క్రీనీడ - ఆకెళ్ళ శివప్రసాద్

Kreeneeda Story By Aakella Sivaprasad

మా బాల్కనీ లోంచి చూస్తే, ఆ యింటి మొదటి అంతస్తు లో ఉన్న ఆ వాటా సృష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడో కట్టిన ఇల్లు. డాబా, రెండు గదులు, గొంతు ఖాళీ స్థలం.

అప్పుడప్పుడు మా బాల్కనీ లో కూర్చుని ఆ యింటి వైపు చూస్తే ఆ వాట లో వుండేవాళ్ళు కన్పిస్తారు. వాళ్ళ గురించి పూర్తిగా తెలీకపోయినా, కాస్త ఊహిస్తే వాళ్ళ జీవితాలు కొంచెంగా అర్ధమవుతాయి.

మొన్న మొన్నటి వరకు -
ఓ ముసలి జంట వుండేవారు. ముసలి వాళ్ళయినా యిద్దరి గొంతులు పెద్దవే. ఎప్పుడూ ఏవో అరుపులు విన్పిస్తుండేవి. ఒక్కోసారి కచేరీ ఆమె మొదలు పెడ్తే, ఆయిన ముగించేవాడు. మరోసారి ఆయన మొదలుపెడ్తే ఆవిడ గావు కేకలతో పూర్తి చేసేది.

ఇంకోసారి యిద్దరు 'జుగల్ బందీ' లా ఒకేసారి మొదలుపెట్టి కాస్త అటు ఇటు లో పూర్తి చేసేవారు. గడిచిన జీవితంలోని అసంతృప్తి యిద్దరిని ఆ వయసులో కూడా ప్రశాంతంగా వుండనిచ్చేది కాదనిపించేది. ఈ మధ్య కాలంలో ఆవిడకి ఏదో అనారోగ్యం వచ్చినట్టుంది.

అంబులెన్స్ హడావిడి గమనించాను. అరుపులు కేకలు తగ్గిపోయాయి.

'మళ్ళీ ఏజన్మలో కలుస్తామోనన్న బెంగ' యిద్దరిని మరింత ఆత్మీయులని చేసినట్టుంది. ప్రశాంత వాతావరణం సృష్టంగా అర్ధమవుతోంది.

ఓ రోజు ఆఫీసు నుండి వస్తుంటే చూశాను. ఓ మెటాడోరులో సామాన్లు ఎక్కిస్తున్నారు. వాళ్ళు ఖాళీ చేసి ఏదో ఓల్డ్ ఏజ్ హొమ్ కి వెళ్తున్నట్టు తరువాత తెలిసింది.

ముసలివాళ్ళు ఖాళీ చేసిన పదిరోజులకి ఆ వాటాలోకి ఓ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఇరవై ఐదేళ్ళ లోపే వయసు వుండొచ్చు. సన్నగా నాజూగ్గా వుంది. చాలా రోజులనుండి ముసలి దంపతులనే చూసిన కళ్ళకి 'రిలీఫ్' గా అన్పించింది. బహుశా ఈమె కూడా ఏ కంప్యూటర్ కోర్సు అయినా చేయడానికి వచ్చి వుండొచ్చు లేదా ఏ ప్రైవేటు కంపెనీ లోనైనా ఉద్యోగం చేస్తుండవచ్చు.

వచ్చిన రోజు సాయంత్రమే 'దర్శనం' యిచ్చింది. ఆ అమ్మాయి తల పైకెత్తి చూస్తే కానీ నేను కనబడను. నేను మాత్రం బాగానే గమనించవచ్చు.

ఆ అమ్మాయి చేతిలో సెల్ ఫోన్ వుంది. పాత మోడల్ తక్కువ ధర సెల్ ఫోన్ అన్పించింది. ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతోంది. మాట్లాడే పద్ధతి బట్టి బహుశా వాళ్ళ తల్లి దండ్రులతో మాట్లాడుతుందేమో అన్పించింది. బెంగతో మాట్లాడుతున్న భావన సృష్టంగా తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలో తరచూ ఇలా బెంగపడ్డ మొహాల్ని చూసిన అనుభవంతో చెప్పగలుగుతున్నాను. నిజానికి 'ఫేస్ రీడింగ్' విషయంలో ప్రత్యేకమైన శిక్షణ తీసుకోకపోయినా గమనింపు వల్ల తెలుసుకుంటాను. మొదట్నించి మొహం చూసిన వెంటనే మానసికంగా ఈ పరిస్థితిలో వుండి వుండొచ్చు అని వూహించేవాడిని. తెలుసున్న వాళ్ళతో ఆ విషయం చెప్పినప్పుడు దాదాపుగా కరెక్ట్ గా అంచనా వేస్తానని తెలుసుకోగలిగాను.

వారం పదిరోజుల వరకు ఆ అమ్మాయి బెంగతో కన్పించినా, క్రమంగా రొటీన్ లో పడి తేరుకుంటున్నట్టనిపించింది. రెండు వారాల తరువాత రాత్రి తొమ్మిది దాటింది. సాధారణంగా నేను ఆసమయంలోనే ఆ వాటా వైపు చూస్తుంటాను. డాబా మీదకి వచ్చిన ఆ అమ్మాయి ఉత్సాహంగా నక్షత్రాల వైపు చూస్తోంది. చందమామకి ఫ్లెయింగ్ కిస్ యిచ్చింది. చాలా హుషారుగా కన్పించింది.

చిత్రంగా -

ఆ అమ్మాయి చేతిలో వున్న పాత సెల్ ఫోన్ మారిపోయింది. తలతలా మెరిసిపోతున్న కొత్త సెల్ కనిపించింది. ఆ సెల్ ఫోన్ లో అతి ఉత్సాహంగా మాట్లాడేస్తోంది.

పరీక్ష పాస్ అయ్యిందా?

ఉద్యోగం వచ్చిందా?

ఆ రోజు జరిగినప్పుడు ఆనందం కన్నా, ఈ ఆనందం మరేదో పెద్ద ఆనందంలా అన్పించింది. ఏమిటది?

తొమ్మిదిన్నరకి మొదలు పెట్టిన ఫోన్ ఆపకుండా రెండుగంటలు మాట్లాడింది. ఆ రెండుగంటలు అదే ఉత్సాహం, ఆనందం, నవ్వులు, కేరింతలు, సిగ్గుపడడం, అలకబోనడం. ఒకటి కాదు రకరకాల హావ భావాలు నాన్ స్టాప్ గా ఒలక బోసేస్తోంది.

ఈ లెక్కన, నా లెక్క కరెక్ట్ అయితే, ఆ అమ్మాయి ప్రేమలో పడింది!

సందేహం లేదు. ప్రేమే.

ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు... నిరాటంకంగా పదిరోజులు రెండు మూడు గంటల చొప్పున రాత్రివేళలో మాట్లాడేస్తోందంటే ఖచ్చితంగా ప్రేమే.

ప్రేమే ఆ శక్తినిస్తుంది. ప్రేమే ఆకళని తెస్తుంది.

ఆ తరువాత -

ఒకటి రెండుసార్లు ఓ బైక్ మీద ఓ అబ్బాయితో ఎలక్ట్రిక్ స్తంభం పక్కన కనబడటం - దగ్గర్లో వున్న పార్కులో ముసిముసినవ్వులతో, గుసగుసలు చెప్పుకోవడం నా కంటపడ్డాయి.

ఈ డాబా మీద చాలా ప్రేమ కథలు పుట్టాయి. ఇక్కడ పుట్టిన మరో ప్రేమ కథ యిది.

చాలా ప్రేమ కథలకి పెళ్ళిళ్ళు అయిపోవడం కూడా నాకు తెలుసు. వీళ్ళ కథ పెళ్ళి పాయింట్ కి ఎప్పుడు చేరుతుందాని చూస్తున్నాను.

ఆరోజు - ఎప్పటిలాగే రాత్రి ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతోంది. మాటలు హుషారుగా లేవు. ఏదో కంప్లయింట్ చేస్తున్నట్టు మాట్లాడుతోంది.

అలక సీను అనుకున్నా -
ఉన్నట్టుంది ఉరుములు మెరుఫుల్లా పెద్ద పెద్ద కేకలు -
ఒక ఆవేశంలో ఆ అమ్మాయి చేతిలో వున్న కొత్త సెల్ ఫోన్ విసిరి కొట్టింది. కృష్ణపక్షపు గుడ్డి వెలుతురులో విరిగిన సెల్ ఫోన్ ముక్కలు కనిపిస్తున్నాయి. ఏమైంది?

ఫెయిల్యూర్ లవ్ స్టోరీనా? ఏమో?

... వాళ్ళు మళ్ళీ కలిసారా, ప్రేమ గొడవ సెటిలయ్యిందా, ఏమైందో నాకు తెలీదు - ఎందుకంటే - అనుకోని మలుఫులా మా ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమనడంతో వేరే రూమ్ కి మారిపోయా! ఆ అమ్మాయి ప్రేమకథ ఏమైందో ఎప్పటికైనా తెలుసుకుంటానని అప్పుడప్పుడు అన్పిస్తుంది!!!

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు