అరిటాకు - అమ్జద్

aritaaku

అరవై ఏళ్ళకు పైబడ్డ బిలియనీర్ అయిన మా ఆయనకు నేను ఇరవై మూడేళ్ళ మొదటి భార్యను, బహుశా చివరి భార్యను కూడా. వారి దగ్గర నా కోసం క్షణం తీరిక ఉండదు? ఓ ముచ్చట మురిపెం లేదు, పెళ్ళయిన ఈ మూడేళ్ళ నుంచి!

వారికెప్పుడూ బిజినెస్ గొడవలే! ఆ మీటింగ్ ఈ మీటింగ్ లని, బిజినెస్ ట్రిప్పులని రాత్రులు కూడా కానరాకుండా ఉంటారు. నా ఈ ఏకాంతంలో టి.వి., కేబుల్ చానల్స్, వి.సి.ఆర్., కథలు, నవలలు తప్ప వేరే మార్గం లేదు రాత్రులు గడపడానికి.

అడపాదడపా ఫైవ్ స్టార్ హోటల్లో ఏదో బిజినెస్ మీటింగ్ ఉందని, ఫారెన్ డెలిగేషన్ వస్తుందని నన్ను బ్యూటీ పార్లర్ కు పంపించి ఏ మిస్ బ్యూటీకి తక్కువ కాకుండా నన్ను తయారుచేయించి కూడా తీసుకువెళ్లుతారు మా ఆయన.

అర్ధరాత్రి దాటే వరకు నన్ను వచ్చిన ఆ ఫారెన్ వెధవల పోకిరి వేషాలు సహించడానికి వదిలేసి ఎక్కడికో మాయమైపోతారు.

తెలతెల్లారుతుండగా మా ఇంటి డ్రైవరు మా ఆయన నన్ను వదిలేసిన హోటల్లో నుంచి మా బంగళాలో దింపేసి వెళ్ళుతాడు. ఇలా జరిగినప్పుడల్లా రెండు మూడు రోజులు నన్ను తప్పుకొంటూ తిరుగుతారు మా ఆయన. ఆ తర్వాత మళ్ళీ మామూలు డైలాగులు...

'ఓ...హనీ...సారీ... ఐ యామ్ వెరీ బిజీ...బట్... యూ నో... వుయ్ గాట్ టెన్ మిలియన్ డాలర్స్ ప్రాజెక్ట్... ఫర్ ఇనిషియల్ స్టేజ్'

ఏడ్వాలో... నవ్వాలో తెలియని సందిగ్దంలో మా ఆయన వైపు తీక్షణంగా చూస్తూ... చివరికి చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకునే దృశ్యాన్ని ముగిస్తాను.

క్లబ్ లకు వెళ్ళడం బోర్ కొట్టుతుంది. కొన్నాళ్ళ నుంచి ఆడవాళ్ళ స్నేహంతో, వాళ్ళ కబుర్లలో విసిగి పోయాను. కొద్ది రోజుల నుంచి మగాళ్ళ స్నేహం నాకు ఓ.కె. లా అనిపిస్తుంది. వాళ్ళతో కబుర్లాడటం నాకు సరదాగా ఉంటుంది. నా పట్ల నా పరిస్థితుల పట్ల వాళ్ళ సానుభూతి కోరడం నాకు అలవాటై పోయింది. కొందరు మగాళ్ళు దీన్ని మరో విధంగా తీసుకొని చొరవ తీసుకున్నారు. ఆ కొందరిలో నేను ఓ హాండ్సమ్ చేతిలో చిక్కిపోయాను. నాకు అతడి పొందు కావాలి. అతడికి నా డబ్బు కావాలి.

అలా కొన్నాళ్ళు గడిచాయి. అతడితో విసిగిపోయాను అని చెప్పుకోవడం కంటే అతను నన్ను మరో విధంగా ఉపయోగించుకొంటున్నాడని చెబితే సరిగా ఉంటుంది. మా వారికి ఈ విషయం తెలిసినా తెలియనట్లుగా నటించారు?

ఓ సారి షాపింగ్ సెంటర్ లోఅనుకోకుండా, నా నిగ్రహాన్ని అధిగమించి, నా అధీనంలో లేకుండానే నా కళ్ళచూపు ఓ యువకుడితో ఆకట్టుకున్నాయి. ఎంత ప్రయత్నించినా, అప్రయత్నంగానే నా మనసు అతడి వైపే లాగసాగింది. నా శరీరంలో అవ్యక్తమైన భావతరంగాలు ఉవ్వెత్తున లేచాయి.

అతడితో మాటలు కలిపాను సేల్స్ మేన్ అయి ఉంటాడని నటిస్తూ.

'మీ లాగే నేను కూడా ఓ కస్టమర్నే' అని అన్నాడు ఆ యువకుడు నవ్వుతూ, జబ్బలెగరేస్తూ.

'ఏమేమి కన్సూమ్ చేస్తార'ని చిలిపిగా అడిగాను.

'మంచిగా అనిపించేవన్నీ?' నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. అతని పెదవులపై చిరునవ్వులు.

క్లుప్తంగా ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం. కాలక్రమేణా మా పరిచయం పెరిగింది.

ఐస్ క్రీములతో మొదలైన మా మీటింగ్ స్థలాలు నైట్ క్లబ్బుల్లోకి చేరాయి. సమయం, సందర్భాలు చూసి ఆయువకుడు నన్ను కవ్వించే స్థలాలను స్పర్శించేవాడు. నాలో లావా బ్రద్దలవుతూండగా నన్ను జుర్రుకునేవాడు. మంచి రసికుడు. అతడితో లేచిపోదామని ఫ్లాన్ వేశాను. అతడితో చెప్పాను. ఉప్పొంగి పోయాడు. కాని నా ప్లాన్ అతడికి నచ్చలేదు.

ఇందులో అనుమానాలకు అవకాశం ఎక్కువగా ఉంది? పైగా రిస్క్. మీ ఆయన ఎంత బిజీగా ఉంటారో అంతే నేర్పుతో మీపై నిఘా వేసి ఉన్నాడు! అని చావు కబురులాంటిది చల్లగా చెప్పాడు, త్రీ స్టార్ హోటల్లోని లాంజ్ లో డిమ్ లైట్ లో వెలుగుతున్న నా మొహాన్ని చూస్తూ.

'నీకెలా తెలుసు?' అని భయభ్రాంతురాలైన నేను, గుండె వేగంగా కొట్టుకుంటుండగా అడిగాను.

మీరిస్తున్న రెస్పాన్స్ ను బట్టి మీ ఆచూకీ తీశాను. గొప్పోళ్ళతో ఇలాంటి సంబంధాలు పెట్టుకొంటే ఓ రోజు ప్రాణం మీదికి వస్తుందని నాకు తెలియకపోలేదు. ఎక్కడ... ఎవరు నన్ను గప్ చిప్ గా మింగేస్తారో తెలియదు? ఇది అండర్ వరల్డ్ రీతి, సీరియస్ గా చెప్పాడు.

అతడు చెప్పిన విషయాలు వింటూంటే... చివరికి నా భవిష్యత్తు ఎలాంటి భీభత్సానికి దారితీస్తుందో... అని ఓ వైపు నాకు భయంగా కూడా ఉంది.

అతని చేతిని గట్టిగా అదిమిపట్టుకొంటూ, 'ఈ భయాందోళన నుంచి దూరంగా... ఏ పర్వతాల పైకో, ఏ మేఘాలను దాటో... కొన్ని రోజులు ఈ లోకాన్నే మైమరచి, నిద్రాహారాలు మాని... ఏకమైపోలేమా?' అన్నాను.

'అదెంత పని?' అని ఓ ఫ్లయింగ్ కిస్ నాపై విసిరాడు.

కొన్ని నిమిషాలు మేము వేయబోయే ఫ్లాన్ గురించి తర్జనభర్జనలు పడి, హోటల్ నుంచి మా గమ్యాల వైపు బయల్దేరాం?

*** *** ***

అణువు అణువునా హిమజ్వాలలా రగిలిన నా శరీరం ఈ మూడు రాత్రుల్లో నాకెంతో తృప్తిని, హాయినొసగాయి.

మా మూడు రాత్రుల ఏకాంత కలయిక ఎగ్రిమెంటు తెల్లారితే పూర్తవుతుంది.

వేకువ జాముననే లేచి, తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ అతడి పేర నా అంగీకారం ప్రకారం లక్ష రూపాయలు చెక్కు రాసి, గాడనిద్రలో ఉన్న అతడిని లేపాను.

నిద్రలో ఎర్రబడ్డ కండ్లతో నా చెక్కును చూశాక అతడి మొహం వికసించింది.

అమాంతంగా బెడ్ మీదనుంచి లేచి తన కౌగిలిలో బందిస్తూండగా మొబైల్ ఫోను మోగింది.

మొభైల్ ఫోన్ స్క్రీన్ లో వచ్చిన నెంబరు వైపు చూస్తూ... నా పెదవులు విప్పవద్దని సైగ చేస్తూ...

'హలో... హరిప్రియ హియర్... ఆ... చెప్తున్నాను... మీ విలువైన సమయాన్ని వృధాచేయకుండా క్లుప్తంగా... మీరనుకొంటున్నట్లు మీ మిసెస్... ఎలాంటి గూడచారి గొడవలు లేవు... మీ బిజినెస్ రైవల్స్ తో ఆమెకెలాంటి సంబంధాలు కూడా లేవు. నా ఫ్లాను ప్రకారం మీరు ఆమెను కోడైకనాల్ కు ఒంటరిగా బిజినెస్ ట్రిప్ కని పంపించి, ఆమెపై నిఘావేసి, నిజానిజాలు బయట పెట్టాలనే మన ఒప్పందం కదా. కాని ఐ యామ్ వెరీ సారీ టు ఇన్ఫామ్ యు దట్... ఆమె అమాయకురాలు. మీ బిజినెస్ సీక్రెట్స్ ఆమె ఎవరికి అందించలేదు. ఆమెను కనీసం చూడటానికైనా ఎవరూ రాలేదు. పైగా ఆమె ఉన్న హోటల్ రూంకు ఓ ఫోన్ కాల్ కూడా... రాలేదు... ఆమె దగ్గర ముభైల్ ఫోన్ కూడా లేదని ఆరా తీశాను... సో... మీ టైం ఇంకా వేస్ట్ చేయకుండా నా ఎక్స్ పీరియన్స్ ప్రకారం... ఆమె కేవలం... అన్ సాటిస్ ఫైడ్... ఉమెన్ లా ఉంది... ఉంటాను సార్ మరి... హలో... హలో... మిస్టర్ పట్టాభిరాం... మీరు పంపించే నా ఫీజు రెండు లక్షలు తీరా దుబాయ్ నుంచి నా అకౌంట్ లో వేయించగలరు... ఓకే బై బై...

ఫోను పై అతని సంభాషణ వింటూన్న నేను, అతని కౌగిలిలో నుంచి విడిపోయాను.

డబుల్ క్రాస్ గురించి విన్నాను. చదివాను, ఇప్పుడు అనుభవించాను.

స్త్రీని అరిటాకు అని పెద్దలెందుకన్నారో ఇప్పుడర్ధమైంది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు