జ్వాల - యజ్ఞమూర్తి

jwala

మొదటిసారి చూసినప్పుడే ప్రతిమ తెలివైన పిల్ల అనిపించింది. అప్పుడామెకు పదహారేళ్లు ఉంటాయి. పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్ మీదుగా నడచుకుంటూ జీడిమామిడి తోట కాడికి కల్పనతో కలిసి వెళ్తున్నప్పుడో, లేదంటే ఇద్దరం కలిసి ద్విపాత్రల నాటకాలను రిహార్సల్స్ వేస్తుంటేనో తను తరచూ కనిపిస్తుంటుంది.

ఓ వైపు జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తూ, మరోవైపు ఏకపాత్ర నాటికలూ, కల్పనతో కలిసి రెండేళ్ల నుంచీ ద్విపాత్రల నాటికలూ, నాటకాలూ వేస్తూ వస్తున్నా. ఈ రెండేళ్లలో రెండు నాటకాలు ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీలో ప్రదర్శనకు నోచుకోవడం, ఆ విషయం పత్రికల్లో, టీవీ చానళ్లలో ప్రముఖంగా రావడంతో మా ప్రాంతంలో అధ్యాపకుడిగానే కాకుండా, రంగస్థల కళాకారుడిగా కూడా నా పరపతిని పెంచింది. కల్పన కూడా మంచి కళాకారిణి అనే పేరొచ్చింది.

నా ఆనందాన్ని ఆవిరి చేస్తూ కల్పన ప్రాణాంతక బ్రైన్ కేన్సర్‌కు గురయ్యింది. కొంత కాలంగా రంగువెలిసిపోయిన బొమ్మలాగా తయారయ్యింది. హైదరాబాద్‌లో పేరొందిన కేన్సర్ హాస్పిటల్‌కు తీసుకుపోయాను. ఆమె జబ్బుని నయం చేయడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయినవాళ్లు, ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు కూడా ఆమె చెంపలు నునుపుగానే ఉన్నా, వాటిలో జీవం కనిపించడం లేదు. ఒకప్పుడు మృదువుగా, పిరుదుల దాకా వేలాడుతూ ఆమె అందానికి తావి అబ్బినట్లుగా ఉండే జుట్టు పెళుసుగా, కురచగా మారింది. ఆ స్థితిలోనూ ఆమె స్టేజిపై నటిస్తోంది. అయితే ఒకప్పటి అల్లరి ఆమెలో లేదు. నన్ను ప్రేమలో పడేసి, మా పెద్దల్ని ఎదిరించి నేను పెళ్లి చేసుకునేదాకా వదిలిపెట్టలేదు తను. అట్లాంటి కల్పన ఇలా అయిపోతున్నందుకు మనసులో ఎంత వేదనా, తుఫానూ చెలరేగుతున్నాయో!

ఓ ఆదివారం మధ్యాహ్నం, సాయంత్రంగా మారబోతున్న వేళ.. సూర్యుడు కిందికి దిగుతున్నాడు. పడమటి ఆకాశం ఎర్రనవుతోంది. ఆ సంధ్య వెలుగులో సముద్రానికి అభిముఖంగా నిల్చుని కల్పనకు వీపు చూపిస్తూ, రావణునిగా అభినయిస్తున్నా. కల్పనది మండోదరి పాత్ర.ఆ సమయంలో కల్పనకు ఎదురుగా కాస్తంత దూరంలో నిల్చొని, ఇటువైపే చూస్తోంది ఓ అమ్మాయి. డైలాగులు చెబుతూ కల్పన వైపు చూసినప్పుడు, నా కళ్లల్లో మెరుపులా ఆ అమ్మాయి తళుక్కుమంది. నేను ప్రశ్నార్థకంగా ఆమె వంక చూస్తా, "ఎవరా అమ్మాయి?" అనడిగా కల్పనను.

"ఈ దగ్గర్లోనే ఉంటుంది" అని ఆగి, "నీ పేరు ప్రతిమ కదూ?" అనడిగింది కల్పన. ఆమె కాస్తంత సిగ్గుపడుతూ తలూపింది."ఓ.. నువ్వేనా ప్రతిమ అంటే" అన్నాను, నేను తలాడిస్తూ. అదివరకే ఒకట్రెండు సందర్భాల్లో ఆమె ప్రస్తావన తెచ్చింది కల్పన."రత్నా టీచర్ చెప్పింది. నాకు సాయంగా ఉంటావా?" అడిగింది కల్పన. "ఆ సంగతి చెప్పడానికే వచ్చానండీ. మీ ఇంట్లో పని చేస్తాను" అంది ప్రతిమ."మా ఇంట్లో పెద్దగా పనులేమీ ఉండవు. నా పనులు నేను చేసుకుంటా. నువ్వు కల్పనకు సాయంగా ఉంటే చాలు" అని చెప్పాను.

కల్పన పనులు చూసుకోడానికి మా ఇంటికి వచ్చేసింది ప్రతిమ. ఆమె నేను పనిచేసే కాలేజీలోనే అటెండర్‌గా చేసి, రిటైరయిన వెంకట్రామయ్య మనవరాలేనని కల్పన ద్వారా తెలిసింది. ఊళ్లో ఓ చిన్న పెంకుటింట్లో తాతా మనవరాళ్లు ఉంటున్నారు. ఆమెకు ఐదారేళ్ల వయసున్నప్పుడు ఆమె అమ్మానాన్నలు ఏదో యాత్రకు వెళ్లొస్తూ, బస్సు ప్రమాదంలో చనిపోయారు. ప్రతిమ చిన్నపాటి గాయాలతో బతికింది. అప్పుడు వాళ్లు కరవదిలో ఉండేవాళ్లు. ఆ వయసులోనే ఆమెను తన వద్దకు తెచ్చేసుకున్నాడు వెంకట్రామయ్య. మూడేళ్ల క్రితం ప్రతిమ వాళ్ల అమ్మమ్మ కూడా పోయింది.

నేను జీడిమామిడి తోటలోకి ప్రాక్టీస్‌కి వెళ్లినప్పుడల్లా ఆడవాళ్లిద్దరూ భోజనం వేళకు క్యారేజ్ పట్టుకుని అక్కడకు వొచ్చేవాళ్లు. నేను పాత్రాభినయం చేస్తుంటే చూస్తూ కూర్చునేవాళ్లు. ప్రతిమ ఏదైనా మాట్లాడబోతే "ష్.. మాట్లాడకు. ఆయనకు డిస్టర్బెన్స్" అనేది కల్పన, నోటిపై వేలుపెట్టి. నా ప్రాక్టీస్ అయిపోయాక, సముద్రం ముందు కూర్చుని అలల్నీ, దూరంగా కనిపించే పడవల్నీ చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఉవ్వెత్తున ఉరుకుతూ ఒడ్డుని తాకి వెనక్కి మళ్లే అలల్ని పట్టుకోడానికి ప్రయత్నించేది ప్రతిమ. ఒడ్డుని అలలు తాకినప్పుడు వచ్చే సవ్వడి నా చెవులకు సంగీతం. రోజులు గడుస్తున్నాయి. ప్రతిమ మా ఇంటి సభ్యురాలు అయిపోయింది. మా ఇంట్లో ఆమెకు బాగానే ఉంటున్నట్లు, కల్పన అనారోగ్యం ఒక్కటే ఆమెకు విచారం కలిగిస్తున్నట్లు గ్రహించాను. జబ్బుతో బాధపడుతూ కల్పన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కూడా నేను "ఇంతకు ముందెప్పుడూ ఇంత అందంగా నువ్వు కనిపించలేదురా. నీ బుగ్గలు ఎర్రగా ఎట్లా మెరుస్తున్నాయో. తొందర్లోనే నీకు నయమైపోతుంది" అనేవాణ్ణి. ఆమె బుగ్గలు రంగు మార్చుకుంటున్న సంగతి నిజం. కానీ అది ఆరోగ్యానికి సంకేతం కాదు. ఆమె బుగ్గలు ఎర్రగా కాదు, తెలుపు-పసుపు కలిసిన పచ్చరంగులోకి మారుతున్నాయి. నిన్నటి మెరుపుతీగ కళావిహీనమైపోతోంది. కల్పనతో నేననే మాటలకు ప్రతిమ కళ్లలో కొచ్చన్ కనిపించేది. 'ఆమె జబ్బును నువ్వు సీరియస్‌గానే పట్టించుకుంటున్నావా?' అని అవి ప్రశ్నిస్తున్నట్లుండేవి.

తన అనారోగ్యం కారణంగా ద్విపాత్రల నాటకాలను పక్కనపెట్టి, ఏక పాత్రల మీదే దృష్టిపెడుతున్నాను. ఎందుకు తనకు ఆ ఆలోచన వచ్చిందో, "ప్రతిమ కళ్లు చూశావా. ఆమెలో చక్కని నటి ఉందని నాకనిపిస్తోంది. మాట్లాడకుండానే ఆ కళ్లు ఎన్ని భావాలు పలికిస్తాయో. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పిల్ల ఆసక్తిగా చూడ్డం గమనించాను. తయారుచేస్తే నీకు స్టేజిపై చక్కని జోడీ అవుతుంది" అంది కల్పన.

నేను కలవరపడ్డాను. తను ఆ చివరి మాటని యథాలాపంగా అన్నదా, కావాలని అన్నదా? నా మొహంలో భావాలు ఆమెకు తెలీకుండా జాగ్రత్తపడ్డాను.

"నువ్వన్నది నిజమే కానీ, వాళ్ల తాతయ్య ఏమంటాడో. ఆయనకు చెప్పకుండా చేయడం బాగోదు" అన్నాను.

"ఆ సంగతి నేను చూసుకుంటాలే" అంది కల్పన.

ఆమె రోజురోజుకూ బలహీనమైపోతోంది. నాకు భోజనం తెచ్చే ఓపిక్కూడా ఉండట్లేదు. మొదట్లో ప్రతిమ ఒక్కతే వొస్తుండటం చూసి, ఆమె వెనక కల్పన కోసం వెతికేవాణ్ణి. తను కనిపించకపోతే నిరాశపడేవాణ్ణి. శిశిర రుతువు పోయి, వసంత రుతువు తిరిగేసరికి ప్రతిమ ఒంటరి రాకకు అలవాటుపడ్డాను.

నా ప్రాక్టీస్ అయ్యాక కొన్నేసిసార్లు తోటలో నేలమీదకి వాలిన జీడిమామిడి కొమ్మల మీద కూర్చుని, ఆకుల చాటు నుంచి వొచ్చే నులివెచ్చని సంధ్య కిరణాల్లో మా దేహాలు తడుస్తుంటే, మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్లం.

"ప్రతిమా, నీకు తెలుసా? నా ఇన్‌స్పిరేషన్ కల్పన. తనకేమైనా అయితే ఇక నటిస్తానని నేననుకోవట్లేదు" అన్నాను.

చప్పున ఆమె ఒళ్లు వొణకడం తెలిసింది.

"చావు మనందర్నీ ఏదో ఓ రోజు పలకరిస్తుంది. దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. అసలు చావంటే ఏమిటండీ? జీవితానికి ఇంకో వైపే కదా" అంది.

నేను ఆశ్చర్యపోతూ.. కాదు.. కాదు.. షాకై ఆమె మొహం వొంక చూశా. పదహారేళ్ల ఈ టీనేజ్ అమ్మాయికీ, ఆమె మాటలకీ ఏమన్నా పొంతన ఉందా? తన మాటల్లో జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది. బహుశా చిన్నతనంలోనే తన అమ్మానాన్నల చావును చూసినందున, ఆమెకు ఈ పరిణతి వొచ్చిందా?

ఎదురుగా సాగరుడు.. జీవితానికి ప్రతీకగా.. పడుతూ, లేస్తూ ఒడ్డును ఒరుసుకుని, వెనక్కి మళ్లుతున్న అలలు జీవిత నాటకంలోని తెరలు.

రెండేళ్లు గడిచాయి, నెమ్మదిగా, భారంగా. కల్పన ఇప్పుడు ఎక్కువగా మంచంపైనే ఉంటోంది. కీమోథెరపీ కూడా అయ్యింది. చివరి ఆశలు మిగిలాయి. ప్రతిమతో ప్రైవేటుగా ఇంటర్మీడియేట్ పాసయ్యింది. ఆమెకు నేను, కల్పన టీచర్లం. ప్రతిమ వొద్దంటున్నా వినిపించుకోకుండా ఆమె పద్దెమిదో పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది కల్పన. నా చేత కేక్ తెప్పించి, ఆమెతో కట్ చేయించింది. ప్రతిమ చాలా సిగ్గుపడింది. "గౌతం, ప్రతిమను చూడు.. ఎంత పెద్దదైపోయిందో. ఇప్పుడు తను సంపూర్ణ యవ్వనవతి. మేజర్" అంది కల్పన, మురిపెంగా.నేను ప్రతిమ వొంక చూశా. నిజం. అయస్కాంతంలాంటి ఆకర్షణ శక్తితో, పూర్ణాకృతి సంతరించుకున్న అందాలతో వెలిగిపోతోంది ప్రతిమ. నేను నటుణ్ణి. నా ఫీలింగ్స్‌ను బయటపెట్టకుండా చాలా మామూలుగా చూసినట్లు చూసి, పెదాల మీద సన్నటి నవ్వు తెచ్చుకుని, తల తిప్పేశా.సాధ్యమైనంత ఎక్కువ సమయం కల్పనతో గడుపుతూనే తెన్నేటి సూరి 'చెంఘీజ్‌ఖాన్' పుస్తకం ఆధారంగా ఏక పాత్ర నాటకాన్ని రాసుకున్నా. ఆ పుస్తకం చదివినప్పట్నించీ, ఎలాగైనా దాన్ని ఏకపాత్ర నాటకంగా ప్రదర్శించాలనే కోరిక బలపడుతూ వొచ్చింది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పట్టుదలతో తయారుచేశాను. ఇక దాన్ని ప్రాక్టీస్ చేసి, స్టేజిమీదకు వెళ్లడమే తరువాయి.

ఆ రోజు.. నేను 'చెంఘిజ్‌ఖాన్'ను ఆవాహన చేసుకొని అభినయిస్తున్నా. నా చేతులు, కాళ్లు రిథమిగ్గా కదులుతున్నాయి. తీక్షణమైన ఏకాగ్రతతో కళ్లతో భావాలు పలికిస్తున్నా. నోటి నుంచి పదునైన బాకుల్లాంటి మాటలు విసురుతున్నా.

ఒక్కసారి కడలి మారుతం చల్లగా వొంటిని తాకింది. కళ్లు మూసుకుని, తలను వెనక్కు వంచా. చప్పున వెచ్చగా నరాల్లో నెత్తురు పరుగులు పెట్టింది.నా వెనుక, నేలమీదికి వాలిన చెట్టు కొమ్మమీద కూర్చుని, కాళ్లు రాయి మీదపెట్టి, నన్నే తదేకంగా చూస్తోంది ప్రతిమ! ఎంత ముచ్చటగా ఉంది! మొదటిసారి ఓ మగాడిలా ఆమెను చూశా. నేను తన వొంక చూస్తున్నా, ఆమె కళ్లు వాల్చలేదు, తలతిప్పలేదు. ఎప్పుడూ నా వొంక అలా ఆమె చూడలేదు.

ఒక్క నిమిషం అలాగే చూసి, నవ్వుతూ "ప్రతిమా! ఏదో ఓ రోజు నువ్వు మంచి నటివి అవుతావు. నేను నిన్ను నటిని చేస్తాను" అన్నాను.అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్నదానికి మల్లే ఉలిక్కిపడింది. కొద్ది క్షణాలు.. కళ్లు కళ్లు కలుసుకున్నాయి. మొదట సంతోషం, అంతలోనే తెలీని ఆందోళన ఆమె మొహంలో...

"నేను నమ్మను. మీ మాటల్లో సీరియస్‌నెస్ లేదు. ఊరకే అంటున్నారు" అంది.

నేను దొరికిపోయాను. ఇబ్బందిగా అనిపించి, మొహం తిప్పుకున్నా. సిగ్గుపడ్డా. ఆ పూట బలవంతంగా ఆమెనూ భోజనానికి కూర్చోబెట్టా. ఇంకో రెండు గంటలకల్లా నా ప్రాక్టీస్ ముగించేశా.ఇద్దరం కలిసి ఇంటివేపు నడుస్తున్నాం. ఒక్క మాటా లేదు మా మధ్య. ఇద్దరికీ తెలుస్తోంది, మా మనసులు సిగ్గుపడుతున్నాయని.

ఇల్లు దగ్గిరపడింది. తెరిచిన కిటికీలోంచి, ఎత్తు దిండుమీద తలపెట్టి పడుకుని మమ్మల్ని అల్లంత దూరం నుంచే కల్పన చూసిందనుకుంటా. ఆమె మొహం నెత్తురులేకపోవడం వల్ల తెల్లగా పాలిపోయి వున్నా, దానిపై చిరునవ్వు, కొంచెం ఎమోషన్ కనిపిస్తున్నాయి. మా ఇద్దర్నీ కలిపి చూడ్డం ఆమెకు ఆనందాన్నిచ్చిందా? అపరాధ భావన వంద రెట్లు పెరిగిపోయింది నాలో.

నేను ఆ గదిలోకి వెళ్లగానే "గౌతం, నీకు లెటర్ వొచ్చింది" అని ఇచ్చింది కల్పన. ఉత్తరం తెరిచి చూడగానే ఆనందం, ఆ వెంటనే కాస్తంత దిగులూ కలిగాయి. మిన్నియాపొలిస్ (అమెరికా)లోని ప్లేరైట్స్ సెంటర్ నన్ను మెక్‌నైట్ థియేటర్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ కోసం ఎంపిక చేసింది. అంటే సర్టిఫికెట్‌తో పాటు ఏకంగా 25,000 డాలర్లు బహుమతిగా అందజేస్తారు. 15 లక్షల రూపాయలు! నిజంగా ఎంత సంతోషకరమైన వార్త! ఎంత అరుదైన ఘనత!! కానీ...

"అయితే తొందర్లోనే యు.ఎస్. వెళ్లబోతున్నావన్న మాట" అంది కల్పన, సంతోషపడ్తూ.

తల అడ్డంగా ఊపాను. "లేదు. దీని గురించి ఆలోచించాలి" అన్నాను.

"నువ్వు వెళ్తున్నావ్. నన్ను చూసుకోడానికి ప్రతిమ ఉంది" అని తేల్చేసింది కల్పన.

క్యాబ్‌లో కూర్చోడానికి వెళ్తూ ప్రతిమ చేతిపై చేయి ఆంచి, "ప్రతిమా, తనని జాగ్రత్తగా చూసుకో. ఎప్పటికప్పుడు విషయాలు చెప్తుండు" అని చెప్పాను.

ఆమె తలూపింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి క్యాబ్ కదిలింది. కిటికీ వేపు చూశా. నాకు తెలుసు, నన్ను కల్పన తనివితీరా చూసుకుంటూ ఉంటుందని.

నేను మిన్నియాపొలిస్‌లో ఫెలోషిప్ అందుకుని, ముంబైలో అడుగుపెట్టానో, లేదో సంగీత నాటక అకాడమీ నుంచి విషాద వార్త. నన్నూ, ఈ లోకాన్నీ శాశ్వతంగా వొదిలేసి వెళ్లిపోయింది నా కల్పన.

ఫెలోషిప్ తీసుకున్న వెంటనే నేను ఫోన్‌చేసి చెప్పినప్పుడు ఆమె బలహీనంగానైనా ఎంత సంతృప్తిగా నవ్విందో జ్ఞాపకమొచ్చి, కళ్లల్లోంచి నీళ్లు ఉబికుబికి వొచ్చాయి.

ఇంటికి ఫోన్ చేశాను. ఏడుస్తూ చెప్పింది ప్రతిమ - "చివరి క్షణం దాకా మిమ్మల్నే తలుచుకుంది."

శ్మశానంలో కల్పన నిర్జీవ దేహాన్ని ఖననం చేస్తుంటే గుండె పగిలిపోయినట్లయింది. ఆమెతో పాటు నాలోని ఓ భాగమేదో వెళ్లిపోయింది. చిత్రమేమంటే కర్మకాండలు జరిగినంతసేపూ నేనేడ్వలేదు. ఇంట్లోనూ ఏడ్వలేదు. కల్పన వాళ్లమ్మా నాన్నలు వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్నంతసేపూ కల్పన ఏ పడగ్గది మంచంపైన చివరి శ్వాస తీసుకుందో, ఆ గది కిటికీ దగ్గర కూర్చొని సముద్రాన్ని అట్లా చూస్తూ కూర్చుంటున్నా. ఇంట్లోంచి బయటికొస్తే గమ్యం తెలీకుండా ఊరికే అలా నడచుకుంటూ వెళ్లి, ఎప్పుడో తిరిగొచ్చేవాణ్ణి. క్లాస్ రూంలో లెసన్స్ ఎలా చెప్తున్నానో నాకే తెలీదు.

దేన్నైనా మరిపించగల శక్తి ఒక్క కాలానికే ఉందనుకుంటా. కల్పన పోయాక కూడా ప్రతిమ రోజూ ఇంటికొస్తోంది. ఇంటి పనులతో పాటు వంటచేసి పెడుతోంది. అయితే ఆమె ఉనికిని గమనించనట్లుగానే ప్రవర్తిస్తున్నా. నాకు ఏ లోటూ లేకుండా చూడాలనే తపన ఆమెలో కనిపిస్తున్నా, తెలీనట్లే ఉంటున్నా.

వేసవి ప్రతాపం చూపిస్తున్న రోజుల్లో ఓ సాయంకాలం ఉన్నట్లుండి ఈదురు గాలులు మొదలయ్యాయి. సెకన్లలో వాన జడివానగా మారింది. ఎక్కడా ఆగడానికి ఆస్కారం లేదు. తడిసి ముద్దయి, ఇంటికొచ్చాను. ధడేలున తలుపు తోసి, విసురుగా లోపలికొచ్చాను. బట్టలు నానిపోయి, వొంటికి అతుక్కుపోయాయి. నుదుటిపై పరుచుకున్న జుట్టును వెనక్కి తోసి, చొక్కా విప్పబోతుంటే నా దగ్గరకొచ్చి సాయం చెయ్యడానికి ప్రయత్నించింది ప్రతిమ. నేను ఆమె వొంక చురుగ్గా చూశాను.

"ముద్దగా తడిసిపోయారు. ఒళ్లు ఎట్లా వొణికిపోతోందో చూడండి" అంటా చొక్కా తీయబోయింది.

ఆమైనే విసురుగా ఆమెను అవతలకు తోసేశా. "నన్నిలా వొదిలేయ్. నా ఒంటి మీద బట్టలు తీసుకోవడం నాకు చేతనవును" అన్నా, అరిచినట్లే. చొక్కా తీసి పక్కనే ఉన్న కుర్చీపై పడేశా. షూస్ విప్పడానికి కిందికి వొంగా. ఒళ్లు వొణికిపోతుండటంతో లేసులు విప్పడానికి వేళ్లు సహకరించలేదు. అట్లాగే కుర్చీలో కూలబడ్డా. వెచ్చదనం కోసం రెండు చేతులూ ముడుచుకున్నా. పళ్లు పటపటమంటున్నాయ్. కళ్లు మూసుకున్నా. ప్రతిమ షూ లేసులు విప్పడం తెలిసి, కళ్లు తెరిచా.

"వేణ్ణీళ్లు పెడతాను, స్నానం చేద్దురు గానీ. ఈలోగా తల తుడుచుకోండి" అని టవల్ అందించబోయింది ప్రతిమ. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.

"నీ ఉద్దేశమేంటి? కల్పన ప్లేస్‌లోకి వొద్దామనుకుంటున్నావా? అది నీ తరం కాదు. కల్పనే నా సర్వస్వం. ఆమె ప్లేస్‌లోకి ఎప్పటికీ ఎవరూ రాలేరు" అనరిచా.

ప్రతిమ ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. పైగా నా మనసు చదివిన దానికిమల్లే "ఎందుకట్లా గంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడైనా తనివితీరా ఏడ్వండి" అంది.

నా గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది.

"ఎంతటి నల్ల మబ్బులకైనా తెల్లటి అంచు తప్పకుండా ఉంటుంది. జీవిత లక్ష్యం చైతన్యం" అంది మళ్లీ తనే. ఈ మాటలు ప్రతిమవి కావు, కల్పనవి. ఆమె నోటివెంట ఆ మాటలు ఎన్నిసార్లు విన్నానో.ఓ రకమైన భావోద్వేగంతో ఊగిపోతూ, ప్రతిమ నడుము చుట్టూ చేతులేసి, ఆమె గుండెల మధ్య తలదాచుకున్నా.

"ప్రతిమా, నన్నేం చెయ్యదలచుకున్నావ్?" అనడిగా, పూడుకుపోయిన గొంతుతో. ఆమె మాట్లాడలేదు. తలను పైకి జరిపి మెడమీద పెదాలతో రుద్దాను. ఆమె దేహాన్ని నా రెండు చేతులూ గట్టిగా పెనవేసుకుపోయాయి. ఆమె నన్ను నెట్టేయలేదు. సముదాయిస్తున్నట్లుగా నా భుజం మీద చిన్నగా తడుతూ, "మాస్టారూ" అంది.

చప్పున ఎవరో ఛెళ్లున చెంపమీద చరిచినట్లనిపించింది. తెలివి తెచ్చుకొని, గభాల్న ఆమెను వొదిలేసి, దూరంగా జరిగా. "నువ్వేం చేస్తున్నావ్? నన్ను సెక్స్‌లో దింపాలని అనుకుంటున్నావా. ఇన్ని రోజుల నుంచీ నువ్వు కోరుకుంటోంది ఇదేగా. కల్పన పోకముందు కూడా నీ కళ్లల్లో నేను చూశాను. అవునా, కాదా?" అని గద్దించా, మండుతున్న కళ్లతో.

ప్రతిమ నా మొహంలోకి ఓసారి చూసింది. సిగ్గుతో, అవమానంతో ఆమె మొహం కందగడ్డలా మారిపోయింది. ఆ వెంటనే ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.

ఆమెపై నేను చేసిన భయంకర ఆరోపణకు కారణమేంటో ఆమెకు తెలిసే అవకాశం లేదు. నేనంటే ఆమెకు విపరీతమైన ఆరాధన. కల్పన ఎన్నోసార్లు ఆ విషయం చెప్పింది. 'ఆ.. చిన్నపిల్ల కదా' అని తేలిగ్గా తీసేస్తూ వొచ్చేవాణ్ణి. కల్పన పోయాక నాకు తోడుగా ఉండాలనేది ఆమె ఆరాటం. అది సరైన పని కాదనీ, ఆమెను దూరం పెట్టాలనీ నా పోరాటం.

ఆమె దగ్గరగా ఉంటే నాలోని లైంగిక జ్వాల అదుపు తప్పుతోన్న సంగతి నాకు స్పష్టమవుతోంది. ఆమెను అవమానించడానికి ఇదొక్కటే కారణం కాదు. "నిజమేమిటో నాకు తెలీదు. కానీ మీకూ, ఆ పనిపిల్లకీ మధ్య ఏదో నడుస్తోందని జనం అనుకుంటున్నారనేది నిజం" అని కల్పన వాళ్ల నాన్న అన్న మాటలు నేనెలా మరచిపోగలను?

జనం మాటలు నిజం చెయ్యాలనే కోరిక నాకే మాత్రమూ లేదు. ప్రతిమను పెళ్లి చేసుకుని ఆమెకు గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి నేనేమీ గొప్పవాణ్ణి కాదు. అందుకే ఆమెను అవమానించాను. దాన్ని అర్థం చేసుకోగలిగే వయసు కానీ, పరిణతి కానీ ప్రతిమలో ఉన్నాయని నేననుకోను. ఇప్పటికైతే నాకు కల్పన జ్ఞాపకాలు చాలు. ఆ జ్ఞాపకాలతో, ఆమె ఇచ్చిన స్ఫూర్తితో కళాకారుడిగా నేను ఎక్కాల్సిన మెట్లు ఎక్కగలననేది నా నమ్మకం.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు