వాటాగా పది ఎకరాలు కావాల్సిందేనని పట్టుబట్టాడు. " అదెలా కుదురుతుంది? చిన్నప్పట్నుంచీ రెక్కలు ముక్కలు చేసుకుని అన్నయ్య సంపాదించిన భాగంలో వాటా అడగడం ఏమాత్రం న్యాయం కాదు" అని వారించాడు శంకరయ్య. అసలంటూ ఎంతో కొంత పొలముండబట్టే కదా దాన్ని మూడింతలకు పైగా చెయ్యగలిగాడు. అలాంటప్పుడు పెట్టుబడి ఉమ్మడిగా వున్ననాటిదే కాబట్టి తనకు పది ఎకరాలు రావాల్సిందే" అన్నాడు సోములు తర్కంగా వాదించి.

" అది న్యాయం కాదు తమ్ముడూ! కావాలంటే నాన్న ఇచ్చిన ఆరెకరాలూ నువ్వే తీసుకో" అని ప్రాధేయపడ్డాడు రాములు గొడవెక్కడ పెద్దదయ్యి పరువు పోతుందో అన్న భయంతో. అన్న చెప్పినదానికి కూడా ఒప్పుకోలేదు సోములు. ఎంత చెప్పినా కొడుకు వినకపోవడంతో ఇంటి గొడవ పంచాయితీ ముందు పెట్టబడింది. ఆ ఊరిపెద్ద అయిన మోతుబరి రైతు చంద్రశేఖరం అన్నదమ్ముల వాదనలు విన్నాడు. అపారమైన తెలివితేటలూ, అనుభవమూ కలిగిన ఆయనకు విషయం సులభంగా బోధపడింది. సోమరిపోతు అయిన సోములు కుత్సిత బుద్ధి అర్థం చేసుకున్నాడు.

కాసేపు ఆలోచించి తర్వాత గంభీర స్వరంతో అన్నాడు.

" ఆస్థి పంపకాలు సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నాను. కానీ ఈ సంవత్సరంలోగా నేను మీ ఇద్దరికీ చెరో రెండు ఎకరాలు పొలాన్ని కౌలుకి ఇస్తాను. ఎవరైతే గడువులోగా ఎక్కువ పంటని పండిస్తారో దాన్నిబట్టి తీర్పు ఉంటుంది." అని. సరేనని ఇద్దరూ తలాడించారు.

కష్టపడటం తనకు కొత్తేమీ కాదు అనుకుని ధైర్యంగా వున్నాడు రాములు. ఒక శుభముహుర్తాన ఇద్దరూ పొలం పనులు మొదలెట్టారు. తను అన్నయ్య కంటే ఎక్కువ ధాన్యం పండించకపోతే ఎక్కడ తనమాట చెల్లదో అన్న భయంతోనూ,దానికితోడు అతని భార్య అందించే సహకారం, ప్రోత్సాహం కూడా తోడవ్వడం వల్లనూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొలానికి వెళ్ళి కష్టపడి పని చేయడం ప్రారంభించాడు సోములు. తన వ్యసనాలూ, అలవాట్లూ అన్నీ పక్కన పెట్టి ఎక్కువ ధాన్యం పండించటమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

పొలాన్ని దున్ని విత్తనాలు జల్లిన దగ్గర్నుంచీ, ప్రతి పనీ దగ్గరుండి మరీ చూసుకుంటూ విపరీతంగా కష్టపడేవాడు సోములు. అహర్నిశలూ శ్రమపడుతూ పొలం దగ్గర కాపలాకి వేరేవాళ్ళని పెట్టుకోకుండా తనే రాత్రంతా పొలానికి కాపలా కాసేవాడు. ఏపుగా ఎదుగుతున్న పైరుని చూసి చాలా సంతోషపడేవాడు. పసి పిల్లలా పొలాన్ని కాపాడుకుంటూ ఎలాగైతేనేం సంవత్సరం తిరిగేసరికల్లా అనుకున్నట్టుగానే అన్న రాములు కంటే పది బస్తాల ధాన్యాన్ని ఎక్కువ పండించగలిగాడు.

మళ్ళీ పంచాయితీ ముందు ఊరివారంతా గుమిగూడారు. అందరిలోనూ ఉత్కంఠ.. ఏం జరుగుతుందోనని. శంకరయ్య అతని ఇద్దరు కొడుకులు కోడళ్ళూ అందరూ హాజరయ్యారు.

ఆశ్చర్యం..

ఉన్నట్టుండి సోములు ఏడుస్తూ తండ్రి కాళ్ళమీద పడి క్షమాపణలు కోరాడు. అందరూ అర్థం కానట్టు చూస్తుండగా ఊరి పెద్దయిన చంద్రశేఖరంతో యిలా అన్నాడు సోములు. " స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి ఇంతకాలం నేను మా అన్న కష్టార్జితాన్ని మంచినీళలా ఖర్చుపెట్టాను. అదీ చాలదనట్టు అన్న కష్టపడిన పొలంలో కూడా వాటా కావాలని మూర్ఖత్వంతో పట్టుబట్టాను. మీరు నాకు మంచి పరీక్ష పెట్టారు. కష్టపడి పని చేస్తున్నకొద్దీ నాకు శ్రమ విలువ అర్థమయ్యింది. విత్తనాలు మొలకెత్తి నాట్లు వేశాక ఏపుగా ఎదుగుతున్న మొక్కల్ని చూస్తుంటే ఇంతకాలంగా నేనెంత విలువైన సమయాన్ని వృధా చేశానో తెల్సి వచ్చింది.అంతేకాదు! మా అన్న ఎంత కష్టపడి ఇరవై ఎకరాలు సంపాదించాడో అని అర్థం కాగానే నేను చేసిన తప్పు తెల్సి వచ్చింది.

అంతే కాదు, మా అన్న ఎంత కష్టపడి ఇరవై ఎకరాలు సంపాదించాడో అర్థం కాగానే నేను చేసిన తప్పు తెల్సింది. ఏదైనా సాధించగలను అన్న నమ్మకమూ, ఆత్మ స్థైర్యమూ కలిగింది నాలో.

నన్ను మన్నించండి. న్యాయంగా నాకు రావాల్సింది ఇప్పిస్తే చాలు. కష్టపడి పనిచేసి దాన్ని చాలా త్వరగానే రెట్టింపు చేయగలను అన్న నమ్మకం కుదిరింది.

" నీకు కష్టం అంటే ఏమిటో తెలియాలనే అలా చెప్పాను శ్రమవిలువ ఏమిటో తెల్సిన నీకు అంతటా విజయమే" అని మెచ్చుకున్నాడు ఊరిపెద్ద.

తండ్రి శంకరయ్య రాములు ఎంతగానో సంతోషించారు సోములు మారినందుకు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు