తనదు మాలిన ధర్మము. - కన్నెగంటి అనసూయ

tanadumalina dharmamu

ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు, ఒక చిన్న చెట్టు రెండూ పక్క పక్కనే ఉండేవి.

అయితే ఈ చెట్లు అడవికి మొదట్లో ఉండటంతో ఆ వైపుగా ఎవరు అడవిలోకి వచ్చినా ఆ రెండు చెట్ల కింద నుంచే వెళ్ళేవారు. ఆ అడవికి రోజూ కట్టెలు కొట్తుకుని జీవించే ఒక ముదుసలి పేదవాడు వచ్చేవాడు. సాయంత్రం దాకా అతి కష్టం మీద కట్టెలు కొట్టి, వాటన్నింటిని కట్టలు కట్టి తల మీద పెట్టుకుని సందె వేళకు మెల్లగా మొయ్యలేక మొయ్యలేక మోస్తూ ఇంటిదారి పట్టేవాడు.

రోజూ అతన్ని గమనిస్తున్న చిన్న చెట్టు “పాపం..పచ్చి కట్తెలు కదా ..మొయ్య లేక మొయ్యలేక మోస్తున్నాడు ..అతన్ని చూస్తే జాలేస్తుంది..నాకు ఏదైనా సహాయం చెయ్యాలని ఉంది “ అంది పెద్ద చెట్టుతో..

“ ఆ పని మాత్రం చెయ్యకు. నువ్వెంత సహాయం చేసినా మనిషి మారడు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటాడు. పెట్టిన చేతినే కొడతాడు. అతనిని నమ్మకు. ” అంది పెద్ద చెట్టు. “ అయినా అతనికి నువ్వేం సహాయం చెయ్య గలవు? “ అని కూడా ప్రశ్నించింది.

“ పాపం అంత ముసలి వయసులో గొడ్దలితో పుల్లల్ని నరకటం బాధేస్తుంది. అందుకే ఆ కష్టం లేకుండా రేపు అతను వచ్చే సమయానికి నాలో ఎండిపోయి ఉన్న కొన్ని కొమ్మల్ని కిందకి పడేస్తాను. కొట్టక్కర లేకుండానే ఏరుకుని పట్టుకుపోతాడు .కొంత కష్టమైనా అతనికి తగ్గుతుంది కదా “ అంది చిన్న చెట్టు.

“ నువ్వు చెప్పింది బాగానే ఉంది..ఎండిన మన కొమ్మలు మనకి అడ్దమే. అయినా ఒక్క రోజు వెయ్య గలవు. రెండు రోజులు వెయ్యగలవు. రోజూ వెయ్యలేవు కదా..

“ నా దగ్గర ఉన్నంత వరకూ ఇస్తాను..ఆ తర్వాత అతనికి సహాయం చెయ్యమని అడవిలోని చెట్లన్నింటికీ చెప్తాను..రోజుకొక చెట్టు తన ఎండు కొమ్మల్ని ఇచ్చినా అతనికి సరిపోతాయి కదా..అలా మళ్ళీ మన దగ్గరకి తిరిగి వచ్చే సరికి మరి కొన్ని కొమ్మలు మనలో ఎలాగూ తయారవుతాయి..” అంది చిన్న చెట్టు. అంతా విన్న పెద్ద చెట్టు..

“ తనకి మాలిన ధర్మము మొదలు చెడ్డ భేరమని అతని బాధలేవో అతన్ని పడనియ్. అప్పుడే అతనికి కష్టం విలువ తెలుస్తుంది. పెద్దల మాట సద్ది మూట అన్నారు. నీకంటే పెద్దదాన్ని చెబుతున్నాను. వింటే బాగుపడతావ్” అని వదిలెసింది.

అయితే పెద్ద చెట్టు మాట చిన్న చెట్టు వినలేదు. అతనికి సహాయం చెయ్యాలనే నిశ్చయించుకుని ఈ విషయాన్ని మిగతా చెట్లన్నింటికీ చెప్పింది. చిన్న చెట్టు చెప్పినదంతా విన్న ఆ చెట్లు..

“అవును .. అలా చేస్తే బాగానే ఉంటుంది. మన పచ్చి కొమ్మలు కొట్టకుండా కాపాడుకోవచ్చు. మనకు పనికి రానివి అతనికివ్వనూ వచ్చు..” అని చిన్న చెట్టు మాటకి సరేనన్నాయి. దాంతో మహాదానందపడిపోయిన చిన్న చెట్టు ఆ మర్నాడు ఆ ముసలి వాడు వచ్చే సమయానికి తన ఎండు కొమ్మలు కొన్ని విరిగి కింద పడిపోయేట్టుగా వేగంగా అటూ ఇటూ కదిలింది. ఆ వేగానికి ఆ చెట్టు మీది ఎండు కొమ్మలన్నీ టప టపా కింద పడ్డాయి. ఇక అప్పట్నించీ ముసలివాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడసాగింది.

ఎప్పట్లానే ఆమర్నాడు ముసలివాడు కట్టెల కోసమని అడవికి వచ్చాడు. వస్తూనే ఎండు పుల్లల్ని చూసి తెగ ఆనందపడిపోయాడు. గబా గబా వాటన్నింటిని ఏరి కట్టలు కట్టుకుని రోజూ కంటే ముందే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు.

అతని ముఖం లోని ఆనందాన్ని చూసి సంతోషపడిపోయిన చిన్న చెట్టు పెద్ద చెట్టు వైపు గర్వంగా చూసింది.

“ముందుంది ముసళ్ల పండుగ..అప్పుడే ఏమయ్యింది..” అంది పట్టించుకోనట్టుగా..ఎంతో అనుభవజ్జ్ఞురాలైన పెద్దచెట్టు.

అది మొదలుగా రోజూ అలా ఉదయాన్నే కట్టెల కోసమని ముసలివాడు అడవికి రావటం, ఏదో ఒక చెట్టు కింద గుట్టల గుట్టల ఎండు పుల్లలు రాలి పడి ఉండటంతో కష్టపడక్కర్లేకుండానే సంతోషంగా వాటిని తీసుకుని వెళ్ళిపోవటం చేస్తున్నాడు.

అయితే ఒకనాడు ఆ ముసలాడు వస్తూ వస్తూ కూడా తన వెంట ఒక కుర్రవాణ్ని తీసుకు వచ్చాడు. ఇద్దరూ తిన్నగా వచ్చి చిన్నచెట్టు కింద నిలబడ్డారు. తల పైకెత్తి చెట్టు కేసి కాసేపలాగే పరిశీలనగా చూసి.. ముసలివాడు కుర్రవాడితో అన్నాడు..

“ ఈ చిన్న చెట్టు మీద ఎండిన పుల్లలు బాగా ఎక్కువగా ఉన్నాయి. జమిందారు గారి ఇంట్లో పెళ్ళి దగ్గరకి వచ్చేసింది. ఈ చెట్టుని కొడితేనే జమిందారు ఇంట్లో పెళ్ళినాటికి ఎండు కట్టెలను అందచేయగలం. ఇక్కడ్నించి మన ఊరి పొలిమేరలు దగ్గర కూడాను. “ అన్నాడు చిన్న చెట్టు చుట్టూరా తిరిగి మరింత పరిశీలనగా చెట్టునే చూస్తూ..

అది విన్న చిన్న చెట్టు భయపడిపోయి పెద్ద చెట్టు వైపు చూసింది..” ఇది విన్నావా?” అన్నట్టు.

విన్నానన్నట్టుగా తల పంకించిన పెద్ద చెట్టు చిన్న చెట్టు వైపు వెటకారంగా చూస్తూ..

“ చూశావా..అప్పుడు నేను చెప్పింది విని వుంటే నీకీ పరిస్దితి వచ్చి ఉండేది కాదు. అతని పనేదో అతన్ని చేసుకోనివ్వక నీ అంతట నువ్వే కట్టెలు కిందకి జార విడచి అతన్లో ఆశలు పెంచావ్. అతనికి జమిందారు రూపంలో మంచి బేరం వచ్చింది. నిన్ను నిలువునా నరికెయ్యాలని మనిషిని తీసుకువచ్చాడు. మనిషి అంతే..మేలు చేసిన వాటిని గుర్తించడు..అతనికి కట్టెలే కాదు పూలూ, పళ్ళూ, ఆకులూ, కాయలూ, గింజలూ, సర్వం మనమే ఇస్తున్నాం. ఏ వయసులో , ఏ కాలంలో అతనికి ఏ పండు అవసరమో.. ఏ పువ్వు అవసరమో ఆయా కాలాల్లో అవి ఇస్తున్నాం.అయినా అతనికి విశ్వాసం ఉండదు..అతను వదిలిన గాలి మనం పీల్చి అతనికి అవసరమైన గాలిని క్షణాల్లో తయారు చేసి అతనికి బ్రతుకునీ మనమే ఇస్తున్నాం..ఇవన్నీ మరచి మన ఉనికికే భంగం కలిగిస్తున్నాడు..” అని పెద్ద చెట్టు చెప్పే సరికి ..

“ నిజమే..” అంటూ భోరున విలపించి “ ఇప్పుడెలా ..ఈ ప్రమాదం నుంచి గట్టెక్కటం” అంది చిన్న చెట్టు.

“ బాధ పడకు..” వాళ్ల సంగతి నేను చూసుకుంటాలే..అంటూ ఆ విషయాన్ని అందరికీ తెలియపరచి

ఒక్క ఉదుటున అప్పటికప్పుడు పెద్ద గాలి దుమారాన్నే స్రష్టించింది..మిగతా చెట్లన్నీ దాన్నే అనుసరించాయి. దెబ్బతో భయపడిపోయిన ఆ కట్టెలు కొట్తే వాళ్లిద్దరూ ఏదో పెద్ద ప్రళయమే ముంచుకు రాబోతుందని .. అదే గనుక జరిగితే ఇక్కడ్నించి వెళ్లటం కష్టమని హడావిడిగా తిరుగు పయనమయ్యారు.

వాళ్లలా వెళ్ళిపోవటం చూసి “ హమ్మయ్య ..గండం గట్టెక్కింది..” అనుకుని ఊపిరి పీల్చుకుంది చిన్న చెట్టు..

“ అందుకే పెద్దవాళ్ల మాట సద్దిమూట అన్నారు పెద్దలు..ఇంకెప్పుడూ అలవిమాలిన ధర్మం చెయ్యకు..ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం వాళ్ల వల్ల సంభవిస్తే ఇలాగే ఏదో ఒక ఉపాయంతో బయటపడదాం..” అంది పెద్ద చెట్టు.

“ అలాగే..” అంది చిన్న చెట్టు క్రతజ్జ్ఞతగా పెద్ద చెట్టు వైపు చూస్తూ..

మరిన్ని కథలు

Manam
మనం
- మణి
Kanumarugai
కనుమరుగై
- ఐసున్ ఫిన్
Vaaradhulu
వారధులు
- Bhagya lakshmi Appikonda
Vaarthallo headloinega
వార్తల్లో హెడ్లైన్సా
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Goppa manasu
గొప్ప మనసు
- సరికొండ శ్రీనివాసరాజు
O magaadi katha
ఓ మగాడి కథ
- జి.ఆర్.భాస్కర బాబు
Kotta oravadi
Kotta oravadi
- Prabhavathi pusapati
Kallu nettikekkayi
కళ్ళు నెత్తి కెక్కాయి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు