ఉదయం ఆరు కావొస్తోంది. ఆటో తుడుస్తున్నాను. ఈలోపు ఒకతనొచ్చాడు. "బాబు! పెండ్లికి బోవాల! వస్తావా?" అన్నాడు. "పెళ్ళెక్కడ?" అన్నాన్నేను. "కుప్పిగంతుల పాలెం!" నొసలు చిట్లించి "అదేం ఊరు? అదెక్కడ?" అన్నాను. "దగ్గరే లేవయ్యా! గంట ప్రయాణం మధ్యాన్నంకల్లా రావొచ్చు. వస్తవా,రావా?" అన్నాడు.
నేను లెక్కలేసుకొని "రాను,పోను కలిపి మూడొందలవుతుంది" అన్నాను. "సరే! దగ్గర్లోనే ఇల్లు, పదా!" అంటూ ఆటోలో ఎక్కాడు.
*********************************
పది నిముషాలని ఇంట్లోకి దూరాడు. అర్ధగంటైంది. గుమ్మంలోకి చూసి చూసి మెడ నరాలు నొప్పెడుతున్నాయి. కేకలేసాను. అంగలేసుకుంటూ ఉరికొచ్చాడు. "ఎంతసేపండి?" కసురుకున్నాను. " అయిపోయింది, పప్పు తాలింపేసేసరికి కాస్త లేటయింది. ఒక్క నిముషమం"టూ మళ్ళీ ఇంట్లోకురికాడు. 'పొయ్యేది పెళ్ళికి, పప్పేమో తాలింపా?" నాకతని మాట మింగుడు పడలేదు. దగ్గర్లేడుగానీ ఉంటే చెంపలు వాయించాలన్న కసి..అయినా నాకెందుకులే అని సర్దుకున్నాను.
తలుపులేసి బయటకొస్తున్నారు. వాళ్ళను చూసినోడల్లా 'ఓరి వీళ్ళ వేషాలో!" అని అనుకోకుండా ఉండలేరు. ఆది దంపతుల్లా మెరుస్తున్నారు. ఆమె మల్లె తీగకు చీర కట్టినట్టుంది. అతను బండరాయికి బట్టలు తొడిగినట్టున్నాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీ దాటుంటారు. కానీ వాళ్ళేసుకున్న బట్టలు ట్వంటీ ప్లస్ వారివే!. ఆమె కాస్త పొట్టి కావటం వల్ల చీర నేలను ఊడుస్తోంది. అతను పొడుగరి. లావు ఉండడం వల్ల చొక్కా ఒంటికి అతుక్కుపోయి కొంత శరీరాన్ని గాలికొదిలేసింది. ఫ్యాంటేమో ఫుల్ కాదు, హాఫ్ కాదు, మిడిలేజ్. మిడిలేజేంటని ఎందుకన్నానంటే మోకాళ్ళ నుండి జానెడు మాత్రమే క్రిందకుంది. గుండ్రటి బొట్టు. ఆయినిది నిలువు బొట్టు. నాకు నవ్వాగితే ఒట్టు. పగలబడి నవ్వితే బాగోదనుకుని పెదాలను పండ్లతో కొరికి పట్టాను.
రెండు చేతి సంచులతో ఆటోలో కూలబడ్డారు. ఆటో సిటీ దాటింది. "పెళ్ళి ఎవరిది సార్?" అన్నాను ప్రయాణంలో హుషారు రావడానికి. "ఎవడిదోలే పెళ్ళి! గమ్మున పోనీ! ఇంకోసారి పెళ్ళి మాటెత్తావంటే గభాలున బయటికి దూకుతా!" అన్నాడు. అన్నంత పని చేస్తాడేమోనని కాసేపు వణికి సచ్చాను. ముఖాన పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే సామెత అతన్ని చూసాకే నిజమనిపించింది. ఆమైతే ఎవడో గుద్దినట్టే పెట్టుకుంది ముఖం. 'పెళ్ళికి ఆటో పిలిచిందీడే....పప్పు వండుకుంది వీళ్ళే....పెళ్ళి ఎవరిదని అన్నందుకు పటపటమని పళ్ళు కొరుకుతాడా...వీడి దుంపతెగ..."సావు కోపం వస్తుంది కానీ నేనేమో ఒక్కణ్ణి. వీళ్ళు ఇద్దరు. వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలు కావాలంటారు. సంఖ్యా బలం కుదరక ఊరుకున్నాను. ఏం చేస్తాం, అన్ని రోజులు మన చేతిలో ఉండవు మరి.
******************
కుప్పి గంతుల పాలెం...
బోర్డు చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది. వెనక్కి చూద్దును కదా, ఎవరూ సోయిలో లేరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఒకరి గాలి ఒకరి మీదకు వదులుకుంటున్నారు, ఇద్దరివీ రెండురకాల గురకలు. సన్నాయి మేళం, డోలు వాయిద్యం రెంటిని కలిపి ముక్కులో పోసినట్టే అనిపిస్తోంది. "సార్" గట్టిగా పిలిచాను. శరీరం కదిలింది కానీ కళ్ళు మాత్రం తెరుచుకోలేదు. 'భలే బేరమే' అనుకున్నాను. హారన్ ఆగకుండా ఒత్తి పట్టుకున్నాను. బెలూన్లో గాలి కొట్టినట్టే టక్కున లేచి కూర్చున్నారు. " ఏందయ్యా గోల..బంగారం లాంటి నిద్ర పాడు చేసావ్?" చికాకుగా అన్నాడు. "ఊరొచ్చింది సార్! ఎటెల్లాలి?" మెల్లగా అన్నాను.
"ఆగా"గని ఎవరికో ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడి పెదవి విరిచాడు. "మన కర్మ కాలిందే! పుర్రెకో బుద్దన్నట్టు లాలయ్య తన పెళ్ళి అడవిలో ఖరారు చేశాడు." భార్యతో అన్నాడు. " సరిపోయింది సంబడం" అన్నదో లేదో మళ్ళీ ముఖం మాడ్చుకుంది. పెళ్ళేందో, అడవేందో....... అసలేం జరుగబోతోందో..... నాలో మళ్ళీ వణుకు....బేరం ఒప్పుకున్నాక తప్పుతుందా? మొత్తానికి రెండు కిలోమీటర్లు చెట్లలోనే వెళ్ళాం. ఖాళీ స్థలంలో పోగుపడిన గుంపు కనబడింది. ఆటో ఆపాను.ఆపాను. నన్నేమాత్రం పట్టించుకోకుండా వారిద్దరూ హడావుడిగా వెళ్ళి గుంపులో కలిశారు. నేను భారంగా నిట్టూర్పు వదిలి, ఆటోలో కూర్చొని పెళ్ళి తంతు చూడడం మొదలు పెట్టాను.
ఏ జన్మ పాపమో, ఈ పెళ్ళి రూపంలో నను పీడిస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో అంతు బట్టడం లేదు.ఎండా కాలం పైగా పన్నెండు కావొస్తోంది. ఒక్క టెంట్ లేదు. అందరూ మండుతున్న ఎండలో....కారుతున్న చెమటతో అపసోపాలు పడ్తూ...పెళ్ళి చూస్తున్నారు. దాదాపు అందరి బట్టలు నీళ్ళల్లో నానబెట్టినట్టే తడిసాయి. నేల కాలుతుంది కాబోలు కొందరు పక్షి రెక్కల్లా కాళ్ళను ఆడిస్తున్నారు. చిన్న పిల్లలు కర్చీఫ్ లు, కండువాలను దగ్గర్లోని వాగులో ముంచి, తీసుకొచ్చి తమ తల్లిదండ్రుల ముఖాలపై పిండుతున్నారు.
రెండు ఇసుక కుప్పలపై వేసిన పీటల్లో వధూవరులు కూర్చున్నారు. అయ్యగారు మాత్రం నిలబడే మంత్రాలు చదువుతున్నారు. ఉక్కపోతకు కాబోలు అయ్యగారి కంఠం పలురకాలుగా మోగుతూ...మైక్ ను తలదన్నుతోంది. కాసేపటి తర్వాత పట్టు వస్త్రాలు కట్టుకు రమ్మని పెళ్ళికొడుకుని చెట్లలోకీ, పెళ్ళికూతురిని వాగు పక్కకీ పంపించారు. పావుగంట గడిచింది. పెళ్ళికూతురు వాగులో పడిందనే కేకలు, బంధువుల్లో కొంతమంది జింకల్లా పరిగెత్తి పెళ్ళికూతురి రెండు రెక్కల్ని పట్టుకొచ్చి పెళ్ళి పీటలపై కుదేసారు. తర్వాత రెండు బేసిన్ల లో సిద్ధంగా ఉన్న తలంబ్రాలు వధూవరులు పోటీపడి ఒకరి మీద ఒకరు పోసుకున్నారు. తదుపరి అయ్యగారు "మాంగల్యం తంతునానేనా..." అంటూండగా పెళ్ళికొడుకు మంగళసూత్రం కట్టాడు.
రెండు, మూడు వరుసలుగా ఇసుక, మట్టి కలిసిన నేలపై భోజనానికి కూర్చున్నారు. చిన్నగా వెళ్ళి నేను ఓ వరుసలో చేరాను. అరచేయి కంటే కొంచెం పెద్దగా ఉన్న మోదుగు ఆకులను అందరి ముందు పరుస్తున్నారు. నాకైతే నోటమాట రాలేదు. పక్కనతనికి కనుసైగలతోనే ఆకు చూపించాను. అతను వేలును నోటికి నిలువుగా పెట్టుకున్నాడు. మూసుకొని తినవోయ్ అన్నట్టు అర్థమైంది నాకు. వడ్డిస్తూంటే అందరి ఆకులను పరిశీలన చేయసాగాను. ఖచ్చితంగా పిడికెడంటే పిడికెడు అన్నం, అరగంటె పప్పు, గిద్దెడు సాంబారు, రెండు స్పూన్లంత మజ్జిగ, స్వీట్ గా జాంగ్రీని ఒకాయన విరుచుకుంటూ చేతికొచ్చినంత ఆకులోకి విసిరేసిపోతున్నాడు. ఓ వైపు వడ్డించడమే కాలేదు. మరోవైపు లైన్లు లేచి, వాగులో చేతులు కడుక్కుంటున్నాయి. నాకు కలో, నిజమో తెలియట్లేదు. వడ్డించిన ఆకును అలాగే మడిచి ఇసుక కింద కప్పెట్టాను. ఉసూరుమనుకుంటూ వెళ్ళి వాగులో నీళ్ళు తాగుతున్నాను. ఈ లోపు అందరూ పరుగులు తీస్తున్నారు. తలో దిక్కున చేరి, తెచ్చుకున్న భోజనం విప్పుకుంటున్నారు. నా ఆటోలో వచ్చిన వాళ్ళు కూడా క్యారేజ్ విప్పి అన్నంలో పప్పుచారు జుర్రుకుంటూ, ఆకలిని తంతున్నట్టే తింటున్నారు.
నేను అప్పటికే సగం చచ్చాను. కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి వారి పక్కన కూలబడ్డాను. మాటవరసకైనా అన్నం తినమమంటారని ఎదురుచూసాను. పొరపాటున కూడా ఆ భాగ్యం కలుగలేదు. అయినా నాకు కించిత్తు బాధలేదు.కానీ ఈ పెళ్ళేంది? అన్నం వండుకొని రావడమేంది? తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువైంది.
" సార్!" పిలిచాను. అన్నం ముద్ద సగం నోట్లోకి సగం బొచ్చెలోకి పడ్తుంటే, "ఏంది?" అన్నాడు. "ఎంత అడుక్కు తినేటోడు అయినా, భోజనం పెట్టకుండా పెళ్ళి చేసుకోడు...ఈ దిక్కు మాలిన ఖర్మేంటి సార్?" అన్నాను. " ఇది రెండోపెళ్ళయ్యా" అన్నాడు.
" ఆ...?" నా పెదాలు తెరుచుకొని అలాగే నిలబడ్డాయి. " రెండో పెళ్ళా?" అన్నాను. " రెండో పెళ్ళంటే రెండోదని కాదు....వధూవరులు వీళ్ళే.వీళ్ళకే మళ్ళీ పెళ్ళి.!" నాకు సర్రున కాలింది. "ఎట్టెట్టా?" పండ్లు కొరుకుతూ అన్నాను.
" మాకో ఆచారం తగలడింది. అమ్మాయి ఇంట్లో పెళ్ళి జరిగినప్పూదు అబ్బాయి తరపు బంధువులను సంతృప్తి పర్చలేకపోతే అబ్బాయి తరపు వాళ్ళు ప్రతీకార పెళ్ళిని ఏర్పాటు చేస్తారు. వారు చేసిన మర్యాదలను ఎత్తిపొడుస్తూ అన్నం వడ్డిస్తారు. దీన్లో మరో మలుపేంటంటే బంధువులు ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలి. అలాగని పెళ్ళికి రాకుంటే ...భోజనాలు తేకుంటే వారికి చుట్టరికాలు బందు. ఎవరూ వాళ్ళింటికి వెళ్ళరు. ఒక విధంగా కులం నుంచి వెలేసినట్టే.
మర్యాదలకు లోటు రానీయకని అమ్మాయి తండ్రికి చిలక్కి చెప్పినట్టు చెప్పా. వాడు వినకపోగా, బావా, ఈ ఆచారం మన తాత ముత్తాతల నుండి చెప్పుకోవటమే కానీ ఏనాడూ ప్రతీకార పెళ్ళిని చూడలేదు. దానిని జరిపించి మూలపురుషుడిని అవుతానని ప్రతిజ్ఞ చేసినాడు. దాని ఫలితమే, ఈరోజు ఇన్ని కష్టాలు." చెప్తూనే మళ్ళీ ముద్దను నోట్లోకి నెట్టనే నెట్టాడు. ముద్ద మింగి ఇకిలిస్తూ "అయినా, మనం వండుకున్న అన్నం మనం తినడానికి నామర్దా ఎందుకోయ్!" అన్నాడు.
తిక్క మనుషులు ఉంటారని వినడమే కానీ, ఎప్పుడూ చూసింది లేదు. అదిప్పుడు ప్రత్యక్షంగా అనుభవించాను. 'ఓరి వీళ్ళ ప్రతీకారం పాడుగానూ! ఆచారం, సంప్రదాయం గంగలో కలిపెయ్య, ఈ పెళ్ళి లోకానికే విడ్డూరంగా ఉందీ మరుగుతున్న నీళ్ళలాగైంది నా మనసు. మెల్లగా పైకి లేచాను. " సార్! సెంటర్ కెళ్ళి పెట్రోల్ పోయించుకొస్తాను...డబ్బులియ్యండి" అన్నాను.
నన్ను పరిశీలనగా చూశాడు. నమ్మకం కుదరలేదో ఏమో... మాట్లాడుకున్న బేరం కంటే వంద తక్కువ ఇచ్చాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆటోలో పడ్డాను. వెందిరిగి చూస్తే ఒట్టు.....