కల కానిదీ... - సుంకర వి హనుమంతరావు..

kala kanidi

“వైజాగ్ ఆర్ కె బీచ్.”సమయం ఆరు దాటుతోంది..టూరిష్టులతో..ప్రేమికులతో కళకళలాడిపోతోంది .ఫ్లోరసెంట్ వెలుగులతో తళతళ లాడిపోతున్న బీచ్ రోడ్ అప్పుడే విడిచిన పాము కుబుసంలా మెరిసి పోతోంది. ఎడతెగని శబ్దాలతో బీచ్ బీచంతా హోరెత్తి పోతుంటే రోడ్డుకు దూరంగా సముద్రానికి దగ్గరగా రాయి మీద దిగులుగా కూర్చున్న మంజూష పరిసరాలను మర్చిపోయి సముద్రాన్ని, వచ్చిపోతున్న అలలనే చూస్తూ మాటి మాటికీ చేతికున్న గడియారాన్నే చూసుకుంటూ అసహనంగా కదులుతోంది ! ఆమె నిరీక్షణ ఫ్రెండ్ కోసమో ప్రియుని కోసమో కాదు ! చీకటి కోసం ! కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో సముద్ర గర్బంలో కలిసి పోవాలని ! మూడురోజుల “అంతర్మథనంతో’ తీసుకున్న ఆత్మహత్యా నిర్ణయమది

************

మంజూష సాధరణమైన అమ్మాయి కాదు ! బి టెక్ గోల్డుమెడలిస్ట్..మల్టినేషనల్ ఐ టీ ఎంప్లాయ్ .ఫైవ్ డిజిట్ శాలరీ..అనురాగాన్ని పంచే అమ్మా నాన్నలకు ముద్దుబిడ్డ ఆకారం ముద్ద మందారం..మనసు రాగ సిందూరం . బంగారం కావలసిన బ్రతుకు కేవలం లవ్” ఫెయిల్యూర్ తో “`బంగాళాఖాతంలో కలిసిపోబోతోంది ! చీకట్లు కమ్ముకుంటున్నాయ్..సముద్రంలో లంగరేసున్న షిప్ లో వెలిగిన దీపాలకాంతులు నీటిలో ప్రతిబింబిస్తూ కార్తీక దీపాల్లా కనువిందు చేస్తున్నాయ్ ..మంజూష చుట్టూ పరికించింది.. చుట్టూ నిశ్శబ్దం. అంతా నిర్మానుష్యం. ఆత్మహత్యకు అడుగు వేయబోతూ అదిరిపడి ఆగిపోయంది..“అమ్మా..దాన్ని పట్టుకో తల్లీ..” ఆయాసంతో అరుచుకంటూ వస్తున్న ఒక స్త్రీ కేకకు తల తిప్పి చూస్తూనే కళ్ల ముందు కన్పించిన దృశ్యానికి కలవరపడిపోయంది .నిండు గర్బిణి ..నీళ్లల్లోకి దూకేయాలని దూసుకొస్తోంది ! అమ్మాయిది ఆత్మహత్యా ప్రయత్నమేనని అర్దమైపోయింది..అమ్మాయితో బాటు పుట్టబోయే మరో పసి ప్రాణం ..

తన ఆత్మహత్య విషయం మరిచి పోయంది..ఆ అమ్మాయిని రక్షించాలన్న ధ్యేయంతో కదిలింది ..అతి కష్టంతో ఆ అమ్మాయిని ఆపగలిగింది .. “అమ్మా ..నన్ను ఒగ్గేయండి ..నాను సచ్చిపోవాల “ ఏడుస్తూ గంజుకుంటుంటే రొప్పుకుంటూ వచ్చిన స్త్రీ ఆ అమ్మాయిని వాటేసుకుని ఏడ్చేసింది. మంజూష ఆ ఇద్దరినీ ఓదార్చ బోతుంటే ఆ అమ్మాయి మంజూష పాదాలు పట్టేసుకుని “అక్కా ! నన్ను ఒగ్గేయ్.. నాను సచ్చిపోవాల..” గుక్క పెట్టేసింది . అమ్మా ..సదూకున్న తల్లివి ..ఎవడో ..దొంగముండాకొడుకు మోసంసేత్తే యిది సచ్చి పోతానంటది.. దైర్నముంటే ఆడ్ని సంపాల ..నేదంటే టీవీ లో కడిగి పారేయాల.. మరో ఆడపిల్ల జోలికెల్లాలంటే ..పోసుకు సావాల..అయ్యన్నీ వదిలేసి పిరికిపందల్లా పానాలు తీస్కుంటే ఏటి నాబం ..నువ్వన్నా సెప్పు తల్లీ..” ఏం చెప్పగలదు తను..

నేనూ ఒక పిరికిపందనేనని చెప్పాలా ?.. చదువుకున్న చవటనని చెప్పాలా.. ?తల బ్రద్దలై పోతున్న ఫీలింగ్ ! “ఇప్పుడీడ మీరు కాపాడినా అర్దరాత్రి ఏదో ఒక లారీ కింద పడి నే సచ్చుడు మట్టుకు కాయం ..” కుండ బద్దలు కొట్టేసింది ఆ అమ్మాయి .శోకాలు పెట్టేసింది వాళ్లక్క .“ముందు మీరా ఏడుపులాపండి .. మనల్నిలా కోష్టల్ గార్డులు చూశారంటే.. పోలీస్ స్టేషన్ లో పడేస్తారు..పదండి ముందిక్కడ్నుంచి వెళ్లిపోదాం” ఆత్మహత్య ట్రాక్ నుండి ఆత్మరక్షణ ట్రాక్ లోకి వచ్చేసింది మంజూష . “మళ్లీ మా గుడిసెకు పోయి రాత్రంతా దీనిని కాపాడ్డం నా వల్ల కాదు తల్లీ పోలీస్ టేసన్ కే పోదాం ..నువ్వు కొంచెం సాయం సెయ్యి తల్లీ” ప్రాధేయపడిపోయింది.. స్టేషన్ కు రానంటే పోలీసులొచ్చే వరకూ వీళ్లు కదిలేలా లేరు,..పోలీసుల కంట పడితే సవాలక్ష ప్రశ్నలు ..పొరపాటున మీడియా కంట పడితే తన బ్రతుకు టాక్ ఆఫి ద టౌన్ అయిపోతుంది..! ముందు యిక్కడినుండి బయటపడాలనే ఆలోచన కొచ్చేసింది. “అయితే నాతో రండి . నా ఫ్లాటు బీచ్ రోడ్లోనే ..రాత్రి మీబాధలు చెప్పండి .నా చేతనైనంత సాయంచేయడానికి ప్రయత్నిస్తాను “ కన్విన్స్ చేయబోయింది మంజూష . ముందు రానని బెట్టు సింది ఆ అమ్మాయి.” నీ అక్కలాంటిదాన్ని ఈ ఒక్క రోజు నా మాట విను” అంటూ రకరకాలుగా బ్రతిమాలి ఒప్పించింది.

*******

“ అమ్మా !నా పేరు పద్మ ..ఇది నా చెల్లి రమ..పదో క్లాసు తప్పింది. సదువు మానేసి ఏదో కంపెనీలో వాటర్ గర్ల్ గా చేరింది. ఎవడో రాజేస్ గాడంట..ఆడి వల్లో పడిపోయింది..పెళ్లి సేసుకుంతానని నమ్మించి కడుపు సేసి పారిపోయిన దొంగముండాకొడుక్కోసం ఇది పానాలు తీసుకోడం ఏంటమ్మా?` వందేల్ల బతుకును ఎవడో కోన్కిస్కాగాడికోసం ఇరవై ఏల్లకే బుగ్గి పాలుచేసుకుంతారా ?నా పెల్లైన ఆర్నెల్లకే నా మొగుడికి మరోదాంతో సంబందం వుందని తెలిత్తే పంచాయితీ పెట్టించి ఆయెదవ కట్టిన తాడు తెంచి ఆడముకాన కొట్టి మరొకడిని కట్టుకున్నాను . మనకోసం బతికేవాడికోసం సచ్చినా లోకంఅంతా మెచ్చు కుంతారు ..ఇసుమంటి దగాకోర్ల కోసం మనబతుకులెందుకు బుగ్గిపాలు సేసుకోవాల ?’ఆక్రోశాన్ని కక్కేసింది పద్మ.

“ అక్కా ..మీరెన్నిసెప్పినా సచ్చుడు సచ్చుడే..యియ్యాల కాకపోతే రేపు..ఉద్యోగం పోనాది..పరువు పోనాది..నా బతుకే బుగ్గి పాలై పోనాది.. పురుడు పోసుకునే దిక్కేనేదు..బిడ్డపుడితే ఎవలు సూత్తారు..నామూలంగా అక్క బతుకూ ..దాని పిల్లల బతుకూ అద్దానమై పోనాది..ఎందుకు బతకాలి..బతికి ఏమిసాదించాలె “ .. గుక్క పట్టేసంది రమ.

****** *******

అక్కా! అలా మాట్లాడిన రమ మాటలకు బిత్తరపోయింది మన కథానాయిక మంజూష . రమ నటనకు నేనే .. షాకైపోయాను ..మన సృజన రమ పాత్రలో జీవించేసింది. ఆరాత్రంతా మంజూష రమని కన్విన్స్ చేస్తూనే గడిపింది.“ మా అమ్మానాన్న డాక్టర్లు ..నీ డెలివరీ నేను చేయిస్తాను ..మా కంపెనీలో జా బ్ యిప్పిస్తాను..నీబిడ్డకు నేను చదువు చెప్పిస్తాను ..”అంటూ ఒకటేమిటి..వరసపెట్టి తన జీవితాన్నే ఏకరువు పెట్టింది మంజూష . వాళ్ల డాడీ క్లనిక్ పేరు చెప్పగానే లేని బాబుకి పాలిచ్చి వస్తానని నమ్మించి సృజన్ని మంజూష కస్టడీలో పెట్టి బయిటకొచ్చి మన సాయాన్ని అర్దించిన మంజూష క్లోజ్ ఫ్రెండ్ మధులికకు కథంతా వివరించి , మన రాజమండ్రి సభ్యులకు పోన్ చేసి మంజూష నాన్న గారి పేరు క్లివిక్ పేరు చెప్పి ఉదయాన్నే వారు వైజాగ్ వచ్చేలా చూడమన్నాను . రాత్రంతా రమ కు చెప్పిన జీవిత సత్యాలు మంజూష మనో కవాటాలను జాగృతం చేశాయో ఏమో గాని ఉదయాన్నే ఆఫీసుకు తయారై పోయింది. నాకూ సృజనకూ యిల్లు అప్పగంచి బయలుదేరబోతుంటే ఆమె అమ్మానాన్న వచ్చేశారు. మంజూష ఆశ్చర్య పోతుంటే దసపల్లాలో డాక్టర్స్ మీట్ కు వచ్చానని చెప్పారు. మంజూష అమ్మానాన్నలకి జరిగిన కథంతా వివరించాము. వాళ్లద్దరూ ముందు నివ్వెరపోయి తర్వాత థ్రిల్లైపోయారు.మన సంస్తలో లైఫ్ మెంబరై పోయారు. రాజమండ్రి వెళ్లగానే డొనేషన్ పంపిస్తాన్నారు. మన రమాసృజన్ను స్వంత కూతురిలా అక్కున చేర్చుకున్నారు ..తమతో బాటే రాజమండ్రి వచ్చేయమన్నారు. అక్కా! మన ఆర్గనైజేషన్ యిచ్చిన చేయూత ఒక నిండు ప్రాణాన్నికాపాడింది. ఏ జీవితానికైనా ఇంతకు మించిన తృప్తి ,సాఫల్యం వుంటుందంటావా? ఆనందంతో మాటలురాక మూగబోయింది..రోషిణీ సభ్యురాలు ..రోహిణి

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు