నాణేనికి రెండో వైపు - - పి.బి.రాజు

naaneniki remdo vaipu

సాయంత్రం అయిదవుతోంది. ఎండ తీవ్రత తగ్గింది.

చల్లని గాలి వీస్తోంది. వాతావరణం హాయిగా ఉంది.

నేనూ, రాంబాబు వాకింగ్ కు బయలుదేరాం. అలా రామాలయం దాటి కబుర్లు చెప్పుకుంటూ ఆ రోడ్డంటా ఓ మైలు నడచి పార్క్ లో కొంచెం సేపు కూర్చుని రావడం మాకలవాటు.

ఇద్దరూ ఈ మధ్యే రిటైరయ్యాం. బాధ్యతలన్నీ తీరి పోయాయి. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు ఇద్దరికీ. రోజూ ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుకుంటూ నడవడం అలవాటై పోయింది.

ఇంతలో రామాలయం సందులోంచి వేగంగా మలుపు తిరిగిన హీరో హోండా మమ్మల్ని ఢీ కొట్టేంతపనయింది. అర క్షణంలో ప్రమాదం జరిగేదే కానీ మేము నేర్పుగా తప్పించుకోగలిగాం.

ఆ కుర్రాడు కూడా సడెన్ బ్రేక్ వేసి బండిని ఆపగలిగేడు. వెంటనే దిగి స్టాండ్ వేసి మా దగ్గరికి వచ్చాడు.

"సారీ! మాస్టారూ! చూసుకోలేదు!"

"జాగ్రత్త బాబూ! చూసి డ్రైవ్ చెయి! లేకపోతే ఈపాటికి ఘోరం జరిగేది కదా! " అని సలహా ఇవ్వబోయాను. కానీ రాంబాబు వూర్కోలేదు. నాలుగు దులిపేశాడు.

"బండెక్కితే ఈ కాలం కుర్రాళ్ళకు కళ్ళు నెత్తికెక్కుతాయి. అందులోనూ పక్కన అమ్మాయుంటే మరీనూ!" రెచ్చిపోయాడు.

అప్పుడు చూశాను అటు. బండి పక్కనే ఒక అమ్మాయి నిలబడి ఉంది. చున్నితో ముఖం కనబడకుండా ముసుగేసుకుంది- కళ్ళు మాత్రమే కనబడేట్లు.

ఆ కుర్రాడు మరో సారి "సారీ" చెప్పాక శాంతించాడు రాంబాబు. మరో నాలుగు చీవాట్లేశాక "తగలడు" అన్నాడు. దానర్థం ఇక "వెళ్ళి తగలడు" అని. వాడు బిక్కచచ్చి అలాగే నిలబడడం గమనించి వెళ్ళమని సైగ చేశాను.

"బ్రతుకు జీవుడా!" అని వాడు బైక్ స్టార్ట్ చేసి అమ్మాయితో వెళ్ళిపోయాడు.

"చూశావా మధూ! వాళ్ళ వాలకం చూస్తే నీకేమనిపిస్తుంది" ప్రశ్నించాడు రాంబాబు.

"ఎవరో కాలేజ్ కుర్రాళ్ళా ఉన్నారు కదూ?" అన్నాన్నేను.

"వీళ్ళ అమ్మా నాన్నలు చదువుకోండని కాలేజ్ కి పంపిస్తే వీళ్ళు చేసే నిర్వాకం ఇదీ. బైక్ ల పై బలాదూర్ గా తిరగడం; అమ్మాయిలతో జల్సా చేయడం ...ఛ! బుద్ధి లేకపోతే సరి " విసుక్కున్నాడు.

ఇంతలో మరో వాహనం - మరో ముసుగు అమ్మాయి వెనక కూర్చుని ముందున్న కుర్రాన్ని వాటేసుకుని సర్రున మా ముందు నుండి దూసుకుపోయింది.

" ఏంటో మధూ! కాలం పూర్తిగా మారిపోయింది. పిల్లలు మరీ పరితెగిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు కామనైపోయింది. పైగా ముసుగులేసుకుని పరితెగింపు. మన కాలం లో కూడా ఉండేవే కానీ ఇంత విచ్చలవిడితనం లేదు బాబూ! అందులోనూ ఆడపిల్లలు కూడా గుర్తు పట్టకుండా ముసుగులేసుకుని ... "

"అవును రాంబాబు గారూ! ఇలాంటివి ఇప్పుడు చాలా కామనైపోయింది. యువతంతా పాశ్చాత్య కల్చర్ లో మునిగి తేల్తున్నారు. ఆ సునామీ లో కొట్టుకుపోతున్నారు. వారేమో మన వైపు చూస్తున్నారు. బాధేస్తుంది అయినా మనమేం చేయగలం? "

"అదే కదా! మనమేమి చేయలేం. చెప్పినా వినరు. అదే బాదేస్తుంది. మన కల్చర్ పాడైపోతుందని బాధ!" రాంబాబు విచారం వ్యక్తం చేశాడు.

ఇంతలో పార్క్ రానే వచ్చింది. మామూలుగా కూర్చునే బెంచి ఖాళీగానే ఉంది. ఇద్దరూ కూర్చున్నాం.

అంతలోనే పక్కలోని పొద నుంచి ఒక యువ జంట ఒకరి పైన ఒకరు పడ్తూ లేస్తూ మా పై పడబోయి తృటిలో తమాయించుకుని 'సారీ!" అనేసి వెళ్ళిపోయింది.

ఎవరా అని తేరుకుని చూసే సరికే జారుకున్నారు. కానీ చిత్రంగా ఈ అమ్మాయి కూడా ముసుగేసుకుంది.

మరో విచిత్రమేమంటే - మా ఎదురు బెంచి మీద కూర్చున్న అమ్మాయి కూడా ముసుగేసుకుంది. ఏదో దీక్షగా; ఏకాగ్రతగా చదువుకుంటున్నట్లుంది.

"ఏమిటీ! ఈవేళ మనకు ముసుగు వీరులే దర్శనమిస్తున్నారు?' నవ్వుతూ అన్నాను.

"అదికాదు మధూ! ఇది నవ్వాల్సిన విషయం కాదు. చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి కల్చర్ ఇటీవల సిటీల్లో బాగా పెరిగిపోయింది. ఆ మధ్య టీ వీ లో పబ్లిక్ ప్లేస్సుల్లో పెరిగిపోతున్న విచ్చలవిడితనం గూర్చి ఒక ప్రోగ్రాం చేశారు. కొన్ని అసభ్యకర వీడియోలను కూడా చూపారు. అది చూసి నాకు పరమ అసహ్యం వేసింది. ఎక్కడికి పోతున్నాం మనం అనిపిస్తోంది. ఇప్పటి దాకా మనమంతా ఎంతో గొప్పగా వూహించుకున్న ఇండియన్ కల్చర్ యువత చేతిలో భద్రంగా ఉంటుందా? ఆ గొప్ప వారసత్వపు సంపద ముందు తరాలవారికి అందుతుందా?" ఆవేశంతో నుదురు కొట్టుకున్నాడు రాంబాబు.

"ఆవేశపడకండి." ఓదార్చాను.

ఎదురు బెంచి పై కూర్చున్న అమ్మాయి మా వైపు చూసి మళ్ళీ పుస్తకం లో తలదూర్చింది.

'యువతలో నానాటికి పెరిగిపోతున్న ఈ విచ్చలవిడితనం - తలితండ్రులకు తెలియకుండా ముసుగుల రూపంలో - ప్రేమలు; తిరుగుళ్ళు; షికార్లు; పబ్లిక్ పార్కుల్లో ముద్దులు; కట్టలు తెంచుకుంటున్న హద్దులు; పెళ్ళికి ముందే వికృత చేష్టలు -ఇవంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది. తలిదండ్రులిస్తున్న స్వేచ్చను హరిస్తున్నట్లు లేదూ!"

"కరెక్టే! అమ్మాయిల్ని కూడా అబ్బాయిలతో సమానంగా కాలేజ్ లకు పంపిస్తున్నారిప్పుడు! ఇద్దరినీ సమానంగా చూస్తున్నారు తల్లితండ్రులు ."

"కదూ! అలాంటప్పుడు బుద్ధిగా చదువుకోక ఇలాంటి ముసుగులతో వయసు వేడిలో; క్షణికావేషాలతో; పబ్లిక్ లోనే ముద్దులతో; కౌగిలింతలతో;రొమాన్స్ లతో సినిమా చూపిస్తే వారి గుండెలు బద్దలు కావూ? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందనుకుంటే ... పొరబాటు ఎవరిది?" ఆవేశంతో చెప్పుకుపోతున్నాడు రాంబాబు.

"మన సంస్కృతి ఎంత గొప్పది. మన కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది. మన వారసత్యం ఎంత గొప్పది. ఎంత గొప్ప ఖర్మ భూమి మనది. ఎంత గొప్పవి మన సంప్రదాయాలు. పాశ్చాత్యులు సైతం మన వైపు చూస్తున్నారు. మన సంస్కృతి; కుటుంబ వ్యవస్థ గొప్పదని గుర్తించారు. కానీ మనమే ... మన యువత పాశ్చాత్య వ్యామోహంలో పడి కొట్టుకుపోవడం నాకు సుతరామూ ఇష్టం లేదు. “ ఆయాసంతో రొప్పసాగేడు రాంబాబు.

"కూల్ డౌన్ రాంబాబూ! మనం అవేశపడడంలో అర్థం లేదు. యువత అర్థం చేసుకోవాలి."

"ఇంకెపుడు అర్థం చేసుకుంటారూ?" ఆయాసంతో దగ్గుతూ అన్నాడు.

ఇంతలో ఎదురు బెంచి ముసుగు అమ్మాయి దగ్గరికి వచ్చి నీళ్ళ బాటిల్ అందిస్తూ "నీళ్ళు తాగండి తాత గారు!" అంది.

నీళ్ళు తాగి కుదుటపడ్డాడు రాంబాబు.

అప్పుడంది ఆ అమ్మాయి నింపాదిగా - " మీ మాటలు విన్నాను తాత గారూ! మీ ఆవేశం అర్థమయింది. నిజమే మీరన్నట్టు కొంత మంది యువత పెడదార్లు పడుతున్న తీరు అభ్యంతరకరమే. కానీ అందరూ అలా ఉండరు. మీరనుకున్నట్టు ముసుగు మనుషులంతా కానీ పని చేస్తున్నట్లు; ముసుగు చాటులో మన సంస్కృతిని మంట గలుపుతున్నట్లు మీరు అవేశ పడడం చూస్తే అందర్నీ ఒకే గాటిలో కట్టినట్లవుతుంది. ముసుగుకు ఎవరి కారణాలు వారికుంటాయి."

"కాని పనులు చేసేవారే ముసుగేస్తారు అమ్మాయీ! మంచి పని చేసేవారికి ముసుగుతో పనేమిటి? రాంబాబు కూడా గట్టిగానే బదులిచ్చాడు. మళ్ళీ తనే అన్నాడు - "నువ్వు ముసుగులో ఉన్నావు! దాని వెనకాల ఏ బృహత్తర మహత్కారణం ఉందో తెలుసుకోవచ్చా?" అతని మాటల్లో వ్యంగ్యం ధ్వనించింది."ఉంది. విని తట్టుకునే ధైర్యం ఉంటే...?"

ఆమె క్షణంలో ముసుగు విప్పేసింది. ఆమెను చూసి ఒక్కసారిగా మాకు ఒళ్ళు జలదరించింది. ముఖమంతా కాలిపోయి , కమిలిపోయి వికృతంగా; ముడుతలు ముడుతలుగా ఉంది. ఏదో ఘోర విపత్తు నుంచి బయట పడ్డట్టు చాల అసహ్యంగా ఉంది. చూడడానికే జుగుప్సగా ఉంది.

మళ్ళీ ముసుగు బిగించుకుంది అమ్మాయి. కళ్ళనుంచి జలజలా రాలుతున్న కన్నీటిని బలవంతంగా ఆపి; తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

"ఏమయింది అమ్మాయీ!" కంగారును అణుచుకోలేక అడిగాను.

"పార్కుల్లోకి అందరూ అనందంగా గడపడానికి వస్తారు. చల్ల గాలికి సేదదీరడానికి వస్తారు. ఆహ్లాదంగా గడపడానికి వస్తారు. ఈ పూల సౌరభాలు; పక్షుల కిలకిలా రావాలు; అందమైన సాయంత్రాల్ని ఆస్వాదించడానికి వస్తారు. అలాంటప్పుడు ఇలాంటి వికృత రూపంతో మీలాంటి వారి ఆనందాల్ని దూరం చేయడం ఇష్టం లేక ఇలా ఉంటున్నాను. అంతే కానీ ముసుగు నాకేం ఆనందం కాదు." ఆగింది.

"ఇంతకీ ముఖానికి ఏమయింది" ఆతృత నణుచుకోలేక అడిగాను.

"తనను ప్రేమించ లేదని ఓ ఉన్మాది ఆసిడ్ దాడి చేశాడు. మృత్యువుతో పోరాడి బయటపడ్డాను.”

నాణేనికి రెండో వైపు మమ్మల్ని కలచి వేసింది. మరింత ఆందోళనకు గురిచేసింది. ఇంత వరకు చూసిన దృశ్యాలు ఒక వైపయితే; ఇది రెండో వైపు. విచ్చలవిడితనం ఒక ప్రక్క; దానికి బలి అయిన అభాగ్యుల జీవితాలు మరో ప్రక్క - నాణేనికి బొమ్మా; బొరుసులా.

"మీ మాటలు నన్ను బాధించాయి. ఇప్పుడే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. నాలాగే ఎంతో మంది ఆడపిల్లలు ముసుగుల చాటున చెప్పుకోలేని శిక్షలననుభవిస్తున్నారు. కాలుష్యం నుంచి; ప్రేమ పేరుతో వెంటబడే ఉన్మాదుల నుంచి; మృగాల నుంచి; బెదిరింపుల నుంచి; అనుక్షణం వెంటాడే ఆకలి చూపుల్నుంచి తమను తాము రక్షించుకోవడానికి ముసుగుల వెనక దాక్కుంటున్నారు. ఇష్టంగా కాదు ... అలా నిర్దాక్షణ్యంగా నెట్టేస్తున్నారు. దయచేసి మీకు మనసుంటే ఆ ముసుగు చాటు మనుషుల్ని కాదు మనసుల్ని అర్థం చేసుకోండి. ముసుగు లేని ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయత్నించండి." నీళ్ళ బాటిల్ తీసుకుని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె వెళ్ళిపోయింది.

ఆమె మూగ వేదన మాకర్థమయింది. పాపం! …చేయని నేరానికి శిక్ష అనుభవిస్తోంది....అదీ జీవితాంతం. భూమిపై ఆడదానిగా పుట్టడమే నేరమా? లేక శాపమా? దీనికి విముక్తి లేదా? కనీసం ఈమె జీవితం ఇతరులకు గుణపాఠం అయితే ఎంత బాగుంటుంది- ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాం.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు