మా వదిన మౌనవ్రతం.. - జి.ఎస్.లక్ష్మి..

maa vadina mounavratam

మామూలుగానే ఉదయం పనంతా అయ్యాక ముందు గదిలోకి రాగానే ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. పనవగానే ఒక్కసారైనా వదినతో మాట్లాడకపోతే నాకస్సలు తోచదు. ఆ రోజు ఇంట్లో జరిగిన భాగోతమో, భర్త విసుగో, పిల్లల కోరికలో, ధరలమంటో.. యేదో ఒకటి మేవిద్దరం మాట్లాడుకోవాల్సిందే. అందుకే అలవాటుగా ఫోన్ వదిన నంబర్ కే వెళ్ళింది. అటు వదిన ఫోన్ యెత్తింది. కానీ, అంతా నిశ్సబ్దం. ఇదేవిటీ.. మాటే వినిపించటం లేదూ.. అనుకుంటూ ఫోన్ సౌండ్ తగ్గిందేమోనని హెచ్చించడానికి చూసాను. కానీ అది యెక్కువగానే వుంది. మరి మాట వినపడడంలేదేవిటా అనుకుంటూ స్పీకర్ బటన్ నొక్కాను. అవతల్నించి రెండు స్పూన్లు ఒకదానినొకటి కొట్టుకుంటున్నప్పుడు వచ్చే “ట్రింగ్..” మన్న శబ్దం వినిపించింది. “వదినా…” అంటూ పిలిచాను. ఊహు.. మళ్ళీ ఆ “ట్రింగ్..” శబ్దమే. నాకేమీ అర్ధంకాలేదు.

“వదినా.. నువ్వేనా.. ఎలా వున్నావ్? వంట్లో బాగుందా.. మాట్లాడవేం..” గబగబా అడిగేసేను. అట్నుంచి మళ్ళీ “ట్రింగ్..”

“ఏమైంది వదినా.. ఒంట్లో బానే వుందా..?” నా గొంతులో ఆతృత..

అటు ఫోన్ పెట్టేసిన శబ్దం. నాకేమీ అర్ధం కాలేదు. యేమీ అఘాయిత్యం జరగలేదు కదా.. మనసు కీడు శంకించింది. మళ్ళీ డయల్ చేసాను. యెవరూ యెత్తలేదు. నాకు ఖంగారు యెక్కువయింది. వెంటనే ఆఫీసులో బిజీగా వుంటాడని తెలిసి కూడా ఆగలేక అన్నయ్యకి ఫోన్ చేసాను. అన్నయ్య ఫోన్ తీసాడు.

“ఊ.. యేవిటీ.. “ అన్నాడు. అసలే అన్నయ్య ముక్తసరిగా మాట్లాడతాడు. అందుకని వెంటనే విషయంలోకి వచ్చేసాను. “ఇంటికి ఫోన్ చేస్తే వదిన యెత్తింది కానీ మాట్లాడలేదేంటన్నయ్యా.. వదినకి ఒంట్లో బానే వుందా..?”

“ఆహా.. నిక్షేపంలా వుంది..”

“మరి మాట్లాడలేదేం..నామీదేవైనా కోపం వచ్చిందా..?” ఆపుకోలేక అడిగేసాను.

“నీ మొహం..కోపం కాదూ,, యేమీ కాదూ.. మీ వదిన మౌన వ్రతం చేస్తోంది.”

ఆశ్చర్యపోయాను. వదిన అన్నయ్య చేత ఉపవాసాలూ గట్రా చేయిస్తుంది తప్పితే తనేమీ చెయ్యదే.. అందుకనే ఆశ్చర్యంగా అడిగేసేను.. “వదిన మౌన వ్రతమా..? యెందుకూ..”.

“యేమో.. నాకేం తెలుసూ.. మీ వదిన్నే అడుగు..” అన్నయ్య చిరాగ్గా అన్నాడు. అవును మరి.. ఆఫీస్ టైమ్ లో ఫోన్ చేస్తే చిరాకు రాదూ.. అందుకే గబ గబా అడిగేసాను.. “ఎలాగరా అన్నయ్యా. .మౌన వ్రతం కదా యెలా చెపుతుందీ..” అంటూ.

“అయితేనేం.. మెసేజిలు పంపుకుంటారుగా ఇద్దరూనూ.. “ అంటూ ఫోన్ పెట్టేసాడు అన్నయ్య.

అవును కదా.. మెసేజ్ పెట్టొచ్చు కదా అనుకుంటూ మొబైల్ తీసాను. తీరా చూస్తే అప్పటికే అందులో వదిన ఇచ్చిన మెసేజ్ “ఇవాళనేనుమౌనవ్రతం. మాట్లాడను..” అనివుంది. వెంటనే ”యేవ్రతంకోసం..” అని కొట్టాను.

“పలాయన వ్రతం..” అని జవాబు వచ్చింది. “అదేం వ్�3vo�ం? యెప్పుడూ, యెక్కడా వినలేదు.” అంటూ మళ్ళీ మెసేజ్ కొట్టాను. “నేనే కనిపెట్టాను. మీ అన్నయ్య నుంచి తప్పించుకుందుకు.. ”అన్న వదిన ఇచ్చిన జవాబు నాకు అర్ధం కాలేదు. “యేవిటీ..” అన్నాను మళ్ళీ. దానికి జవాబుగా నాకూ, వదినకీ మధ్య జరిగిన మెసేజిలు ఇవిగో.. ఇవీ..

“అంటే అన్నానంటారు కానీ ఈ మొగుళ్ళతో వేగడం మాటలు కాదమ్మోవ్.

.” “

“మొగుళ్ళా..”

“అదేలేవోయ్.. ఒక్క మొగుడే.. మొగుడైన మగాడితో అనుకో.. జనరల్ గా అనేసేను. నువ్వలా అక్షరం అక్షరానికీ అర్ధాలు తియ్యక నేను చెప్పేది విను ముందు.. “

నేను సైలెంటయిపోయాను.

“క్రితం నెల మీ అన్నయ్య పుట్టిన రోజుకి కొత్త చొక్కా కొన్నానా..”

“నువ్వెక్కడ కొన్నావూ? గీకింది మా అన్నయ్య క్రెడిట్ కార్డే కదా..”

“అబ్బ.. అయితేనేం.. చాలా ఖరీదుంది, ఇప్పుడెందుకులే అని మీ అన్నయ్యంటున్నా నేనే కదా బలవంత పెట్టి కొనిపించేనూ.. ఇప్పుడదే పెద్ద యిష్యూ అయిపోయింది.”

“ఏవయింది? రంగుపోయిందా..”

“ఊహు.. రంగంటుకుంది..”

“అయ్యో.. ఆ చొక్కా వేసుకుని హోళీ ఆడడానికి యెందుకు పంపించేవు వదినా?”

“అబ్బ.. హోళీ కాదు. ఇవాళ వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నప్పుడు పొరపాటున నా ఎర్ర చీరతో పాటు ఆ చొక్కా కూడా వేసేను.. అంతే..”

“అంతేనా.. అంతేనంటూ అంత నెమ్మదిగా చెపుతున్నావా.. అంత ఖరీదు పెట్టి కొన్న చొక్కాకి ఎర్ర రంగంటితే ఎంత బాధగా వుంటుందీ..”“నే కాదన్నానా.. యేదో పొరపాటయిందనుకోవచ్చుగా.. అబ్బే.. పొద్దుట్నించీ ఆ చొక్కాని చూసుకుని చూసుకుని, దానినేం చెయ్యలేక, ఆ బాధంతా నా మీద కేకలుగా మారిపోవడం మొదలయ్యింది. నేను మీ అన్నయ్యకి జవాబు చెప్పలేక నా.. ఆయన కంటే గట్టిగా అరవగలను. కానీ, వాదనలెందుకులే అని ఊరుకుంటే మరీ యెక్కువ చేసేస్తున్నారు. అందుకే నేను కూడా గొడవపెట్టుకుంటే మళ్ళీ మీ అన్నయ్యకి బీపీ వచ్చేస్తుందేమోననిపించింది. అలాగని వాదించకపోతే మీ అన్నయ్య అన్నట్లు చేతకానిదాన్నయి పోతానాయె.. అందుకే మధ్యే మార్గంగా ఈ మౌనవ్రతాన్ని ఆశ్రయించాను.”

“దాని వల్ల యేవిటి లాభం?” “యే వుంది.. అరిచి అరిచి నా వేపు నుంచి సమాధానం రాక, నోరు నొప్పెట్టి మాట్లాడకూరుకుంటారు. అయినా నాకు తెలీకడుగుతానూ, యేదో పొరపాటున చొక్కాకి రంగంటిందే అనుకో.. అది పట్టుకుని ఆర్వాలూ పూర్వాలూ యెత్తాలా.. యెప్పుడో మా పెళ్ళైన కొత్తలో మీ అన్నయ్య బనీనోటి పోగొట్టేనుట..ఆ మాటెందుకిప్పుడు? “పోనీ వదినా.. యేదో ముచ్చటపడి కొనుక్కున్న చొక్కా పాడయిందని బాధపడుతున్నాడెమో..”“అందుకే ఇవాల్టికి క్షమించి వదిలేశా మీ అన్నయ్యని. అయినా. నాకు తెలీకడుగుతానూ.. మనం పాత చీరల మీద కొత్త రంగులు వేయించుకుందుకు బోల్డు డబ్బులు పోస్తాం కదా.. అసలు ఖర్చే లేకుండా మీ అన్నయ్య చొక్కాకి యెంచక్క రంగేసి పెడితే సంతోషించక అంత గింజుకోవడవెందుకూ.. మరీ బడాయికాపోతేనూ.”అంటూ చివరగా వదిన పెట్టిన మెసేజ్ చదివాక వదిన మౌనవ్రతం పట్టి అన్నయ్యకి యెంత మేలు చేసిందో అనిపించింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు