మసకబారిన మనోచిత్రం - తిరుమలశ్రీ

masakabarina nakshatram

ఆ రోజు వచ్చిన ’నేటి మహిళ’ మాసపత్రికను ఆత్రుతగా తిరగేసాను. పత్రిక రాగానే ముందుగా నేను చూసేది, అందులోని ’మీ సమస్యలు - నా సలహాలు’ శీర్షికనే. స్తీల వ్యక్తిగత సమస్యలకు ప్రముఖ సైకాలజిస్ట్ కామినీదేవి పరిష్కార మార్గాలను సూచిస్తూంటుంది. ఆవిడ ఇచ్చే జవాబులు నన్నెంతో ఆకట్టుకుంటాయి.

ఐతే నేనూ ఆవిడ సలహాను కోరవలసిన రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నన్ను పీడిస్తూన్న సమస్యను గూర్చి కామినీదేవికి పత్రికలో ఇచ్చిన చిరునామాకి లేఖ రాసాను.

ఓ బ్యాంకిలో అసిస్టెంటుగా పనిచేస్తూన్న నాకు మూడేళ్ళ క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఐన రవితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా పుష్పించడంతో, ఏడాది క్రితం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను పెళ్ళిచేసుకున్నాడు రవి. పెళ్ళయ్యాక మా మామగారు సర్దుకుపోయినా, అత్తగారు మాత్రం అంత సులభంగా నన్ను అంగీకరించలేకపోయింది. అత్తింట అడుగిడిన క్షణం నుండీ ఏదో విధంగా నన్ను హింసించసాగింది ఆవిడ. కోటి రూపాయల కట్నం తెచ్చే సంబంధాలను కాదని నన్ను చేసుకున్నాడట కొడుకు! అందుక్కారణం, నేను నా వగలతో అతన్ని వలలో వేసుకోవడమేనట!. నా మనసును నొప్పించడం, నన్ను కష్టపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంది. అన్నీ మౌనంగా భరిస్తూ వస్తున్నాను నేను.

ఐతే ఆవిడ చాలా తెలివైంది. రవి నాకోసం తల్లిదండ్రులను వదులుకోవడానిక్కూడా సిద్ధమని ఆవిడ ఎరుగును. ఏకైక సంతానమైన అతన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగాలేరు. అందుకే రవి ఎదుట నా పట్ల అతిప్రేమ ఒలకబోస్తుంది ఆవిడ. అతను లేనప్పుడు మానసికంగా చిత్రహింసకు గురిచేస్తుంది నన్ను. ఏం జరిగినా రవితో చెప్పేదాన్ని కాదు. అతని మనశ్శాంతిని కూడా చెదరగొట్టడం నాకిష్టంలేదు. నేను సామరస్యంగా వ్యవరించేకొద్దీ ఆవిడ రెచ్చిపోవడంతో, ఏం చేయాలో తోచక కామినీదేవి సలహా కోరడం జరిగింది...

మూడు నెలల తరువాత ఆ సంచికలో కామినీదేవి ఇచ్చిన సలహా ఖంగుతినిపించింది నన్ను -’అత్తాకోడళ్ళ నడుమ స్పర్థలు అనాదిగా వస్తున్నవే. ఇందుకు దేవతలు సైతం మినహాయింపు కాదు. అందుకు తరాల అంతరం ఓ కారణమైతే, వ్యక్తుల అహం మరో కారణం. నువ్వు చదువుకున్నదానివి. ఉద్యోగం చేస్తున్నావు. మీ అత్తగారు చదువుకోలేదు. జీవితకాలమంతా నాలుగు గోడల మధ్యే గడిపిన స్త్రీ. కనుక ఆవిడ ప్రతి చర్యను, మాటను భూతద్దంలో చూడడం మానేసి సర్దుకుపోవలసిన బాధ్యత నీమీదే ఉంది. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పెట్లు ఔతాయి! ఒకవేళ తప్పు ఆవిడదే ఐనా సర్దుకుపోగల మనస్తత్వం అలవరచుకోవాలి నువ్వు...కుటుంబంలోని కలతలు కార్చిచ్చులాంటివి. అవి ఇంటెల్లపాదినీ చుట్టబెట్టి మనశ్శాంతిని కరవు చేస్తాయి.

ఇంట్లో సుఖశాంతుల్ని నశింపజేస్తాయి...’ కామినీదేవి నా సమస్యను సరిగా అర్థంచేసుకోలేదేమో ననిపించింది నాకు. ఒకవేళ లోపం నాలోనే ఉందేమోనని కూడా ఆలోచించాను... ’మా అమ్మ తిడితే పడనా?’ అనుకుంటూ, మాఅత్తగారు ఏమన్నా జవాబివ్వకుండా మౌనం వహిస్తూంటాను. దాన్ని అలుసుగా తీసుకుని మరింత సాధిస్తూంటుంది ఆవిడ. ఆ వాతావరణం నా మనసు మీద, పని మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

కామినీదేవిని నేరుగా కలుసుకుని చర్చిస్తే బావుంటుందనిపించింది..ఆమె ఉండేది వరంగల్ లోనే. హైదరాబాద్ నుండి మూడు గంటల ప్రయాణం.

చిరునామా కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. గేటు తెరచిన చప్పుడుకు బైటకు వచ్చిన ఓ నడివయస్కురాలు నా వంక ప్రశ్నార్థకంగా చూసింది. కామినీదేవిని కలవడానికి హైదరాబాద్ నుంచి వచ్చినట్లు చెప్పాను.

"అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు" అంది ఆమె.

"అయ్యో, ఆరోగ్యం బాగోలేదా?" అనడిగాను.

"రాత్రి నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్య చేసుకోబోతే ఆసుపత్రిలో చేర్పించారు" చెప్పిందామె.

నిర్ఘాంతపోయాను నేను. "ఇప్పుడెలా ఉన్నారు? క్షేమమే కదా?" ఆత్రుతగా అడిగాను.

"ప్రమాదం లేదంట. ఓ రోజు అక్కడే ఉండాలన్నరంట".

’ఆత్మహత్యకు పాల్పడవలసినంత కష్టం...ఆవిడకు ఏం వచ్చిందో, పాపం!’ సగం స్వగతంగా అనుకున్న నా పలుకులకు జవాబుగా, ఆ ఇంటి పనిమనిషినంటూ ఆమె చెప్పిన సమాచారం వింటూంటే...శిలాప్రతిమే అయ్యాను నేను...

’కామినీదేవికి ముప్పై ఐదేళ్ళుంటాయి. ఓ ప్రైవేట్ కాలేజ్ లో సైకాలజీ లెక్చరర్ గా పనిచేస్తోంది. మేనత్త కొడుకుతో ఆమె వివాహమైంది. సివిల్ ఇంజనీర్ అతను. వారికి ఓ కొడుకు, కూతురూను. మేనత్త సరస్వతమ్మ చాలా మంచిది. అన్న కూతురన్న అభిమానంతో కట్నం తీసుకోకుండా మేనకోడల్ని కోడల్ని చేసుకుంది. కాని, కామినీదేవికి మేనత్త అన్న గౌరవం, అభిమానం లేవు. అత్తమామలంటే కిట్టదు. వారు తమ గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చూసుకునేవారు. ఏడాది క్రితం భర్త మరణించడంతో సరస్వతమ్మ కొడుకు పంచకు చేరక తప్పలేదు. అత్తగారు వచ్చాక పనిమనిషిని మానిపించేసింది కామినీదేవి. అరవై ఐదేళ్ళ వయసులో కూడా ఇంటెడు చాకిరీని ఒంటి రెక్కను చేసేది సరస్వతమ్మ. కోడలు ఉద్యోగం చేసి అలసిపోయి వస్తుందని పూచికపుల్ల కూడా ముట్టుకోనిచ్చేది కాదు. ఐనా సూటిపోటి మాటలతో అత్తను మానసికంగా హింసించేది కామినీదేవి. పనిమనిషి కంటె హీనంగా చూసేది. ఆవిడ అదంతా మౌనంగా భరించేదే తప్ప కొడుక్కి తెలియనిచ్చేదికాదు. దురదృష్టవశాత్తూ మూణ్ణెల్ల క్రితం ఆవిడకు పక్షవాతం వచ్చింది. ఓ కాలు, ఓ చేయీ పనిచేయడం మానేసాయి. మాట తడబడసాగింది. దాంతో మళ్ళీ పనిమనిషిని పెట్టుకోవలసివచ్చింది కామినీదేవికి

ఆ స్థితిలో అత్తగారి వల్ల తనకు ఉపయోగంలేదనుకున్న ఆమె...ఆమెకు చాకిరీ చేయడం తనవల్లకాదనీ, ఇంటి నుండి పంపేయమనీ భర్తను పోరసాగింది. ఆ దుస్థితిలో తల్లిని వదిలేయడం కొడుక్కి ఇష్టంలేదు. పెళ్ళాం పోరు పడలేక, ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేర్పించాలనుకున్నాడు అందుకు కామినీదేవి ఒప్పుకోలేదు. ఆవిడమీద పైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదంది. పైగా, బంధువులు తమను ఆడిపోసుకుంటారంది. అత్తగారిని కాశీ తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి వద్దామంది. బంధువులతో ఆమె అక్కడ మరణించినట్లు చెబుదామంది. దాంతో కృద్ధుడైన భర్త ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు. ముందురోజు రాత్రి పెద్ద గొడవే జరిగింది. తన పట్టును సాధించుకునే ప్రయత్నంలో కామినీదేవి నిద్రమాత్రలు మ్రింగేసింది...’

విద్యుద్ఘాతంలాంటి ఆ స్థితి నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది నాకు. నేనెంతగానో అభిమానించే కామినీదేవి ’నిజస్వరూపం అదీ!’ అంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాలేదు.

లోపలికి వెళ్ళి మంచాన ఉన్న ముసలమ్మను చూసి వచ్చాను. ఆవిడ కళ్ళలో పుట్టెడు దిగులు... "ఆసుపత్రికి వెళ్ళి అమ్మగారిని చూసొస్తారా అమ్మా?" అనడిగింది ఆమె.

ఆసుపత్రిఉకి వెళ్ళి ఆ ’మేకవన్నె పులి’ ని చూడాలనిపించలేదు నాకు. జవాబు చెప్పకుండా వెనుదిరిగాను. నాతో తెచ్చిన స్వీట్ పాకెట్ ని వీథిలో ఆడుకుంటూన్న పిల్లల చేతిలో పెట్టి, ఆటో ఎక్కాను.

రైల్వే స్టేషన్ కి వెళ్తూంటే అనిపించింది నాకు – ‘ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలి. వేరెవరో పరిష్కారం చూపుతారనుకోవడం అవివేకమే ఔతుంది. మా అత్తగారి సమస్యను ఆవిడ కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆవిడ కోపం, బాధ పోగొట్టడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నేను ఓర్మితో వ్యవహరిస్తే...కాలం ఆవిడలో మార్పు తేకమానదు...’

అంతవరకు నాలో ఉన్న కామినీదేవి మనోచిత్రం క్రమంగా మసకబారిపోసాగింది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ