రాజు వేసంగి సెలవులకి ఊళ్ళో వుండే వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళాడు.
రాత్రి భోజనాలయ్యాక పున్నమి వెన్నెట్లో అందరూ ఆరు బయట మంచాలేసుకుని పడుకుని కబుర్లుచెప్పుకుంటున్నారు.
"తాతయ్యా..మనింట్లో వున్న ఆ పెద్ద మామిడి చెట్టు ఎవరు..ఎప్పుడు నాటారు?"అడిగాడు రాజు.
"ఓహ్! అదా..దానిపేరు రామయ్య మామిడి చెట్టు" అన్నాడాయన నవ్వుతూ.
"రామయ్య మామిడి చెట్టా? అదేంటి తాతయ్యా దానిపేరు అలావుంది?" లేచి మంచంపైన బాసింపట్టు వేసుకుని కూర్చుని ఆశ్చర్యంగా అడిగాడు.
"చెబుతాన్రా..మరేమో అప్పుడు నేను నీ అంత చిన్న పిల్లవాడిని..మీ నాన్న కానీ..నువ్వు కాని పుట్టలేదన్నమాట. అప్పుడు మా నాన్న ఈ ఇంట్లో ఒక వాటాని రామయ్యా అనే అతనికి అద్దెకిచ్చాడు. రామయ్య చాలా మంచివాడు. అందరికీ సహాయం చేస్తూ తలలో నాలుకలా వుండేవాడు. అతడు ఒకనాడు మా నాన్న దగ్గరకు వచ్చి ’అయ్యా! మనింటి చుట్టూ ఉన్న స్థలమంతా మొక్కల్లేక బోసిపోయి వుంది. అందుచేత మీరనుమతిస్తే నేను నాలుగురకాల పూల..పళ్ళ మొక్కలు నాటుతాను..ఇంటికి కళ వస్తుంది.’ అన్నాడు. మా నాన్నగారేమో ’సరే! నాకేం అభ్యంతరం లేదు’ అన్నాడు.
రామయ్య జామ, మామిడి, సపోట, పనస లాంటి చెట్లతో పాటు బంతి, చేమంతి, మల్లె, కనకాంబరం మొదలగు పూలమొక్కలు నాటడమే కాకుండా వాటికి చక్కగా కుదుళ్ళు తీయడం, ఎరువులేయడం, నీళ్ళుపోయడం చేసేవాడు. అవి ఏపుగా పెరిగి మా ఇంటి అవసరాలకి ఎంతగానో ఉపయోగపడేవి. మా నాన్నగారికి రామయ్య మీద మంచి అభిమానం ఏర్పడింది. ఆయన అప్పుటికప్పుడే ’రామయ్యా..మొక్కలు నాటి ఈ ఇంటికి కళా..కాంతి తీసుకొచ్చావు..ఈ చెట్లు తర తరాలకీ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని ప్రతి చెట్టు పేరు మొదట్లో నీ పేరు చేరుస్తాను. అలా ఈ ఇంట్లో నీ పేరు శాశ్వతం అవుతుంది’ అన్నాడు.
అలా ఈ ఇంట్లోని ప్రతిచెట్టు రామయ్య చలవే! ఆ మహానుభావుడు ఇప్పుడున్నాడో..లేడో కాని మనం ఆయన్ని తల్చుకున్నాము. అందుకని నువ్వు కూడా మీ ఊరెళ్ళింతర్వాత మొక్కలు నాటు, అవి ముందు ముందు ఎంతోమందికి నీడనిస్తాయి. కాయలు..పళ్ళూ ఇస్తాయి.. వైద్యానికి ఉపయోగపడతాయి." అన్నాడు.
"అలాగే తాతయ్యా! నేను మొక్కలు నాటడమే కాకుండా మా పాఠశాలలోని స్నేహితులకి కూడా నువ్వు చెప్పింది చెప్పి మొక్కలు నాటిస్తాను."అన్నాడు ధృడంగా.
"అలాగే కన్నా..మరి పడుకో..ఇప్పటికే ఆలస్యమైంది" అన్నాడాయన నిద్రకు ఉపక్రమిస్తూ.