ముసురు - చిత్ర వెంకటేష్

musuru

ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. యడతెరిపిలేకుండ వర్షం కురుస్తునే ఉంది. ఊరికి దూరంగాఉన్న ఒక పెంకుటిల్లు ఒంటరిగా అన్ని కోల్పోయినట్టు నిస్తేజంగా ఉంది. చాల పాతకాలం నాటి ఇల్లు కావటంతో గోడలు పెచ్చులు ఊడిపోయాయి. పైగా గదిగోడలు నల్లగా మసకబారినట్టు తారురంగులో ఉన్నాయి. ఇదిచాలదన్నట్టు పైకప్పు మీద నుంచి బూజులు వేలాడుతున్నాయి. గది గుమ్మం దగ్గర నిలిబడి ఆశగా రోడ్డు వైపు చూస్తుంది రత్తాలు. దాదాపు రెండు రోజులనుంచి ఆమె అలాగే చూస్తోంది. కనీసం ఈ రోజు అయిన ఒక్క ప్యాసింజర్ అయినరాకపోతాడా అని ఆమె ఆశ.

దూరంగా ఉన్న మెయిన్ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. దాదాపురెండు రోజుల నుంచి ఆగకుండ వర్షం కురుస్తునే ఉంది. ముందు చిన్న చినుకులతో మొదలయిన వర్షం గంట గడిచేసరికి కుంబవృష్టిగా మారిపోయింది. ఈదురుగాలలతో పిడుగుల చప్పుడుతో వాతావరణం భీభీత్సంగా మారిపోయింది. ఒక గంటలో తగ్గిపోతుందని అనుకున్న వర్షం విడవకుండ కురువటంతో రత్తాలు బెంబెలు ఎత్తిపోయింది. తన దగ్గరు అంతవరకు దాచుకున్న డబ్బుతో ఇంటికి వెచ్చాలు బాబుకు పాలు కొనుక్కుంది. దాంతో ఆమె దగ్గర ఒక పైసా కూడా మిగలలేదు. అయిన రత్తాలు కంగారుపడలేదు. కనీసం ఒక ప్యాసింజర్ అయిన రాకపోతాడా అనుకుని మనస్సుని సరిపెట్టుకుంది. కాని ఆమె ఆశ నిరాశ అయింది. వర్షం తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది. రెండు రోజులపాటు ఆగకుండ కురుస్తునే ఉంది.

నగరంలో జనజీవితం పూర్తిగా స్తంబించిపోయింది. మిగత జనం మాట అటుపక్కన పెడితే ఈ వర్షం వల్ల రత్తాలు మాత్రం చాల నష్టపోయింది. చేతిలో డబ్బు లేదు. ఇంట్లో వెచ్చాలు నిండుకున్నాయి. బాబు పాల కోసం ఏడ్చీ ఇప్పుడే నిద్రపోయాడు. ఈ రోజు కూడా ప్యాసింజర్ రాకపోతే తన పరిస్ధితి ఏమిటా అని మదనపడింది రత్తాలు. ముందు పక్కన ఉన్నవాళ్ళ సహయం అడగాలని అనుకుంది. కాని వాళ్ళ పరిస్ధితి కూడాఇంచుమించు అమె లాగే ఉంది.

నిజానికి ఒక సంవత్సరం ముందు రత్తాలు జీవితం చాల ఆనందంగా సాఫిగా సాగిపోయింది. భర్త యూదగిరి ఒక పెద్ద కంట్రాక్టర్ దగ్గర పనిచేస్తేవాడు. రోజుకు అయిదువందలు సంపాదించి తెచ్చేవాడు. అతనికి ఒక్క చిన్న చెడ్డఅలవాటు కూడా లేదు. కనీసం టీ కూడా బయటతాగడు. పెద్దగా చదువుకోలేదు అతను. కనీసం తనకు పుట్టబోయే బాబు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని అతని కోరిక. అందుకే పెళ్ళయిన మొదటి రోజు భార్య రత్తాలును దగ్గర కూర్చోపెట్టుకుని తన మనస్సులో మాట చెప్పాడు.

“చూడా రత్తాలు నువ్వు నేను ఏం చదువుకోలేదు. కాని మనకు పుట్టబోయే బాబు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని పెద్ద కొలువు చెయ్యాలి. అందరు వాడిని చూసి ముక్కునవేలువేసుకోవాలి. కాని ఇది మనం అనుకున్నంత తేలికకాదు. ఖర్చుతో కూడుకున్నది. నేను రోజు అయిదువందలు సంపాదిస్తాను. అందులో రెండు వందలు తీసి దాచిపెట్టు. మిగత మూడు వందలతో మనం సరిపెట్టుకుందాం. ఎంత కష్టం వచ్చిన దాచుకున్న డబ్బులోంచి ఒక్క పైసా కూడా తియ్యటానికి వీలులేదు. వాడికి నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి స్కూలులో చేర్పించటానికి మన దగ్గర చాల డబ్బు ఉంటుంది. ఎవరిని చెయ్యి చాచి అడగవలసిన అవసరం లేదు. ఏమంటావ్”అన్నాడు.

సరే అంది రత్తాలు. మరునాడు నుంచి భర్త ఇచ్చిన డబ్బులోంచి రెండువందలు వేరే డబ్బాలో దాచిపెట్టటం మొదలుపెట్టింది. సరిగ్గా సంవత్సరం తరువాత రత్తాలుకు మగబిడ్డపుట్టాడు. వాడిని చూసి ఇద్దరు ఎంతో మురిసిపోయారు. దొరబాబులా ఉన్నాడని చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు. ఆ మాటలు విని ఇద్దరు ఎంతో ఆనందపడిపోయారు. కొడుకును చూసుకుని ఆ భార్య భర్తలు తమ కష్టాలను మరిచిపోయేవారు.

సరిగ్గా బాబు పుట్టిన నాలుగునెలలకు వాళ్ళ జీవితంలో తుఫాను చెలరేగింది. ఆ రోజు మాములుగా యాదగిరి పనికి వెళ్ళాడు. సాయంత్రం పనిముగించుకుని మార్కెట్టుకు వెళ్ళాడు. భార్యకు పూలు కొన్ని కూరగాయలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మాములుగా రోజు అతను మెయిన్ రోడ్డు క్రాస్ చేసి తన ఇంటికి చేరుకోవాలి. ఆ రోజు కూడా అతను జాగ్రత్తగా మెయిన్ రోడ్డు క్రాస్ చెయ్యబోయాడు. అప్పుడే ఒక లారి వేగంగా వచ్చి అతన్ని బలంగా గుద్దుకుంది. యాదగిరి అక్కడికి అక్కడే చనిపోయాడు. అతనిచేతిలో ఉన్న పూలు పండ్లు రోడ్డు మీద పడిపోయాయి. ఈ దారుణం తెలియని రత్తాలు రోజులాగే చక్కగా ముస్తాబు చేసుకుని భర్త కోసం ఎదురుచూస్తోంది. భర్త రాలేదు కాని భర్త దగ్గర పనిచేసే కుర్రాడు వచ్చి చావు కబురుచెప్పాడు. రత్తాలు వెంటనే బాబును చంకనఎత్తుకుని యాక్సిడెంట్ జరిగిన స్ధలం దగ్గరికి వెళ్ళింది. అప్పుటికే జనం మూగిపోయారు. ట్రాఫిక్ స్తంబించిపోయింది. రత్తాలు ఎలాగో జనం మద్యలోంచి వెళ్ళి చూసింది. రక్తపు మడుగులో నిర్జివంగా ఉన్న భర్తను చూడగానే ఆమె స్తంబించిపోయింది. షాక్ తో బొమ్మలా ఉండిపోయింది.

మరుసటి రోజు ఏడుస్తున్న రత్తాలును చూడటానికి కాంట్రాక్టర్ వచ్చాడు. యాదగిరి చాల మంచివాడని నిజాయితిపరుడని పొగిడాడు. అలాంటి వాడు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవటం చాల దురదృష్టమని విచారం వెలిబుచ్చాడు. అతను చేసిన సేవలకు తగిన ప్రతిఫలం ఇస్తానని హామీ ఇచ్చాడు. రత్తాలు ఎంతో సంతోషపడింది. తన కష్టాలు కొంచంవరకు తీరిపోతాయని ఎంతో ఆశపడింది. రోజులు గడుస్తున్నాయి కాని కాంట్రాక్టర్ దగ్గర్నుంచి ఒక రుపాయి కూడా రాలేదు. కష్టాలమీద కష్టాలు రత్తాలును చుట్టుముట్టాయి. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు యాదగిరి అంతిమసంస్కారానికి ఖర్చయిపోయింది. తినటానికి తిండి లేని పరిస్ధితి ఏర్పడింది.

ఏంచెయ్యాలో అనిఆలోచిస్తుంటే ఆమెకు కాట్రంక్టర్ గుర్తుకువచ్చాడు. అతని దగ్గరికి వెళ్ళి డబ్బు సహయం చెయ్యమని అడిగింది. అప్పుడే కాంట్రాక్టర్ తన కూతురును చూడటానికి విదేశాలకు వెళుతున్నాడు. ఇప్పుడు తన దగ్గర అంత డబ్బులేదని విదేశాలనుంచి వచ్చిన తరువాత ఇస్తానని చెప్పాడు. నిరాశతో ఇంటి ముఖం పట్టింది రత్తాలు.

నెలరోజులు గడిచాయి కాని కాంట్రాక్టర్ మాత్రం తిరిగిరాలేదు. రత్తాలు పరిస్ధితి చాల హీనస్ధితికి చేరుకుంది.తినటానికి తిండిలేదు. కనీసం బాబుకు పాలు పట్టటానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదు. తను పస్తులు పడుకోగలదు కాని బాబు పాలు లేకుండ బతకలేడు.అందుకే తనకు తెలిసిన చంద్రి ఇంటికి వెళ్ళింది. తనకు ఏదైన సహయం చెయ్యమని అడిగింది.

నిజానికి చంద్రిది కూడారత్తాలు లాంటి పరిస్ధితే. కాని ఆమె ఆ పరిస్ధితులు అదిగమించటానికి తన శరీరాన్ని ఆయుధంగావాడుకుంది. పగలు రెండుఇళ్ళలో పాచిపనిచేసేది. రాత్రివేళ రోడ్డు మీద నిలబడి వచ్చే పోయే మగవాళ్ళను ఆకర్షించేది. వాళ్ళకు సుఖం ఇచ్చి డబ్బు తీసుకునేది. ఈ విషయం రత్తాలుకు తెలియదు. తెలిస్తే ఆమె సహయం అడిగేది కాదు.

“నీకు ఇవ్వటానికి నా దగ్గర డబ్బులేదు. కాని డబ్బుసంపాదించే మార్గం మాత్రం చెప్తాను”అంది చంద్రి.

“ఏమిటది”ఆశగా అడిగింది రత్తాలు.

“నాకు తెలిసిన మూడు ఇళ్ళలో పనిచెయ్యటానికి ఒక మంచి పనిమనిషి కావాలి. ఈ విషయంవాళ్ళు ఈ రోజే చెప్పారు. నీకు ఇష్టమైతే ఆ మూడు ఇళ్ళు నీకిప్పిస్తాను”అంది చంద్రి. సరే అనక తప్పలేదు రత్తాలుకు. మరునాటి నుంచి ఆ మూడు ఇళ్ళలో పనికి కుదిరింది. వాళ్ళు ఒక్కోక్కరు నెలకు పదిహేను వందలు ఇచ్చేవారు. వచ్చే నాలుగువేల అయిదువందలతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకోచ్చింది. అంత కష్టంలో కూడా ఆమె భర్త ఆశయం మరచిపోలేదు. అతను లేకపోతే ఏం. అతని ఆశయాన్ని తాను నెరవేర్చాలని తీర్మానించుకుంది. అందుకే సంపాదిస్తున్న దాంట్లో కొంత భాగం దాచకోవటం మొదలుపెట్టింది.

రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. కాని ఆ ఆనందం ఎక్కువరోజులు ఉండలేదు.మళ్ళి రత్తాలు కష్టాల కడలిలో చిక్కుకుపోయింది. ఆమె పనిచేస్తున్న మూడు ఇళ్ళలో వాళ్ళకు వేరే ఊరుబదిలి అయింది. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగస్ధులు కావటంవల్ల ఒకేసారి ముగ్గురికి ట్రాన్స్ ఫర్ అయింది. చేతికి అందిన ముద్ద ఎవరో లాక్కున్నట్టుగా విలవిలలాడిపోయింది రత్తాలు. రేపటినుంచి ఏం చెయ్యాలో తోచలేదు. భవిష్యత్తు అయోమయంగా అంధకారంగా తోచింది.

చేసేది లేక ఒక రోజు బాబును చంకనెత్తుకుని కూలి పనికి పోయింది. మేస్ట్రీ ఆమెను రోజు కూలికి తీసుకున్నాడు. దొరికిందే చాలనుకుని ఆ పనిలో చేరిపోయింది. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం వరకు గొడ్డులా పనిచేయించుకునేవాడు మేస్ట్రీ. రెండు వందలు చేతిలో పెట్టేవాడు. ఆ డబ్బు తీసుకుని ఆదరబాదరగా ఇంటికి చేరుకునేది రత్తాలు. బాబుకు పాలుపట్టించి తను ఇంత ఉడకేసుకుని తినేది. పదిహేనురోజులు గడిచాయి. ఒక రోజు పని ఎక్కువగా ఉండి సైట్ దగ్గర ఉండిపోవలసివచ్చింది. అప్పటికే మిగత పనివాళ్ళు వెళ్ళిపోయారు. చుట్టు చీకటి ఆవరించుకుంటోంది. బాబు పాలకోసం ఏడుస్తున్నాడు. పని ముగించుకుని బాబుకు పాలు పట్టింది. వాడిని నిద్రపుచ్చి భుజం మీద వేసుకుని మేస్ట్రీ దగ్గరికి వెళ్ళింది.

లోపల మేస్ట్రీ ఒక్కడే ఉన్నాడు. ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు. పోతపోసిన విగ్రహంలా అందంగా ఉన్నా రత్తాలు ఎదురుగా కనిపించేసరికి అతని ఊపిరి ఆగిపోయింది. నిజానికి రోజు అతను రత్తాలును చూస్తునే ఉన్నాడు. మొదటి సారి ఆమెను చూసినప్పుడు అతనికి గుండెఆగిపోయినంత పనిఅయింది. అతని దగ్గర ఎంతో మంది ఆడవాళ్ళు పనచేస్తున్నారు. కాని ఎవరు రత్తాలు ఆకర్షించినంతగా ఆకర్షించలేదు. పైగా అతను వద్దనుకున్నా వాళ్ళే వచ్చి అతని మీద పడేవాళ్ళు. అతనికి సుఖం ఇచ్చి తమకు కావల్సింది తీసుకునేవాళ్ళు. కాని రత్తాలు మాత్రం అలాంటి పిచ్చివేషాలు వేసేదికాదు. చాల గౌరవంగా టైంకు సైట్ కు వచ్చేది. నడుం వంచకుండ చెప్పిన పనిచేసేది. చిన్నమాట కూడా పడే అవకాశం ఇచ్చేది కాదు.

ముందు తనే ప్రొసిడ్ అయి రత్తాలును లొంగతీసుకోవాలని అనుకున్నాడు మేస్ట్రీ. కాని సీరియస్ గా ఉన్న రత్తాలు మొహం చూసిన తరువాత అతనికి ధైర్యం చాలలేదు. గొడవచేస్తుందని భయపడిఊరుకున్నాడు. కాని మనస్సులో మాత్రం రత్తాలు మీద కోరిక చావలేదు. అది లావాలా అప్పుడప్పుడు పొంగుతునే ఉంది. కాని సమయం కోసం ఎదురుచూస్తున్నాడుఅంతె. ఆ సమయం ఆ రోజు రానే వచ్చింది.రత్తాలుకు ఓవర్ టైమ్ ఇస్తానని చెప్పి అమెను ఒప్పించాడు. పనివాళ్ళందరు వెళ్ళిపోయిన తరువాత మెల్లగా రత్తాలును సమీపించాడు.

అంతవరకు మేస్ట్రీ ఉద్దేశం ఆమెకు తెలియదు. కాని ఎప్పుడైతే మేస్ట్రీ దగ్గరికి వచ్చాడో అతని కోరిక అర్ధమైంది. అతని పట్టులోంచితప్పించుకోవాలని ఎంతో ప్రయత్నించింది. కాని ఆ మొరటు వాడి బలం ముందు ఆమె శక్తి చాలలేదు. అక్కడే మట్టిలోనే తన కోరిక తీర్చుకున్నాడు మేస్ట్రీ. ఆమెకు రావలసిన ఓవర్ టైమ్ తో పాటు తన కోరిక తీర్చినందుకు మరికొంత డబ్బు ఆమె చేతిలో పెట్టాడు.

రత్తాలు జీవచ్ఛంలా లేచి నిల్చుంది. బాబును తీసుకుని ఇంటికి చేరుకుంది. ఇంత కాలం పవిత్రంగా కాపాడుకున్న శీలం మంట కలసిపోయినందుకు విలవిలలాడిపోయింది. భర్తయాదగిరి ఫోటో ముందు నిల్చుని గట్టిగా ఏడ్చింది.

రోజులు గడుస్తున్నాయి. రత్తాలు జీవితంలో ఎలాంటి మార్పులేదు. అక్కడఇక్కడపనిచేస్తూ జీవితాన్ని నెట్టుకోస్తుంది. ఒక రోజు కాంట్రాక్టర్ మనిషి వచ్చి అయ్యాగారుఇంటికి రమ్మంటున్నాడని చెప్పాడు. బహుశా యాదగిరి చావుకు నష్టపరిహారం ఇస్తాడని ఆశపడిఆ మనిషితో అతని ఇంటికి వెళ్ళింది. లంకంత కాంట్రాక్టర్ ఇల్లు చూసిరత్తాలు ఆశ్చర్యపోయింది. కాంట్రాక్టర్ మనిషి ఆమెను లోపలికి తీసుకువెళ్ళి ఒక గది చూపించాడు. గదిలో అమ్మగారు అయ్యాగారుఉన్నారు వెళ్ళు”అన్నాడు.

రత్తాలు బాబును ఎత్తుకుని లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే బయట నుంచి ఎవరో తలుపుకు గడియపెట్టేశారు. గదిలో మంచంమీద విలాసంగా కూర్చుని ఉన్నాడు కాంట్రాక్టర్. చేతిలో మందు గ్లాసు ఉంది. పక్కన సీసా ఏవో తినుబండారాలు ఉన్నాయి.

“రా రత్తాలు నీ కోసమే ఎదురుచూస్తున్నాను”అన్నాడు.

“రెండురోజులనుంచి సరిఅయిన భోజనం లేదు అయ్యాగారు. మీరు డబ్బు ఇస్తే ఇంటికి వెళ్ళి ఒండుకుని తింటాను. బాబు కూడా ఆకలితో అలమటించిపోతున్నాడు”అంది రత్తాలు.

“నా పని పూర్తికాకుండ డబ్బు ఎలా ఇస్తాను. ముందు నా కోరిక తీర్చుకోనివ్వు”అంటు గ్లాసుపక్కన పెట్టిఆమాంతం రత్తాలు మీద పడ్డాడు కాంట్రాక్టర్. ఆమెచేతిలో ఉన్న బాబును నేలమీద పడుకోపెట్టాడు. బలంగా రత్తాలును తన కేసి లాక్కున్నాడు. ఊహించని ఈ పరిణామానికి రత్తాలు బెంబెలుఎత్తిపోయింది. నిర్ఘాంతపోయింది. షాక్ తో అచేతనురాలైంది. ఆ అవకాశాన్నికాంట్రాక్టర్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆమెతేరుకునేలోగా మంచం మీద ఉంది. కాంట్రాక్టర్ ఆవేశంతో ఆమెను ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని పట్టులోంచి తప్పించుకోవటానికిఎంతో ప్రయత్నించింది రత్తాలు. కానిఅతని పశు బలం ముందు ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక అమాయకురాలు ఆనాలుగుగోడల మద్య తన మానం పొగోట్టుకుంది.

జింక మాంసం తిన్న పులిలా తృప్తిగా లేచాడు కాంట్రాక్టర్. కొంత డబ్బు తీసి ఆమె కేసి విసిరికొట్టాడు.

“ఇలాగే నేను పిలిచినప్పుడల్లా వస్తూఉండు. నీకు కావల్సిన డబ్బుఇస్తాను. నీ దరిద్రం తీరిపోతుంది. నా కోరిక తీరుతుంది”అన్నాడు. ఆడపులిలా లేచి నిలబడింది రత్తాలు . బట్టలు సవరించుకుని అతని మీద కాండ్రించి ఉమ్మింది. బాబును తీసుకుని గదిలోంచి బయటపడింది. అంతటితో కాంట్రాక్టర్ ఆమెను విడిచిపెట్టలేదు. లొంగతీసుకోవాలని ప్రయత్నించాడు.కాని రత్తాలు మాత్రం ఒప్పుకోలేదు. ఆ రోజురాత్రి బాబు నిద్రపోయిన తరువాత భర్త ఫోటో ముందు నిల్చుంది. ఇంత జరిగిన యాదగిరి ఆశయం ఆమె మరచిపోలేదు. ఆరునూరైన బాబును బాగాచదివించాలని నిర్ణయించుకుంది.

ఎలాగు రెండు సార్లు శీలం కోల్పోయింది. ఇక పొగోట్టుకోవలసిందిఏం లేదు. ఆ కాంట్రాక్టర్ కు ఉంపుడు కత్తెగా ఉండటం కంటే స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకుంది. అది శరీరం అమ్ముకునే వృత్తి అయిన ఫర్వాలేదని అనుకుంది. ఆ రోజునుంచి రత్తాలు పడుపువృత్తిలో దిగింది. రోజు ఇద్దరు ముగ్గురికి సుఖాన్ని ఇచ్చేది. రాబడి పెద్దగా ఎక్కువలేకపోయిన తిండికి బట్టకు లోటులేకుండ జరిగిపోతుంది. కాని రెండు రోజులు యడతెరిపిలేకుండ వర్షం కురవటం వల్ల ఆమె ఆదాయానికి గండి పడింది. నిన్నటి నుంచి ఆమె ఏం తినలేదు. బాబుకు పాలు కూడా పట్టలేదు. పాలకోసంబాగా ఏడ్చీ బాబు నీరసంతో అలాగే నిద్రపోయాడు.

“వస్తావా”అంటు ఒక మగవాడి గొంతు వినిపించింది.

రత్తాలు ఆలోచననుంచి తేరుకుని అతన్నిలోపలికి రమ్మనిసైగ చేసింది. అతను సైకిల్ బయట పెట్టి రత్తాలుతో లోపలికి వెళ్ళాడు. ఒక పక్కగా మంచంమీద బాబు నిద్రపోతున్నాడు. ఒకవేళ మేలుకుని ఉన్నా ఈ దారుణం చూడలేక కళ్ళుమూసుకునేవాడు. పదినిమిషాలు ఆ గదిలో గాలి స్తంబించిపోయింది. పెళ్ళి భోజనం చేసినట్టుతృప్తిగాలేచాడు ఆ మగవాడు. వందరుపాయలు ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. రత్తాలు డబ్బుతీసుకుని శెట్టి కొట్టుకు వెళ్ళింది.

“ఒక పాలపాకెట్టు రెండు రొట్టెలు ఇవ్వు”అంటు వందరుపాయలు శెట్టి చేతిలో పెట్టింది. అతను దాని వైపు చూసి “ఇది చెల్లదమ్మా. జాలినోటు”అన్నాడు.

అప్పుడే రేడియోలోంచి “దోపిడి దోపిడి మనిషి మనిషి దోపిడి అంటు పాత సినిమా పాట వస్తోంది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు