ఐడియా - వాత్సల్య రావు

idea

మధ్య తరగతి ఉద్యోగి ఆనందరావు కి ఏదో ఒక సైడు బిజినెస్ లాంటిది చేసి రిటైర్ అయ్యే సమయానికి నాలుగు రాళ్ళు ఎక్కువ మిగుల్చుకోవాలని తపన.

రియల్ ఎస్టేట్లు,చిట్టీలలో కి దిగుదామంటే భయం, హఠాత్తుగా పెట్టిన డబ్బులన్నీ పోతే అని..పెళ్ళయ్యి పుష్కరం దాటినా ఓ చంద్ర హారం చేయించుకోలేకపోయాను అని ఆనందరావు అర్ధాంగి రమణి పెట్టే నస తగ్గించటానికయినా ఏదో ఒకటి చెయ్యల్సిందే అని తీర్మానించేసుకున్నాడు..కానీ ఏదీ దారి కనబడటం లేదు.

సాయంత్రాలు ట్యూషన్లూ అవీ చెప్పేవాడు ఇదివరకు.. కానీ "టెక్నో", "కాన్సెప్ట్", వంకాయ టెంకాయ లాంటి స్కూళ్ళొచ్చేసి రేడియోలో పొలం పనుల కార్యక్రమమం

మొదలవ్వక ముందు వెళ్ళిన పిల్లలు రాత్రి యే పదింటికో కానీ ఇల్లు చేరట్లేదు. దాంతో ట్యూషన్ల ఆదాయం కూడా ఏమీ పెద్దగా రావట్లేదు.ఇంత అనుభవం ఉంది కదా తనే ఒక చిన్న స్కూల్ ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన వచ్చింది ఒకరోజు. అమ్మో ఆ హంగూ ఆర్భాటం,పేద్ద బిల్డింగ్లు.లక్షల్లో పెట్టుబడి వద్దు బాబోయ్ అనుకున్నాడు.వాళ్ళింట్లో పని చేసే నరసమ్మ పిల్లల ఫీజులకని ప్రతీ మూడు నెల్లకోసారి అడ్వాన్సులు తీసుకుంటుండడం గమనించి మన ఆనందరావు బుర్రలో మెరుపు లాంటి ఆలోచన వెలిగింది..

అంతే..ఆ పక్క వీధిలో ఎప్పటి నుండో ఖాళీ గా ఉన్న చిన్న ఇల్లొకటి అద్దెకి తీసుకుని "బాలానందం" పేరుతో మొదట రెండో తరగతి వరకూ మొదలెట్టాడు.

రమణి ఏకైక టీచర్ మరియు ఆయా ఆ స్కూల్లో. ఫీజులూ అవీ నామ మాత్రం గా ఉండటంతో నరసమ్మ లాంటి వాళ్ళ పిల్లలు కోకొల్లలు గా వచ్చెస్తారు కాబట్టి ఇంకో ఆరు నెల్లల్లో ఇంకో ఆయా ని టీచర్ ని తీసుకుని రమణి కి ప్రిన్సిపాల్ ప్రమోషన్ కూడా వాగ్దానం చేసేసాడు.

నరసమ్మ ఏడేళ్ళ కొడుకు ఓ సారి తన దగ్గరకి వచ్చి సైన్సు ప్రాజెక్టు లో సహాయం అడగటం గుర్తొచ్చి ప్రాజెక్టులు,ట్రిప్ ల పేరుతో డబ్బులు గుంజడాలు లాంటి హంగూ ఆర్భాటాలకి దూరం అనీ ఇంకా తన స్కూల్ లో పిల్లలకి హోంవర్కులు అవీ ఇచ్చి తల్లి తండ్రులని ఇబ్బంది పెట్టమనీ,రోజూ చెట్ల కింద ఆడుకుంటారనీ.. ఇలా తనకనిపించిన ప్రత్యేకతలన్నీ ఏకరువు పెడుతూ కంప్యూటర్ లో తనకున్న పరిఙానం తో ఒక పాంప్లెట్ లాంటిది తయారు చేసి ఓ వంద ఖర్చు పెట్టి కలర్ జిరాక్సులు తీయించి నరసమ్మ కి ఓ పాతిక ఇచ్చి పంపించాడు వాళ్ళ బస్తీ లో పంచి పెట్టమని..

వారం గడిచింది. రోజూ రమణి పొద్దున్నే ఇంటి వంట పనులు చేసి స్కూలుకెళ్ళి కూర్చోవడం..ఏవో ఒకటి రెండు ఎంక్వైరీలు వచ్చాయి తప్ప ఒక్క అడ్మిషనూ రాలేదు.

ఇక లాభం లేదని తనే చిన్న పిల్లలున్న ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ స్కూల్ గురించి చెప్పేది.. శని ఆదివారాల్లో ఆనందరావు కూడ పార్కుల్లో అక్కడా ఇతోధిక పబ్లిసిటీ చేసేవాడు..ఓ నెల గడిచేసరికి తాముంటున్న ఇంటి అద్దె కాక మరొక అద్దె అదనం గా చెల్లించాల్సొచ్చింది తప్ప పైసా ఆదాయం కనపడలేదు.

అయినా పట్టు వదలని విక్రమార్కుడి లాగ ప్రయత్నిచాడు ఆనందరావు.. ఓ పక్షం రోజులకి పక్కనే ఉన్న బస్తీ లోంచి ఓ ఇద్దరు పిల్లలు జాయిన్ అయ్యారు.ఇంకో వారానికి ఆ వీధి లోకి కొత్తగా వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు తమ మూడేళ్ళ కవల పిల్లలకి అడ్మిషన్ తీసుకున్నాడు.

ఇదే కదా శుభ దినం అని రమణీ ఆనందరావులు పాడుకున్నారు..స్కూల్లో ఆయా కూడా తనే అవ్వటం తో రోజంతా ఆ రెండు మూడేల్ల పిల్లల వెనకాల పరిగెత్తి, ఆడి,అలసిపోయేది రమణి. అయినా ఇదంతా చంద్ర హారం చేయుంచుకోవడానికి మార్గం గా భావించి కిక్కురుమనలేదు.ఓ నెల రోజులయ్యాకా ఆ కవల పిల్లల తండ్రి వచ్చి అస్సలు పిల్లలు ఇంటికి వచ్చి ఏమీ రాయడం చదవడం చెయ్యట్లేదని, ఎంత సేపూ తెలుగు పాటలేవో పాడుతున్నారనీ, అసలు స్కూల్లో ఏమి నేర్పిస్తున్నారని పెద్ద యుద్ధమే చేసాడు.మూడేళ్ళ పిల్లలకి రాయడం నేర్పడం ఏమిటి, హాయిగా వాళ్ళు ఆడుకుంటూ పాటలూ పద్యాలూ నేర్చుకోవాల్సిన వయసులో అని ఆనందరావు ఎంత నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోకుండా తమ పిల్లలని తీసుకుని ఎంచక్కా పోయాడు.

ఇంకో నెల రోజులకి బస్తీ పిల్లలు కూడా మానేసారు. ఆరా తెస్తే తెలిసిందేమిటంటే,ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీరు తమ పిల్లని పేరున్న ప్లే స్కూల్లో వేసాడనీ, బస్తీ పిల్లలు ఆ పక్క కాన్వెంటు లో జాయిన్ అయ్యరనీ.

మూడో నెలలో ఇక ఖర్చు తప్ప రాబడి లేకపోవడం తో స్కూలు మూసేసారు ఆనందరావు దంపతులు.

కట్ చేస్తే..ఓ రెండు సంవత్సరాలు తిరిగేసరికి చంద్ర హారం వేసుకుని విద్యా శాఖా మంత్రి గారి పక్కన పట్టు చీరలో మెరిసిపోతూ రమణి విజయ గర్వం తో కూర్చుని ఉంది.

ఇది ఎలా సాధ్యమని అవాక్కయ్యారా.. ఆనందరావు పోయినచోటే వెతుక్కోమన్న సామెత ని నమ్మి తన బాలా నందాన్ని మూసేసాకా ఓ ఆర్నెల్లు స్కూళ్ళ తీరు తెన్నులనీగమనించడమే హాబీ గా పెట్టుకున్నాడు.

తన పాత స్కూలు పిల్లలకి పాఠాలు చెప్పలేకపోయినా తనకి కావాల్సిన పాఠాలు నేర్పింది మరి.

తన అయిడాలన్నీ కలిపి "సన్స్ క్రితి"(మీరు చదివినది కరక్టే, తెలుగు పేరు కానీ ఇంగ్లీషు పదం లా వినపడాలని "సంస్క్రుతి" ని "సన్స్ క్రుతి" చేసాడు) పేరుతో స్కూల్ ఏర్పాటు చేసాడు. పేరు పెట్టడం లోనే సగం విజయం దక్కేసింది మన విక్రమార్కుడికి.విద్యా బోధన అంతా ఇంగ్లీషే.రెండేళ్ళ పిల్లలకి ఇంగ్లీషు రైంస్, మూడేళ్ళ నుండీ కంప్యూటర్ శిక్షణ,నాలుగైదేళ్ళ పిల్లలకి వర్డ్, పవర్ పాయింటు,ఫస్టు క్లాస్ నుండీ జావా, లాంటి ప్రొగ్రామింగు లాగ్వేజీలు..ఎం.సీ.ఏ. అయిపోయి ఉద్యోగ వేట లొ ఉన్న తన మేనళ్ళుడే ఈ కంప్యూటర్ భాషల శిక్షకుడు. మామయ్యా ఏదో వైవా కోసం, ప్రాజెక్టు కోసం నేర్చున్న నాలుగు ప్రోగ్రాములు తప్ప నాకేమీ రావంటున్నా కానీ,నీకు క్షుణ్ణం గా రావని పిల్లలకీ వాళ్ళ తల్లి తండ్రులకీ తెలీదూ కదా,

ఉద్యోగం వచ్చేవరకు ఖాళీ గా ఎందుకు అంటూ లాక్కొచేసాడు.

నరసమ్మ లాంటి ఓ ఆడావిడ గిన్నెలు తోముతున్న ఫోటో ప్రతీ గదిలో వేళాడదీసాడు.హార్డ్ వర్క్ కి అది ప్రతీక అని పైకి చెప్తున్నా కానీ పిల్లలని ఎలా తోమాలో అన్న దానికి సూచన అన్న విషయం అధ్యాపకులకి మాత్రమే తెలుసు.

ఇంకా స్కూల్లోనే కరాటే, కుంగ్ ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ తో పాటు, భరత నాట్యం, ఆంధ్ర నాట్యం, ఫోక్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ లు చేర్చేసాడు.అస్సలు ఇంత మంది శిక్షకులని తేవడం ఎలా అని ఏ మాత్రం చింతించలేదు ఆనంద రావు.క్వాంటిటీ యే తప్ప క్వాలిటీ కి విలువ లేదన్న నిజాన్ని ఎప్పుడో గ్రహించాడు.

బస్సు, క్లాసు రూము అన్నీ ఏసీ చేయించేసరికి ఇంటికెళ్ళాకా కూడా ఏసీ కావాలని గొడవ చేస్తున్న పిల్లల కోసం తమ స్కూలు పిల్లలకి ఐదు శాతం రాయితీలో ఏసీ మిషన్ లు సప్లయ్ చేసే వ్యాపారం కూడా మొదలెట్టేసాడు.

ఎండా కాలం శలవల్లో "సమ్మర్ క్యాంప్" పెట్టాడు. దాంట్లో పిల్లలకి ఉపయ్యోగపడే కంప్యూటర్ శిక్షణ లాంటివి మాత్రమే ఉండటంతో ఎనలేని స్పందన వచ్చింది.

రెండొ తరగతి పిల్లలకి సైన్సు ప్రాజెక్టులు,మూడో తరగతి పిల్లలకి ఒలింపియాడ్ శిక్షణ కూడ చేర్చేసరికి ఎక్కువ మంది పట్టే ఓ నాలుగంతస్తుల కొత్త బిల్డింగ్ లోకి మారాల్సొచ్చింది.

పిల్లలని నిద్ర లేపడం దగ్గర నుండీ రాత్రి పదింటికి ఇంటికి తీస్కొచ్చి దింపే(పడేసే) బాధ్యత ఉన్న స్కూలు గా ఎనలేని ఖ్యాతినార్జించింది మిస్టర్ ఆనంద్ స్కూల్. పిల్లలు ఇంటి నుండి టిఫిన్ బాక్సులు తెచ్చుకోవడం నిషిద్ధం.పోషకాహార నిపుణుల ఆధ్వర్యం లో తయారు చేసిన ఒక 100 గ్రాముల అన్నం మెతుకులు, నాలుగు పచ్చి కూర ముక్కలు,ఒక ప్రొటీన్ షేక్ తో మధ్యాహ్న భోజనం, సాయంత్రం నాలుగింటికి నాలుగు బాదం పలుకులు ఒక గ్లాసు పాలు, రాత్రి చిన్న రొట్టె ముక్క గ్లాసు పాలతో డిన్నర్.

తమ స్కూల్ లోగో వేసిన నోటు పుస్తకాలు,టెక్స్ట్ పుస్తకాలు పంపిణీ అయిపోయాయి.ఆర్నెలల్లో ఐదో తరగతి వరకూ పెంచాడు. స్కూలు వార్షికోత్సవం సమీపిస్తుండటంతో ఆనంద రావు కి ఇంకో అయిడియా తట్టింది. తమ స్కూల్లో చదివే పిల్లలకి తమ్ముడో చెల్లో త్వరలో వస్తునట్లయితే వారికి తమ అనుబంధ హాస్పిటల్ ద్వార గర్భస్త ఐ.క్యూ. పరీక్షలు చేయించి అవసరమయితే ఐ.క్యూ. పెరగటానికి మందులు కూడా ఇచ్చే స్కీము ప్రవేశ పెట్టాడు.

ఆ ఐ.క్యూ. ఐన్ స్టీన్లు తమ స్కూల్ కి వస్తే వారికి మొదటి తరగతి నుండే ఐ.ఐ.టీ శిక్షణ అని ప్రకటించడం తో వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ కొట్టినట్లయ్యింది ఆనందరావు దంపతులకి.

ఆనందరావు ఉద్యోగం వదిలేసాడు.. తన మేనళ్ళుడేమో ఐదంకెల సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వద్దనుకుని భాగస్వామిగా చేరిపోయాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు