ఆంటీ... అంకుల్ - పి.వి.డి ఎస్. ప్రకాశ్

aunty...uncle


" ఆంటీ " అంటూ లోపలికి వచ్చింది సుజి. పక్కింటి అమ్మాయి. కోఠీ విమెన్స్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది.

" ఏంటీ వేళ నీ దర్శనం. కొంపదీసి కాలేజీకి బంక్ కొట్టావేంటీ ? " అనడిగాను నేను.

" ఔను ఆంటీ....ఎవ్విరి డే వెళ్ళాలంటే బోర్ కొడ్తోంది. కాలేజీకి డుమ్మా కొట్టకుండా వెళ్ళాల్సింది లెక్చరర్లు మాత్రమే. అలా వెళ్ళినందుకేగా జీతాలు తీసుకుంటున్నారు.! ఆ లెక్చరర్లు కరెక్టుగా వస్తున్నారో, లేదో కనిపెట్టేందుకే అడపాదడపా స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళి వస్తుండాలి. అదీ నా లాజిక్ ...." చెప్తూ " అందుకే ఇవాళ డుమ్మా కొట్టాను. " అంటూ ముక్తాయింపు ఇచ్చింది సుజి. ఆ వెంటనే, " అన్నట్లు అనుకోని అతిథిగా నీ ఫ్లాట్ కొచ్చాను కదా కాఫీతోనో, బోర్న్ విటాతోనో సత్కరించుకో. ప్రశాంతంగా ఉంటుంది." అంటూ ఆర్డర్ పాస్ చేసింది.నిజానికి సుజీ వస్తే సందడే సందడి. సాయంత్రాలు, సండే లు ఆ అమ్మాయి చనువుగా మా ఇంట్లో దూరిపోయి బోల్డన్ని కబుర్లు చెబుతుంది. మా ఆయనకి ట్రాన్స్ ఫర్ కావడంతో ఈ ఊరికి రావడం, రెండు నెలల క్రితం ఈ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ లో అద్దెకు దిగడం అప్పట్నుంచి సుజీతో నాకు అనుబంధం పెరగడం నాకూ కాలక్షేపంగానే ఉంది.

కానీ, మాటకి ముందూ, వెనకా " ఆంటీ" అనడమే నాకు నచ్చనిది.

నిజానికి ఆంటీ అన్న పదం తప్పు కాదు కానీ ఆ పిలుపులో మోయలేని వయసేదో మీద పడిపోయినట్లు ఇబ్బంది కరంగా ఉంటుంది నాకు.ఈ ఫ్లాట్ లో దిగిన మొదటి రోజు సాయంత్రమే తుఫానులా లోనికి దూసుకొచ్చేసి, " ఈ ఫ్లాట్ లో కొత్తగా దిగిన ఆంటీ మీరేనా?" అనడిగింది.ఆ అమ్మాయి ఇంచుమించు నా హైటే ఉంది. నాలాగే సన్నం, చామనచాయ.

వస్తూ, వస్తూనే ' ఏమండీ, అనో, బాగున్నారా, " అనో, మొదలెట్టకుండా, ఏకంగా ' ఆంటీ' అనే వరుస కలిపేసింది. ' ఆంటీ అని ఏ అయిదారేళ్ళ పిల్లలో ముద్దుముద్దుగా పిలిస్తే అదో అందం. నిజానికి ఏడాది క్రితం పెళ్ళయి తాళి మెళ్ళో పడింది కాబట్టి సుజి దృష్టిలో నేను ఆంటీని అయిపోయాను. ఇంకా చదువునే కంటిన్యూ చేస్తే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ స్టూడెంట్ గానే ఉండేదాని. ఇంకోరకంగా చెప్పాలంటే సుజీ కన్నా నేను కేవలం మూడేళ్ళు మాత్రమే పెద్ద. ఆ చిన్నపాటి తేడాకే జనరేషన్ గ్యాప్ తో నేనేదో పెద్దదాన్నయిపోయినట్టు ఫీలయిపోతుంది తను.

అంతేనా!

పంజాబీ డ్రస్ ల్లో వయసు దూర్చేస్తూ చిన్నపిల్లలా పెద్ద ఫోజు కొడ్తూ మాటి మాటికీ ఆంటీ అంటూ పిలుస్తోంది. అలా పిలవొద్దని ఎన్నోమార్లు చెప్పాలనుకొన్నా పదాలు పెదాలు దాటని మోమాటం తెగ తినేస్తోంది. ఇంచుమించు నా అంత ఎత్తు ఎదిగి కూడా ' నీ నెక్స్ ట్ జెనరేషన్ దాన్ని సుమా ' ! అన్నట్టు ప్రవర్తించడమే నాకు చికాకు తెప్పిస్తోంది.

' ఆంటీ ' అని ఆమె పిలిచిన మొదటి సారే నా మనసు చివుక్కుమంది.

" మార్నింగ్ నే కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరీ ఫ్లాట్ లోకి వచ్చారని మమ్మీ చెప్పింది. ఇంకా అలా చూస్తూ ఇక్కడే నిల్చున్నావేం...కొత్త ఆంటీని పలకరించి, పరిచయం అంటూ పరిగెత్తించింది..." గలగలా నవ్వుతూ మాట్లాడేస్తోంది ఆమె.

" నీ వయసెంత..ఏం చదువుతున్నావ్...ఏ కాలేజ్ ఆంటీ అని ఎవర్ననాలో, ఎవర్ని అనొద్దో ఇంత వయసొచ్చి నీకు తెలీదా? అరే, నువ్వూ-నేనూ పక్కపక్కన నిల్చుంటే అక్కా-చెల్లెళ్ళలా వుంటామే. అప్పుడే నాలో నీకు ఆంటీ లుక్ కనిపించిందా? మెళ్ళో తాళి అంటే పడింది కానీ..ఇంకా నేను యూతే. జస్ట్ ట్వంటీత్రీ. మరి నీకో...ట్వంటీ ఉండవూ?" అని చెడా మడా అడిగేయాలనిపించింది.

ఆహ్వానించకుండానే గడప తొక్కిన తొలి అతిథి.

అవమానపరిస్తే ఆమె బాధ పడడమేకాదు, ఈ కొత్త పరిసరాల్లో అందరి ముందూ తనో విలన్ గా మారడం ఖాయం. అలా జరగడం ఇష్టం లేకే అప్పటికి ఊరుకున్నాను. ఆ ఊరుకోవడమే అలుసైంది కాబోలు...సుజీ పిలిచిన ' ఆంటీ ' అన్న పిలుపునే కాలనీ అంతా ఖరారు చేసేసింది.' ఆంటీ అన్న పిలుపుతోనే తెల్లారుతోంది....సూర్యుడికంటే ముందుగా ఉదయాన్నే తలుపు తట్టి పాల ప్యాకెట్లు అందించే కుర్రాడు మొదలుకుని.. ఇంటిముందుకొచ్చి కూరలు అమ్మే అప్పలమ్మ దాకా అంతమందీ ఆంటీ అనే పిలుస్తున్నారు. ఏడాది కిందట పెళ్ళయి అత్తారింటికి వెళ్ళి ఈమధ్యే పురిటికి పుట్టింటికొచ్చిన పద్మజ కూడా తొలి పరిచయంలోనే ' ఆంటీ' అని పిలిచేసింది. చురుక్కుమనేలా చూసినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు సరికదా..ఆ మధ్య మా ఇంటి గడప తొక్కిన ఆవిడ మొగుడు కూడా అదే పిలుపుని కంటిన్యూ చేసాడు. అలా, చిన్న పెద్దా తేడా చూడకుండా ఎదురైన ప్రతి ఒక్కరూ 'ఆంటీ' అనే పిలుస్తుంటే ఒళ్ళంతా కారం పూసుకున్నట్లు ఒకటే కంపరం. దాంతో, అంతమందినీ ఒకే దగ్గరకు పిలిచి..మనసులో వేదనంతా వెళ్ళగక్కాలనుండేది.

' ఆమె సుజాత...ఈమె పద్మజ..ఆవిడ సుబ్బలక్ష్మి.....ఈవిడ సుకుమారి..మా పక్కింటావిడ పేరు నాగమణి..ఎదురింటావిడ పేరు లక్ష్మీకళ.మనచుట్టూ చాలామంది ఉన్నారు. అనసూయ, అరుంధతి బలసుందరి....ఇలా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఆంటీ అని మీరంతా పిలిచే నాకూ ఓ పేరుంది. అది బారసాల చేసి మరీ అమ్మానాన్నలెంతో ఇష్టంతో పెట్టిన పేరు. ఆ పేరేంటో తెలుసా? సుమ.ఔను...నేనెంతో అభిమానించే నాపేరు సుమ. నన్నప్పుడే ఆంటీని చేయకండి. సుమ..అని నాపేరుతోనే పిలవండి...

ఆంటీ..ఆంటీ అంటూ మీరు పిలుస్తున్నకొద్దీ నేను మీతో కలవలేకపోతున్నాను. మనస్పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. స్నేహం చేయలేకపోతున్నాను. రాన్రానూ నా ఇంటి గడప దాటి బయటికి రాలేకపోతున్నాను. ఆంటీ అని పిలుస్తూ మీరు చేస్తున్న ఉపకారం ఇది. నన్ను నా ఇంట్లోనే బందీని చేస్తున్నారు. కిటికీలోంచి తొంగిచూసినా, వీధిలోకొచ్చినా మీలో ఎవరైనా ఎదురుపడి ' ఆంటీ ' అని ఎక్కడ పిలుస్తారోనని బెంగపడిపోతున్నాను. ఎవరెవర్ని అలా పిలిచినా నన్నే అనుకుని ఉలిక్కిపడుతున్నాను. ప్లీజ్ కాల్ మీ సుమ! దయచేసి నన్ను నన్నుగా చూడండి. నా పేరుతోనే నన్ను పిలవండి. నేనెంతో ఇష్టపడే రెండక్షరాలు సుమ. ఇష్ట పడని రెండక్షరాలు ఆంటీ..." అని ప్రపంచానికి తెలిసేలా ఎలుగెత్తి చాటాలనిపించేది. ' ఆంటీ ' అనే రెండక్షరాలు కోరలు సాచి నాపై విషం చిమ్ముతున్నట్టనిపిస్తోంది. ఈ నరకం ఇక భరించలేననిపించిన తర్వాత...ఓరోజు రాత్రి,

" ఏమండీ...." గారంగా పిలిచాను మావారిని...

" ఊ..." అన్నారాయన ఆ పిలుపులోని ఆత్మీయతకు తనకే తెలిసిన అంతరార్థాన్ని వెతుక్కుంటూ, రాత్రివేళ ఏకశయ్యమీద భార్య భార్య ముద్దులొలికితే ఏ ' శృంగార నైషధమో ' ఆవిష్కృతమవుతోందనుకోవడం ఆయన తప్పు కానేకాదు. ఎందుకంటే గతానుభవాలు అవేమరి. అయితే, ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా ' నేనో విషయం చెప్పాలి ' అన్నాను.

" చెప్పు " అన్నారాయన కాస్త పరధ్యాన్నంగా.

" మీరు కాదనకూడదు" ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నట్లన్నాను.

" మీకంటికి నేనెలా కనిపిస్తున్నాను" అడిగాను.

" ఎలా అంటే?" అర్థం కానట్టు నావైపు చూసారాయన.

" అందంగా లేనా.....అసలేం బాలేనా?" ఆసమయంలో సింగర్ సునీత నన్నావహించింది. చిన్నగా హం చేస్తూ అడిగాను. నామనసులోని ప్రశ్నని.

దానికి ప్రతిగా ఆయన నవ్వుతూ " అందమా...అందుమా!అందనన్టె న్యాయమా....." అంటూ కొంటెగా చూసారు.

" అంటే నే అందగత్తెనే కదా....!"

" అందగత్తెవే కాదు, మంత్రగత్తెవి కూడా....పెళ్ళిచూపుల్లోనే మహామాయ చేసి నీ కొంగున నన్ను కట్టి పడేసావు." అన్నారాయన." అందగత్తెనని మీరొప్పుకుంటున్నట్టే కదా!"

వేటూరి పాట మీదొట్టు. అయినా ఆ డౌట్ నీకెందుకొచ్చింది?"

" మిమ్మల్ని కట్టుకున్నాకే ఆంటీనైపోయానని కుళ్ళుకుంటున్నాను."

" ఆంటీయా...ఆ మాటే నీకు యాంటీ?"

" మరేంటీ..కాలనీ వాళ్ళంతా నన్ను ఆంటీ అంటున్నారు?" అంటూ కాలనీలో ఎదురైన ప్రతి చిన్న ఇన్సిడెంట్ నీ వదిలి పెట్టకుండా పూస గుచ్చినట్లు చెప్పాను. ఆ విషయాలన్నీ ఆయనకు చెప్పే సరికి నా మనసు తేలికైంది. అయితే, ఓపిగ్గా విన్న ఆయన మాత్రం అదే పనిగా నవ్వడం మొదలు పెట్టారు.

" ఎందుకలా నవ్వుతారు? మీ దృష్టిలో కూడా నేను ఆంటీగా మారిపోయానా?" ఉడుకుమోత్తనం ప్రదర్శించాను. అయినా.....ఆపుకోకుండా పడీపడీ నవ్వుతున్నారాయన. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు తిరిగి నవ్వడం ఆపేసారు

." ఇంతకీ ఆ నవ్వుకి అర్థం ఏంటీ?" ఒళ్ళుమండి అడిగాను.

" చెప్పనా?"

' చెప్పమనే కదా అడుగుతోంది?"

" నువ్వలా చెప్తుంటే ....రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్టనిపించి నవ్వాగలేదు" అన్నారాయన.

" ఏంటో....మీ మాటలు అర్థం కావడం లేదు."

" అయితే నీకో ప్రశ్న...నేను అంకుల్లా ఉన్నానా చెప్పు....." అనడిగారు. అలా అడుగుతున్నప్పుడు ఆయన గొంతులో జీర బాధలా ధ్వనించింది.

" అంటే....మిమ్మల్ని..." సందేహంగా చూసాను...

" ఔను..నిన్నే కొత్తగా ఆఫీసులో సుధీర్ అనే ఓ యువకుడు చేరాడు. అలా కాలేజీ నుంచి డిగ్రీ పుచ్చుకుని బయటకొచ్చి..ఇలా ఆఫర్ లెటరందుకుని ఆఫీసులో చేరిపోయాడు."

" అయితే?"

" ఏదో పనుండి నా టేబుల్ దగ్గరకొచ్చాడు..."

" ఆ తర్వాత?"

" అంకుల్...ఫలానా ఫైలెక్కడుంది?" అనడిగాడు. అంకుల్ అన్న పిలుపు నన్ను కాదేమో అనుకుని అటూ-ఇటూ చూస్తే..నవ్వుతూ, ' మిమ్మల్నే అంకుల్ ' అని మరీ నిర్ధారణ చేసాడు." నిట్టూర్చారు మావారు.

" ఆఫీసులో అకులేంటీ అసహ్యంగా.....ఎంచక్కా సార్ అని పిలవమనలేకపోయారా?" అడిగాను నేను.

" అలా చెప్దామనుకుంటుండగానే...ఎకౌంటెంట్ పరమేశ్వరరావు అక్కడికొచ్చాడు."

" ఆయన రాకతో డిస్ట్రబయ్యారా?"

" అతడ్ని చూసి పలకరింపుగా నవ్వుతూ ...ఈ అంకుల్ దగ్గరే ఆ ఫైలుందని మేనేజరంకుల్ చెప్పారంకుల్.." అన్నాడు. దానికి పరమేశ్వరరావు నవ్వుతూ వీడ్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఎంచక్కా అంకుల్ అని వరుస కలిపి మరీ కలిసిపోతాడంటూ తెగ మెచ్చుకున్నాడు." ఏడ్వలేక నవ్వుతూ చెప్పారాయన.

" నేను ఆంటీనైతే మీరు అంకులే మరి" అంతకన్నా సమాధానం ఏం చెప్పాలో తెలీలేదు నాకు.

కొన్నాళ్ళ తర్వాత-

మా ఆయన ఆఫీసులో పని చేస్తున్న సుధీర్ అపార్ట్ మెంట్ లో ఖాళీ అయిన ఓ సింగిల్ బెడ్ ఫ్లాట్ లో అద్దెకి దిగాడు. తరచూ మా ఇంటికొచ్చి వెళ్తూండేవాడు. ఆఫీసు అలవాటు వదలకుండా మా ఆయన్ని అంకుల్ అనీ...అదే ఆనవాయితీ ప్రకారం నన్ను ఆంటీ అని వచ్చిన మొదటి రోజు నుంచే వరుస కలిపేసి పిలిచేవాడు. సుధీర్ ' ఆంటీ ...' అని నన్ను పిలుస్తూంటే నా ఒళ్ళంతా తేళ్ళూ-జెర్లూ పాకేవి. వీలైనప్పుడల్లా అతడ్ని తప్పించుకునే ప్రయత్నమే చేసేదాన్ని. అది కుదరనప్పుడు ' ఆంటీ ' అనే అతడి పిలుపు విన్నా విననట్టే నటించేదాన్ని. అంతే కాదు. " ఉన్న చికాకు చాలదనా ...సుధీర్ కూడా ఇదే అపార్ట్ మెంట్ లో చేరాడు...' అంటూ చీటికీ మాటికీ మా ఆయన మీద విరుచుకుపడేదాన్ని. నిజానికి, సుధీర్ ఆ ఫ్లాట్ లో దిగడానికీ, మా ఆయనకూ ఏ మాత్రం సంబంధం లేదని తెలిసి కూడా నా కోపాన్నంతా వెళ్ళగక్కడానికి ఆ విధంగా చేసేదాన్ని.

ఇప్పుడు సుజికి కొత్తగా సుధీర్ జత కలిసాడు. ఇద్దరూ చెరోవైపు చేరి రెండు చెవుల్లోనూ ఇంత సీసం పోస్తున్నట్లు ' ఆంటీ...." అంటూ పిలిచేవాళ్ళు.

" ఇక ఈ ఫ్లాట్ లో ఒక్క క్షణం ఉండలేం...మారిపోదాం..." అంటూ మావారి చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేదాన్ని.

"అలాగే...." అంటూనే, ' కొత్తగా మారే ఫ్లాట్ లోనూ సుధీర్, సుజి లాంటి వాళ్ళే మరో పేర్లతో ఉంటారు. ' ఆంటీ, అంకుల్ ' అనే పదాలకు నిషేధం లేదు కదా! అక్కడి వాళ్ళూ మనకదే హోదా ఇస్తారు." అన్నారు.

" మరి, మన బాధకు పరిష్కారం లేదా?"

" పరిష్కారం దొరకాలనే కోరుకుంటున్నాను. నాకు మాత్రం ' అంకుల్ ' అని పిలిపించుకోవడం ఇష్టమా?"

ఇలా మా ఇద్దరి మధ్య గరంగరంగా వాదప్రతివాదాలు తరచూ జరుగుతుంటే...ఆ విషయాలేవీ తెలీని సుజి, సుధీర్ తమ పంధాలో తాము వెళ్తున్నారు.

ఓ రోజు సుధీర్ మా ఫ్లాట్ కొచ్చి " ఆంటీ-అంకుల్, మీరిద్దరూ నాకో సాయం చేయాలి. " అడిగాడు.

" ఏ సాయం?" అడిగారు మావారు.

" పెళ్ళిమాటలాడేందుకు నాతరపున మీరిద్దరూ నిల్చోవాలి." చెప్తూనే సిగ్గు పడిపోతున్నాడు.

" మీవాళ్ళో?" అప్పటివరకూ సుధీర్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మాలో కలగలేదు. కారణం....ఎంతసేపూ అతడి పిలుపులపైనే దృష్టి తప్ప మరో ఆలోచన లేదు.

" నాకెవరూ లేరు..అనాధని.." అన్నాడతను.

" అందుకే చిన్నప్పట్నుంచీ నా చుట్టూ ఉన్న వ్యక్తులే నా బంధువులు. వాళ్ళే నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఆంటీ, అంకుల్స్, కూడా.. ఇంఫర్మేషన్ రివల్యూషన్ తో ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్తితుల్లో మనమంతా ఒక కుటుంబంలోని వాళ్ళమే. అదే వసుధైక కుటుంబం. మీరడిగిన ప్రశ్నలకు నా ఫిలాసఫీ అంతా చెప్పి బోర్ కొట్టిస్తున్నానేమో? నిజానికి మీకన్నా నాకు ఆత్మీయులెవరూ లేరు. అందుకే చనువుకొద్దీ అడిగాను. నా తరపున పెళ్ళిపెద్దలుగా మీరుంటారు కదూ" అడిగాడు.

అతడి అభ్యర్థనని కాదనలేకపోయాం.

" తప్పకుండా...ఇంతకీ అమ్మాయెవరు?" ఈ ప్రశ్నకి అతడిచ్చిన సమాధానం విని పీకల్లోతు ఆశ్చర్యంలో మునిగిపోవాల్సొచ్చింది.

" సుజి "" సుజి యా...?" నోరెళ్ళబెట్టాం.

" అపార్ట్ మెంట్లోకొచ్చి ఆరునెలలు కాలేదు. అప్పుడే ఇంత లవ్ స్టోరీ నడిపించేశావా?"

"ఒకర్నొకరు ఇష్టపడటానికి ఆరునెలలెందుకు? అరక్షణం చాలు...." అన్నాడు సుధీర్.

" ఈ విషయం సుజీ పేరెంట్స్ కి తెలుసా..?"

" చూచాయగా తెలుసు...అయినా సంప్రదాయం ప్రకారం పెళ్ళిచూపులు, ఆ పై పెళ్ళివేడుక జరగాలి కదా!" అన్నాడు.

" ఔనౌను...ఆనవాయితీగా అన్నీ జరగాల్సిందే...." అన్నాన్నేను. నా మాటకి మావారు వంత పలికారు.

అతడు వెళ్ళిపోయిన తర్వాత నన్నేడిపిస్తూ మావారన్నారు." నిజంగా నువ్వు సుజీకి ఆంటీవైపోయావు."

" మీరూ అంకులైపోయారు..." అంటూ కౌంటరిచ్చాను నేను. ఒకే లోకంలో ఒకే గడ్డపై ఒకే గాలి పీలుస్తూ బతుకుతున్న మనుషుల మధ్య అపురూపమైన బంధాల్ని ఏర్పరచేవి ఆత్మీయమైన పిలుపులే. ఆ పలక్రింప్ల్లోని అనురాగం, ఆప్యాయతల్ని అర్థం చేసుకోవాలే తప్ప అపార్థం చేసుకోవడం సబబు కాదు. ఈ విషయాన్ని అనాధ్త అయిన సుధీర్ ఎంతో బాగా చెప్పాడు. ఆ భావన రాగానే మనసు తేలికైంది. ఎప్పుడెప్పుడు సుజి ఎదురుపడుతుందా? ఆంటీ అని పిలుస్తుందా? అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను.అన్నట్లు ఆ ఇద్దరి పెళ్ళి పెద్దరికం మాదేనని ప్రత్యేకించి మరీ చెప్పాలా..?

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు