ఎలమంచమ్మ తల్లి దయ - బాడిశ హన్మంతరావు

yalamanchamma talli daya

రాత్రి పదిన్నరయింది. హుజూర్ నగర్ లో బస్సు దిగాడు వెంకట్రావ్. ఎప్పుడో ఉదయమనగా బయల్దేరితే ఇప్పటికి దిగాడు. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరం లో వున్న గూడెం వాళ్ళ సొంతూరు. బతుకుతెరువు కోసం కర్నూలు దగ్గర లోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు సొంతూరి దగ్గరలో పని వెతుక్కుందామనుకుంటూనే నాలుగేళ్ళనుండి అదే కంపెనీలో ఒక మోస్తారు జీతం తో నెట్టుకొస్తున్నాడు.

ప్రతి రెండేళ్ళకోసారి వాళ్ళ ఊరిలో జరిగే ఎలమంచమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. వారం కిందనే భార్యాపిల్లలు కూడ గూడెం వచ్చారు. నాలుగు రోజులు సెలవు పెట్టి తనూ బయలుదేరాడు. వీటిలో రెండు రోజులు రానుపోను ప్రయాణానికి చెల్లు. అందుకే ఎప్పుడు సొంతూరు వద్దామన్నా నెత్తిమీద కొండంత బరువు పెట్టుకున్నట్లు ఉంటుంది. ఇక్కడి నుండి గూడెం వెళ్ళాలంటే ఆటోలోనో లేదా కాలినడకనో వెళ్ళాలి. అడ్డదారిన పడితే రెండు కిలోమీటర్ల దూరంతగ్గుతుంది. ఆటోలో పోతే బానే వుంటుంది కానీ కనీసం తన ఒకరోజుకు పడే జీతం ఆవిరయినట్టే జేబులో చూసుకున్నాడు. 240 రూపాయలు వున్నాయి. ఆటోలో పోవడానికి మనసొప్పలేదు.

పిల్లలకు డజను అరటిపండ్లను తీసుకున్నాడు. సెల్లుఫోనులో టైం చూసాడు. పదకొండు కావస్తోంది. గట్టిగా ఏదిస్తే అర్ధగంటగూడానికి హుజార్ నగర్ కి మధ్యలో ఒక పంట కాలువ దాటాలి. ఊరి ముందు తాటి తోపులో నుండి కాలిబాట. సెల్లులో టార్చిలైట్ వుంది. ఒక మాదిరి వెలుతురు వస్తుంది. చార్జింగ్ తక్కువున్నత్తూంది. పర్వాలేదు. అవసరమైనప్పుడు పురుగుపుట్ర జాగ్రత్తలకు ఉపయోగపడుతుంది. చూపు తన చేతులపై పడింది. వేలికి మామగారు పెళ్ళికి పెట్టిన ఎరుపు రాయి ఉంగరం. భార్యకు అదంటే చాలా ఇష్టం.

"పోయిన తిరునాళ్ళకు వచ్చినప్పుడు ఇదే దారిలో రాములు మామను ఇద్దరు దొంగలు పట్టుకుని జేబులో సొమ్ము, ఉంగరం దోచుకోవడమే కాకుండా తమకు గిట్టుబాటు కాలేదని నాలుగు వడ్డించారి కూడా. గుండెలు గుబగుబలాడాయి. తల విదిల్చాను. ఎప్పుడో జరిగిందని ప్రతీసారి జరుగుతుందా" తర్కించుకున్నాడు.

తననెవరైనా గమనిస్తున్నారా అని అటు, ఇటు జాగ్రత్తగా చూసి, పండ్లు కొనగా డబ్బులు మడతపెట్టి లోపల జేబులో పెట్టుకున్నాడు. వేలి ఉంగరం లాగాడు మామగారి వ్యవహారిశైలి లాగానే ఓ పట్టాన మాట వినలేదు. తిప్పలు పడి మొత్తం మీద వేలి నుండి బయటకు లాగాడు. ఓ క్షణం గట్టిగా ఆలోచించాడు. మొలతాడుకున్న పిన్నీసు తీసి దాంతో మోకాలి కింద పాంట్ కింది భాగం లో బట్టకు ఉంగరం గుచ్చి పెట్టాడు. "అమ్మయ్య, దీన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు, మహా అయితే డబ్బులు పోతాయి, బంగారం మాత్రం బద్రం, ఈ రోజుల్లో కొనాలంటే వేల రూపాయలు పోయాలి" అనుకుని రెండు కాళ్ళకు పని పురమాయించాడు.

చల్లటి గాలి వీస్తుంది. పంటకాలువ ఒడ్డమ్మటి సమాధులు తెల్లగా కనబడుతున్నాయి. అదిరే గుండెలు చిక్కబట్టుకొని అడుగులేయసాగాడు. భయం తగ్గడానికి సినిమా హీరోయిన్ లను, ఇంకా తన కుర్ర వయసులో విన్న, చూసిన , చేసిన రకరకాల సంఘటనలను గుర్తుతెచ్చుకుంటు నడుస్తున్నాడు. అదేమిటో వద్దనుకున్న దెయ్యం కథలే గుర్తుకొస్తున్నాయి. తను చదువుకున్న హై స్కూలు చదువు తెలివికి, దెయ్యాలు లేవనిపిస్తున్నా, ఈ సమయం లో అవి వుండే అవకాశం వుందేమో అని అనుమానం మొదలయ్యింది.

"శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం" అని (స్తోత్రం లో అంతవరకే వచ్చుమరి) మాటి మాటికి అనుకుంటూ, నడవసాగాడు. ఓరి అవతలి ప్రక్కనున్న యలమంచమ్మ గుడి వైపు, నెగళ్ళ నుండి వెలుతురి పల్చగా వస్తోంది. అమ్మయ్య, తాటి తోపు దగ్గరికి వచ్చాడు. అసలు గండం ఇదే.. ఇది దాటితే ఊళ్ళో పడ్డట్లే. తోపులో నుండి గాలి ఈల వేస్తోంది. పెద్ద ధైర్యం వున్న వాళ్ళలా కథలు చెపుతాం కానీ, చుట్టూ చీకట్లో, నడి మధ్యలో ఒక్కరమే వుండి, చుట్టూ గాలి సంగీత కచేరీ చేస్తుంటే అప్పుడుంటుంది మన కథ.

యహపో.. ఊరి దగ్గరికి వచ్చాం, గట్టిగా కేక వేస్తే ఊళ్ళోకి వినపడుద్ది. ఇంక భయమేమిటీ?" సెల్ ఫోన్ చూసాడు సిగ్నల్ లేదు. మరిచిపోయాడు తను వాడే నెట్ వర్క్ కి ఇక్కడ సిగ్నల్ వుండదు. ఇక్కడుండేది తను పని చేసే చోట వుండదు. అడుగులు గబ గబ వేయసాగాడు.

ఇమతలో కాలికేదో తగిలి దూరంగా పడ్డట్టనిపించింది. లైట్ అటు వేశాడు మసక వెళుతురులో ఏదో మెరుస్తూ కనపడింది చటుక్కున వంగి తీశాడు.

"అమ్మో, ఉంగరం. తనది పొద్దేమో అని జాగర్త పడుతోంటే తనకే ఇక్కడ మరో ఉంగరం .. గిల్టుదేమో ఒకవేళ బంగారమే కావచ్చుగా.. పాపం ఎవరిదో .. తెల్లారిన తరువాత ఎవరిదో తెలుసుకుని ఇవ్వచ్చులే" చకచకా నడవసాగాడు.

"ఎంత, ఏడెనిమిది గ్రాముల బరువుంటుందా?.. బంగారందైతే ఎంతలేదన్నా పాతికవేలు.. జేబులోని వుంగరాన్ని తడుముకున్నాడు. ఏదో చప్పుడయింది. ఉలిక్కిపడ్డాడు. సెల్లు లైటు అటు వేశాడు. పందికొక్కు.. తాటి తోపులోకి ఉరికింది.

మళ్ళీ అలోచనలు ముసురుకున్నాయి. "పాతకవేలతో ఏమేం కొనుక్కోవచ్చు?.. ఇంట్లో టీవి లేదు.. దాదాపు అందరిళ్ళల్లో వుంటున్నాయి. పెద్దాడు రోజూ స్కూలుకి నడిచివెళ్తున్నాడు..."

యలమంచమ్మ తల్లి దయ .. తల్లిదయ వుండబట్టే ఎవరికో కాకుండా తనకు దొరికింది"

తెల్లవారి గూదెంలో తెలిస్తే నాదే అని ఎవరైనా వస్తారేమో?"

"తనకు కాకుండా వేరే ఓరు వాళ్ళకి దొరికితే యిస్తారా? అసలు దొరికిన సంగతి తెలుస్తుందా?"

"అమ్మోరు తల్లి ఇచ్చిన అదృష్టాన్ని జార విడుచుకుంటామా?

ఎవ్వరికి చెప్పకూడదు.. భార్యకు తప్ప ఇంట్లో కూడా ఎవ్వరికీ చెప్పకూడదు" నిర్ణయించుకున్నాడు.

వేగం గా అడుగులు వేశాడు. చూస్తుండగానే, తాటితోపు దూరం అవుతోంది. వెనుక ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వెనక్కు తిరిగిచూడాలనుకున్నాడు. తిరగలేకపోయాడు.

"అదిగో సత్యం బాబాయ్ ఇల్లు, పక్కనే తమ ఇల్లు. గూడెం వచ్చింది. అంత చలిలోనూ చేతులకు చెమట్లు పడుతున్నాయి. పాంట్ జేబులో వున్న ఉంగరం పై చేయి పెట్టి పరిగెత్తినట్లుగా ఇంట్లో పడ్డాడు.

అలికిడికి భార్య లేచింది. "ఏమయ్యా! ఇంత ఆలశ్యమయింది. చీకటంటే మాలావు బయ్యం గదా.. బానే వచ్చావే.. ఎక్కడున్న పడుకుని తెల్లారగట్లా వస్తవేమో అనుకున్న కళ్ళు నులుముకుంటూనే నవ్వింది. అల్లా ఎకసెక్కాలాడుతున్నప్పుడు పెళ్ళాం తనకు భలే నచ్చుద్ది.ఎగపోత ఓప్రిని అణుచుకుంటూ, మొహానికి పట్టిన చెమట్లు తుడుచుకుంటూ, కాళ్ళు కడుక్కోడానికి గాటు దగ్గరికి వెళ్ళాడు."ఎంకటా.. ఏవయినా తింటడేమో పెట్టు" అలికిడికి లేచిన అత్త పడుకునే అన్నది.

సరే అత్తా! అని ఏమయ్యా.. తింటావా? మొగుడ్ని అడిగింది.

"అబ్బ, ఇప్పుడేం వద్దులేవే, అర్ధరాత్రి వేళ దెయ్యాల మాదిరి ఏం తింటాం? అంటూ వసారాలో దండెం మీది లుంగీ తీసుకుని కట్టుకున్నాడు.లోపలి గదిలో వేసిన పక్క మీదకు చేరాడు. పిల్లల తల నిమురుతూ దొరికిన ఉంగరం సంగతి గుసగుసగా చెప్పాడు. లేచి పాంట్ జేబులో నుండి ఉంగరం తీసి భార్య చేతిలో పెట్టాడు.

భార్య దానిని రెండు వేళ్ళతో పట్టుకుని పరీక్షగా చూసింది. అటు తిప్పింది, ఇటు తిప్పింది. ఇక ఒకటే నవ్వసాగిఉంది. ఏప్పూడొచ్చాడో.. ఏడో తరగతి చదివే పెద్దకొడు కూడా తల్లికి వంత కలిపాడు.

"నీ వుంగర ఏది నాన్నా? ఇటియ్యి చేయి చాపాడు.

వెంకట్రావ్ వంగి పాంట్ కింద తడుముకున్నాడు. పిన్నీసు లేదు, ఎర్రరాయి ఉంగరమూ లేదు. బిక్క మొహం వేశాడు. తను అనుకున్న మాటలన్నీ చకచకా రీలులా మనసులో గిర్రున తిరగాయి. ఏదో నష్టం వచ్చినట్లు దిగులుగా అనిపించింది.... సిగ్గుగా కూడా..

."ఎలమంచమ్మ తల్లి దయ. మన వస్తువు పోలేదు.. ఐనా మనయి మనకు మిగిలితే చాలయ్యా, కలిసొచ్చే అదృష్టం మనకు రాదు. వచ్చినా వద్దు.

'కొడుకు మెడ చుట్టూ ఎడమ చేయి వేసి, మరో చేత్తో మొగుడి తల మీద మురిపెం గా మొట్టింది.

" అబ్బా! తల రుద్దుకుంటూ ఇద్దరినీ చేతులతో చుట్టాడు వెంకట్రావు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు