పరుగు పందెం - - పి.బి.రాజు

parugupamdem

ఎంతైనా మగాడు మగాడేగా!

ఎంత ప్రేమించిన దాన్నైనా ఒక మెట్టు కిందికి తొక్కేయడం మామూలేగా!

కొత్తేం కాదు...యుగ యుగాలుగా జరుగుతున్నదిదే!

ప్రేమించేదాకా తియ్యటి కబుర్లెన్నో ... అసలు జీవితాన్నే పాదాక్రాంతం చేసేసేట్లు ...తీరా పెళ్ళయాకేగా అసలు రూపం బయటపడేది. ప్రియురాలుగా ఉన్నంతవరకూ ఆకాశమే హద్దు. పెళ్ళామయితే ఎన్నో హద్దులు... మరెన్నో ఆంక్షలు.

అవును. మహర్షి కూడా ఒక మగాడేగా!

కాకపోతే ...ఏమన్నాడూ... ఉదయం?

అతను పూర్తిగా మారిపోయాడు. పెళ్ళయినప్పట్నుంచీ... నాకు ప్రమోషన్ వచ్చినప్పట్నుంచి మరీనూ...

అంటే మహర్షి నా ఎదుగుదల భరించలేకపోతున్నాడా?

"శశీ! నీ కళ్ళలోకి చూస్తూ ఇలానే ఉండిపోవాలనుంది ఎన్ని యుగాలయినా..." అన్నప్పుడు ఎంత మురిసిపోయాను.

నా అపాయింట్ మెంట్ ఆర్డర్ చూసి ఆనందంగా నన్నెత్తుకుని గాల్లో తిప్పేసినప్పుడు ఎంత ఉబ్బితబ్బిబ్బయ్యాను.

అర్ధరాత్రి దాకా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుంటే పక్కన కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పే వాడు...టీ లు సరఫరా చేసేవాడు నాతో పాటు మేల్కొనే. నిద్ర మత్తులో వాలిపోతున్న నా కనురెప్పలపై సున్నితంగా ముద్దుపెట్టుకొని "ఇక పడుకో శశీ! ఆరోగ్యం దెబ్బతింటుంది" అని ఎంతగా లాలించేవాడు.

నా ప్రమోషన్ కు పరోక్షంగా ఎంత సాయపడ్డాడు.

ప్రమోషన్ వచ్చిన రోజు స్వీట్లు పంచి నా కంటే ఎక్కువగా ఆనందించినవాడు -

అయితే ... ఇప్పుడేమయింది?

ఇప్పుడాలోచిస్తే - అవును అదంతా అతనిలోని ఒక పార్స్వం మాత్రమే.

మరో పార్స్వం ఇపుడిపుడే అర్ధమవుతోంది. మగవాడి అసలు రంగు బయట పడుతోంది.

ప్రిగ్నెన్సీ కంఫర్మయినట్లు చెప్పీ చెప్పగానే - ఎత్తుకొని గిరగిరా తిప్పేసి ఎంత ముద్దుల వర్షం కురిపించాడనీ -

ఎంత సంబరపడ్డాడనీ-

మాటలకందని ఆనందంతో ఆ కళ్ళల్లోని మెరుపు చూసి ఎంత తబ్బిబ్బయ్యాననీ -

ఎన్ని జాగ్రత్తలు చెప్పాడనీ -

అలా చెపుతూనే - మెల్లగా - మెత్తగా

చావు కబురు ... అవును నిజంగానే చావు కబురు లాంటిదే -

కాకపోతే...?

"శశీ! ఇక మీదట ఇంటిపన్లన్నీ మానేసి ... ఉద్యోగం కూడా మానేసి ...హాయిగా రెస్ట్ తీసుకో"

"ఏమంటున్నావు? మహర్షీ! ఉద్యోగం మానేయలా...?" ఉలిక్కిపడి అశ్చర్యంగా అడిగాను.

“అదికాదు …శశీ!"

" ఆర్నెలలు మెటర్నిటి లీవుంది. నాకు మరో మూడు నెలలు లీవులున్నాయి. అవసరమయితే వాటినీ వాడుకుందాం. అంత మాత్రానికి ఉద్యోగం మానేయడం దేనికి?"

"శశీ! మనకు కావలసినంత ఉంది. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. హాయిగా రెస్ట్ తీసుకుని పండంటి బిడ్డను కను. వాడితో నీకు బోలెడంత కాలక్షేపం ..."

"ఉద్యోగంలో నాకు మంచి కాలక్షేపమే జరుగుతోంది. ఒక ఆయాను వుంచుకుంటే వాడి బాగోగులు చూసుకుంటుంది. అయిదారు వేలు పడేస్తే ఆయాలు దొరుకుతారు. దాని కోసం బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు."

"మన బిడ్డను ఎవరి చేతుల్లోనో పెడ్తే; వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో ...లేదో; మనమయితే జాగ్రత్తగా చూసుకోవచ్చు. వాడి ఎదుగుదలను కళ్ళారా చూసి ముచ్చట పడొచ్చు. ఆనందించొచ్చు. ఆ అనుభవాన్ని పదిలంగా పది కాలాల పాటు దాచుకోవచ్చు."

" నీవెన్నైనా చెప్పు..

.""నాకు తెలిసిన వారబ్బాయి ...."

"ఆపుతావా? మహర్షీ! నీవు కూడా ఒక సగటు మగాడిగా ఆలోచిస్తున్నావు. నీ భార్య ఎదుగుదల సహించలేక పోతున్నావు. అంతేనా నీ సంస్కారం?" నాలో ఆవేశం కట్టలు త్రెంచుకుంది.

"అంతేనా! నన్నర్ధం చేసుకుంది. శశీ!" దెబ్బతిన్న పులిలా చూశాడు. ఏమనుకున్నాడో ఏమో విసురుగా బయటికెళ్ళిపోయాడు.

అయినా - "ఏమాలోచించావు శశీ!" అని అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే వున్నాడు.

మహర్షీ! నువ్వేం వర్రీ కాకు. అంతా నేను చూసుకుంటాను." అని చెప్తూనే వున్నాను.

అయినా మహర్షి మాటి మాటికీ అలా అడగడం నాకు నచ్చడం లేదు. అతనిలోని పురుషాధిఖ్యతను నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ ఉదయం పెద్ద గొడవే జరిగింది. మాటా మాటా పెరిగి నేను గట్టిగానే సమాధానం చెప్పాను.

"ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను అబార్షన్ చేయించుకుంటాను." అని బెదిరించాను.

బిత్తరపోయాడు మహర్షి.

"అలాగే శశీ! నీ ఇష్టం. ఇకమీదట నేనేమీ మాట్లాడను. నీకెలా తోస్తే అలాగే చెయి." మారు మాట్లడకుండా ఆఫీస్ కెళ్ళిపోయాడు.

మహర్షి ఎందుకింత పట్టుబడుతున్నాడో నాకర్థం కావడం లేదు. మాది లవ్ మ్యారేజి. పట్టింపులతో పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే వారి వాళ్ళు కొద్ది మెత్తబడ్డా; మా వాళ్ళు ఇంకా గుర్రుగానే ఉన్నారు. అయినా ఆలోటే నాకు తెలియకుండా చాలా చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు. పెళ్ళైన ఈ మూడేళ్ళలో ఏనాడూ నా మాటకు ఎదురు చెప్పలేదు. కానీ - ఈ విషయంలో మాత్రం ఎందుకింత పట్టుబడుతున్నాడో అర్థం కావడం లేదు.

"ఏమిటే! అలా ఉన్నావు?" నా క్లోజ్ కొలీగ్ విమల అడిగింది.

చూచాయగా ఈ విషయం చెప్పి సలహా అడిగాను.

'దాన్నే మగబుద్ధి అంటారే? ఏ మగాడూ పెళ్ళాం తనకంటే ఎదిగిపోవడం సహించలేడు. ప్రతి మగాడు అంతే. ఇంటింటి కధే ఇది." అంది విమల తేలిగ్గా.

అంటే మహర్షి కూడా ఆ "ప్రతి" మగాడిలాగే అలోచిస్తున్నాడా? ఇంత వరకు మహర్షి "ప్రత్యేకం" అనుకున్నాను. అతను కూడా మామూలు మగాడు అనుకోవడానికి నాకెందుకో మనస్కరించడం లేదు. మనస్సంతా అదోలా ఉంది. నేను ప్రత్యేకం అనుకున్న మహర్షి “ సాధారణ మగాడు “ అనుకోవడానికి నా మనసొప్పుకోవడం లేదు.

ఆలోచిస్తూనే బస్ స్టాప్ చేరాను.

"ఏమిటే శశీ! ఎంత పిల్చినా పలుకవూ?" అంటూ నా భుజం పై చేయి పడేసరికి స్పృహలోకి వచ్చాను.

ఎదురుగా నా బెస్ట్ ఫ్రెండ్ శోభ.

తేరుకొని "ఏమిటే! ఇక్కడా...ఇంత సడెన్ గా!" అన్నాను.

"మా అక్క కొడుకు వుండేది ఇక్కడే."

"అవునా?" ఆశ్చర్యంగా అడిగాను. శోభను చూడగానే అనందంగా ఉంది. ఉదయం నుంచి వున్న బాధంతా పోయినట్లయి మనసంతా హుషారుగా ఉంది.

'పద ఇంటికి పోదాం" అన్నాను.

"లేదే. ఇప్పుడు అర్జెంట్ గా వాణ్ణి చూడాలి." అంది విషాదంగా.

"నువ్వూ రా! చూసొద్దాం?" అంటూ ఆటోను కేకేసింది.

ఆటో " రిహబిలిటేషన్ హౌజ్ఫ ర్ మెంటలీ రిటార్టెడ్ " ముందాగింది.

దిగి వడివడిగా లోనికెళ్ళింది శోభ. అయోమయంగా నేనూ అనుసరించాను.

లోన ఎంతో మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అందర్నీ దాటుకుంటూ ఒక గదిలోకి అడుగుపెట్టింది.

"ఎలా ఉన్నావు బాబీ" అంటూ మంచం పైనున్న అబ్బాయిని పలకరించింది.

ఆ అబ్బాయి ముఖం విప్పారింది శోభను చూడగానే.

"ఆ… ఊ… ఏ…" అని సైగలేవో చేశాడు.

"దా! ఆడుకుందాం.." అని లేవదీసి భుజం పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ వెలుపలకొచ్చింది.

వాడికి పద్దెనిమిదేళ్ళుంటాయి. సరిగ్గా నడవలేకపోతున్నాడు. మాట్లాడలేక పోతున్నాడు.

కాళ్ళు;చేతులు ఒక పట్టానా ఉండడం లేదు. వున్నట్టుండి అరుపులు; పెడబొబ్బలు అంతలోనే ఏడుపులు. మానసికంగా ఎదగని పిల్లాడని నాకర్థమయింది.

చేతికి బంతినిచ్చి మెల్ల మెల్లగా ఆడిస్తోంది. పక్కన పిల్లల్ని చూసి వాడు ఆడుతున్నాడు. అక్కడున్న పిల్లలంతా మానసికంగా ఎదగని పిల్లలే. వివిధ వయస్సుల్లో వున్న పిల్లల్ని వారి వారి తల్లో; తండ్రో; బంధువులో ఆడిస్తున్నారు. నా కంతా వింత వింతగా వుంది. మరో ప్రపంచంలో ఎక్కడో అడుగు పెట్టినట్లుంది. ఆడిస్తున్న కొందరి తల్లి;తండ్రుల కళ్ళల్లో ఇంకిపోతున్న నీళ్ళు నన్ను కదిలించి వేశాయి. వాళ్ళ ముఖాల్లో పెను విషాదం. అంతులేని దిగులు. పదహారు ...పద్దెనిమిదేళ్ళు దాటినా ఇంకా మూడు...నాలుగేళ్ళ పిల్లల్లాగా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకే కన్నీళ్ళాగలేదు. ఇంక వారి తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో ఊహించుకోగలను.

ఒకరిద్దరి తల్లిదండ్రులతో మాట్లాడగలిగాను. వారి పిల్లలపైన పూర్తిగా ఆశలు వదులుకున్నట్లుంది. పూర్తిగా నయం కావడం కష్టమేనట. కానీ ఆశ చావక ఇక్కడ చేర్పించి దేవునిపైన భారం వేసి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారట. చిన్నప్పుడు పిల్లల పట్ల తగినంత కేర్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతాయట. ఎదిగే వయస్సులో పిల్లల పట్ల తగిన శ్రద్ద చూపకపోవడమే మూలకారణమని డాక్టర్స్ చెప్పారట. "అంతా అయిపోయాక ఇప్పుడని ఏమి ప్రయోజనం?" అని వాపోయారు. వాళ్ళ కడుపుకోత వర్ణానాతీతం.

"పాపం! చిన్న చిన్న పిల్లలకి ఎంత బాధ వచ్చింది. జీవితాంతం ఇలా బ్రతకడం ఎంత దౌర్భాగ్యం? ఏం పాపం చేశారని వీరికీ శిక్ష? కన్నవారికి ఎంత కడుపు కోత? జీవితాంతం ఎంతటి క్షోభ? ఎంతటి నరకం? పగవారికైనా ఇంతటి శిక్షలొద్దు దేవుడా?" నా ఆలోచనలు పరి పరి విధాలుగా పోతున్నాయి.

ఇంతలో తను తెచ్చిన పళ్ళు; స్వీట్స్ తినిపించి బాబీ ని గదిలో వదిలి వచ్చి నా ప్రక్కన కూర్చుంది శోభ.

"ఏమాలోచిస్తున్నావే?" అంటూ.

"ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. నాకే ఇంత బాధగా ఉంటే పాపం వాళ్ళని కన్నవాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో?" అన్నాన్నేను.

"అందులో మన స్వయం కృతాపరాధం కూడా ఉంది శశీ!"

"స్వయంకృపరాధమా...అంటే?"

"అంటే ... మా అక్క; బావల్నే తీసుకో! "

వాళ్ళకేమయింది?"

"కూర్చుని తిన్నా రెండు మూడు తరాలకి సరిపడా ఆస్థి ఉంది. అయినా ఇంకా ఇంకా సంపాయించాలనే కక్కుర్తి. ధ్యాసంతా సంపాదన పైన్నే. వాడు పుట్టినప్పుడు కూడా రెస్ట్ లేదు. లీవు లేదు. నెలల బిడ్డను అయా చేతిలో పెట్టి సంపాదన కోసం పరుగో పరుగు. వాడెలా పెరుగుతున్నాడో...ఆయా వాడీని ఎలా చూసుకుంటుందో...సరిగ్గా సమయానికి అన్నీ ఇస్తుందో లేదో ...తెలుసుకునే తీరిక లేదు. వచ్చిన సమయానికి నిద్ర పోతున్నాడా? తమకెలాంటి ఇబ్బంది పెట్టడం లేదు కదా? కావల్సినప్పుడు డబ్బులిస్తే అంతా ఆయా చూసుకుంటుంది. తమకి అంతే చాలు. తాము.. తమ సంపాదన ...కేరిర్; ప్రాజెక్ట్స్; టార్గెట్స్, డెడ్ లైన్స్, అచీవ్ మెంట్స్, ప్రమోషన్స్; ఇంక్రిమెంట్స్ …. జీవితమంతా పరుగో పరుగు. ఒకరికి మించి మరొకరు పరుగు. లేచింది మొదలు అర్థరాత్రి దాకా పరుగు ఆపకుండా. ఎక్కడ వెనక పడుతామో అని పరుగు. కొంచెం ఊపిరి తీసుకోవడానికి కూడా తీరిక లేని పరుగు. ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెట్టి పరుగు. ఆ పరుగు పందెంలో మనమేం పోగొట్టుకుంటున్నామో ఆలోచించడానికి కూడా తీరిక లేని పరుగు.

నిజమే! సంపాదన పొగేసుకుంటున్నాం. ఫ్లాట్లు, అపార్ట్ మెంట్లు,షేర్లు,బంగారం అన్నీ ... అన్నీ కొనేస్తున్నాం. అవసరానికి మించి సంపాదిస్తున్నాం. నీకిన్ని కోట్లుంటే; నాకిన్ని కోట్లు. నలుగురు కలిసి నప్పుడు కూడా కోట్ల గొప్పలు; ప్రమోషన్ గొప్పలు, జీతం గొప్పలు తప్ప మన నోట్లో మరో మాట రాదు. అంతా అయ్యాక ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ... మనమేం సాధించామో నిజాయితీగా బేరీజు వేసుకుంటే తెలుస్తుంది మనమేం పోగొట్టుకున్నామో?

కనీసం చిన్న చిన్న కోరికలు కూడా తనివితీరా తీర్చుకోలేని దౌర్భార్గ్యం మనది. పిల్లలతో కలసి గడిపిన క్షణాలు; కలిసి భోంచేసిన క్షణాలు; చేయి పట్టి నడిపించిన క్షణాలు; కధలు చెప్పిన క్షణాలు; వారికి ఆసరాగా నిలిచిన క్షణాలు; వారికి భరోసా ఇచ్చిన క్షణాలు గుర్తుకు రావు. అసలుంటేగా గుర్తుకు రావడానికి. డబ్బుకు కొదవలేకుండా పెంచాం. అడిగింది అడిగినట్లు కొనడానికి డబ్బులిచ్చాం. చూసుకోవడానికి ఆయాను పెట్టాం. . . తల్లిదండ్రులుగా ఇంకేం చేయాలి? ఇదీ మన వరస. గొప్పగా పెంచామనీ; కాస్ట్ లీ చదువులు చెప్పించామనీ గొప్పలు." ఆవేశంతో చెప్పుకుపోతోంది శోభ.

“మా అక్కా;బావలు కూడా ఈ పరుగు పందెంలో బ్యాంక్ బ్యాలన్స్ పెరగడం; ఆస్తులు పెరగడం, జీతాలు పెరగడం; ఉద్యోగాల్లో హోదాలు పెరగడం చూసుకున్నారే తప్ప పిల్లాడు ఎలా పెరుగుతున్నాడో చూసుకోలేకపోయారు. కొదువలేకుండా డబ్బులిచ్చినా ఆయా వాణ్ణి సరిగ్గా చూసుకోలేదు. వీళ్ళు ఇలా ఆఫీస్ కు పోతూనే పసివాడని కూడా చూడకుండా మంచం కోడుకు వాడి కాళ్ళు కట్టేసి ఆడుకోవడానికి వాడి ముందు బొమ్మలు నాలుగు పడేసి; ఆమె తన సంపాదన కోసం అలా పనికెళ్ళేది. ఎప్పుడో తీరిక దొరికినప్పుడు వచ్చి వాడిని చూసుకొనేది. సాయంత్రానికి వీరు తిరిగి వచ్చేసరికి అంతా సవ్యంగా వుండేది. సంపాదన ధ్యాసలో దానికీ నాటకాలాడాడం వచ్చేసింది. చీకటి గదిలో ఒంటరిగా ఆ నోరులేని చిన్నారి బాధ ఎవరికీ పట్టలేదు. చివరికి మెదడు ఎదగక ఇలా దైన్య స్థితిలోకి నెట్టబడ్డాడు. మేలుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు మా అక్కా;బావలకు కోట్లున్నాయి. కానీ అనుభవించాల్సిన వారసుడు ఇలా ఉన్నాడు. మా అక్క కుమిలిపోతోంది. తనను తాను తిట్టుకోని క్షణం లేదు. కానీ ఏం లాభం? తప్పును సరిదిద్దుకోవడానికి గడిచిన కాలం తిరిగి రాదుగా! అన్యాయంగా పసివాడు బలయి పోయాడు. " వెక్కి వెక్కి ఏడుస్తోంది శోభ.

“సంపద కన్నా మంచి పౌరుణ్ణి సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ఉంది. మన మెంతైనా సంపాదించొచ్చు. సంపదనెంతైనా కూడ బెట్టొచ్చు. కానీ ఆ యావలో పిల్లల్ని; వారి బాల్యాన్ని బలి చేయడం భావ్యం కాదు. ఆరోగ్యవంతమయిన ఉత్తమ పౌరుడే నవ సమాజానికి అవసరం. కరెన్సీ సంపద కన్నా ఆరోగ్యమయిన మానవ సంపదను ముందు తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి ఉంది. వారే నిజమైన దేశ సంపద. “ ఆవేశంతో వూగిపోతోంది శోభ.

ఆమె చెబ్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాగా మారి నా అఙ్ఞాన తిమిర పొరల్ని చేదిస్తూ కర్తవ్య బోధ చేస్తున్నాయి. నా కళ్ళు అప్రయత్నంగా వర్షించడం మొదలెట్టాయి.

అవును. ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకొని ఎవరికోసం సంపాదిస్తాం? ఆ పిల్లలే ఆరోగ్యంగా లేనప్పుడు ఈ పోగే సిన లక్షలు లక్షలు ఎవరి కోసం?

మహర్షి గుర్తుకొచ్చాడు. నా మూర్ఖత్వంతో అతనేం చెప్తున్నాడో కూడా వినిపించుకోలేదు. నా పిడివాదం నాది. "ఆధిఖ్యత" అని నోరు మూయించేశాను.

“బార్యాభర్తలు సంసారంలో కుటుంబపరమయిన విషయాలు తమకు అనుకూలంగా సౌఖర్యంగా తీసుకోవాలేకానీ; ప్రక్కవాడితో పోటీ పడరాదు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారని; మనమూ చేయాలనుకోవడం...వారు కొంటున్నారని; మనమూ కొనేయడం...వాళ్ళు చేస్తున్నారని; మనమూ చేసేయడం...వారు పరుగెత్తుతున్నారని; మనమూ పరుగెత్తడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లవుద్ది. మన అవసరానికి; మన కుటుంబపరంగా ఏది మంచిదో ...ఏది మనకనుకూలమో బార్యాభర్తలు కాసేపు "ఇగో"లు ప్రక్కన పెట్టి కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే ఇల్లే స్వర్గమవుతుంది. ఏ రెండు కుటుంబాల పరిస్థితులు ఒకేలా ఉండవు. అలాగే పరిష్కారాలు ఒకేలా ఉండవు. ఎవరికి వారే తమ కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం “- ఎంత గొప్పగా చెప్పింది.

ఇంటికెలా వచ్చానో తెలియదు. "ఏమయింది శశీ!" కంగారు పడ్తున్న మహర్షి గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడ్చాను తనివి తీరా.

కుదుటపడ్డ తర్వాత రిజిగ్నేషన్ లెటర్ రాసి సైన్ చేసి "ఇది మా ఆఫీస్ లో ఇచ్చేయండి" అన్నాను నిశ్చలంగా అయోమయంగా చూస్తున్న మహర్షి కేసి చూస్తూ. *

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు