బుద్ధి వచ్చింది - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

buddhi vacchindi

ఉండ్రాజవరంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే అతడు పరమ ఆశబోతు. తొందరగా తృప్తి పడే రకం కాదు.

ఆ వూరిలో కట్టెలు కొట్టుకుని బ్రతికేవాడు సూరయ్య. పేదవాడు. సూరయ్య తన కూతురుని మేనల్లుడుకిచ్చి పెళ్లి చేసాడు. పెళ్లిని చేయించింది సుదేవుడే. పెళ్లి జరిపించినందుకు తనకు బంగారు ఉంగరం, అరమూట బియ్యం అడిగాడు సుదేవుడు. తనకి కలిగినంత ఇస్తానని దానితో తృప్తి పడమని వేడుకున్నాడు సూరయ్య. కానీ సుదేవుడు వినిపించుకోలేదు.

పెళ్ళికి వచ్చిన బంధువులందరూ కలసి చందాలు వేసుకుని సుదేవుడి కోరిక తీర్చారు.

సుదేవుడి మేనల్లుడు కూడా సూరయ్య కూతురి పెళ్ళిలో మంత్రాలు చదవడంలో సాయo చేసాడు. అతడికి మామగారి ప్రవర్తన నచ్చలేదు. “వాళ్ళను బాధ పెట్టి ధనం తీసుకోవడం వల్ల గ్రామస్తులకి కోపం వస్తుందేమో!” అని చెప్పడమే కాకుండా ఇంటికి వెళ్లి మేనత్తకు కూడా చెప్పాడు. అతడి మాటలను వినిపించుకోలేదు సుదేవుడు.

మరొకసారి రైతు రంగయ్య గృహప్రవేశ సమయంలో కూడా ఇలాగే జరిగింది. పాలిచ్చే ఆవునీ, బియ్యం బస్తానీ అడిగాడు సుదేవుడు. అంత విలువైనవి ఇవ్వలేనన్నాడు రంగయ్య. ఎప్పటిలాగే బంధువులంతా కలసి వంతులు వేసుకుని సుదేవుడి కోరినది ఇచ్చారు. అలాంటివి ఎన్నో సంఘటనలు అక్కడ జరగడంతో ప్రజలకి సుదేవుడి మీద కోపం వచ్చింది.

ఊరి జనమంతా గ్రామపెద్దను కలసి సుదేవుడి వల్ల పడుతున్న బాధలు చెప్పారు. అతడికి కూడా గతంలో అలాంటి అనుభవమే ఎదురవడంతో సుదేవుడి సమస్యకి తగిన పరిష్కారం చూస్తానని మాట ఇచ్చాడు.

దగ్గరలోని గ్రామాల్లో ఉన్న పురోహితుల గురించి కనుక్కోమని కొందరు మనుషులను పంపించాడు గ్రామపెద్ద.పొరుగూరులో ఉండే వసుభద్రుడు మంచివాడని తెలియడంతో వెంటనే వెళ్లి కలుసుకున్నాడు. తమ వూరి సమస్య ఆయనకు చెప్పి తగిన విధంగా సాయం చెయ్యమని అడిగాడు.

దానికి వసుభద్రుడు “సాటి బ్రాహ్మణుడి కుటుంబానికి అన్యాయం జరిగే పని చెయ్యలేను. వెళ్ళిపొండి” అన్నాడు.

అప్పుడు గ్రామపెద్ద బ్రతిమలాడుతూ “ మేము కూడా సుదేవుడిని వదులుకోలేము. కాకపొతే ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పమని కోరుతున్నాను. మీ కొడుకుని కొన్నాళ్ళు పంపించి సాయపడండి’ అన్నాడు. దాంతో వసుదేవుడు తన కుమారుల్లో ఒకడిని వారితో పంపించాడు.

అది మొదలు వూరి జనం తమ ఇండ్లలో జరిగే శుభ కార్యాలకి సుదేవుడిని పిలవలేదు. సుదేవుడుకి కూడా విషయం తెలిసి “పొరుగూరు బ్రాహ్మణుడు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు? నెలో రెండు నెలలో!” అనుకున్నాడు. కానీ ఆరునెలలు దాటిపోయేసరికి ‘ఒకవేళ గ్రామస్తులు శాశ్వతంగా పిలవకపొతే ఎలా బ్రతకాలి?’ అనే భయం పట్టుకుంది.

దాంతో మరునాడు పొద్దున్నే కొత్త పురోహితుడిని కలిసి “నా బ్రతుకు నాశనం చెయ్యడానికి వచ్చావా? వెంటనే ఊరొదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే నీ అంతు చూస్తాను” అని బెదిరించాడు.

ఈ విషయం గ్రామస్తులకు తెలిసి సుదేవుడి ఇంటికి వెళ్లి “గ్రామపెద్ద అనుమతి లేకుండా అతడు ఊరొదిలి వెళ్ళడు. కావాలంటే మీరే మరొక వూరు వెళ్ళిపొండి“ అన్నారు.

సుదేవుడి భార్య భర్తను ఓదార్చి ‘మీరు పొరుగూరు వెళ్లి వసుభద్రుడిని కలసి న్యాయం కోరండి” అని సలహా ఇచ్చింది. భార్య చెప్పిన సలహా నచ్చడంతో వెంటనే వెళ్లి వసుభద్రుడిని కలిసాడు సుదేవుడు.

అతడి మాటలు విన్న వసుభద్రుడు “మీ గ్రామపెద్ద కోరిక మీద నా కొడుకుని పంపించాను తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపo లేదు. మీ గ్రామపెద్దని ఒప్పిoచుకుని నా కొడుకుని వెనక్కి పంపించు” అన్నాడు.

అప్పుడు సుదేవుడు “నాకు బుద్ధి వచ్చింది. నా కుటుంబం వీధిన పడక ముందే మీరే ఏదో ఒక దారి చూపించండి’ అనడంతో అతడి మీద జాలి కలిగింది వసుభద్రుడుకి. వెంటనే ఒక నౌకరును పంపి గ్రామపెద్దని రప్పించి సుదేవుడి కోరిక వివరించాడు.

సుదేవుడు కూడా గ్రామపెద్దతో ‘ఎవరికీ కష్టం కలిగించకుండా నడుచుకుంటాను’ అని మాట ఇచ్చాడు. దాంతో సమస్య తీరిపోయింది. అప్పుడు వసుభద్రుడు “కానుకలు అడిగే ముందు బీదాగొప్పా బేధo తెలుసుకోవాలి సుదేవా! ఇచ్చే స్తోమత ఉన్నవాళ్ళ దగ్గర పుచ్చుకున్నా ఫరవాలేదు. ఇవ్వలేనివాళ్ళని పీడించవద్దు. మనసు మెప్పించి తీసుకోవాలి కానీ మనసు నొప్పించి కాదు. ఈ సందర్భంలో నాకు తెలిసిన ఒక సత్యం చెబుతాను. సంతుష్టి లేని బ్రాహ్మణుడు, సంతుష్టుడయిన రాజు పాడయిపోతారని పెద్దల ఉవాచ. లభించిన దానితో బ్రాహ్మణుడు సంతృప్తి చెందాలి. అప్పుడే అతడికి సమస్యలు రావు. కాని రాజు విషయంలో అది వర్తించదు. రాజ్యాన్నేలే రాజు సంతృప్తి చెందితే ప్రమాదం వస్తుంది. పొరుగునున్న రాజు పెరిగిపోయి ఈ రాజు మీద దండయాత్ర చేసి రాజ్యం ఆక్రమిస్తాడు. ఇది తెలుసుకుని ప్రవర్తిస్తే శాంతంగా ఉండగలవు” అన్నాడు సుదేవుడితో.

సుదేవుడు తరువాత కాలంలో తన మాటను నిలుపుకుని ప్రజల మన్నన పొందాడు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ