షరా మామూలే...! - పి.వి.డి.ఎస్. ప్రకాష్

Shara Mamoole Story by PVDS Prakash

ఆనందం... ఆశ్చర్యం!

పిచ్చిపిచ్చిగా ఉంది శ్రీపతికి. కూచున్న కుర్చీలోంచి ఒక్కసారి లేస్తూ వచ్చీరాని డాన్సులు చేస్తూ ఎగిరెగిరి గంతులేస్తున్నాడతడు. ఉదయం ఎనిమిది గంటలవేళ... ఆఫీసుకెళ్ళే తొందర్లో ప్లేట్లో పొగలు కక్కుతున్న వేడివేడి ఇడ్లీల్ని ఏమాత్రం ముక్కలు చేయకుండా వేసినవి వేసినట్లే గబుక్కున నోట్లోకి తోసేసుకుని నమలకుండా గుటుక్కున మింగేస్తూ... మంచినీళ్ళ గ్లాసుని పట్టుకోవాల్సిన ఎడమచేతి ఆనవాయితీని ఏనాడో విస్మరించి వ్యసనం ప్రకారం ఆ చేత్తో రిమోట్ పట్టుకుని... అత్యంత లాఘవంగా చానెల్స్ మార్చేస్తూ చిన్నితెరపై కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్ని కళ్ళనిండుగా నింపుకుంటూ ప్రతి రోజూ అల్ఫాహారం పూర్తిచేసే పతిదేవుడు ఇవాళ ఇలా పిచ్చి పిచ్చిగా గెంతులేస్తుంటే అవాక్కయిపోయింది శ్రీపతి భార్య ఎ. ఎం. ఎం. తాయారు అలియాస్ అలిమేలు మంగతాయారు.

"ఏమైందండీ" అని గట్టిగా అరుస్తూ భుజాలు పట్టుకుని కుదుపుతూ అతడ్నీ లోకంలోకి తీసుకొచ్చేందుకు చేయరాని ప్రయత్నమంతా చేస్తోందామె.

"ఏమో... ఏమైందో నాకు తెలీడం లేదు. పట్టరాని సంతోషంతో కాళ్ళు నేలమీద నిలవడం లేదు. ఇప్పటికిప్పుడు సల్సా డాన్స్ చేయాలనిపిస్తోంది..." అంటూ రెండు చేతులు పట్టుకుని ఊపేస్తూ గిరగిరా తిప్పేయసాగాడు శ్రీపతి.

"అబ్బ... ఈ ఉప్పెనతో ఊపిరాట్టం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఉండండీ" ఆయాసంతో రొప్పుతూ అరుస్తోంది తాయారు.

"ఊహూ.." శ్రీ పతిదేవుడస్సలు ఊరుకోవడం లేదు. పైపెచ్చు ఆ బండ గొంతేసుకుని - "ఆనందమానందమాయేనే..." అంటూ పాటెత్తుకున్నాడు.

అలా పూనకంతో వీరంగం చేస్తున్న మొగుడి చెంపని చెల్లుమనిపిస్తూ ఒక్కటిచ్చింది... ముద్దుగా ఓ ముద్దు. అంతే! ప్రకోపించిన పైత్యం కాస్త తగ్గి - "ఏమైందీ" అంటూ యాక్సిడెంటై కోమాలోకి వెళ్లి అపుడే బయటకొచ్చిన రోగిలా అయోమయంగా చుట్టూ చూస్తూ అడిగాడు భార్య అలిమేలుని.

"ఆ క్వశ్చన్ పై కాపీ రైట్సన్నీ నావే. ఏమైందంటూ ఇందాకట్నుంచీ మిమ్మల్ని నేనే అడుగుతున్నాను. ఆన్సరివ్వకుండా పిచ్చి గెంతులేస్తున్నారు"

"పిచ్చిగెంతులు కావు... సల్సాడాన్స్"

"ఎపుడు నేర్చుకున్నారటా..." ఎకసెక్కంగా అడిగిందామె.

"ఎపుడో...! ర్యాంప్ షోల్లో పార్టిసిపేట్ చేస్తున్న సినీ సెలబ్రిటీస్... మోడల్స్ ఈమధ్య చేస్తున్న డాన్స్ అదేగా..."

"వాళ్ళు సరే... ఆ డాన్స్ మీరెప్పుడు నేర్చుకున్నారనీ అర్ధమయ్యేట్టు అచ్చతెలుగులో అడుగుతున్నా" కాస్త కోపంగా అడిగింది అలిమేలు.

"అదే చెప్తున్నా... ఈలోకంలో సామాన్యుడికి సర్వకలలూ అబ్బుతున్నాయంటే కారణం... ఈబుల్లితెరే. ఇంట్రస్ట్ అంటూ ఉండాలే కానీ విశ్వంలో ఉన్న ఏ విషయమైనా ఇట్టే నేర్చుకోవచ్చు. పైగా నాలాటి ఏకసంతాగ్రాహికి ఇలాటి సల్సాడాన్స్ లు నేర్చుకోవడం ఎంతో సేపు పట్టదు. ఆ డాన్స్ ల భంగిమలు రోజూ టీవీల్లో చూస్తూనే ఉన్నాగా" చెప్తున్నాడు తన అంతరంగంలోంచి పొంగిపొర్లుతున్న అంతర్గత సృజనకి హద్దులంటూ లేవని తెలియపరుస్తూ.

"అద్సరే... ఆఫీసుకెల్లాల్సిన టైంలో పొద్దున్నే ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టారో? అది తెలీకే నేను నెత్తీనోరు బాదుకుంటున్నా"

"అంతపని చేయకు..."

"అయితే... నాన్చక అసలు విషయం చెప్పండి... అలా పిచ్చిగెంతులెందుకు వేసారు?"

"పిచ్చిగెంతులు కావనీ చెప్పానా?"

"సర్సరే... నాకు పిచ్చి గెంతులనిపించే మీ సల్సానృత్యాన్నే ఇంత పొద్దున్నెందుకు చేసారటా?"

"కళా ప్రదర్శనకి కాలంతో పనేముంది. ఎపుడు హృదయం సంతోషంతో పరవళ్ళు తొక్కుతుందో... ఎపుడు ఆనందం అంబరాన్ని తాకుతుందో... ఎపుడు వళ్ళంతా పులకరించి పరవశిస్తుందో అపుడు... అపుడు నాలాటి సామాన్య కళాకారులెవరైనా ఆదమరిచి డాన్స్ లు కట్టొచ్చని..."

"ఏ రాజ్యాంగంలో రాసుంది 'మగా'నుభావా?"

"చెప్పేది విను. చరిత్ర అడక్కు. అలా ఒక్కసారి టీవీ వంక చూడు..."

"చూసా...?" ఓ క్షణం టీవీవేపు కన్నార్పకుండా చూసి మళ్ళీ మొగుడు వేపు చూపు మరిల్చి చెప్పింది అలిమేలు.

"ఆ డిస్కషన్ చూడు ఎంత లక్షణంగా సాగుతుందో?"

"ఇవాళ కొత్తేం కాదుగా... ప్రతిరోజూ ఇదే టైం లో ఏ న్యూస్ చానెల్ చూసినా కొన్ని డైలీ పేపర్లు ముందేసుకుని కూచున్న యాంకర్ వివిధ పొలిటికల్ పార్టీల అఫీషియల్ స్పోక్ పర్సన్స్ తో హెడ్ లైన్స్ చదువుతూ ముచ్చట్లాడుతాడు. ఎపుడూ కనిపించే దృశ్యమే కదా"

"చూడు అలిమేలు మంగతాయారూ... ఇవాల్టి డిస్కషన్ రోజూ కనిపించేది కాదు. ఆకాశంలో కనిపించే గురుచంద్రుల కలయికంత అద్భుతం. ఎపుడో తప్ప ఇలాటి దృశ్యం టీవీతెరపై కనిపించదంటే కనిపించదు. ఇంట్రస్ట్ పెట్టి ఇంకోసారి చూడు. స్టూడియోలో కూచున్న ఆ మనుషుల్లో ఏ ఒక్కరైనా చికాకుతో చిర్రుబుర్రులాడుతున్నారా? అసెంబ్లీలో అంతంత గొంతులేసుకుని అరుస్తున్నారా? లేదే? ఓ క్షణం బ్రేక్ ఇస్తే... ఒకరిపై ఒకరు చటుక్కున పడిపోయి కౌగిలించుకోవాలని ఆశపడ్తున్నట్లు లేరూ...? ఎంత అభిమానంగా పలకరించుకుంటున్నారో? ఎంత ఆప్యాయతని ఒలకబోస్తున్నారో? ఎంత గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారో? సందు దొరికితే చాలు తెలుగు భాషలో కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టడంలో ఎక్కడలేని ప్రావీణ్యతని సంపాదించుకున్న మన రాజకీయనాయకులేనా వీళ్ళు? టీవీ స్టూడియోలో ఇంత సామరస్యంగా కూచుని డిస్కస్ చేస్తున్నారు. పక్కపార్టీవాడు ఏది చెప్పినా కాదనడమే ఒకానొక లక్ష్యంగా ఒంటికాలిపై లేచి వీరావేశం ప్రదర్శించే మనవాళ్ళేనా... ఈ సమ్మర్ లో ఇంత కూల్ గా మాట్లాడుతోంది? వాళ్ళలో ఎంత వినయం కనిపిస్తోంది? చూస్తుంటే నాకళ్లలో నీళ్ళు కారుతున్నాయి. దాంతో... ఏదో తెలీని భావావేశంతో పూనకం వచ్చినవాడిలా ఊగిపోయా. వీరావేశంతో సల్సా డాన్స్ కట్టా" పట్టరాని ఆనందంతో ఛాతీ విశాలమవుతుండగా అంతరాయం లేకుండా అనర్ఘళంగా చెప్తున్నాడు శ్రీపతి.

"ఏమోనండీ... నాకలా ఏం అనిపించడం లేదు" నిర్మొహమాటంగా అంది అలిమేలు.

"అందుకే...ఎపుడూ సీరియల్సే కాదు అపుడపుడూ న్యూస్ ఛానల్స్ చూడమని నీకు చెప్తోంది" తను గమనించిన అంశాన్ని అర్ధాంగి గమనించలేదనే అసహనం అతడి మాటల్లో ధ్వనించింది.

"అద్సరే... ప్లేట్లో మిగిలిపోయిన చల్లారిన ఆ రెండు ఇడ్లీల్ని చటుక్కున నోట్లో వేసుకుని ఫాంట్, షర్టు మీ వంటికి తగిలించుకుని ఆఫీసుకి నడవండి. ఆలస్యమైతే సిటీబస్సులో సీట్ దొరకలేదని రద్దీగా ఉన్న ఆ బస్సులోనే మళ్ళీ ఏ కూచిపూడి డాన్సో వేస్తారు" చురకలంటిస్తూనే అతడ్ని వేగిరిపరుస్తోంది అలిమేలు.

అంతే! భార్య సూచించిన విధంగా ఒక్కోటి చేసుకొంటూ... త్వరత్వరగా బయటపడ్డాడు శ్రీపతి.

మళ్ళీ అంతలోనే అతనికి ఆశ్చర్యం... అనందం.

అదెలా అంటే -

వేలాడుతున్న జనంతో ఎపుడూ పదకొండుమాసాల పూర్ణగర్భిణిలా కనిపించే సిటీబస్సు ఆరోజు ఆవేళపుడు ఖాళీగా వచ్చి సరిగ్గా ఆ బస్టాండ్ లోనే ఆగింది. ఆకాశం చిల్లుపడినట్లు, నేల ఈనినట్లు... ప్రతి కూడలి ఓ జాతరనే తలపించే ఆ ప్రయిమ్ టైం లో హైద్రాబాద్ లోని ఆర్దనరీ సిటీబస్సొక్కటి కేవలం కండక్టర్నే మోసుకుంటూ అదీ బస్టాండ్ లోనే ఆగడంతో మొదట ఆశ్చర్యం... ఆతర్వాత ఆనందం కలిగింది శ్రీపతికి.

"సిటీలో ఎక్కడైనా అల్లర్లు జరిగాయా?" బస్సెక్కుతూ అడిగాడు శ్రీపతి కండక్టర్ ని.

"జరిగిన అల్లర్లు చాలవా? ఇంకా జరగాలా?" కస్సుమన్నాడు కండక్టర్. బస్సులో జనాలెవరూ లేకపోయేసరికి డ్యూటీ చేస్తున్నట్టనిపించలేదు అతగాడికి. కాలివేలు కూడా పెట్టడానికి వీల్లేని బస్సులో అట్నుంచి ఇటువరకూ బొంగరంలా తిరుగుతూ 'టిక్కెట్... టిక్కెట్' అని అరుస్తూ ఆడామగా అన్న తేడా లేకుండా అడ్డొచ్చిన ప్రతిఒక్కర్నీ తన కండబలంతో తోసేస్తూ... డ్యూటీ చేయడం అలవాటైపొయిందతడికి. ఖాళీ సీట్లో సౌకర్యంగా కూచుని చేతిలో ఉన్న పేపర్లో చెవిలో దాచుకున్న బాల్ పెన్ తీసి అంకెలు వేయడం... అతడికెందుకో సరిపడడం లేదు. వేగంగా పరిగెడుతున్న బస్సులో నడిమధ్యలో ఉన్న ఏదో ఓ రాడ్ ని ఒంటికాలిపై ఆనుకుని అటూఇటూ మూగిన జనం ఆసరాతో రాతపని పూర్తిచేయడం అతడికి పెన్నుతో పెట్టిన విద్య. అలాటిది... ఇవాళ ఖాళీగా సిటీబస్ ఉండడం అతడిని కలవరపరిచిందేమో... శ్రీపతి ప్రశ్నకి అడ్డదిడ్డంగా సమాధానమిచ్చాడు.

"సిటీలో వన్ ఫార్టీ ఫోర్... కర్ఫ్యూలాంటివేమైనా విధించారా?" మళ్ళీ అడిగాడు కండక్టర్ ని శ్రీపతి.

"అలాటివేం లేవు"

"మరి..." నానుస్తూ కండక్టర్ వేపు చూసాడతడు.

"ఖాళీగా ఈ బస్ ఎందుకుందనేగా మీ డౌట్"

"కరెక్ట్" అన్నట్టు తలూపాడు శ్రీపతి.

"ఘనత వహించిన మన ఆర్టీసీవాళ్ళు కేవలం మన సిటీలో తిరిగేందుకే వెయ్యి బస్సులు కొనేసారు"

"వెయ్యి బస్సులా?" శ్రీపతి గుండె ఆగినట్టనిపించిందోసారి.

"ఎపుడు చూసినా ఆర్టీసికి నష్టాలంటారే... ఇన్ని బస్సులెలా కోనేసారబ్బా" నోరు వెల్లబెట్టాడతడు. నేలపై నడుస్తున్న పుష్పకవిమానంలా ఏ అడ్డూఆపూ లేకుండా హాయిగా సాగిపోతోంది సిటీ బస్సు. నిజానికి, హైదరాబాద్ లో సిటీబస్ లో ప్రయాణించడాన్ని మించిన ప్రత్యక్ష నరకం మరోటి లేదనోచ్చు. విపరీతమైన రద్దీతో పాటు... అడుగడుగునా ట్రాఫిక్ సిగ్నల్స్ తో అరనిముషం కూడా సజావుగా సాగదు సిటీబస్ ప్రయాణం. అస్తమానం ఆగిపోతుండడమే. అయిదునిముషాల దూరానికి ఆరుగంటలకు పైగా టైం తీసుకుంటూ నెమ్మదిగా ఊరేగుతుంటుంది సిటీబస్సు. అలాటిది... జెట్ స్పీడ్ లో ఆటంకాలన్నవి లేకుండా వెళ్లిపోతుంటే ఇంకా ఆశ్చర్యం వేసింది శ్రీపతికి.

"ఇదెలా సాధ్యం?" అడిగాడు మళ్ళీ కండక్టర్ ని.

"ట్రాఫిక్ కంట్రోలింగ్. మనోళ్ళు మాబాగా చేస్తున్నారు. ప్రయిం టైం లో జనాలకు ఇబ్బందులు రాకూడదనీ కొన్ని బస్సుల దారులు మళ్ళించారు. దాంతో... రోడ్లు విశాలమై ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాఫీగా సిటీబస్సులెల్తున్నాయ్. ఇక, రోజూ ఇలాగే ఉంటుంది" చెప్పాడు కండక్టర్.

"హమ్మయ్యా. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ప్రతిరోజూ అవతారమెత్తక్కర్లేదు. జనాల్ని తోసుకుంటూ బస్సుల్లో వేలాడుతూ ప్రయాణం చేయక్కర్లేదు. సొంతకారులో ట్రావెల్ చేస్తున్న అనుభూతితో దర్జాగా ఈ సిటీబస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు..."మహానందపడిపోతున్నాడు శ్రీపతి. వేసవిలో వింటర్ లా ఉందతనికి. కిటికీలోంచి వీస్తున్న పిల్లతెమ్మెరని మనసారా ఆస్వాదిస్తుండగా... ఆఫీస్ స్టేజ్ వచ్చేసింది.

బస్ దిగి అయిదు సెకన్లలో ఆఫీసులో పడ్డాడతడు. ఎదురుగా సొగసుగా కనిపిస్తున్న లేడీరిసెప్షనిస్టు అందమైన 'హాయ్' తో వళ్ళు పులకరించిపోతుండగా... ఆనవాయితీ ప్రకారం చాంబర్ లోకి వెళ్లి బాస్ ని విష్ చేసాడు.

"హౌ ఆర్యూ శ్రీపతీ. మీ సెక్షన్ లో వర్క్ ఎలా సాగుతోందీ?" చిన్మయలాస్యం, చిరుదరహాసంతో చిదానందమూర్తి పలకరించాడు.

"ఎవ్విరిథింగ్ ఓకే సర్..."

"నధింగ్ టు వర్రీ. ఏమైనా డౌట్స్ ఉంటే డైరక్ట్ గా నన్ను కలువ్" అభయమిచ్చాడతడు.

"ఏంటో...? ఈ సమ్మర్ లో పైన భానుడు, లోన 'బాసు'డు చిటపటలాడాల్సింది పోయి చిదానందాన్నొలికిస్తున్నారు" మళ్ళీ ఆశ్చర్యం... మళ్ళీ ఆనందం కలగలిసిన అపురూపమైన ఫీలింగ్ తో శ్రీపతి గుండె తడబడింది.

అలా అలా క్షణానికో వింత ఎదురవుతుంటే ఆశ్చర్యపడడానికూడా అతడికి విసుగేస్తుంది. సాధారణంగా సమ్మర్ లో కరెంట్ కోత సహజాతిసహజమైన విషయమే. అధికారికంగా ఆరుగంటలు... అనధికారికంగా పన్నెండుగంటలపాటు కరెంట్ కట్ చేస్తూ 'ఆంధ్రప్రదేశ్' పేరుని 'అంధేరాప్రదేశ్' గా రాష్ట్రనేతలు మార్చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్న నేపధ్యంలో ఆరోజు అసలు విద్యుత్ కోతే లేదు. ఆఫీసులు, సినీ థియేటర్లలో జనరేటర్ లకి పనే లేకుండా పోయింది.

ఇంటికి రాగానే ఇల్లాలు నవ్వు మొహంతో ఎదురై వేడివేడి పొగలు కక్కుతున్న కాఫీకప్పు అందించింది. ఎపుడో పెళ్ళయిన కొత్తలో ఆమె దగ్గర్నుంచీ ఇలాటి ఆహ్వానం అందేది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆమెకి మొహమాటం పోవడం... సంసారం అలవాటై రొటీన్ గా మారిపోవడంతోపాటు ఇబ్బందులు, ఇక్కట్లు, పనిఒత్తిళ్ళ కారణంగా అటువంటి మురిపాలన్నీ ఎపుడో జ్ఞాపకాల్లోకి జారిపోయాయి.

"ఏంటీ పెళ్ళయిన కొత్తరోజుల్ని మళ్ళీ గుర్తుకి తెస్తున్నారు" కాఫీ అందించిన పెళ్ళాం చేతిని ఆప్యాయంగా నిమురుతూ అడిగాడు శ్రీపతి.

"ఇవాళ జాక్ పాట్ కొట్టినంత ఆనందంగా ఉంది. మీతో కలిసి పిచ్చిపిచ్చిగా గెంతులు వేయాలనిపిస్తోందండీ. ఔనూ... పొద్దున్న మీరు వేసిన డాన్స్ సల్సా కదా... నాకిపుడు ఆ డాన్స్ వచ్చేసిందండీ" శ్రీపతి కాఫీతాగుతున్నాడనే స్పృహ కూడా లేకుండా రెండు చేతులూ పట్టుకుని ఊపేస్తూ అతడ్ని గిరగిరా తిప్పేస్తోంది అలిమేలు మంగతాయారు. ఆ హఠాత్ పరిణామానికి అతడిచేతిలోని కప్పు జారిపడి కాఫీ అతడి షర్ట్ ని తడిపేసింది. అసలే పొగలు కక్కుతున్న వేడి కాఫీ ఒంటిని చురుక్కుమనిపించడంతో 'కెవ్వు'మని కేకేసాడతడు. పట్టరాని ఆనందంతో అలా కేకలువేస్తున్నాడనుకున్న అలిమేలు మంగతాయారు మరింత జోరుతో హుషారుగా అతడ్ని గిరగిర తిప్పసాగింది.

"మరీ ఇంత సంతోషం ఏంటే?" అడుగుతున్నాడు శ్రీపతి భార్యని.

"ఎపుడు హృదయం సంతోషంతో పరవళ్ళు తొక్కుతుందో... ఎపుడు ఆనందం అంబరాన్ని తాకుతుందో... ఎపుడు వళ్ళంతా పులకరించి పరవశిస్తుందో అపుడు... అపుడు నాలాటి సామాన్య కళాకారులెవరైనా ఆదమరచి డాన్స్ లు కట్టొచ్చని..."

ఈమాటలెపుడో... ఎక్కడో అన్నట్టు, విన్నట్టు అనిపించిందతడికి. ఎపుడో కాదు... ఈ ఉదయమే. ఎవరో కాదు... తనే అన్నాడామాటల్ని. ఇపుడు అవే మాటలు శ్రీమతి నోటివెంట వింటున్నాడతడు ఆశ్చర్యంగా.

"ఇంతకీ ఏం జరిగింది?" కారణం తెలియాలంటూ కస్సుమన్నాడు.

"ఏ భగీరథుడు కరుణించాడో ఏమో ఆ ఆకాశ గంగ దిగొచ్చినట్లు నల్లానీళ్ళు మధ్యాహ్నమే వచ్చాయి. నిజానికి ఈ సిటీలో నల్లా నీళ్ళెపుడొస్తాయో... టాంకర్లనెపుడు పిలిపించుకోవాలో తెలీని పరిస్థితి. ఏ అర్ధరాత్రో కాకుండా పగలు మేలుకున్న సమయంలోనే నల్లానీళ్ళు వచ్చాయంటే మంగళగౌరీవ్రత ఫలితం దక్కినంత సంబరంగా ఉంది నాకు..." అంటూ సల్సా స్టెప్పులేస్తోంది శ్రీపతి శ్రీమతి.

"అంతేనా... చెప్పుకోదగ్గ విశేషాలు ఇంకా ఉన్నాయి. కాస్త తీరిక దొరకడంతో కూరలు కొనొద్దామని అలా మార్కెట్ కి వెళ్తే అక్కడింకో షాక్"

"అదేంటో?"

"వంకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ, టమోట, ఆలుగడ్డ... ఇలా అన్ని కూరలూ కారు చవగ్గా అమ్మేస్తున్నారు. ఏది కొందామన్నా రూపాయి రెండ్రూపాయలకి మించి లేదు. కూరగాయలు కొని ఇంటికొచ్చి టీవి చూసేసరికి ఇంకో బ్రేకింగ్ న్యూస్ నన్ను నన్నులా నిలవనీయలేదు. పెట్రోల్, డీజిల్ రేట్స్ తగ్గిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. ఇపుడు లీటర్ పెట్రోల్ రేట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే..."

'ఇది నిజమా... కలయా?" అనుకున్నాడతడు కళ్ళు బైర్లు తిరుగుతుండగా. నిన్నటికి నిన్న యుపిఎ గవర్నమెంట్ రైల్వే బడ్జెట్ లో చార్జీలు పెంచడంతో... ఓ భాగస్వామ్య పక్షం నుంచి వ్యతిరేకత ఎదురుకావడం... ఫలితంగా కేంద్ర రైల్వే మంత్రి రిజైన్ చేయడం అతనికెందుకో ఇపుడు గుర్తుకొచ్చింది. ఆ నేపధ్యంలో ఇంత సడన్ గా పెట్రోల్, డీజిల్ కారుచవగ్గా దొరికిపోతుంటే... ఇంకా సిటీబస్సుల్లో ఆఫీసుకి వెళ్ళిరావటం ఎందుకు? ఏకంగా ఓ కారు కొనుక్కోవచ్చు... హటాత్తుగా వచ్చిన ఆ ఆలోచనతో మనసుండబట్టలేక-"అదిగో... నవలోకం విరిసే మనకోసం" అంటూ హఠాత్తుగా పాటెత్తుకున్నాడు శ్రీపతి.

అలా అలా ఆ ఇద్దరూ కలిసి డాన్సులు కడ్తుంటే టీవీతెరపై మరో అద్భుతం ప్రత్యక్షమైంది.

జాతివైరం ఉన్న పిల్లికుక్కల్లా ఎపుడూ కాట్లాడుకునే సిఎం, అప్పోజిషన్ లీడర్ ఒకే ఫ్రేం లో చిర్నవ్వులు చిలికిస్తూ కెమెరాకి ఫోజులిస్తున్నారు. 'రాజకీయభేదాలు మరిచి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్ర ప్రగతి సుసాధ్యమం'టూ ఒకరి చేతిలో ఇంకొకరు చేయివేస్తూ మరీ ఉపన్యాసాన్ని దంచేస్తున్నారు.

"అసలేమైందీ రాష్ట్రానికి. చానెల్స్ లో పొలిటికల్ పార్టీల అఫిషియల్ స్పోక్స్ పర్సన్స్ కొట్టుకోవడం లేదు. ట్రాఫిక్ పంజరాల్లో చిక్కుకోకుండా సిటీబస్ లు రాజహంసల్లా వయ్యారాలొలుకుతూ వెళ్తున్నాయి. కరెంట్ కటకట లేదు. టైంకి టంచన్ గా నల్లానీళ్ళొస్తున్నాయి. ఇక, రోజూ ఎదురుపడితే కొట్టుకునే సిఎం అప్పోజిషన్ లీడర్లు చెట్టాపట్టాలేసుకుంటూ అసెంబ్లీని సైతం సజావుగా నడిపించాలని ప్రతిన పూనుతున్నారు. అన్ని పార్టీలవాళ్ళు అన్నదమ్ముల్లా కలిసిపోతే న్యూస్ చానెల్స్ లో ఎంటర్టైన్మెంట్ ఇంకేముంటుంది? ఎక్కడ సమస్యల సంక్షోభంలో చిక్కుకుని జనాలు విలవిలలాడుతారో...? ఎక్కడ వానరాకడ, కరెంట్ పోకడ చెప్పలేని పరిస్థితి నెలకొంటుందో? ఎక్కడ గొంతెండుతున్నా గుక్కెడు నీళ్ళు దొరకని స్థితి దాపురిస్తుందో...? ఆ దేశం... ఆ రాష్ట్రం నాదీ అని చెప్పుకునే సామాన్యుల్లో సామాన్యుడిని నేను.

చానెల్స్ లోని స్టూడియోల్లో కూచున్నవాళ్ళు తలబోప్పికట్టేట్టు తిట్టుకోవాలి. అడపాదడపా కొట్టుకోవాలి. అసెంబ్లీలో కూడా ఆ ఆనవాయితీ మారడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. అధికారపక్షం, విపక్షం ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేయాలి. అపుడే కదా... ఏ నిముషాన ఏం జరుగుతుందో తెలీని ఉత్కంఠతో వ్యూవర్స్ చానెల్స్ టీఆర్పీ రేట్ ని పెంచేస్తారు. అర్ధరాత్రివేళల్లో మాంచి రొమాంటిక్ మూడ్ లో కొత్త దంపతులున్నపుడే నల్లా నీళ్ళు రావాలి. కరెంట్ కోత యధాతధంగా ఉండాలి. నిముషనిముషానికి బిపి పెరిగినట్లు కూరగాయల రేట్లు పెరుగుతుండాల్సిందే..." అనుకున్నాడు శ్రీపతి.

"ఔను... కూరగాయల రేట్లు పెరగాల్సిందే... పెరగాల్సిందే... పెరగాల్సిందే" గట్టిగా అరుస్తున్నాడు శ్రీపతి.

అర్ధరాత్రివేళ మొగుడు అరుపులకి ఒక్కసారిగా హడలిపోయి లేచింది శ్రీపతి భార్య ఎ.ఎం.ఎం. తాయారు అలియాస్ అలిమేలు మంగతాయారు.

"ఏమైందండీ మీకు?" అడిగింది బిక్కచచ్చిపోతూ.

"కల వచ్చిందే?"

"ఏదైనా పీడకలేమో?"

"ఔను పీడకలే. భయంతో హడలిచచ్చాననుకో. అమ్మో... ఇపుడు తలచుకుంటున్న కొద్దీ భయమేస్తోంది" కల చెప్పబోతున్నాడు శ్రీపతి.

"వద్దండి. ఎంత తాళికట్టిన భార్యనైనా పాడు కలలు కూడా పంచుకోవాలా? ఆ పాపమంతా మీదే. మంచి కలలేమైనా వచ్చాయనుకోండి. విని తరిస్తా. ఆ పుణ్యం నాది" ఆదిలోనే అటకాయించింది అలిమేలు మంగతాయారు.

"వాల్మీకిగా మారకముందు ఓ బోయవాడికి అతడి భార్య కూడా సరిగ్గా ఇలాగే చెప్పి ఉంటుందేమో?" అంతరాత్రివేళ నిద్రకళ్ళతో అనుకున్నాడు శ్రీపతి. ఆ తర్వాత మనసు కుదుటపరుచుకుంటూ... 'ఈ రాత్రి వచ్చిన ఈ కల నా డైరీలో లేని ఓ పేజీలాంటిది. మళ్ళీ తెల్లారితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో సమస్యలు యధాతధం. వాటితో జనాలు సతమతమవడం 'షరామామూలే'. ఇంక నాకెందుకు భయం?" అలా అనుకున్న మరుక్షణమే అతడి కన్రెప్పల్ని నిద్ర కాటేసింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు