ప్రకటనల వైకుంటం! - ప్రతాప సుబ్బారాయుడు

Prakatanala Vaikuntham story by Pratapa Subbarayudu

'ఉ చితం'
శివ పంచాక్షరిలా రాంబాబుకి ఎంతో కర్ణపేయంగా ఉంటుందా మాట.

పక్క వాళ్ళకి తాగడానికి గుక్కెడు నీళ్ళు... తినడానికి గుప్పెడు మెతుకులు పెట్టని సమాజం మనది, అలాంటిది ఉచితంగా ఇస్తున్నారంటే ఏమనాలి. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నది రాంబాబు ఉవాచ.

ప్రతిరోజు నాలుగు రకాల పేపర్లు వేయించుకుంటాడు. రాజకీయాలపై ఆసక్తితోనో... సినిమా వాళ్ళ విశేషాలు తెలుసుకునే వార్తలకోసమో కాదు. కేవలం ప్రకటనల కోసం. ఉచితం అని కనిపించే ప్రకటనల కోసం. అది కనిపించిందంటే ఆ పూట పండగ. ఆఫీసులో పర్మిషను తీసుకుని అది ఎంత దూరంలో వున్నా అవలీలగా వాలిపోతాడు.

ఈరోజు కూడా పేపర్ల కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. ఈపాటికే పేపర్లొచ్చేయాలి కాని వెయ్యలేదు. అదే అతని అసహనానికి కారణం. అంతలో పేపర్ల కట్ట విసురుగా వచ్చి ముఖానికి బలమైన దెబ్బ తగిలింది. మరొకరైతే కుమిలిపోయి హాకరుని కేకలేసేవారు. కాని మనవాడు చిన్న గీత ముందు పెద్ద గీతలా పేపర్లలో ఉచితం అన్న పదం చూడాలన్న ఆత్రంలో అది పట్టించుకోలేదు. గబ గబా టీపాయి మీద వాటిని పరచుకుని కుర్చీలో కూర్చుని హడావుడిగా పేజీలు తిరగేశాడు.

చిన్నా బ్రదర్ సూపర్ మార్కెట్ కొత్తగా టోలీచౌకీలో ప్రారంభిస్తున్నాం. ఈ శుభసందర్భంలో అద్భుత ప్రారంభ ఆఫర్ గా మొట్ట మొదటగా విజిట్ చేసిన వందమందికి పదకొండొందల రూపాయల గిఫ్ట్ ఓచర్స్ ఇవ్వబడును. మూడువేల పర్చేజ్ తో వెయ్యి రూపాయలకే డి వి డి ఫ్లేయర్ తీసుకోవచ్చు. ఇహ మన రాంబాబు మనసు గాల్లో తేలిపోవడం మొదలెట్టింది.

సెల్ ఫోన్ తీసుకుని కొలీగ్ కనకారావుకి ఫోన్ చేసి తను ఇవాళ ఒంట్లో బాగా లేక ఆఫీసుకి రావడం లేదని బాస్ కీ విషయం చెప్పమని అభ్యర్ధించాడు. తర్వాత " సుందరీ, ఒసేవ్ సుందరీ" అని భార్యని కేకేశాడు.

మాంచి నిద్రలో వున్న ఆమె అదాటున లేచి "ఎవరో చచ్చినట్టు ఏంటా అరుపులు?" అంది కోపంగా.

"అది కాదే సుందరీ, మరేమో నేనివాళ ఆఫీసుకి వెళ్ళడం లేదు. కారణం..." అని విషయం మొత్తం విపులంగా చెప్పాడు.

" హవ్వ... ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎక్కడ టోలిచౌకి ఎక్కడలోకం ఇక్కడినుండి అరవై కిలోమీటర్లుంది. పైగా ఆఫీసు మానేసి వెళతారా? చోద్యం కాకపోతే!"

" అదికాదే నీకు విషయం పూర్తిగా అర్ధం కాలేదు పదకొండొందల గిఫ్ట్ ఓచర్లు ఇస్తారట, మనం ఎప్పటినుండో డి వి డి ఫ్లేయర్ కొనాలనుకుంటున్నామా... మార్కెట్లో మినిమం మూడువేల రుపాయలుంది. అలాంటిది వెయ్యి రుపాయలకే ఇస్తానంటున్నారా... ఉపయోగించుకోవాలే... ఇలాంటి ఆఫర్లు తెలివిగా ఉపయోగించుకోవాలి. నేను ఇక బయల్దేరుతా, టిఫిన్ బయట చేస్తా, మొదటిగా విజిట్ చేసిన వందమందికే గిఫ్ట్ ఓచర్లట" అన్నాడు.

"ఖర్మ... నే చెబితే ఏరోజు విన్నారు గనక? వెళ్ళండి" అంది విసురుగా.

రాంబాబు తన డొక్కు స్కూటరు మీద బయలుదేరాడు.

అక్కడికెళ్ళేసరికి ఎవరూ లేరు షాపు కూడా మూసి వుంది. షాపు ముందు చాలా మంది ఉంటారని... తొక్కిసలాట జరుగుతుందని ఊహించన రాంబాబుకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. టైము చూసుకున్నాడు పావుతక్కువ తొమ్మిదయింది. అక్కడి వాచ్ మెన్ న అడిగాడు షాప్ ఎప్పుడు తెరుస్తారని. ముహూర్తం పదకొండూ నలభై అయిదుకయినందువల్ల పదిన్నరకి షాపు తెరుస్తారని చెప్పాడు.

రాంబాబు చేసేదేం లేక కడుపులో ఎలుకలు పరిగెడుతుండటంతో దగ్గర్లో వున్న హోటల్ కి వెళ్ళి పెసరట్టు ఉప్మా తిని కాఫీ తాగాడు. బిల్లు యాభై అయింది. 'చక్కగా ఇంట్లో తిని వచ్చినా బాగుండేది డబ్బు మిగిలేది' అనుకుని నిట్టూర్చాడు.

షాపు తెరవంగానే లోపలికి వెళ్ళబోయాడు. " ఆగండి సార్ పూజ పూర్తయ్యాక, పెద్ద బోణీ అయ్యాక మీరు షాపింగ్ చేద్దురు గాని" అన్నాడు పట్టు బట్టల్లో, చేతి వేళ్ళకి ధగ ధగలాడే ఉంగరాలతో మెరిసిపోతున్న షాప్ ఓనర్.

రాంబాబు ఒక మూల నిలుచున్నాడు. అంతా అయ్యేసరికి రెండు అయ్యింది. వాడిపోయిన ముఖంతో రాంబాబు షాప్ లోపలికి అడుగుపెట్టాడు. చల్లని ఏ సి గాలి... పై నుండి కూల్ డ్రింక్ ఇవ్వడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చింది. ఉత్సాహంగా షాపింగ్ పూర్తి చేసి బిల్ కౌంటర్ ముందు నుంచున్నాడు. బిల్ పూర్తయ్యాక " సార్ మీరు చాలా అదృష్టవంతులు... మీరు తొంభై తొమ్మిదో వారు మీ గిఫ్ట్ ఓచర్లు ఇదిగోండి" అన్నాడు కౌంటర్ లోని వ్యక్తి. పట్టుమని పాతికమంది కూడా లేరు తనది అప్పుడే తొంభై తొమ్మిది ఎలా అయిందో అర్ధం గాక బుర్ర గోక్కున్నాడు. ఏదయితేనేం తనకి గిఫ్ట్ ఓచర్లు సొంతమయ్యాయి అనుకుని "ఇవన్నీ ఇప్పుడే రిడీం చేసుకోవచ్చా!"అన్నాడు ఆశగా.

కౌంటర్లో కూర్చున్న వ్యక్తీ రాంబాబుని వెర్రి వెంగళాయిని చూస్తున్నట్టుగా చూసి " ఇవన్నీ నెలకి వంద చొప్పున రిడీం చేసుకోవాలి. ఆల్రెడీ మేము ఒకటి కన్సిడర్ చేసేశాం. అందుకే మీకు పదకొండు నెల్లకి పదకొండు కూపన్లు ఇచ్చాం." అని చెప్పి నవ్వాడు. అంటే వందరూపాయల ఓచర్ కోసం నెలకోసారి ఇంతదూరం రావాలన్నమాట. " మరి వెయ్యి రూపాయలకే డి వి డీ ఫ్లేయర్?" అడిగాడు క్వశ్చన్ మార్కు ముఖంతో. " అచ్చా మీకు డి వి డి ఫ్లేయర్ కావాలా? ఇప్పటిదాకా మీరు పర్చేజ్ చేసిన వాటికి డిస్కౌంట్ రేట్స్ వేశాం. మరి డి వి డి ఫ్లేయర్ కావాలంటే ఎం ఆర్ పి రేట్స్ వెయ్యాలి మరి వెయ్యనా" అన్నాడు.

రాంబాబు చేసేదేం లేక 'సరే' అన్నాడు. మెషిన్ లో ఏదో ఫీడ్ చేసి వెంటనే బిల్ ఫ్రింట్ తీసి ఇచ్చాడు. రెండు వేల తేడా. పైన తనెలాగు వెయ్యి రూపాయలు కట్టాలి అంటే మార్కెట్ లో దొరికే రేటే! నిట్టూర్చి అది కూడా తీసుకుని డబ్బెక్కువుగా తేనందుకు, క్రెడిట్ కార్డుతో బిల్ కడుతున్నందువల్ల 2.5 శాతం అదనంగా కట్టి ఈసురోమంటూ బయటకొచ్చాడు. రాంబాబుకి తనేం సాధించాడో అర్ధం కాలేదు. పేపర్లో కనిపించే అరచేతి వైకుంట ప్రకటనకి ఆకర్షితుడై ఆఫీసుకి సెలవు పెట్టి మరీ అరవై కిలోమీటర్ల దూరంలోని షాప్ కొచ్చి కొనాల్సిన దానికన్నా ఎక్కువ కొని భంగపడ్డాడు. ఈ విషయం తన భార్యకి తెలిసిందంటే తననో వారం రోజుల పాటు సాధిస్తుంది 'డబ్బూ పోయి దొబ్బులాట' అంటే ఇదే కాబోలు.

ప్రతి రోజు పేపర్ చూసి ఆన్ లైన్ షాపింగ్ ప్రకటనల మోజులో పడి ఫోన్ చేసి దర్జాగా వస్తువు ఆర్డర్ చేయడం... ఆ తర్వాత చేతి చమురు వదలడం. ఓ వ్యసనంలా అవసరమైనవన్నీ కొని ఇళ్ళంతా నింపేశాడు. ఓ మాయలో చిక్కుకున్నట్టుగా తనకి తెలియకుండానే గిల గిల లాడాడు. తన కొచ్చే జీతమెంత? తన ఖర్చు పెట్టేదెంత? అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పైగా క్రెడిట్ కార్డు ఒకటీ... స్టైల్ గా తీసి అలవోకగా ఉపయోగించడం... ఆ తర్వాత వచ్చే స్టేట్ మెంట్ చూసి గతుక్కుమనడం. ఎవరైనా ఆఫర్లు ఎందుకిస్తారు? అవి నిజంగా ఆఫర్లేనా? అదో మోసం. మధ్య తరగతి వాళ్ళ ఆశలకి వేసే అందమైన గాలం. చిక్కుకున్న వాళ్ళు గిల గిల్లాడుతుంటారు. మిట్ట మధ్యాహ్నపు ఎండలో నడుస్తున్న రాంబాబుకి జ్ఞానబోధ అయింది.

మూడుంపావుకి దాహంతో ఆకలితో ఇంటికి చేరుకున్న రాంబాబు " ఏమండి... ఏమేం తెచ్చారు?" అని భార్య అదుగుతున్నా వినిపించుకోకుండా ల్యాండ్ లైన్ నుండి పేపర్ ఏజంట్ కి ఫోన్ చేసి రేపటి నుంచి తనకి పేపర్లు వేయద్దన్నాడు. " మీకేమైందండి..." అని భార్య అడిగితే "మంచిరోజులొచ్చాయి" అని చెప్పాడు.

***

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి