బాగన్న జోగన్న చిన్ననాటినుండి స్నేహితులు,
ఇద్దరు ఎంత స్నేహితులంటే...... ఒకమంచంలో తిని ఒక కంచంలో పడుకునేంత ....ఛీ ... ఛీ ........ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేంత దగ్గరి స్నేహితులన్నమాట.
ఇద్దరి ఆదర్శాలు ఒక్కటే! నాస్తికత్వం. దేవుడు లేడు దయ్యము లేదని ఇద్దరు గంటలగ్గంటలు ఆ దేవున్ని తిడుతూ మాట్లాడుకోడమే వారి పని.
అలాంటి స్నేహితులు చాలా రోజులుగా దూరమయ్యారు. కోపంతొనో మనస్పర్థల తోనో కాదండోయ్ ....
జోగన్నకు ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం వచ్చింది మరి.... వెళ్ళక తప్పని పరిస్థితి... వెళ్ళాడు.
చాలారోజుల తర్వాత ....... ఆరోజే జోగన్న బాగన్నను చూడ్డానికొచ్చాడు. బాగన్నకు చిన్న నాటి ప్రాణమిత్రున్ని చూడగానే సంతొషమేసింది.
లోకాభిరామం మాటాడుతూ కూర్చున్నారు ఇద్దరు. ఉన్నట్టుండి జోగన్న బాగన్నను.
"ఒరా బాగులూ! నువ్వు దేవున్ని నమ్ముతున్నావా?" అని అడిగాడు,
అలా అడుగుతున్న మిత్రున్ని ఆశ్చర్యంగా చూసి నమ్మనన్నట్లు తలనడ్డంగా వూపుతూ
"అదేం అలాఅడుగుతున్నావ్ , నేను మొదటినుంచి కూడా నమ్మనుకదరా....నీకూ తెలుసుగా! " అన్నాడు.
వెంటనే జోగన్న " హమ్మయ్య ఐతే నువ్ మారలేదన్న మాట నీదగ్గర గడపొచ్చన్నమాట " అంటుంటే మరింత ఆశ్చర్యంతొ బాగన్న
"నువ్వు కూడా నమ్మవుగా! మరిరోజు ఇలా అడగడమెందుకు?" అన్నాడు ఆశ్చర్యంగా...
"నేను నా నమ్మకాన్ని మార్చుకున్నాలే!" అన్నాడు జోగన్న
" ఆహా! ఎప్పటినుండేమిటి?" బాగన్న వ్యంగ్యం
"దయ్యాలున్నాయని నమ్మకం ప్రారంభమైనప్పటినుండి " చెప్పాడు జోగన్న.
" అలాగా! దయ్యాలనెప్పటి నుండి నమ్ముతున్నావేంటి?" అడిగాడు
"ఆర్నెల్ల క్రితం యుపిలో ఓ పేద్ద రైలు ప్రమాదం జరిగింది చూడు ఆరోజు నుండి" జోగుచెప్పగానే "హహహహహ! ఇవే మూడనమ్మకాలు రైలు ప్రమాదానికి దయ్యాలకేంటీ సమ్మందం ఇలా చెడిపోయావేంటి? నువ్వు" అన్నాడు బాగన్న మాటల్లో హేళన.
" ఔను! ఆరైలు ప్రమాదంలో చనిపోయిన నాలుగు వందలమంది ప్రయాణీకులలో నేనూ ఒక్కడినికదా! అందుకే ఆరోజునుండి దయ్యాలున్నాయని నమ్ముతున్నా" నంటూ చెప్పి
అంతలోనే మాయమైపోయాడు.
అంతే బాగన్న శరీరం చమటలతో తడిసి ముద్దైంది.