దృశ్యం - ప్రజ్ఞ.వి.

drushyam

“ఏంట్రా ఈ సారి కూడా ఉద్యోగం రాలేదా?” ఇంటికొచ్చిన కొడుకుని గుమ్మం దగ్గరే అడిగేసాడు రవీంద్ర.

లేదు అన్నట్లుగా తల ఊపి ఇంట్లోకి మెల్లిగా అడుగుపెట్టాడు అశ్విన్.

“ఎందుకురా మనకి ఈ చదువులు అంటే విన్నావు కాదు. నేను చెప్పినట్లు బుద్ధిగా ఇంటి పట్టనుండుంటే బాగుండేది. మీ అమ్మ నిన్ను మరీ గారం చేసేసింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇవాళ పేపర్ లో కూడా మాట్రిమొని కాలమ్ లో మంచి సంబంధాలు పడ్డాయి. ఒక రెండు రోజులు టైం తీసుకొని, నచ్చినవి ఏంటో మాకు చెప్పు” అని రవీంద్ర కొడుకుతో చెప్పేసి, వంటింటిలోకి వెళ్లిపోయాడు.

అశ్విన్ తనకి తగ్గ మాచస్ పెన్నుతో మార్కు చేస్తూండగా తన తల్లి ఇంటికి రావటం చూసి దగ్గరికెళ్ళాడు.

“అమ్మా, ఇవాళ ఇంటర్వ్యూ ఈజీ గానే ఉంది. కాని ఆ కంపెనీ లో ఎక్కువ ఆడవారే ఉంటారుట. ముక్కోపులు అసలే. నేను ఒక చిన్న తప్పు చేసినా కూడా నాకు ‘దృశ్యం ’ చూపించేస్తారు. అందుకే భయం వేసింది, జాబ్ వదిలేసుకున్నాను” అని అశ్విన్ ఎంతో బాధతో అమ్మతో చెప్పాడు.

“తప్పదురా. ఎంత కూతుళ్ళలా పెంచినా కూడా తరతరాలుగా నీ లాంటి యువకుల మనస్సులో కలుగుతున్న భయాన్ని పోగోట్టలేకపోతున్నారు చాలా మంది పేరెంట్స్. ఇది 2090. ఒకప్పుడు అంటే 2014 ఆ టైం లో నీ లాంటి అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు భయపడి పోయేవారుట. నమ్మసఖ్యంగా లేదు కదా? నాక్కూడా అలాగే నమ్మబుద్ధి అవ్వడం లేదు. కాని ఇంటర్నెట్ లోనూ, ‘దృశ్యం ’ లోనూ, పాత సినిమాలలోనూ చూపించే సందర్భాలు, సన్నివేశాల బట్టి నమ్మాల్సి వస్తుంది. సరేలే నాకొక గ్లాస్ నీళ్ళు తీస్కొని రా, అలాగే డాడీని గ్రీన్ టీ ఇమ్మను. ఇవాళ మా బాస్ నన్ను వాయించేసింది మీటింగులో…హబ్బా..... తల నొప్పి బాగా” అంటూ తల మీద చెయ్యి పెట్టి, కళ్ళు మూసుకుంది ఛాయ.

ఐదు నిముషాలలో రవీంద్ర టీ, శాండ్విచ్ తీసుకొచ్చి ఛాయ ఎదురుకుండా పెట్టాడు. పాపం ఛాయ నెలంతా కష్టపడి సంపాదిస్తూ, భర్తాపిల్లలతో ఏ లోటు లేకుండా సుఖంగా, సంతోషంగా జీవితం సాగిస్తోంది. రవీంద్రకి భార్య అంటే అమితమయిన ప్రేమ, అంతకంటే ఎక్కువ గౌరవము. మంచి సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన రవీంద్రకి, సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అందుకే ‘దృశ్యం’ని తన జీవితంలో ఎన్నడూ చూడలేదు, చూడాల్సిన అవసరం రాలేదు. కాని దాని గురించి విన్న దాని ప్రకారం, అది నరకం లో విధించే శిక్షల కంటే దారుణం అట. ఒక్కగానొక్క కొడుకు అయిన అశ్విన్ ఎక్కడ జీవితంలో ‘దృశ్యం’ చూడాల్సి వస్తుందో అని రవీంద్ర భయం. అశ్విన్ కి వచ్చిన ఎన్నో సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. కారణం ఏదైనా కూడా ఎదిగిన పిల్లాడికి పెళ్లి కుదరట్లేదు అంటే ఏ తండ్రికి అయినా బాధగానే ఉంటుంది మరి. అదే ఆడపిల్ల పుట్టి ఉంటే ఈ పాటికి ఛాయ ఏ బాధ్యతలు లేకుండా ఉద్యోగం మానేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, కూతురి సంపాదనని ఎంజాయ్ చేస్తూ ఉండేది. అలాగే కూతురికి పెళ్లి చేసేసి ఉంటే ఒక అల్లుడు కూడా తనకి ఇంటి పనులలో సాయం ఉండేవాడు- ఇలాంటి ఆలోచనల నుండి నెమ్మదిగా బయటపడి రవీంద్ర గట్టిగా నిట్టూర్చాడు.

రెండు రోజులు గడిచాయి. కొడుకు దగ్గరికొచ్చి “ఏరా ఏదైనా మాచ్ నచ్చిందా? అమ్మతో చెప్పి వాళ్ళతో మాట్లాడిద్దామా?” అని రవీంద్ర అడిగాడు.

“ఒకటే ఒకటి నచ్చింది డాడీ. ఆ అమ్మాయి ప్రొఫైల్ ఫేస్ బుక్ లో కూడా చూసాను. అందంగా ఉంది. పెద్ద కంపెనీ లో డైరెక్టర్ పోసిషన్ లో ఉంది. సో తను బ్రాడ్ మైండెడ్ అయ్యుండి, నేను జాబ్ చేసే లిబర్టీ ఉంటుంది అని నా ఫీలింగ్” అని అశ్విన్ చెప్పేసరికి రవీంద్రకి సంతోషమేసింది. ఆ రోజు సాయంకాలమే ఛాయ, ఆ అమ్మాయి తల్లితో మాట్లాడింది. వచ్చే ఆదివారం సాంప్రదాయం ప్రకారం పిల్లాడిని చూడటానికి తమ ఇంటికి వస్తాము అని ఛాయతో చెప్పారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ సంబంధం అయినా కుదిరితే బాగుండు అని రవీంద్ర దేవతలని మొక్కుకున్నాడు.

“ముందు పిల్లలకి నచ్చాకే మనం ఇంకేమైనా మాట్లాడుకుందాము. మీరేమంటారు ఛాయ?” పెళ్లి కూతురి తల్లి అన్నారు.

“నాది కూడా అదే అభిప్రాయం. ఎమ్మా శ్రద్ధా, అశ్విన్ .. టెర్రేస్ కి వెళ్లి మాట్లాడుకోండి” అని ఛాయ అనటంతో వాళ్ళిద్దరూ మేడ మీదకి వెళ్లారు.

“సో మీ హాబీస్ ఏంటి?” శ్రద్ధ అడిగింది.

“మా ఇంట్లో నన్ను అమ్మాయిలా పెంచారండి. సో నాకు వంట, కుట్లు, అల్లికలు లాంటి టిపికల్ మగవాళ్ళ ఇంట్రెస్ట్ లు లేవు. ఐ లైక్ ట్రావెలింగ్” అని సూటిగా అశ్విన్ చెప్పాడు.

“గుడ్. నాక్కూడా అలాగ ఉండే వాళ్ళే ఇష్టం. కాని పెళ్లి అయ్యాక వంట చేస్తారుగా? హ హ..” అంటూ శ్రద్ధ నవ్వేసింది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు అర్ధంచేసుకోటానికి ఇద్దరూ ప్రయత్నించారు.

“మీరు నాకు నచ్చారు” శ్రద్ధ డైరెక్ట్ గా చెప్పేసింది.

‘శ్రద్ధ మంచి దానిలాగే ఉంది. పెళ్లి అయ్యాక నాకు ఉద్యోగం చేయాలని ఉంది అని చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం’ అని మనసులో అనుకోని గట్టిగా ఊపిరి పీల్చుకొని అశ్విన్ మాట్లాడసాగాడు, “నాకు కూడా మీరు బాగా నచ్చారు. నేను మీకొక ముఖ్యమయిన విషయం చెప్పాలి. నాకు పెళ్లి తరువాత జాబ్ చేయాలని ఉంది. ఇప్పుడు ఉద్యోగ వేటలో ఉన్నాను. ఐ హోప్ తొందరగా జాబ్ దొరుకుతుంది అని…. ”

ఇంకా అశ్విన్ మాటలు పూర్తికాకుండానే “ఏంటి? పెళ్లి అయ్యాక వర్క్ చేస్తావా? మాకు చాలా ఆస్తులున్నాయి. పైగా నేను బానే సంపాదిస్తున్నాను. సో నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు” నిర్మొహమాటంగా శ్రద్ధ చెప్పింది.

“అంటే ఇంత చదువూ చదివీ…” అన్న తన మాటలను శ్రద్ధ మధ్యలోనే ఆపేసి “మా ఇంట్లో ఒప్పుకోరు దీనికి. నాకు కూడా సదభిప్రాయం లేదు. గట్టిగా చెప్పాలంటే యు కనాట్ వర్క్. ఆలోచించుకో ” అంది.

“అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. కిందకి వెళ్లి చెప్పేద్దాం ఇది కుదరదు అని” అశ్విన్ నిశ్చయంగా అన్నాడు.

“అబ్బో ! సరే, ఆడపిల్లని నాకేంటి భయం? నీకే చెడ్డ పేరు. నీ ఇష్టం ఇంక !” అనుకుంటూ కిందకి వెళ్లి శ్రద్ధ తన పేరెంట్స్ తో “అమ్మా, ఈ పిల్లాడికి పొగరు ఎక్కువలే. బాగా ఫాస్ట్ కూడా. మనకి సరిపోరు వీళ్ళు పదండి” అని బయటకి వెళ్ళిపోయింది శ్రద్ధ. తన వెంటే పిల్ల తల్లిదండ్రులు వెళ్ళిపోయారు.

ఈ హటాత్ పరిమాణానికి ఎలా స్పందించాలో తెలియక ఛాయ సోఫాలో కూలిపోయింది.

“ఛి వెధవ. ఎన్ని సంబంధాలు తీసుకురావాలిరా? మాకెందుకు ఈ శిక్ష? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా?” రవీంద్ర బాధతో అరిచాడు.

“నేనేం చేశాను డాడీ? నాకు జాబ్ చేయాలని ఉంది అన్నాను. అది వాళ్ళకి ఇష్టం లేదు” అని అశ్విన్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడు.

“మాటకి మాట ఎదురు చెప్పటం బాగా నేర్చుకున్నావే? నిన్ను అనవసరంగా కన్నాము మేము” అని రవీంద్ర కోపంగా అన్నాడు.

తను విన్నది నిజమేనా అని సందేహం కలిగి “ఏమన్నారు డాడీ?” అని అశ్విన్ సీరియస్ గా అడిగాడు.

“మాకు కూతురు పుడుతుంది అనుకుంటే నువ్వు పుట్టావురా. ఎన్ని అబద్ధాలు ఆడుంటానో, మగపిల్లాడు పుట్టాడు. దేవుడా అప్పుడే ఏదోకటి చేసుండాల్సింది. నువ్వు మాకు ఎక్స్ట్రా. అదనపు బరువు” రవీంద్ర ఆవేశంతో అన్నాడు.

“నిజమా అమ్మా? మీకు కూతురు కావాలా నువ్వు చెప్పు” అని తల్లి దగ్గరకెళ్ళి దీనంగా అశ్విన్ అడిగాడు.

ఛాయ సమాధానం చెప్పలేదు. అశ్విన్ వైపు కూడా తిరిగి చూడలేదు. ఈ మౌనాన్ని తట్టుకోలేక అశ్విన్ తన రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

ఒక గంట పోయాక అశ్విన్ రూం నుండి ఒక వికృతమైన శబ్దం వినిపించటంతో అటు వైపు రవీంద్ర పరిగెట్టాడు. తలుపు తట్టాడు, అశ్విన్ ని పిలిచాడు, అరిచాడు. తలుపు లోపల నుండి లాక్ చేసి ఉంది, పైగా అశ్విన్ నుండి ఏం సమాధానం లేదు. మెల్లిగా భయం మొదలయింది. ఇంక లాభం లేదు అని తలుపును తెరవటానికి గట్టిగా ప్రయత్నించాడు. పది నిముషాలు కష్టపడితే తలుపు తెరుచుకుంది. లోపల అశ్విన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది చూసిన రవీంద్ర కెవ్వ్ అని అరుస్తూ అక్కడే బొమ్మలాగా నిలుచుండిపోయాడు. ఇది గమనించిన ఛాయ, రవీంద్ర దగ్గరకొచ్చి.....
“యావండి యావండీ, లేవండి”

“హే, ఏమైంది?” రవీంద్ర అయోమయంగా అడిగాడు.

“ఏమైంది ఏవిటి నా మొహం. గట్టి గట్టిగా అరుస్తున్నారు నిద్రలో. ఆ వెధవ హారర్ సినిమాలు చూడొద్దు అంటే వినరు. ఏం పీడకల వచ్చిందో ఏమో, చాలా భయంకరంగా అరిచారు మీరు” అని ఛాయ అంది.

“ఇదంతా ఒక కల? అయ్యబాబోయ్!” అని వెంటనే లేచి తన మొబైల్ ఫోన్ తీసి, మర్చిపోయేలోపల కలలో ఏమి జరిగిందో గుర్తున్నంతవరకు రాస్కున్నాడు.

“ఛాయా, నా కల చెప్తాను వింటావా?” రవీంద్ర అడిగాడు.

“నాకొద్దు బాబూ. అసలే వొట్టి మనిషిని కాను. ఇంకొన్ని నెలలలో మీకు మరో అత్తగారు పుడుతుంది” అని ఛాయ నవ్వుతూ అంది.

“దానికి సంబంధించిందే. ప్లీజ్ విను. చాలా వెరైటీ గా వచ్చింది కల” అంటూ తన కొచ్చిన కలని వివరంగా చెప్పాడు.

మొత్తం విన్నాక ఛాయ “కల అదిరింది. నేను ఆఫీసర్, మీరు హౌస్-హస్బెండ్. అదేదో సినిమాలో లాగా మన పాత్రలు తారుమారు అయ్యాయి. పాత్రల పేర్లు కూడా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం బాలేదు. నాకు చావులు ఇష్టం ఉండవు. సినిమా డైరెక్టర్ కి కథ పంపినపుడు మార్చేద్దాం లెండి” అని టీజ్ చేసింది.

“నీకు జోక్ లా ఉంది కదా?” అని రవీంద్ర సీరియస్ గా అడిగాడు.

“లేకపోతే ఏంటండి? కలలని సీరియస్ గా ఆలోచించకూడదు. మనం సైన్స్ ని నమ్మేవాళ్ళం. ఇంక ఆ విషయం వదిలేయండి” అని అనేసి వెళ్ళిపోయింది.

బిజీ డాక్టర్ అయినా కూడా ఆదివారాలలో రవీంద్ర అవసరముంటేనే హాస్పిటల్ కి వెళ్తాడు. ఆ రోజు ఆదివారం కాబట్టి రోజంతా బాగా లేజీగా గడిచింది. రవీంద్ర లాప్టాప్ ని వదనలే లేదు. నిద్రపోయే ముందు ఛాయ రవీంద్రతో “మీరు ఆలోచించారో లేదో కానీ, మీ కల గురించి నేను బాగా ఆలోచించగా నాకు కొన్ని డౌట్స్ కలిగాయి. అడగనా?”

“హ హ, అడుగు” రవీంద్ర అన్నాడు.

“అసలు మీ కలకి ఏంటి కారణం?”

“నువ్వు ప్రెగ్నంట్ అని తెలిసి మనం డాక్టర్ దగ్గరకెళ్ళినప్పుడు మనం అడగకుండానే ఆవిడ స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్పింది. మనం ఎంతో సంతోషించాం. అదే ఉత్సాహంతో హాస్పిటల్ కి మరుసటి రోజు వెళ్ళానా, వెళ్ళగానే విద్య, అదే మెటర్నిటీ స్పెషలిస్ట్, తన రూం నుండి గట్టిగా మాటలు వినిపించాయి. ఆ వైపు వెళ్లి చూస్తే, ఒక బస్సు డ్రైవర్ అట, కూతురు పుట్టబోతోంది అని తెలిసి అబోర్షన్ చేయిన్చుకోమన్నాడు భార్యని. ఆవిడ ససేమిరా అంది. నాకెందుకు ఈ గొడవ అనుకోని నా రూంకి వచ్చేసాను. లంచ్ టైం కి విద్య కలిసినపుడు అడిగాను ఏమైంది అని. ఆ డ్రైవర్ తన భార్యని ఒప్పించేశాడు అబోర్షన్ కి. విద్య చాలా బాధ పడింది. ‘ఫిమేల్ ఇంఫాన్టిసైడ్’ గురించిన ఆర్టికల్స్ చూపించింది. ఇలా ఆడపిల్లలను భూమి మీద పుట్టకుండా ఆపేస్తే ఒక వంద ఏళ్ల తరువాత మొత్తం ప్రపంచ జనాభాలో 25% మాత్రమే ఆడవాళ్లు ఉంటారుట. అప్పటినుండి నేను ఆ విషయం మీద తెగ ఆలోచించాను. అలా అలా నా ఆలోచనలు బహుశా నా కలకి దారి తీసుంటాయి”

“ఎంత దారుణమండి! ఎప్పుడూ పేపర్ లో చదవటమే కాని, ఒక రియల్ లైఫ్ కేసు అనమాట ఇది. ఇలా పుట్టకముందే ఆడపిల్లల ప్రాణాలు తీసేస్తే మీ కలలో లాగే శాస్తి జరుగుతుంది. అన్నట్లు కలలో ‘దృశ్యం ’ అని ఏదో అన్నారు, ఏంటది?”

“నాకు ఇప్పుడు చాలా లీలగా గుర్తుంది కల. నా కల ప్రకారం అబ్బాయిలు భవిష్యత్ కాలంలో అంటే 2090 లో బలహీనులుగా ఉంటారు, అదే ఇంగ్లీష్ లో ‘ది వీకర్ సెక్షన్’ అనమాట. అన్నిటిలోనూ ఆడవాళ్ళ దే రాజ్యం. సింపుల్ గా చెప్పాలంటే సోషల్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్త్రీలు పురుషులుగా, పురుషులుగా స్త్రీలుగా బ్రతకడం. అందుకే నా కలలో రవీంద్ర వంటింట్లో, ఛాయా ఏమో ఆఫీసు నుండి రావడం కనిపించాయి. నాకు గుర్తుండి 2014 వరకు ఆడపిల్లల మీద దాడులు, స్త్రీలకు నచ్చని పనులని వాళ్ళ చేత ఎలా చేయించారు, అసలు స్త్రీలకు సంబంధించిన దురాగతాల వీడియోలు అన్నీ ఒకే సినిమాగా చేసి, ఆ సినిమాని భవిష్యత్ కాలంలో ఉన్న అబ్బాయిలకి చూపించి తప్పు చేస్తే మీకు ఇలాగే జరుగుతుంది, ఇలాంటి శిక్షే పడుతుంది అని భయపెట్టేందుకు ఉపయోగించేవారేమో! ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. అదీ దృశ్యం సంగతి. నీకు తెలుసు కదా, ఒక మనిషిని ఒక గదిలో ఒంటరిగా ఉంచి, ఒకే వీడియో ని మళ్లీ మళ్లీ చూపించటం ఎంత మెంటల్ టార్చరో. అదే విపరీతమైన ‘బ్రెయిన్ స్టార్మింగ్’ అన్నమాట. సైకలాజికల్ గా దెబ్బ తింటారు. చిన్న తప్పుకి ఒక్క సిట్టింగ్. పెద్ద తప్పుకి ఎక్కువ సిట్టింగ్లు అంటే రక్తం కక్కుకుని చచ్చేంత ఘోరమైన శిక్ష. శారీరక హింస కన్నా, మానసిక హింస ప్రమాదకరం, బాధాకరం కూడా. అందుకే ‘దృశ్యం’ అనేది మరణ శిక్ష అంతటిది అన్నట్టుగా అనిపించింది. అయినా కల కదా, ఏమైనా జరగవచ్చు”

“దృశ్యం గురించి తలచుకుంటేనే భయమేస్తోంది. నేను నా కూతురిని లక్షణంగా పెంచుకుంటానండి. మీ ఈ కలని ఇలా వదిలేయకుండా, ఏదోకటి చేయాలండి”

“పోద్దునేమో ఆలోచించకండి అన్నావ్ మరి?"

“ఆడవాళ్ళం ఎన్నో అంటాము. నేను నిజంగా చెప్తున్నాను. ఈ సమాజం పట్ల కొద్దో గొప్పో బాధ్యత ఉన్నవాళ్ళం, పైగా మనం చదువుకున్న వాళ్ళం. చంటి పిల్లలకి ఊపిరి రాకుండా ఆపేవాళ్ళను మాయం చేయాలి”

“నిజమే. ఈ కలని నేను పాజిటివ్ గా తీస్కుంటున్నాను ఛాయా! ‘ఆడపిల్లని కాపాడుకుందాం’ (Save A Girl Child) ఇలాంటివి ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో ఇవాళ అంతా కూర్చొని మన పేర్లను నమోదు చేశాను. ఇంకా చేస్తాను కూడా. మన చేతనైనంత సహాయం మనం చేద్దాము. యు డోంట్ వరీ”

“అసలు మీ కలని, ముఖ్యంగా ‘దృశ్యం’ గురించి వివరంగా చెప్తే అలాంటి పనులు చేసే మూర్ఖులు కూడా భయపడి మారిపోతారు” అని అంటూండగా, రవీంద్ర తన చెయ్యిని పట్టుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చి “హ్యాపి ఉమెన్స్ డే ఛాయా” అన్నాడు.

అప్పుడే డేట్ మారిపోయిందా అని అనుకోని “థాంక్స్ అండ్ సేమ్ టు హర్” అంటూ ఛాయ తన పొట్టవైపు చూపిస్తూ సిగ్గుపడింది.

యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః |

యత్రైతాస్తు నపూజ్యంతే, సర్వాః తత్రాఫలాః క్రియాః ||

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ