నైజం - - మౌద్గల్యస

naijam

‘‘ఇది మాయాప్రపంచం గురువా...ఇక్కడ వ్యక్తిగతంగా ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలుండవు. అన్నీ వ్యాపార సంబంధాలే. నీకు మార్కెట్ బాగా ఉంటే ... నీ కాళ్లు పట్టుకునయినా పనిచేయించుకుంటారు. రోజుల తరబడి నీ కోసం ఎదురుచూస్తారు. నువ్వడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికయినా సిద్ధపడతారు. అదే నీ పరిస్థితి తలకిందులయ్యిందనుకో... నిన్ను పట్టించుకునేవాడు కూడా ఉండడు.’’ సినిమా రంగం గురించి అరటిపండు ఒలిచినట్టుగా చెప్పసాగాడు హృషీకేష్.

గత రాత్రి మా ఇద్దరి మధ్య ఘర్షణ గుర్తొచ్చి సిగ్గేసింది.

నేనంత మూర్ఖంగా ప్రవర్తించి ఉండకుండా ఉండవలసింది. అనవసరంగా... ‘నువ్వు స్వార్థపరుడివి.. దగాకోరువి... డైరక్టరు గాడి చెప్పులు నాకే కుక్కవి..’’ అని నిందించాను.

అప్పటికే మందులో రెండో రౌండ్ లో ఉన్నానేమో.. ఇంకా ఏదో చెప్పబోతే పక్కనే టీపాయ్ మీద బాటిల్ తీసి అతనిపైకి విసిరేశాను. అంత వరకే... ఆ తర్వాత ఏమయిందో గుర్తులేదు.చాలా మంది లాగే నాకు కూడా సినిమాలంటే పిచ్చి.

ఎప్పటికయినా రచయితగా తెర మీద నా పేరు చూసుకోవాలనేది కల.ఎవరో చెప్పారని ఇక్కడికొచ్చి దర్శకుడు విరూపాక్షని కలిశాను. ‘ రేపట్నుంచి రండి. కథ మీద కూర్చుందాం’’ అన్నాడు అతను మొదటి రోజునే. ఎగిరి గంతేశాను.

నాలాంటి వాళ్లు అక్కడ ఇంకో నలుగురున్నారు.‘‘ ఇంత మంది కలసి కథ మీదపనిచేస్తే నాణ్యమైన కథ రాక ఇంకేమవుతుంది’..అనిపించింది.

‘‘బాయ్ స్.. రెడీ అవ్వండి. బయటకెళుతూ మాట్లాడుకుందాం’’ అన్నాడు దర్శకుడు మర్నాడు వస్తూనే.

గబగబా కారెక్కాం. ముందు సీట్లో డైరక్టరు, అతని అసిస్టెంటు.

వెనకాల మేం నలుగురం. సర్దుకుని కూర్చున్నాం.

నాకు థ్రిల్లింగ్ గా ఉంది. ఓ దర్శకునితో ఇంత సన్నిహితంగా ఉండగలుగుతానని అనుకోలేదు. ‘‘ ప్రేక్షకులు థ్రిల్లయిపోవాలి... అలాంటి కథ మనం తయారుచేయగలగాలి’’ అన్నాడు సీరియస్ గా.

క్రమశిక్షణ గల విద్యార్దుల్లా బుద్ధిగా తలాడించాం.

‘‘నటులతోనూ ప్రయోగాలు చేయటం నా స్టెయిల్ అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా...’’.. డైరక్టరు ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.అతడి మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ పక్కనున్న అసిస్టెంటు అందుకున్నాడు. ‘‘భామాకలాపం సినిమాలో ఎలాంటి ప్రయోగాలు చేశావ్..

.. హాస్యనటుడి చేత సీరియస్ పాత్రచేయించావు. వాంప్ పాత్రలేసి అమ్మాయికి ఒంటి నిండా చీర కట్టి.. తల్లిపాత్ర చేయించావు. ప్రయోగాలంటే నీ తర్వాతే...’’

‘‘ సార్.. ఆ సినిమా అట్లర్ ఫ్లాప్ అయ్యిందిగా.. ప్రేక్షకులు ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా తిరస్కరించరుగా..’’ అన్నాను ఠక్కున.అంతకు ముందు ప్రతి మూడో సినిమాలోనూ ఒక ఐటమ్ సాంగ్ చేసే ఆ అమ్మాయి అలాంటి పాత్రలు చేయలేక అవకాశాలు వదులుకున్న విషయం నాకు గుర్తొచ్చింది.

నా మాటలకి డైరక్టరు మొహం కందిపోయింది.

తెలుగు సినిమాల్లో సగం రాంగ్ కేస్టింగ్ వల్ల దెబ్బతింటాయి. తమకు బాగా పరిచయం ఉన్న నటులు సాధారణంగా నటించే పాత్రలకు భిన్నంగా కనిపిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. సినిమాను ఆదరించరు.

ఆ మాటే చెప్పబోయి మనసులోనే దాచుకున్నాను. .

నేను చెప్పిందాంట్లో మంచి పాయింట్ లేదని చెప్పటానికి కాబోలు... ‘‘ ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ కోసం సినిమా ఫీల్డ్ ఎదురుచూస్తుంటుంది. పాత నీరు పోయి కొత్త నీరు రావటం ఇక్కడ మామూలే’’ అన్నాడు అసిస్టెంటు.డైరక్టరు ఆ తర్వాత సినిమాల గురించి మాట్లాడనేలేదు.

‘‘ ఇక్కడ తిప్పమ్మ హోటల్లో పెసరట్టు చాలా ఫేమస్. మీ అందరికీ తినిపిద్దాం అని తీసుకొచ్చా’’ అన్నాడు.

ఉప్మా పెసరట్టు కోసం ఇంత దూరం ప్రయాణం ఏమిటో నాకు అంతుబట్టలేదు.

సినిమాల గురించో, ఇటీవల వచ్చిన రచనల గురించో కాకుండా ...ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడెక్కడ పెసరట్టు రుచికరంగా ఉంటుందో... దానిలో నంజుడికి అల్లం చట్నీ ఎక్కడ అందుబాటులో ఉంటుందో చెప్పటం మింగుడుపడలేదు.

అతను చెప్పినవేమీ ఖరీదయిన హోటళ్లుకావు. ఊరుబయట కనిపించే కాకాహోటళ్లు. సినిమా వాళ్లు అడుగుతారంటే వాళ్లే అన్నీ సిద్ధం చేసి అతని ముందుంచుతారు. కానీ స్వయంగా అంత దూరం వెళ్ళి.. ప్రతి ముక్కకీ వంటగాణ్ణి మెచ్చుకోవటంతోపాటు అదెంతో మధురంగా ఉందో పక్కన వాళ్లకి విడమరిచి చెప్పటం అతని అలవాటని కూడా త్వరలోనే అర్ధమయిపోయింది.

కథ మీద కంటే పెసరట్టుమీదే ఎక్కువ కసరత్తు చేసినట్టున్నాడు.

నాలో నేను నవ్వుకుంటూ అనుకున్నాను.పక్కనున్న అసిస్టెంటు ఊదరకొడుతున్నాడు. సినిమాల్లో అతను చేసిన ప్రయోగాల గురించి ఓ హిందీ అగ్రదర్శకుడు ఎంత అబ్బుర పడ్డాడో వివరిస్తున్నాడు.‘‘ ఆ సీన్ ఎంత అద్భుతంగా తీశావ్ గురూ... నాకు తెలిసి సౌత్ లో ఎవరూ ఇలాంటి

సీన్ తీయలేరు... పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. అది భరించటం చాలా కష్టంగా ఉంది.ఇలా పొగడటానికే డైరక్టరు అతన్ని పక్కనుంచుకుంటాడేమో అని కూడా అనిపించింది.

నాలుగేళ్ల నుంచి ఈ దర్శకుడికి సినిమా లేదు. అంతకు ముందు వరుసగా ఐదారుసినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. చాలా మంది దర్శకుల మాదిరిగానే కథా రచయితలను కూడగట్టి కొత్త కథ తయారుచేసే పనిలో ఉన్నాడు.

కారు మళ్లీ తిరిగొచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగింది.

అందరం లోపలికి రాగానే..

‘‘ మీరు ఈ రెండు కేసెట్లు పూర్తిగా చూడండి... సాయంత్రం డైరక్టరు గారొచ్చి మీతో మాట్లాడతారు’’ అన్నాడు అసిస్టెంటు..‘‘ ఆ కేసెట్లు చూడటమే మేం చేయవలసిన పనా?’’ ఆశ్చర్యమనిపించింది నాకు.

‘‘అందరం కూర్చుని ఏదయినా లైన్ అనుకుంటే చర్చించుకుని

దాన్ని ఇంప్రూవైజ్ చేయచ్చు గానీ...’’ఏదో చెప్పబోయాను.

‘‘మీకు కాఫీ, టీలు కావాలంటే... పక్కనే వాచ్ మెన్ ఉంటాడు తెప్పించుకోండి. రెండున్నర కల్లా భోజనం వస్తుంది’’ అని చెప్పేసి తను కూడా వెళ్లిపోయాడు.

ఒకటి హాలివుడ్ సినిమా...

అందులో పుంఖానుపుంఖంగా నగ్నదృశ్యాలు..

‘‘ కొంచెం రివైండ్ చేయి గురూ.. మళ్లీ చూద్దాం’’ అంటూ మాలో ఒకరు అడగటం.. అందులో చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూడటం... సమయం అంతా అలా గడిచిపోయింది.

‘‘ఈ సినిమా నుంచి మనం నేర్చుకునేదేముంది. అక్రమ సంబంధాలపైన సినిమా.. భార్య, ఆమె ప్రియుడు కలసి భర్తను ముక్కలుముక్కలుగా నరికి చంపేస్తారు. చంపటం అనేది అనేది అత్యంత పాశవికంగా సాగుతుంది. సన్నివేశాలు ఒళ్లు జలదరించేలానే కాదు, జుగుప్స గొలిపేలా ఉన్నాయి. ఇది మన తెలుగు నేటివిటీకి సరిపోదు కదా’’ అన్నాను .

‘‘ అది సరిపోతుందా లేదా అనేది మనకు అనవసరం. చూడటం.. ఆ తర్వాత డైరక్టర్ ఏం చెబుతాడో విని దానిని బట్టి మనం చేయటం అంత వరకే’’ అన్నాడు హృషీకేష్.


మొదటిసారి నా అభిప్రాయాన్ని ఖండిస్తూ అన్నాడు.

అక్కడున్న మిగిలిన ఇద్దరిలో ఒకరు దర్శకుని దూరపు బంధువు. మరొకతను అతని కులం వాడే. సినిమా రంగంలో కులానికున్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. పదిహేనేళ్లుగా అతను ఇదే పనిలో ఎలా ఉన్నాడో మొదట అంతుబట్టలేదు.

దర్శకుడి వెనక అతని గురించి అనుకునే మాటలన్నింటిని చేరవేసే పని అతను చేస్తాడని... ఈ పనిచేయటం కోసమే దర్శకుడు అతన్ని ఇక్కడ ఉంచాడనీ రెండ్రోజుల తర్వాత గానీ నాకు అర్ధం కాలేదు.

‘‘ రాత్రి 7.30, 8 గంటల ప్రాంతంలో డైరక్టర్ వచ్చాడు.

‘‘ సినిమా ఎలా ఉంది?’’ అడిగాడు.

‘‘ అద్భుతంగా ఉంది సార్. మీరేది సెలక్టు చేసినా మా గొప్పగా ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేదిగా ఉంది’’ మధ్యాహ్నం చూసిన బూతు సన్నివేశాలు మనసులో గుర్తుచేసుకున్నాడేమో తెలీదు. డైరక్టరును పొగడ్తలతో ముంచెత్తాడు హృషీ.

‘‘ కామెడీ సినిమా కూడా చూశారుగా.. సమాంతంరంగా కొన్ని అవే సీన్లు రాసుకుని దాన్ని ఓ హరర్ ఫిల్మ్ గా డెవలప్ చేయగలమేమే చూడండి..’’ అన్నాడు డైరక్టరు.

మనుషుల భావోద్వేగాలు ప్రపంచమంతా ఒకటే అయినా, దాన్ని వ్యక్తపరిచేతీరులో తేడాలుంటాయి. తమిళసినిమాల్లో లౌడ్ నెస్ ఎక్కువ ఉంటే మలయాళ సినిమాలు సున్నితంగా ఉంటాయి. డైలాగులతో వ్యక్తీకరించటం మనదగ్గర విధానం.‘‘ప్రయోగం పేరుతో పిచ్చి పనులు చేయటం దేనికో?’’ నాకు అర్ధంకాలేదు. అదేమాట అన్నాను.

‘‘ వెరయిటీ..’’ అన్నాడు డైరక్టరు .. నన్నో వెర్రివెధవని చూసినట్టుగా చూసి.

‘‘అవును సార్.. ఎక్సలెంట్... చాలా బావుంది.. ఈ కథతో మంచి మసాలా డైలాగులు వండివారిస్తే...’’ ఓ నిముషం ఆగాడు హృషీకేష్.డైరక్టరు మొహం ప్రకాశవంతమైంది.

‘‘హర్రర్ సినిమాలో సెక్సును బాగా కూరినట్టు..’’ అంటూ చర్చకు సంబంధం లేని విషయాన్ని ఆసక్తికరంగా వివరించటం మొదలుపెట్టాడు.‘‘ హీరోయిన్ హోటల్లో గది బాత్రూంలో స్నానానికి సిద్ధమవుతూండగా.. హఠాత్తుగా ప్రేతాత్మ ప్రత్యక్షం అవుతుంది.. ఆమె భయంతో విప్పుతున్న బట్టలను కిందకు జార్చేస్తుంది. హీరోయిన్ అర్థనగ్న శరీరంపైన కెమెరా జూమ్ అవుతుంది.ప్రేక్షకులు ఎగబడి థియేటర్ కొస్తారు.నీరు విప్పగానే కుళాయిలో నుంచి నీరు బదులు రక్తం వస్తుంది.

వణికిపోయిన హీరోయిన్ కళ్లు తిరిగి కిందబడిపోతుంది.ఒంటిపైన ఆచ్చాదన తొలగిపోయి ఉంటుంది. మోకాళ్లపై భాగం వరకూ నగ్నంగా.. ’’హృషీకేష్ చెబుతుంటే దర్శకుడి కళ్లముందుసన్నివేశాలు కదులుతున్నట్టున్నాయి. ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించాడు.‘‘ చాలా పాత ఆలోచన. ఎన్ని సినిమాల్లో ఇవి చూడలేదూ’’ అన్నాను మధ్యలో అందుకుని. దర్శకునికి నా మాటలు రుచించటం లేదని నాకు అర్ధం అవుతూనే ఉంది.

‘‘ కొన్ని వందల సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలున్నాయి. ఇందులో కొత్తదనం ఏముంది? ’’ అన్నాను.

దర్శకుడు విసుగ్గా నా వైపు ఓ చూపు విసిరి .. ఆ తర్వాత హృషీకేష్ వైపు చూపు తిప్పి ‘‘ నువ్వు చెప్పేది కంటిన్యూ చెయ్యి’’ అన్నాడు ప్రోత్సాహకరంగా.

‘‘ సన్నివేశాలు పాతవి కావచ్చు. కానీ కొత్తగా చెబుతాం...’’ అసలు హీరోయిన్ ఇల్లు వదిలి హోటల్ కెందుకు వెళ్లిందనేది ఫ్యామిలీ డ్రామా.. హోటల్లో జరిగింది హర్రర్.. హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి. ఎక్స్ పోజింగ్ కూడా కొత్తగా ఉంటుంది..అన్నీ కలిపి కూరితే కొత్త జెనర్ సిసిమా కాక ఏమవుతుంది?’’ అన్నాడు గబగబా.

హృషీ రచయిత కాబట్టి సరిపోయిందిగానీ.. వాడే దర్శకుడు అయ్యుంటే.. ఈపాటికి ఏ నిర్మాతో బుట్టలో పడిపోయేవాడే..అంతగా మాటలతో గారడీ చేస్తున్నాడు.

‘‘రామ్ సే బ్రదర్స్ లాంటి కొందరు డైరక్టర్లు కొన్ని పదుల సినిమాలు అదే కథతో తీశారు. పంపుల్లో రక్తం కావటం.. హీరోయిన్ హోటల్ గదిలో భయపడటం లాంటివి.. ‘‘నాకూ తెలుసు గురువా... డైరక్టర్ ను బుట్టలో వేయటానికి ఏదో ఒకటి చెప్పాలిగా అన్నాడు హృషీ ఆ రాత్రి పడుకునే ముందు.

‘‘ వీడెంత బతక నేర్చిన వాడు ’’ అనుకోకుండా ఉండలేకపోయాను.

వాడు చెప్పినదానిలో ఏం కొత్తదనముందని డైరక్టర్ మురిసిపోయాడో అర్ధం కాక అప్పటి వరకూ నాలో నేను మథనపడుతున్నాను.‘‘ బా.. అన్న అక్షరంతో సినిమా టైటిల్ పెట్టటం నా స్టయిల్. ఓ ఇరవై పేర్లు రాసుంచు. రేపు వచ్చినప్పుడు మాట్లాడదాం’’ అంటూ నాకు పనిపురమాయించి హృషీతో కబుర్లలో పడ్డాడు దర్శకుడు.

‘‘ముందుగా కథ అనుకోకుండా.. టైటిల్ పెట్టేదెలా? ఈ డైరక్టరుకి తలకాయలేనట్టుంది’’... విసుక్కున్నాను పక్కవాళ్లదగ్గర.ఆ విషయం డైరక్టర్ చెవిలో వేసారెవరో...

‘‘ నాకు తలకాయ లేదు సరే.. .నీకెంత ఉందో నాకు తెలియాలిగా.. ఏదీ నువ్వురాసిన టైటిల్సు చూపించు.. ’’ డైరక్టర్ మర్నాడు కనపడగానే నన్ను కడిగిపారేశాడు

‘‘ సినిమా చూసి.. అది బావోలేదు.. ఇది బావోలేదు అని తేలిగ్గా కామెంట్ చేయటం కాదయ్యా... తీసేవాడికి తెలుస్తుంది బాధ. డబ్బు పెట్టే నిర్మాతను సంతృప్తి పరచాలి. హీరో హీరోయిన్లకు నచ్చేలా చేయాలి. వాళ్లకు నచ్చిన ఆర్టిస్టులను పెట్టుకోవాలి... సంగీతదర్శకుడు, కెమెరామెన్... ఇలా 24 శాఖల వారిని సమన్వయం చేసుకుంటూ పోతేగానీ.. సినిమా తయారవ్వదు.. సినిమా ఫెయిలయితే అందరూ దర్శకుడిని కామెంట్ చేస్తారు. నీకేంతెలుస్తుంది బాధ’’

మౌనంగా వింటూ కూర్చున్నాను.

అతి కష్టంమీద నాలుగయిదు టైటిల్సు రాసిచ్చాను.

‘‘ పేరులో కవిత్వం ఉంటే ఎవరికి అర్ధం అవుతుంది.. ట్రెండ్ అర్ధం చేసుకోకుండా సినిమా రంగంలోకి రావటం దేనికి?’’ఇలాంటి వాతావరణంలో ఇమడటం రోజురోజుకీ కష్టంగా మారుతోంది.

అలాగని ఇక్కడి నుంచి బయటపడలేను.

‘‘ నువ్వేదో పోటుగాడిని అనుకున్నావా?’’ దర్శకుడి మాటలకు ఎదురుచెబుతున్నావట?’’ నన్ను ఈ దర్శకుడి దగ్గరకు పంపిన కోడైరక్టర్, మా ఊరి వాడే రెండు వారాల తర్వాత ఫోన్లో మందలించాడు.

ఆ తర్వాత ప్రేమపూర్వకంగా సలహా ఇచ్చాడు.

‘‘ ఏదో ఓ రకంగా సర్దుకుని వాడి దగ్గరే సెటిల్ అవ్వు. పైకి చాదస్తుడిలా కనిపించినా.. తన దగ్గరున్నవాళ్లని బాగా చూసుకుంటున్నాడన్న పేరుంది.’’ ఆ రాత్రంతా ఆలోచిస్తూండిపోయాను.ఈ గెస్టు హౌస్లో మేం చేస్తున్న పనేమీలేదు. వేళకి తినటం.. పడుకోవటం.. వివిధ భాషల కేసెట్లు చూడటం..నా అవకాశాలు మెరుగుపడేవిగా కనిపించటం లేదు.డైరక్టర్ కొత్తగా ఆలోచించాలంటాడు. అలాగని ఓ మంచి విషయం చెబితే హర్షించడు. బావోలేదన్నట్లు తలాడిస్తాడు. అవతలవాళ్లు పొగడాలని ఆశిస్తాడు.

‘‘కొంచెం మెరుగుపర్చండి అని చెప్పచ్చుగా...అన్నీ బావోలేదని చెబితే... మనం ఇంకా కొత్తగా ఏం ఆలోచించగలం.. ఎంత సేపూ వాడిని ఎలా సంతృప్తిపరచటమా అన్నది ఒక్కటే ఆలోచించటమవుతోంది. ’’ హృషీ దగ్గర విసుక్కున్నాను. వాడు నవ్వి వదిలేశాడు.

రోజు రోజుకీ నాలో అసహనం పెరిగిపోతోంది.ప్రతి సిట్టింగ్ లోనూ డైరక్టర్ నన్ను అవమానిస్తున్నట్లుగా అనిపించేది. హృషీ చెప్పేది అతను శ్రద్దగా వింటున్నాడు. అతను వింటున్నాడు అనేకంటే..

దర్శకుడు వినేలా హృషీ చెప్పగలుగుతున్నాడు అనటం సబబేమో?

రేపోమాపో సినిమా అవకాశమొస్తే.. ఖచ్చితంగా అతను హృషీ వైపే మొగ్గు చూపుతాడు.

ఆ విషయం అర్ధమవుతూనే ఉంది. హృషీ పైన కోపం మొదలయ్యింది.

అది ద్వేషంగా మారటానికి ఎన్నో రోజులుగా పట్టలేదుదర్శకుడి పరోక్షంలో అతన్ని విమర్శించేవాడు.. ఎదురుగా పొగడ్తలతో ముంచెత్తేవాడు.‘బతకనేర్చిన వెధవ’ మనసులోనే తిట్టుకునేవాడిని.నిన్న రాత్రి రూంకి తిరిగొచ్చి మందు తాగుతున్నాను.‘ ఏంటి? నువ్వొక్కడివే సిట్టింగ్ వేశావ్? నవ్వుతూ పలకరించాడు.

‘ డైరక్టరు గాడి చెప్పులు నాకే కుక్కా? పిచ్చివాగుడు వాగకు..’’అన్నాను కోపంతో.

‘‘ కూల్ .. కూల్...’’ అన్నాడు నాకు నచ్చచెప్పేధోరణిలో.

‘‘ నోర్ముయ్.. ’’ ఓ బూతు మాట ప్రయోగించాను.

‘‘నేను చెప్పేది జాగ్రత్తగా విను. సినిమా రంగంలో ముక్కుసూటితనం అసలు పనికిరాదు. లాబీయింగ్ చేస్తేనే ఇక్కడ అవకాశాలు దొరుకుతాయి. మాటలతో అవతలవాడిని పడగొట్టాలి. ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఉబ్బేయాలి. అప్పుడప్పుడు వాడు మనల్ని నెత్తిన పెట్టుకుంటాడు. అవకాశాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ’’

నచ్చేచెప్పేధోరణితో ఏదో చెప్పబోయాడు హృషీ.

మద్యం మత్తు పూర్తిగా నా తలకెక్కింది.

దర్శకుడిమీద కోపం.. పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నానన్న అసహనం.ఒక్కసారిగా నా మీద దాడిచేశాయి. విచక్షణ కోల్పోయాను.నేను విసిరిన గాజు గ్లాసు భళ్లుమని అతని నుదుటికి గాయం చేసింది.

హృషీ నుదుటి చుట్టూ తెల్లని బ్యాండేజీ.

నాకు సిగ్గేసింది.

నన్ను ద్వేషించకుండా... ప్రతీకారం గురించి ఆలోచించకుండా ఉదయానే వచ్చి నన్ను కలవటం.. ఎప్పటిలానే ప్రేమపూర్వకంగా మాట్లాడటం..

ఇలా చేయటానికి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి.

‘‘ మా అందరి కంటే తెలివైన వాడివి...’’ అంటూ ప్రారంభించాడుహృషీ.ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత తప్పు చేశానో అర్ధం అయ్యింది. క్రమంగా మబ్బు తెరలు తొలగుతున్నాయి.‘‘డైరక్టరు చెప్పే అభిప్రాయం మనకి నచ్చకపోవచ్చు. ఆ విషయం వాడి మొహం చెప్పి నష్టపోవటం దేనికి? అవకాశాలు ఇవ్వవలసిన వాడు డైరక్టరు. అతన్ని కాదని మనం బావుకునేదేముంది?’’హృషీ చెప్పుకుపోతున్నాడు.‘‘వీడు కాకపోతే.. ఇంకొక డైరక్టరు అంటావా? ఎంతకాలం ఇలా వెతుకులాడగలం. సినిమా గ్రౌండయితే ఏంటి? కాకపోతే ఏమిటి? మనమేమీ నష్టపోవటం లేదు కదా?ఆలోచించు’’ అన్నాడు.

నేను మాట్లాడలేదు.

‘‘నువ్వు బయట ఉండి తలబద్దలు కొట్టుకుని కథ రాస్తే నీకు వచ్చేదెంత?

మూడొందలో, ఐదొందలో.. అంతే కదా.. ఇక్కడ రచయితగా మనకు అవకాశాలు రాకపోయినా.. డబ్బు బానే ముడుతోంది కదా? రాచమర్యాదలకీ తక్కువేం ఉండవు. కావలసినంత తిండి, మందు, కోరుకుంటే అమ్మాయిలు..

నేను ఇలాంటి సాంప్రదాయాలకు దూరం అని మడి కట్టుకుని కూర్చంటానంటే.. కొన్ని అనుభవాలు, ఆనందాలు నీ నుంచి దూరమవుతాయి. అది వేరే విషయం.... ... ...’’

‘‘నేనేదో అనుభవం ఉన్నవాడినని ఈ మాట చెప్పటం లేదు. నా కంటే ఎక్కువ ప్రతిభ ఉన్న నువ్వు మానసికంగా నలిగిపోవటం చూసి తట్టుకోలేక ఈ ముక్క చెబుతున్నాను.’’ అన్నాడు.

నిష్టూరంగా కనిపించినా వాడు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా అనిపించాయి.

‘‘ ఈ రంగంలో ఉన్న నటులు గానీ, దర్శక రచయితలు గానీ ఎవరూ ఒక్క రోజులో గొప్పవాళ్లు కాలేదు. సంవత్సరాల కొద్దీ ఓర్పుగా ఎదురుచూస్తే గానీ అవకాశం వాళ్ల తలుపుతట్టలేదు. ఎంతో శ్రమిస్తేగానీ వాళ్లు ఓ స్థాయికి చేరుకోలేపోయారు గురువా...

మళ్లీ చెబుతున్నాను. నువ్వు తెలివైనవాడివి...

నిస్పృహతో వచ్చిన అవకాశాలను కాలదన్నుకోకు’’...

‘ ఏమో ఎవరికి తెలుసు... రేపెప్పుడో నువ్వే గొప్ప దర్శకుడివవుతావేమో... అప్పుడు ప్రపంచమంతా నీకు హారతులు పడుతుంది. ఈ దర్శకుడిలాంటి వాళ్లు నువ్వు చెప్పిందానికల్లా తలాడిస్తారు. ఆరోజు వచ్చేవరకూ...’’

ఇంకేదో చెబుతున్నాడు హృషీ.

ఒకే చోట ప్రారంభమయినా మా ఇద్దరిలో ఎంత తేడా...

ఉన్నదాంట్లో నుంచి అవకాశాలను పిండుకోవాలంటాడు అతను.

ఎప్పుడూ పరిస్థితులను నిందించడు. ఓర్పుగా, నేర్పుగా వ్యవహరిస్తాడు...అన్నీ తనకు అనుకూలంగా మార్చాడు.

మరి నేను...

నేను పరిస్థితులతో రాజీపడలేను. వ్యక్తులతో సర్దుకోలేను. గెలవాలని తాపత్రయపడతాను. ఆ గెలుపు ఒక్కరోజులో సాధ్యం కాదని వాస్తవాన్ని అర్దం చేసుకోలేను.

ఇతరులు లౌక్యంగా వ్యహరించటాన్ని భరించలేను.

దానికి స్వార్థం అని పేరుపెడతాను.

హృషీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతే..

నేను మరుగుజ్జులా కుంచించుకుపోతున్నాను.

ఈ ఒక్క అనుభవమయినా నాలో పరివర్తన తెస్తుందా?

భవిష్యత్తు గాడిలో పడుతుందా?

ఏమో...?

కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు