డౌరీ కళ్యాణం - తిరుమలశ్రీ

dowry kalyanam

"ఆశయం నా శ్వాస. ఆదర్శం నా ఊపిరి. ప్రేమికుల్ని విడదీయడం పాపం అనుకునేవారిలో నేను ప్రథముణ్ణి" అన్నాడు కుక్కుటేశ్వర్రావు.

"శ్వాస, ఊపిరీ...రెండూ ఒకటేనేమో నాన్నా!" అన్నాడు చంద్రం తండ్రి చెవిలో.

"ఐతే అయ్యాయిలేరా. ఎఫెక్ట్ కోసం అలా అన్నాన్లే" అన్నాడు కుక్కుటేశ్వర్రావు మెల్లగానే.

"ఆశయం, ఆదర్శం వంటి పెద్ద మాటలు నాకు తెలియదుగాని...నా కొడుకు అభీష్టాన్ని నెరవేర్చాలనే ఇంగితం మాత్రం ఉంది" అన్నాడు పరమేశ్వర్రావు నవ్వుతూ.

పరమేశ్వర్రావు కొడుకు రఘు, కుక్కుటేశ్వర్రావు కూతురు జలజ ప్రేమించుకున్నారు. రెండేళ్ళ యూనివర్శిటీ ప్రేమ - డిగ్రీలు చేతికి వచ్చి, రఘుకి జాబ్ కూడా రావడంతో పెళ్ళి ప్రస్తావనకు దారి తీసింది. మధ్య తరగతికి చెందిన పరమేశ్వర్రావుకీ ఓ కూతురు ఉంది. ఆ కట్నాల జగతిలో కూతురి పెళ్ళి చేయడం కొంచెం కష్టమే అతనికి. ఐతే, ’కొడుక్కి కట్నం తీసుకుని, అది కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్ళి చేసేస్తే సరి. ఈ మాత్రానికే బెంబేలుపడిపోతావేమిటోయ్?’ అని ఇటు బంధువులు, అటు స్నేహితులూ అనడంతో, అదీ బాగానే ఉందనిపించింది. కాని, కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాననీ, ఆమెనే పెళ్ళాడతాననీ చెప్పడంతో కాదనలేకపోయాడు. ఎంత ప్రేమ వివాహమైనా, పిల్ల తండ్రి కాస్తో కూస్తో కట్నం ఇవ్వకపోతాడా అనుకున్నాడు.

ఐతే కుక్కుటేశ్వర్రావు ఘటికుడు. ’కొడుక్కి కట్నం తీసుకోవాలి, కూతురికి కట్నం ఇవ్వకూడదు’ అన్న తరహా మనిషి. రఘు తన కూతుర్ని ప్రేమించాడనీ, అతని పెద్దలు అందుకు వ్యతిరేకులు కారనీ తెలియడంతో రాజకీయం ఆడాడు. "కట్నం అనండి, కానుకలనండి...కూతురికి అంతో ఇంతో ఇచ్చి పంపాలని ఏ తండ్రికైనా ఉంటుంది, బావగారూ! కాకపోతే ఇది ప్రేమ వివాహం. నేను ఏమైనా ఇస్తే వారి ప్రేమను అవమానించినట్టవుతుంది. అందుకే మా అమ్మాయికి కట్నం ఇవ్వదలచుకోలేదు నేను" అన్నాడు కుక్కుటేశ్వర్రావు నిస్సిగ్గుగా. పరమేశ్వర్రావు అవాక్కయ్యాడు. అక్కడికీ కూతురి పట్ల తాను నిర్వహించవలసిన బాధ్యతను గూర్చి పరోక్షంగా ప్రస్తావించాడు కూడాను. ఏమీ అర్థంకానట్టే ప్రవర్తించాడు కుక్కుటేశ్వర్రావు. పరమేశ్వర్రావు ఏమీ అనలేకపోయాడు.

రఘు, జలజల వివాహం జరిగిపోయింది. పైసా కట్నం ఇవ్వకుండా కూతురి పెళ్ళి సజావుగా జరిపించినందుకు తనను తానే అభినందించుకున్నాడు కుక్కుటేశ్వర్రావు. కొడుక్కి మాత్రం మంచి కట్నం ఇచ్చే సంబంధం కోసం వల విసిరాడు. ఆ లోపున కొడుకు, తన అల్లుడిలాగ పిచ్చి పనేదైనా చేస్తాడేమోనని, "ప్రేమా దోమా అంటూ పిచ్చి పిచ్చి వేషాలెయ్యమోకు. మనకు కిట్టుబాటు కాదు. బోలెడు తగలేసి చదివించాను నిన్ను. నాకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్ళి జరిపించే పూచీ నాది" అంటూ చంద్రం ముందు కాళ్ళకు బంధం వేసాడు. చంద్రం మెతక మనిషి. "అలాగే నాన్నా!" అంటూ తలూపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జలజకు అన్నను చూస్తే గంగిరెద్దు గుర్తుకొచ్చింది.

కొడుక్కి ఎన్నో సంబంధాలు చూసాడు కుక్కుటేశ్వర్రావు. అమ్మాయి అందంగా ఉంటే, సంగీతం రాదని వద్దన్నాడు. సంగీత సరస్వతి ఐతే, అందం లేదన్నాడు. రెండూ ఉంటే, మరేదో కొరత చూపించేవాడు. రంగు లేదనో, పొంగు లేదనో, హంగు లేదనో ఏదో ఒక వంక పెట్టి వచ్చిన సంబంధాలన్నీ త్రిప్పికొడుతున్నాడు. నిజానికి చంద్రానికి తాను చూసిన అమ్మాయిలందరూ బాగానే కనిపించారు. వాళ్ళంతా తండ్రికి ఎందుకు నచ్చలేదో అర్థమయ్యేదికాదు.

ఓసారి జలజతో "ఆఫీసులో అంతా ముదురు బెండకాయి అని నిక్ నేమ్ తో పిలుస్తున్నారే నన్ను," అంటూ వాపోయాడు ముప్పై ఐదేళ్ళ చంద్రం.

"మరి కొన్నాళ్ళు ఇలాగే సాగిందంటే పెళ్ళిచూపుల కొడుకుగా మిగిలిపోతావే తప్ప, నువ్వెప్పటికీ పెళ్ళికొడుకువి కాలేవురా అన్నయ్యా! చదువుకున్నావు, చక్కటి ఉద్యోగం చేస్తున్నావు. జీవిత భాగస్వామి విషయంలోనైనా కాస్త స్వతంత్రంగా ప్రవర్తించరా" అంటు సన్నగా అన్నను మందలించింది ఆమె.

అన్నగారి నిశ్చితార్థపు సమయంలోను, పెళ్ళిలోను చంద్రాన్ని చూసిన రఘు చెల్లెలు సంధ్యకు అతనిపైన సదభిప్రాయం ఏర్పడింది. ఓసారి జలజతో, "వదినా! మీ అన్నయ్య నాకు నచ్చాడు. ఇది ప్రేమ అనను. అతనంటే నాకిష్టం. అంతే. అతనికీ ఇష్టమైతే అతని ఇల్లాలిని కావాలనుకుంటున్నాను నేను," అంటూ సిగ్గుకు కాసేపు ముసుగేసి తన మనసులోని మాటను బైటపెట్టింది. ఆ ఆలోచన జలజకూ ఉంది. కాని తండ్రి సంగతి ఎరిగున్నందున ఆ ఆలోచనను తనలోనే అణచుకుంది. ఇప్పుడు ఆడపడుచు తనంతట తానుగా తన అభీష్టాన్ని వెలిబుచ్చడం సంతోషం కలిగించింది.

ఆ విషయం భర్తతో చెప్పింది. అతను తల్లిదండ్రులతో చెప్పాడు. అప్పటికే కూతురుకి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు. చంద్రం వారి దృష్టిలో ఉన్నా, కుక్కుటేశ్వర్రావు తత్వానికి జడిసి వెనుకాడాడు పరమేశ్వర్రావు. ఇప్పుడు చంద్రమంటే కూతురు ఇష్టపడుతోందని తెలిసి కుక్కుటేశ్వర్రావును కలసి ప్రతిపాదన చేసాడు.

చంద్రం, సంధ్యను చూసియున్నాడు. ఆమె అందగత్తే కాదు, చదువుకున్నదీ నెమ్మదైనదీను. తండ్రి నీడలో ఉండిపోయిన అతనికి ఆ పిల్లను చేసుకోవాలన్న ఆలోచన అంతవరకు తట్టలేదు. ఇప్పుడు జలజ మావగారు వచ్చి అడిగితే, తండ్రి వంక ఆశగా చూసాడు, ఒప్పుకుంటే బావుండునని.

వియ్యంకుడి ప్రతిపాదన గురించి క్విక్ గా ఆలోచించాడు కుక్కుటేశ్వర్రావు. మదిలోనే ఏవేవో లెక్కలు వేసాడు...పరమేశ్వర్రావు కాలేజ్ లెక్చరర్ గా వెనకేసిందేమీ లేదు. తాను కోరిన కట్నం ఇచ్చుకోలేడు. తన ఎక్స్ పెక్టేషన్స్ కి అతను తూగలేడు. పైగా కూతురికి తాను పైసా కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు అతన్ని కొడుక్కి కట్నం అడగడం బావుండదు.

అందుకే, "ఈ ఆలోచన నాకు అమ్మాయి పెళ్ళిలోనే వచ్చింది, బావగారూ! కుండమార్పిడి అవుతుందని ఊరుకున్నాను. మన కుటుంబాలలో కుండమార్పిడి పెళ్ళిళ్ళు జరుగవుగదా! అమ్మాయికి మంచి సంబంధం చూసి చేద్దాం" అంటూ లౌక్యంగా ’నో’ చెప్పేసాడు.

వియ్యంకుడు నిరాశ చెందితే, చంద్రం హతాశుడయ్యాడు. తండ్రి ఎదుట కిక్కురుమనే ధైర్యం లేదు అతనికి. ఆ తరువాత మూణ్ణెల్లకే సంధ్య పెళ్ళయిపోయింది. మరో ఆర్నెల్లకు చంద్రానికి కూడా సంబంధం కుదిరింది. ఎంతో క్లోజ్ స్క్రీనింగ్ తరువాత కుదిరిన సంబంధం కావడంతో, పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది సంధ్యకు. పెళ్ళికి తానూ వచ్చింది.

పెళ్ళికూతురు గౌరి పల్లెటూరి పిల్ల. చామనచాయకు తక్కువగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. చిన్న మెల్ల కూడా ఉంది. పెద్దగా చదువుకోలేదు.

గౌరిని చూసి విస్తుపోయింది సంధ్య. "అమ్మాయిలెవరూ మీ అన్నయ్యకు ఓ పట్టాన నచ్చడంలేదనీ, అందుకే చాలా సంబంధాలు చూడవలసి వచ్చిందనీ ఆలకించాను. ఈ మెల్లకన్ను నల్ల పిల్ల ఎలా నచ్చింది, వదినా!?" అనడిగింది జలజను రహస్యంగా. జలజ పెద్దగా నవ్వి, "నచ్చనిది అన్నయ్యకు కాదు, మా నాన్నకు. నాన్నకు నచ్చవలసింది కన్య కాదు, కట్నం!" అంది. "గౌరి తెచ్చే లక్షల కట్నం ముందు ఆ పిల్ల మెల్లకన్ను మా నాన్నకు ఆనలేదు మరి!"

సంధ్య తెల్లబోయి, "ఆ అమ్మాయికి వంకలు పెట్టడం నా ఉద్దేశ్యం కాదుగాని...మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నారా అని ఆశ్చర్యంగా ఉంది" అంది.

"మా అన్నయ్య గంగిగోవే కాదు, గంగిరెద్దు కూడాను. అమ్మానాన్నల కూచి. వారు గీచిన గీటు దాటడు" నవ్వింది జలజ. "నిజానికి నిన్ను చేసుకోవాలని ఉవ్విళ్ళూరాడు అన్నయ్య. మావయ్యగారు తాను కోరిన కట్నం ఇచ్చుకోలేరని, కుండమార్పిడి వంకతో కొట్టిపారేసాడు మా నాన్న".

రెండేళ్ళ తరువాత - ఎందుకో పక్క ఊరికి వచ్చిన సంధ్య, వదిన పుట్టింటికి వెళ్ళింది, ఆమె తల్లిదండ్రులను చూసివద్దామని. గేటు తీసుకుని లోపల ప్రవేశించిన సంధ్యకు ఇంటి చుట్టూ నందనవనంలా ఉన్న తోట కనువిందు చేసింది. పూలమొక్కలు, ఫల వృక్షాలతో, కూరగాయల మడులతో, పాదులతో నిండుగా కళకళలాడుతోందిప్పుడు. పంచెకట్టు, బనియన్ తో, తలకు తువాలు చుట్టుకుని పాదులకు బోదులు త్రవ్వుతూన్న వ్యక్తిని చూసి, తోటమాలిని పెట్టుకున్నారన్న మాట అనుకుంది.

గుమ్మంలోనే ఎదురు వచ్చిన గౌరి వంక పరిశీలనగా చూసింది సంధ్య...గౌరి ఇప్పుడు కొంత రంగు రావడమే కాక కాస్త ఒళ్ళు కూడా తగ్గింది...ప్రశ్నార్థకంగా చూస్తూన్న గౌరికి స్వపరిచయం చేసుకుంది.

"సారీ, అప్పుడు పెళ్ళిలో చూడ్డమే మిమ్మల్ని. ఆ తరువాత మనం మళ్ళీ కలుసుకోలేదుగదా. రండి," అంటూ లోపలికి ఆహ్వానించింది గౌరి చిరునవ్వుతో.

"బాగున్నావా అమ్మా?" అన్న పిలుపు వినిపించి అటువైపు చూసింది సంధ్య. హాల్లో మాపింగ్ చేస్తూన్న వృద్ధురాలు పలకరింపుగా నవ్వింది. ఆమె వంక పరీక్షగా చూసిన సంధ్య విస్తుపోయింది. "మీరు...!?" "నేనేనమ్మా. చంద్రం తల్లిని" అని ఆవిడ జవాబివ్వడంతో చటుక్కున దగ్గరకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని, "అత్తయ్య గారూ!?" అంది.

"చూసావా అమ్మా, నా కోడలు పెట్టే ఆరళ్ళు? ఇది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నన్ను పనిమనిషి కంటె హీనంగా చేసేసింది" అంటూ మదిలోని ఆవేదనంతా వెళ్ళగ్రక్కుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

సంధ్య తెల్లబోయి చూసింది. అత్తాకోడళ్ళ నడుమ సఖ్యత లోపించిందని అర్థమైపోయింది. వెలసిపోయిన చీర, జాకెట్టు, రేగిన జుత్తు, శుష్కించిన దేహం, పీక్కుపోయిన ముఖమూను. మనిషి నల్లబడింది. అంతకుమునుపు దర్జాగా దర్పంగా ఉండే ఆచిడకూ, ఈనాడు తాను చూస్తూన్న మనిషికీ పోలిక లేదు...ఆవిడ పట్ల జాలి కలిగింది. కాని, అది సున్నితమైన విషయమూ, మరొకరి కుటుంబ వ్యవహారమూ కనుక మాట మార్చుతూ, "మావయ్యగారు ఇంట్లో లేరా, అత్తయ్యగారూ?" అనడిగింది.

"బైట తోటలో కనిపించలేదామ్మా? మావగారనైనా చూడకుండా కూలోడి కంటె హీనంగా బండ చాకిరీ చేయిస్తోంది ఆయన చేత ఈ మహాతల్లి!" అంటూ అక్కసు కొద్దీ మెటికలు విరిచిందావిడ.

నివ్వెరపోయింది సంధ్య. ’తోటలో కనిపించిన మనిషి మావయ్యగారా! ఆ వేషం చూసి తోటమాలి అనుకుని పలకరించలేదు’ అనుకుంది మదిలో. పైకి చిరునవ్వుతో, "తోట పని ఒంటికి మంచిదేగా అత్తయ్యగారూ! డెయిలీ గార్డెనింగ్ చేసేవారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు తెలుసా?" అంది.

మూతి త్రిప్పుకుందావిడ. "తోటపని ఒక్కటే కాదమ్మా. పనివాడిలా బైటి పనులు కూడా చేయిస్తోంది ఆయన చేత" అంది. "ఐనా మన బంగారం మంచిదైతే కంసాలిననే అవసరమేముందన్నట్టు, నా కొడుకు చవటై పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగబట్టేగా మాకీ పాట్లు!” అంతలో కుక్కుటేశ్వర్రావు అక్కడికి వచ్చాడు.

"ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మనమ్మాయి ఆడపడుచు సంధ్య. మనల్ని చూడాలని వచ్చింది" అని భార్య అనడంతో, "అలాగా! బాగున్నావా అమ్మా?" అంటూ సంధ్యను పలుకరించాడు అతను ఆప్యాయంగా.

"బాగున్నారా మావయ్యగారూ? " అంటూ పరామర్శించింది సంధ్య.

"ఏం బాగులే తల్లీ! కోడలని కోరి తెచ్చుకుంటే మా పాలిట కొరివై కూర్చుంది. ఆ రోజు మీ నాన్నగారు అడిగినప్పుడే నిన్ను చంద్రానికి చేసుకునుంటే మాకు ఈ పాట్లు తప్పేవేమో!" అన్నాడు కోడలి వంక నిరసనగా చూసి. "తప్పు మావయ్యగారూ! పెద్దవారు, మీరలా మాట్లాడకూడదు" అంది సంధ్య వారిస్తూ.

గౌరి ఆ ఇంటి కోడలయ్యాక మొదటిసారిగా వారిని చూడ్డానికి వచ్చింది సంధ్య. ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు. ఆమె అవస్థను గ్రహించినదానిలా, "రండక్కయ్యా, పైకి వెళ్దాం" అంటూ చనువుగా సంధ్య చేయి పట్టుకుని మేడ మీదకు తీసుకుపోయింది గౌరి. రెఫ్రెష్మెంట్స్ తీసుకుంటూండగా, "సారీ, అక్కా! అత్తయ్య, మావయ్య మిమ్మల్ని ఇబ్బందిపెట్టినట్టున్నారు" అంది నొచ్చుకుంటున్నట్టు. అనీజీగా మందహాసం చేసింది సంధ్య. "ఎంత మంచివాళ్ళైనా అత్తాకోడళ్ళ మధ్య ఆ డిస్టెన్స్ అలాగే ఉండడం సహజం. అందుక్కారణం జెనరేషన్ గ్యాప్ తప్ప మరేం కాదు".

నవ్వింది గౌరి. "లేదండీ. అత్తయ్య మీతో చెప్పిందంతా నిజమే. కావాలనే నేను వాళ్ళకు విధించిన శిక్ష అది" అంది. తెల్లబోయి చూసింది సంధ్య.

"ఔనండీ. మా అమ్మా, నాన్నా మంచి కట్టుబాట్లతో పెంచారు నన్ను. అత్తవారింటికి పంపించేప్పుడు వాళ్ళు నాతో ఏం చెప్పారో తెలుసా? ఇకమీదట నా తల్లిదండ్రులు వీళ్ళేనని. కాని, నా పెళ్ళికి మావాళ్ళను వీళ్ళు పెట్టిన హింస నేనెలా మరచిపోగలనక్కా?" గౌరి గొంతులో జీర. "ఏం జరిగింది?" విస్మయంతో అడిగింది సంధ్య. "పది లక్షల కట్నం అడిగితే ఇవ్వడానికి ఒప్పుకున్నారు మావాళ్ళు. తీరా అందరికీ శుభలేఖలు పంచేసాక, పెళ్ళి వారం రోజులు ఉందనగా...అమ్మాయికి మెల్ల ఉంది. ఇంకో ఐదు లక్షలు ఇస్తే సరిపెట్టుకుంటాం. లేకుంటే పెళ్ళి జరుగదు" అంటూ పట్టు పట్టారు మావగారు. అది తన తలకు మించిన భారమని నాన్న ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. అమ్మాయిని ముందుగా చూసుకునే సంబంధం ఖాయం చేసుకున్నారుకదా అంటే, ఆ విషయం మీరు చెప్పలేదు, మేం చూళ్ళేదు అంటూ మొండికేసారు. పీటలవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే. గత్యంతరంలేక ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అదనపు కట్నం ఇచ్చారు నాన్న. పెళ్ళయాక కూడా అదీ ఇదీ అంటూ నానా అవస్థలూ పెట్టారు మావాళ్ళను..." గౌరి వదనం అరుణిమదాల్చింది. ఆశ్చర్యంతో నోరు తెరచుకుని ఆలకించింది సంధ్య.

"అక్కా! నావల్లే కదా మావాళ్ళకు అన్ని బాధలు అనుకుని నేను ఏడ్వని రాత్రులు లేవు. ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని చింతించని క్షణాలు లేవు. ఈ కట్నాల దుర్వ్యవస్థను దూషించని రోజు లేదు...ఈ ఇంటి పేరును భావితరానికి కొనసాగించే సంతానాన్ని కని పెంచడానికి ఈ కుటుంబంలోకి వచ్చాను నేను. ఈ ఇంటి వంశాభివృద్ధికి తోడ్పడడంలో పావుగా వచ్చాను. కని పెంచి, విద్యాబుద్ధులు గరపినవారిని, తోడబుట్టినవారినీ, అందర్నీ వదిలి ఈ కుటుంబం యొక్క కష్టసుఖాలను పంచుకోవడానికి వచ్చాను...కాని, వీళ్ళేం చేసారు? కట్నాలనీ, కానుకలనీ నన్ను, నావాళ్ళనూ వేధించారు. రేపు వీరికి జవసత్త్వాలు ఉడిగాక కంటిపాపలా చూసుకోవలసిన నన్ను...కంటిలో నలుసులా, పరాయిదానిలా చూసారు. ఆడపిల్లను ఇచ్చుకున్న పాపానికి మావాళ్ళకు నరకం చూపించారు..." ఆవేశంగా చెప్పుకుపోయిందామె. "అదే అక్కా, నాలో ఈ తిరుగుబాటుకు కారణం. పదిహేను లక్షలు పోసి భర్తను కొనుక్కున్నాను నేను. ఈ ఇంటినీ, ఇంట్లోని మనుషుల్నీ కొనుక్కున్నాను. కనుక ఈ ఇంటి పైన అధికారం నాది. వీళ్ళంతా నా చెప్పుచేతల్లో ఉండాలి, అనిపించింది. కక్ష తీర్చుకుంటున్నాను".

జాలిగా చూసింది సంధ్య. "కాని, అది తప్పు కదమ్మా! ఈ ఎడ్వాన్స్డ్ ఏజ్ లో వారిని కష్టపెట్టడం..." అంది. "తప్పని నాకూ తెలుసక్కా! మా అమ్మా, నాన్నా కూడా తిట్టారు నన్ను..."

చంద్రం రావడం చూసి లేచి నిల్చుంది సంధ్య. "కూర్చోండి. ప్లీజ్!" అంటూ లోపలికి వచ్చాడు అతను. కుశలప్రశ్నల అనంతరం, "గౌరీ కళ్యాణం కాస్తా డౌరీ కళ్యాణం అయిందన్నది మా గౌరి ఫిర్యాదు. కన్యకు కాక కట్నానికి తాళి కట్టే పెళ్ళికొడుకులకూ, కట్నం కోసం జలగల్లా పీడించే పెద్దమనుషులకూ తగిన గుణపాఠం చెప్పాలన్నది తన ధ్యేయం. అత్తమామల్ని హరాస్ చేయడంతో తన ఉద్యమం ఆరంభించింది" అన్నాడు నవ్వుతూ.

"మీకంతా వేళాకోళమే! అసలు మీకు ఫుడ్డు, బెడ్డు రెండూ గడ్డుచేసేస్తే తెలిసొచ్చేది" అంది గౌరి కోపంగా. "అమ్మో! ఆ పని మాత్రం చేయకు" అన్నాడు భయం నటిస్తూ.

సంధ్య నవ్వేసి, "లోకం తీరే అలా ఉన్నప్పుడు మావయ్యగారిని తప్పుపట్టి ఏం లాభం, గౌరీ? పాపం, వయసు మళ్ళిన వాళ్ళను మరీ కష్టపెట్టడం మంచిది కాదేమో! అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచావు కాబట్టి నాకు తోచింది చెబుతున్నాను. అపార్థం చేసుకోకు" అంది.

అందుకు చంద్రం కూడా నవ్వేసి, "మీకో విషయం తెలుసా? చెడు చేస్తున్నాననుకుంటూ గౌరి వాళ్ళకు మంచే చేస్తోంది. అమ్మకు, నాన్నకు డయాబెటిక్స్ ఉంది. డాక్టర్ వాళ్ళను ఎక్సర్సైజ్ చేయమన్నాడు. అది వాళ్ళ వల్ల కాదు. వాకింగ్ కూడా అలవాటులేదు. ఇంటి పనైనా చేస్తే మనసుకు, శరీరానికీ కొంతవరకైనా వ్యాయామం లభిస్తుందనిపించింది. నిజానికి తోటపని మొదలుపెట్టాక నాన్నగారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. అందుకే గౌరి ఉద్యమానికి నేను సైలెంట్ స్పెక్టేటర్ని అయ్యాను" అన్నాడు.

సంధ్య నవ్వింది. గౌరి కూడా ఆమెతో శృతి కలుపుతూ, " మా అత్తమామలకు పట్టిన గతి ఇతరులకు గుణపాఠం కావాలన్నది ఓ కారణమైతే, వీళ్ళలో పశ్చాత్తాపం తీసుకురావడం నా లక్ష్యం, అక్కా! ఆ మధ్య ఓసారి మావయ్యగారన్నారు, మావాళ్ళ దగ్గర తీసుకున్న అదనపు కట్నం తిరిగి ఇచ్చేస్తానని. ఆ మాటే నేను నాన్నతో అంటే, ’ఆడపిల్లకు అరణంగా ఇచ్చింది తిరిగి తీసుకుంటామా? తప్పమ్మా!’ అంటూ, అత్తమామలకు మనస్తాపం కలిగిస్తున్నందుకు తల వాచేలా చీవాట్లు పెట్టారు నాకు. అత్తయ్యనీ, మావయ్యనీ నెత్తిమీద పెట్టుకునే రోజులు త్వరలోనే ఉన్నాయి లెండి" అంది.

పల్లెటూరి పిల్లైనా, పెద్దగా చదువుకోకపోయినా కట్నదాహార్తుల పైన కత్తిగట్టిన ఆమె తెగువకు, మనోపరిపక్వతకూ ఆరాధానగా, మురిపెంగా గౌరి వంక చూస్తూ ఉండిపోయింది సంధ్య.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు