మా ఆవిడ ప్రత్యేకతల గురించి వివరించడానికి ఒక్క రోజు సరిపోదు. డైలీ సీరియల్ ఎపిసోడ్స్ లాగా దీర్ఘ కాల ఎపిసోడ్స్ విత్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ అవసరం. కొలతలు తీసుకుని మరీ మా ఆవిడని బ్రహ్మ సృష్టించాడా అని అనిపించే శరీర సౌష్టవం ఆమె సొంతం.
ఆ బ్రహ్మ దేవుడు మా ఆవిడని మలిచేటప్పుడు కొంత అందాన్ని, కొంత అమాయకత్వాన్ని, మరికొంత తెలివితేటలతో పాటు టీవీ పిచ్చి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ (ఎవరికీ) గా పడుంటుందని కలిపేసి ఉంటాడు.
ముచ్చట గొలిపే అందం, అమాయకపు నవ్వు కలగలిపితే మా ఆవిడ. వీటితో పాటు ఆవిడకున్న టీవీ పిచ్చి ఆమెకే ప్రత్యేకమైనది.
అసలు ఇప్పుడు కాదు పెళ్లి అయిన తరువాత మా శోభనం రోజే మా ఆవిడకి టీవీపై అందులో నటించే వాళ్ళపై ఉన్న అభిమానం అర్ధమయింది.
నా ఫ్లాష్ బ్యాక్ చదవండి మరి
శుక్రవారం
సమయం - రాత్రి 7:30 నిమిషాలు
అమ్మలక్కలు అందరూ మా ఆవిడని ముస్తాబు చేస్తున్నారు.
"ఈ సిగ్గంతా మా వద్ద కాదే నీ మొగుడి కోసం కొంచెం ఉంచుకో" అని పక్కింటి బామ్మగారు, "ఓసినీ, నువ్వేంటే ఇంత సిగ్గుపడుతున్నావు, నన్ను చూడు శోభనం శోభనం అని ఎలా ఎదురుచుస్తున్నానో" అని పెళ్ళికాని మా ఆవిడ స్నేహితురాలు, "చాల్లే సంబడం, మా కాలంలోనైతేనా చచ్చేంత సిగ్గు అనుకో. శోభనం అయిపోయిన మరునాడు అబ్బాయి మొహం చూసేవాళ్ళం" అని బామ్మగారు మళ్ళీ రంగం లోకి దిగడం
శుక్రవారం
సమయం - రాత్రి 7:50 నిమిషాలు
మా అత్తగారు మా ఆవిడని కుందనపు బొమ్మలా తయారు చేసి చెవిలో ఏవో గుసగుసగా చెప్పారు.
సాధారణంగా సినిమాలలో అత్తగారు కూతురి చెవిలో శోభనానికి పంపించే రోజు చెప్పే మాటలు
"అబ్బాయి చెప్పినట్టే నడచుకో"
ఇక్కడా అలాగే చెబ్తూ ఉంటారు. మా అత్తగారు ఎంత మంచివారో అని ముచ్చట పడిపోయాను.
శుక్రవారం
సమయం - రాత్రి 7:59 నిమిషాలు
మంచంపై చల్లిన మల్లెలపై హృదయం ఆకారంలో అందంగా అలంకరించబడిన గులాబీ పూలు. గదిలో చల్లిన లావెండర్ రూం ఫ్రెష్నర్. మంచం పక్కనే వెండి పళ్ళెం లో సర్దిపెట్టిన స్వీట్లు హాట్లు నన్ను ఎంతో ఉత్తేజపరుస్తున్నాయి. శోభనపు గదిలోకి మా ఆవిడ ఎంటర్ అవగానే తనతో ఎలా మాట్లాడాలి అని నాలో నేను ప్రాక్టీసు చేస్తున్నాను.
కొన్ని సినిమాల ద్వారా నాకర్ధం అయింది ఏంటంటే అసలు విషయం ప్రారంభించే ముందు...
తన చేతిలోని పాల గ్లాసు తీసుకుని సగం పాలు నేను తాగి సగం పాలు తనచేత తాగించాలి. సుతారం గా మంచం వరకు తనని తీసుకెళ్ళి నేను కూడా పక్కన కూర్చోవాలి. నా ఫ్లాష్ బ్లాకు గురించి తనకి చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ వినాలి. ఆ తరువాత నువ్వే నా సర్వస్వం ఇప్పుడు మనం ఇద్దరం కలిపి మన జీవితాన్ని ఒకే జీవితంగా గడుపుదాం అని చెప్పాలి.
వీలయితే నాలుగు మాటలు, కుదిరితే గ్లాసుడు పాలు తరువాత ఇద్దరం కలిసి "ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది" అని ఒక పాట పాడాలి. పాట చివరలో ఇద్దరం మంచం మీద ఎదురెదురుగా కూర్చొని ఉండగా నేను మా ఆవిడ రెండు భుజాల పైన చెయ్యి వేసి సుతారంగా పడుకోబెట్టాలి.
ఇలా నేను జరగబోయే మా శోభనపు తీయని అనుభవాల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తేరుకునేసరికి చాలా సమయం గడిచిపోయినట్టు అనిపించింది. ఇంకా ఆవిడ రాలేదేంటి. అదేనండి మా ఆవిడ. గదిలోంచి బయటకు వెళ్లి చూసాను. ఆశ్చర్యం అమ్మలక్కలు లేరు, మా ఆవిడా లేదు.
బయటకి రావటానికి శోభనపు పెళ్ళికొడుకుని కదా కొంచెం మొహమాటం వేసింది. భోజనం పెట్టేసి హడావిడిగా నన్ను లోపలి పంపించారు. ఆవిడని ముస్తాబు చేసి పంపిస్తారు కాబోసు అని నేను లోపలి వచ్చి కలలుకనే సరికి 8:30 అయింది.
ఎక్కడ వీళ్ళు. మా ఆవిడ ఎక్కడ. అని అనుకుంటూ ఇల్లు మొత్తం కలియదిరగడం ప్రారంభించాను. ఇల్లంతా నిశ్శబ్దం.
పల్లెటూరిలో ని ఇళ్ళ గురించి వేరే చెప్పాలా. ముందంతా బోలెడంత వాకిలి. హాలు, హాలుకి ఇరువైపులా రెండు బెడ్ రూములు. వంటగది.
అరే, ఎవరూ కనిపించరేమిటి???
మామయ్యగారు కూడా కనబడట్లేదు అనుకుంటూ నేను పెరటి వైపుగా వచ్చాను. అక్కడ కనిపించారు మామయ్య గారు తన స్నేహితులతో పేకాడుతూ.
నన్ను చూసి కొంచెం ఆశ్చర్యం తో "ఏంటండీ అల్లుడు గారు, మీరు ఈ సమయం లో ఇక్కడ, ముహూర్తం దాటి పోతోంది కదా" అని అడిగారు.
"మీ అమ్మాయి కోసమే వెతుకుతున్నానండి. ఎక్కడుందండి." అనికొంచెం మొహమాటం తో అడిగాను.
"అదేంటి అల్లుడు గారు, అమ్మాయి లోపలికి రాలేదా? ఒసేయ్ వరాలు, వరాలు" అని నేను వెతికినట్టే మా మామయ్య గారు వెతకడం ప్రారంభించారు.
కాకపోతే నేను ఇంట్లో ఎక్కడైనా ఒక చోట మా ఆవిడ కనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో వెతికితే అతనికి రోజూ ఇలా వెతకడం అలవాటు కాబోలు ఇంట్లో వీళ్ళు కనబడరు అని తెలిసి నా కోసం వెతుకుతున్నట్టు వెతుకుతున్నారు.
వాళ్ళు కనబడకపోయే సరికి నా దగ్గరకి వచ్చి "అల్లుడు గారు, ఇలా కూర్చోండి. టీవీ చూస్తూ ఉండండి. ఈ లోపు నేను వాళ్ళని తీసుకుని వస్తాను" అని టీవీ స్విచ్ ఆన్ చేసారు.
టీవీలో నీలం రంగు దర్శనమిస్తోంది. "కేబుల్ ప్రాబ్లం అనుకుంటా" అని ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు మాట్లాడాను.
అసలే ఒళ్ళు మండిపోతోంది. శోభనం గురించి చిన్నప్పటి నుంచి (అంటే సినిమాలలో చూసి) ఎన్ని కలలు కన్నాను. నా తొలిరాత్రి జీవితం లో మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది అనుకుంటే ఈ విధంగా అవుతుందని ఎక్కడో మండుతోంది.
అయినా గదిలోకి పంపించడానికి కదా వాళ్ళందరూ ముస్తాబులు, చమత్కారాలు చేసుకున్నారు. ఈ లోపు మా అత్తగారు మా ఆవిడ చెవిలో ఏదో గుసగుసలాడారు. ఎలాగో లోపలికి వస్తుంది కదా అని నేను మా ఆవిడని దొంగ చాటుగా గమనించడం బాగోదని లోపలి వచ్చేసాను.
ఈ లోపు టీవీకి కేబుల్ కనెక్షన్ ఇచ్చిన మా మామగారు నన్ను పిలిచేసరికి ఆలోచనల్లోంచి బయటకి వచ్చాను.
"అల్లుడుగారు, కేబుల్ ప్రాబ్లం లేదండి. నేనే ఈ వైర్ తీసేసాను. లేకపోతె ఆడమేళం మొత్తం ఇక్కడే ఉంటారు" అని చెప్పి వాళ్ళని వెతకడానికి బయటికి వెళ్లారు.
టీవీ చూసే మూడ్ లేదు. అసలు ఏ మూడ్ లేదు. మా ఆవిడ మీద నాకు చాలా కోపం గా ఉంది. అప్పుడు తెలీదు నా జీవితం మీద నాకే జాలి వేసే స్థితి వస్తుందని.
ఏదో సీరియల్ వస్తోంది టీవీ లో
ఆ సీరియల్ కింద పెద్ద పెద్ద అక్షరాలతో స్క్రోలింగ్
"ఇదే ఈ సీరియల్ చివరి ఎపిసోడ్. ఇదే ఈ సీరియల్ చివరి ఎపిసోడ్"
టీవీ లో పాత్రలు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఏవో మాట్లాడుకుంటున్నాయి.
గంభీరం గా ఉన్న ఒక ఎభయి అయిదేళ్ళ ముసలావిడ నిగ నిగ లాడే నల్ల జుట్టుతో, ఒంటి నిండా భారీ నగలతో దట్టమైన మేకప్ తో ఎదురుగా ఉన్న ఇరవై అయిదేళ్ళ అమ్మాయితో అంటోంది.
"ఇదేనా నీ నిర్ణయం"
ఏడుపు మొహం తో ఉన్న ఆ అమ్మాయి చెక్కు చెదరని మేకప్ తో ఉంది. నగల షాపులోని నగలన్నీ ఈ అమ్మాయి వంటి మీదే ఉన్నాయి.
ఆ ముసలావిడకి సమాధానం గా "అవును ఇదే నా నిర్ణయం" అని అంది
"అలా అయితే నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో నీకు వేరే చెప్పక్కర్లేదు" అని ఆ ముసలావిడ
"నాకు తెలీదా పిన్నీ. ఇలాంటి సమస్యలు వస్తాయనే కదా నువ్వు నిన్నే మోసం చేసుకుని జీవిస్తున్నావు"
"జీవితం అంటేనే సమస్యల వలయం తల్లీ. పెద్దదాన్ని నేనెందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో"
"అర్ధం చేసుకున్నానుగాబట్టే నా నిర్ణయాన్ని మార్చుకోలేను"
"ఇదే ఆఖరి సారి అడుగుతున్నాను. ఇదేనా నీ నిర్ణయం"
"ఇదే ఆఖరి సారి చెబుతున్నాను. ఇదే నా నిర్ణయం"
"ఇరవై అయిదేళ్ళ పిల్లవి జీవితం గురించి నీకేం తెలుసు"
"నాకేం తెలుసో ముందు ముందు నీకు తెలుస్తుంది"
"ఇదేనా నీ ఆఖరి నిర్ణయం"
"అవును ఇదే నా ఆఖరి నిర్ణయం"
'తిక్క కుదిరిందా' సీరియల్ లో విరామం అని ఒక ఫిమేల్ వాయిస్ లౌడ్ స్పీకర్ లో అరిచింది.
నిర్ణయం నిర్ణయం అంటారు తప్ప వాళ్ళ నిర్ణయం ఏంటో అర్ధం కావట్లేదు.
ఇదేంటి మా మామయ్యగారు ఇంకా కనబడట్లేదు. అయన స్నేహితులు కూడా మామయ్యతో పాటే వెళ్ళిపోయారు.
వీళ్ళంతా ఎక్కడికి వెళ్లినట్టు. నాకర్ధం కాలేదు.
మళ్ళీ సీరియల్ ప్రారంభం అయింది.
మిస్ అయిన వాళ్ళు చూస్తారని మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తున్నట్టున్నారు.
"ఇదే ఆఖరి సారి అడుగుతున్నాను. ఇదేనా నీ నిర్ణయం" అని పెద్దావిడ వాయిస్
"ఇదే ఆఖరి సారి చెబుతున్నాను. ఇదే నా నిర్ణయం" అని చిన్నావిడ వాయిస్.
ఏంటో డైలాగులు కోరస్ లో వినబడుతున్నాయి ఈ సారి అనుకుంటూ పక్కకి తిరిగి చూస్తే సీరియల్ లో లీనమయిపోయిన మా ఆవిడా, మా అత్తగారు కలిసి ఆ సీరియల్ నటులతో పోటీగా డైలాగులు రిపీట్ చేస్తూ అక్కడే ఉన్న సోఫా లో కూర్చున్నారు. పక్కింటి బామ్మగారు, ఇంకా మా ఆవిడ స్నేహితురాలు కూడా సీరియల్ లో లీనమయిపోయారు.
మా మామయ్యగారు నా వద్దకి వచ్చి.
"ఇదీ బాబు వరస. రోజూ సీరియల్స్ లో నిమగ్నమయిపోతారు.చుట్టు పక్కల ఏం జరిగినా పట్టించుకోరు. ఇంట్లో కేబుల్ కనెక్షన్ తీయించేస్తే ఒక దారికి వస్తారేమో అనుకుంటే పక్కింట్లోకి ఎదురింట్లోకి వెళ్లి టీవీ చూస్తున్నారు. అందుకే ఈ కేబుల్ వైర్ ని నేనే దాచేస్తూ ఉంటాను. కానీ ఇవాళ కూడా వాళ్ళు సీరియల్స్ కోసం పక్కింటికి వెళ్తారని ఉహించలేదు. నన్ను క్షమించండి అల్లుడుగారు. క్షమించండి" అని గుమ్మడి స్టైల్ లో ప్రాధేయపడుతున్నారు.
అసలే శోభనం గదిలోకి మా ఆవిడ రాలేదని నేను బాధపడుతుంటే మా మామయ్య గారు కొత్త బాంబు పేల్చారు. రోజూ ఇదే వరసంటే ఎలా వేగేది.
భవిష్యత్తు గురించి త్వరలో ప్రణాళికలు వేసుకోవచ్చు అనుకుంటూ ... "పర్వాలేదు మామయ్యగారు, ముందు మీ అమ్మాయిని లోపలి పంపించే ఏర్పాటు చెయ్యండి" అని నవ్వు బలవంతంగా తెచ్చుకుంటూ చెప్పాను.
"మీరు లోపలి వెళ్ళండి అల్లుడు గారు, వెంటనే పంపించే ఏర్పాటు చేస్తాను" అని అన్నారు.
నేను లోపలికి వచ్చాను.
ఇప్పటికైనా మా ఆవిడ లోపలికి వస్తోందని తెగ సంతోష పడ్డాను.
తను రాగానే నేను ఎలా మాట్లాడాలో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకున్నాను. కానీ అనుకోని పరిణామం ఎదురయింది.
చేతిలో పాల గ్లాసుతో వస్తుందనుకున్న మా ఆవిడ శోభనపు గదిలోకి పోర్టబుల్ టీవీ తో ఎంటరయింది.
"ఏంటి హారిక, ఈ టివి ఏంటి"
"ఈ టీవీ కాదు, మా టీవీ. మాటీవీలో ఈ సీరియల్ ఆఖరి ఎపిసోడ్ ఇవాళ. పుట్టి బుద్దెరిగినప్పటి నుండి టీవీ సీరియల్లోని ఆఖరి ఎపిసోడ్ చూడలేదు. కాబట్టి, ఏవండీ ప్లీజ్ ఈ సీరియల్ నన్ను చూడనివ్వండి."
"అదేంటి హారిక, ఇవాళ మన శోభనం"
"శోభనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కానీ సీరియల్ లో ని ఆఖరి ఎపిసోడ్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు రాదండి. తర తరాలు ఎదురు చూడాలి. పుష్కరణిలో లో స్నానం చేస్తే ఎంత పుణ్యమో, టీవీ సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూస్తే అంత ఆనందం" అని తను చక్కా టీవీ ఆన్ చేసి కేబుల్ వైర్ అడ్జస్ట్ చేసి సీరియల్ చూడడంలో నిమగ్నమయిపోయంది.
ఆఖరి ఎపిసోడ్ ఆఖరి ఎపిసోడ్ అని ఆ సీరియల్ మొదట్నుంచి ప్రసారం చేసారు. ఆ ఎపిసోడ్ అయ్యే సరికి మర్నాడు ఉదయం అయింది.
మా శోభనం పోస్ట్ పోన్ అయిందని వేరే చెప్పాలా... ఆ తరువాత వారం రోజులకి టీవీ సీరియల్ రాని సమయంలో టీవీ పుణ్యమా అని మా శోభనం జరిగింది.
ఇంతకీ మా అత్తగారు మా ఆవిడ చెవిలో చెప్పిన మాటలు తెలుసుకోవాలనుందా? "మర్చిపోయానే, ఇవాళే 'తిక్క కుదిరిందా' సీరియల్ ఆఖరి ఎపిసోడ్".
***************