నేరము- శిక్ష - కర్లపాలెం హనుమంతరావు

neramu - shiksha

పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మగారికి అలవాటు. ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు నగర పొలిమేరల్లోని ఒక ఇంటితలుపు తట్టారు కృష్ణవర్మమహారాజు.

ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది. ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుంటుంబం అతనిది. ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేసాడా రాత్రి.

భోజనం ముగించి.. పడుకునే ముందు బాటసారికి, బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది.

మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని రాయలవారితో దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను ఏకరువు పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు.

అంతా సావకాశంగా విన్న రాజావారు "అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా! న్యాయ పర్యవేక్షణ, చట్టం అమలు వంటి విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ ఉద్యోగులను నియమించారు కదా! వారి ప్రవర్తనల్లో లోపం కలిగితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం న్యాయం కాదు" అని వాదనకు దిగారు.

"కావచ్చు కానీ.. ప్రజలకు వాటితో పనిలేదు. అంతంత లోతులు ఆలోచించ లేని అమాయకులకు వారు. సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి చలవ వలనే అని ఎలా నమ్ముతారో.. శాంతి భద్రతలు కరువైనప్పుడూ అలాగే రాజుగారి వైపు వేలెత్తి చూపిస్తారు. శరీరానికి దెబ్బ తగిలితే.. గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా.. ఆ ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం! ఉద్యోగే అన్యాయం చేసినా.. అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే ఆ నిందను భరించక తప్పదు. సత్పరిపాలన అంటే సచ్చరితులను గుర్తించి సరైన పదవుల్లో నియోగించుకోవడమే" అన్నాడా బ్రాహ్మణుడు.

రాయలువారు ఆలోచనలో పడ్డారు.

"చెప్పడం సులభమే. పదవి చేతిలోకొచ్చిన తరువాత గాని అసలు నైజం బైటపడదు. ఎవరిదాకానో ఎందుకు.. మీకే గనక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికే మచ్చా రాకుండా భాధ్యతలు నిర్వహించగలరా?" అని అడిగారు చివరికి.

బ్రాహ్మణుడే మాత్రం తొట్రు పడలేదు. " మహారాజు గారి నమ్మకాన్ని వమ్ము చేయననే అనుకుంటున్నాను" అన్నాడు. ఆ సంభాషణ అంతటితో ముగిసి పోయింది.

మర్నాడు ఆ బ్రాహ్మణుణ్ని కృష్ణవర్మమహారాజు కొలువుకి పిలిపించారు.

రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజా వారే అని అప్పటికి గాని గ్రహింపుకి రాలేదు బ్రాహ్మణుడికి. "నేటి నుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాము. న్యాయం 'తు..చ' తప్పకుండా పాటించడ మెలాగో మీరు నిర్వహించి చూపించాలి. గడువు నెల రోజులు. గాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది. తల కోటగుమ్మానికి వేలాడటం ఖాయం. బీరాలు పలికి చివరికి కార్యభీరువులయే వారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. అంగీకారమైతే వెంటనే అంగుళీకమును అందుకోవచ్చు" అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని ముందుకు చాచారు కృష్ణవర్మమహారాజు.

క్షణకాలం మాత్రమే ఆలోచన. ఆ రాజముద్రను అందుకుని భక్తిగా కళ్లకద్దుకొన్నాడు పేదబ్రాహ్మణుడు. నగర కొత్త న్యాయాధికారిగా రామశాస్త్రి పేరు ప్రకటింపబడింది. రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే.

సగం గడువు తీరిపోయింది. నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇప్పుడు. మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి. దోషులను విచారించడంలోను, దండనలు విధించడంలోను, శిక్షల అమలును పర్యవేక్షించడంలోను.. రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితీ, నిష్పక్షపాతం, నిబద్ధత రెండోవారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలు పెట్టాయి. నేరస్తులు జంకుతున్నారు. నిందితులు తప్పించుకునే కొత్తదారులు వెదుకుతున్నారు. శిక్షల రద్ధుకోసం పూర్వం అవలంబించిన అడ్దదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బందీలు.

కొత్తన్యాయాధికారికి జనం 'జేజే'లు పలకడం నగరసంచారంలో కృష్ణవర్మమహారాజు స్వయంగా గమనించారు. మహారాజా వారు రామశాస్త్రినే రాజ్యం మొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో కొచ్చేసింది ఎలాగో. అప్పుడు జరిగిందా విచిత్రం.

పనిమీద దేశాంతరం పోయిన ఒక వ్యాపారి అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది. భార్య చాలా తాత్సారం చేసి గానీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడకగదిలో మంచం కింద మరొక మగమనిషి నక్కి కనిపించాడు. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వాడికీ, ఇంటియజమానికీ మధ్య పెద్ద పెనుగులాట అయింది. ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి మగమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఇప్పుడు హతుడి భార్య న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

"ఆడమనిషి చనువు ఇవ్వకపోతే మొగవాడనే వాడికి అర్థరాత్రి ఇంట దూరే ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? భర్త వుండీ పరాయి మగవాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష.. ముందుగా" అని విగతజీవుడి భార్య వాదన.

కొట్టి పారేయదగింది కాదు.

"నాకే పాపమూ తెలీదు. ఈ మనిషి ముఖం కూడా ఎన్నడూ చూసి ఎరగను. వీడు ఎప్పుడు ఇంట్లోకొచ్చాడో.. పడకగదిలో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు తెలీదు. నా బిడ్డమీద ఒట్టు. తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచి నిద్రలో వుండటమే. మా ఇంటాయన ఆ సమయంలో వస్తాడని నేనేమన్నా కలగన్నానా?"అని భోరుమంది. కన్నబిడ్డమీద ప్రమాణం కూడా చేసి చెప్పిందా ఇల్లాలు. కల్లిబొల్లి కథలుగా శంకించడం సబబు కాదు.

"నిజానికి ఆ దుర్మారుడే నన్ను చంపాలని చూసాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి విసిరిన మాట నిజమే. కాని.. వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. గాయ పరిచి చట్టానికి పట్టిద్దామన్నదే నా ఆలోచన. చేతికి గురి చూస్తే కత్తి గొంతులో దిగబడింది.." అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని. ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరుంది. విచారణలో ఏ మాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంది.

రామశాస్త్రికి మొదటిసారి ధర్మసంకటం ఏర్పడింది.' న్యాయానికి భార్య ఉండీ.. పరాయిస్త్రీ కోసం వెంపర్లాడిన ఆ కాముకిడికి తగిన శిక్షే పడింది. కాని దాని పర్యవసానం అమాయకురాలైన వాడి భార్యమీదా పడింది. వ్యాపారి భార్యమీద ఆరోపించిన కాముకత్వానికి రుజువులు లేవు. చట్టప్రకారం శిక్షించడం కుదరదు. సహజన్యాయం దృష్టితో చూస్తే.. తన కాపురంలో నిప్పులు పోయబోయిన దుర్మార్గుడిని ఆత్మగౌరవం గల ఏ మగవాడూ ఉత్తిపుణ్యానికి సహించి వదిలి పెట్టలేడు. నిజంగా వాణ్ని చంపినా వ్యాపారికి పాపం అంటుకోరాదు.

కాని ఇది న్యాయస్థానం. న్యాయం ఇక్కడ కొన్నిచట్రాల పరిధిలో మాత్రమే ఇమిడి నిర్థారింపబడుతుంది. కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ఒక నిండుప్రాణం గాలిలో కలసిపోయింది. దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇదే అదనుగా తన మీద గుర్రుగా ఉన్నతతిమ్మా న్యాయాధిపతులు మహారాజుగారికి ఫిర్యాదులూ చేయవచ్చు. తన తలను గురించి కాదు కానీ .. రాజ్యం మళ్ళీ పూర్వసంక్షోభంలో చిక్కుకుంటుందేమోనన్నదే దిగులు. ముందు ముందు సమాజానికి ఈ తలతో చేయవల్సిన సేవ ఎంతో వుంది. ఈ చిన్న కారణంగా ఆ పెద్ద సామాజికభాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు.'

ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెల్లారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు గాని నిశ్చింతగా నిద్ర రాలేదు శాస్త్రికి.

మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్య చకితులను చేసింది. ' ఘటన పుర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట ఈ నేరం మొత్తానికి పూర్తి భాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మమహారాజు గారే అని నిర్ధారించడమైనది. దేశాంతరం పోయిన చిరువ్యాపారి చేసే పని తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం. దేశీయంగా తగిన మద్దతు దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా గాలికి వదిలి దేశాలు పట్టి పోరు.

మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణం. స్వయంకృషితో నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గం ఒకటి దేశంలో వర్ధిల్లుతున్నది. వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది. తిన్నదా అరగదు. కొవ్వా కరగాలి. రకరకాల దోవల్లో యావలు తీర్చుకోవడానికి తాపత్రయాలు పడుతుంటారు. సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగేది ఇలాంటి నడమంత్రపు సిరిపోగైన వాళ్ళే. చట్టాలు వీరికి చుట్టాలు. న్యాయం ఆంటే మహా అలుసు ఈ దుర్మార్గులకి. పాపాత్ములకి ఏ శిక్షలూ పడని ఈ అస్తవ్యస్త వ్యవస్థకూ సర్వొన్నతాధికారి అయినందు వల్ల మహారాజుగారే భాద్యత వహించాలి'.

'కట్టుకున్న వాడితో కలసి బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే లలన మెట్టినింట్లోకి అడుగు పెట్టేది. కలకాలం పక్కనే ఉంటానని ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న మగవాడు కలలో తప్ప కనపడని దుస్థితి దాపురిస్తే పడతులందరూ ఒకే రీతిలో స్పందించరు. కడుపు నిండిన వాడు అన్నం దొంగిలిస్తాడా? బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిది నేరం ఎలాగో.. ఏలిన వారి దోషం ఇక్కడ అలాగా'.

మూడు తప్పులకూ మూలకారణం మహారాజుల వారే కనక మరణ దండనే వారికి సరైన శిక్ష. నిందితుడే స్వయంగా, బహిరంగంగా మహారాజా వారి మీదకు కత్తి విసిరాలి. ఆ తరువాత ఆ నేరంమీద వ్యాపారికీ యథేచ్చగా ఉరిశిక్ష అమలు చేయవచ్చు. హతుడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా అప్పుడే సాధ్యమని ఈ న్యాయస్థానం భావిస్తున్నది'

రామశాస్త్రి తీర్పు పుట్టించినంచిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రజలు తీర్పుకి అనుకూలంగా.. ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీలి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. అంశం మహారాజుగారి మరణదండనకు సంబంధించింది కనక ఆ చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది. తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు.. కలవారి విచ్చలవిడి తరహా బతుకులు.. ఆడవారి జీవితాల్లో జరుగుతున్న అన్యాయాల్లాంటి ఎన్నోసామాజిక సమస్యలు మేదావివర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్య్లుల అవగాహనా స్త్జాయి పదును తేలింది. న్యాయస్థానాల్లో, శాంతిభద్రతల రక్షణ యత్రాంగాల్లో అప్పటి వరకూ లోపాయికారీగా సాగుతోన్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చకు గురవుతున్నాయి.

రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే.

మహారాజుగారూ 'తీర్పుకి కట్టుబడి ఉంటాన'ని ప్రకటించడంతో చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది. న్యాయవ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనికవర్గాలకున్న ధీమా మొత్తం ఒక్కసారి కుప్పకూలింది.రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి. బహిరంగ వధ్యశిల ఏర్పాటు చేయబడింది. రాచపరివారం సమస్తం వెంటరాగా మహారాజు గారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలి వచ్చారు.

శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త. చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉండని అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జన సమూహాలో విరగబడి వచ్చాయి. .

ఎక్కడ విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన స్మరణే. ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించే కృష్ణవర్మ మహారాజస్థానాన్ని వారసులు ఎంతవరకు పూరిస్తారోనన్న నిరాశ. మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది. రాములవారికి ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా?

చర్చలు ఇలా పలురకాలుగా సాగుతుండగానే.. చీకటి పడింది. తీర్పులో విధించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని మరణ వేదిక మీదకు తీసుకొచ్చారు. అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు.

ఎదురుగా తలమీద ముసుగుతో చక్రవర్తులు.. ప్రాణాలు అర్పించడానికి సిద్ధబడి ధీరోదాత్తంగా నిలబడి వున్నారు.ప్రకటన వెలువడింది "వ్యాపారీ! తీర్పు ప్రకారం నువ్వు మహారాజుగారి మెడమీదకు ఈ కత్తి విసరాలి. ఒకే ఒక్క వేటుతో మహారాజుగారి ప్రాణాలు పోవాలి. విసురూ!" అంతటా హాహాకారాలు.

వజవజా వణుకుతూ చేతిలోని కత్తి బలంగా విసిరాడు వ్యాపారి . గురి తప్పనే తప్పింది. మెడకు తగలాల్సిన కత్తి భుజానికి రాసుకుని కింద పడింది. తీర్పులో వ్యాపారికి ఇచ్చింది ఒకే ఒక్క అవకాశం కనక మహారాజుగారు సురక్షితం.అంతటా ఆనందంతో కేరింతలు.ప్రజాభిమానానికి కదలి పోయారు కృష్ణవర్మ మహారాజు. ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను? జన సంక్షేమానికి మరింత ప్రాథాన్య మివ్వాలని ఆ క్షణంలోనే కృతనిశ్చయానికొచ్చారు మహారాజు.

ఇదంతా రామశాస్త్రి చిత్రమైన తీర్పు కలిగించిన బుద్ధివికాసం. "నిజమే కానీ.." అంటూ అప్పటి వరకూ తనను తొలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బైట పెట్టారు మహారాజా వారు " అర్థరాత్రి పరాయి యింట్లోకి ఆ దుర్మార్గుడు దూరింది ఎందుకో నిర్ధారణ కాలేదు. ఆ ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వచ్చమైందో రుజువు కాలేదు. వ్యాపారి 'దుర్మార్గుడిని కావాలని చంపలేదు.. నిర్దోషిన'ని బుకాయిస్తున్నాడు. ఆ మాటల్లోని నిజాయితీ పాలు నిగ్గు తేల్చలేదు. తప్పు చేసిన వాళ్ళందరిని గాలికి వదిలేసి సంఘటనతో ఏ మాత్రం సంబంధం లేని… నాకా శిక్ష? వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాకపోబట్టి తడబడ్డాడు. లేకపోతే.."

మధ్యలోనే అందుకొని ముగించాడు రామశాస్త్రి "అతను తడబడ లేదు మహారాజా! గురి చూసే విసిరాడు. అది తప్పింది. అతని గురే అంత. కుడికన్నులో దృష్టిలోపం ఉంది. ఆ లోపం కారణంగానే ఆ రోజు రాత్రి ఈ వ్యాపారి చేతిలో ఆ దుర్మార్గుడి ప్రాణాలు పోయాయి. దుర్మార్గుణ్ని గాయ పరిచి వదిలేద్దామన్న ఉద్దేశంతోనే వ్యాపారి కత్తి విసిరిని మాట వాస్తవమే. దృష్టిలోపం దుర్మార్గుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. నిజానికి అలాంటి నీచులు బతికి ఉండటం వల్ల అమాయకులకే మాత్రం మనశ్సాంతి ఉండదు. వ్యాపారి భార్య ఒంటరిగా ఉండటం చూసి, నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటి మాటున చాటుగా వచ్చి పడక గదిలో దూరాడు. ఆ పాపంలో ఆమెకే భాగం లేదు. ఆ కాముకుడి చరిత్ర.. ఆ ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తరువాతనే నేనీ రకమైన శిక్ష ఖరారు చేసింది.'

'సంఘటన విచారణకు వచ్చినప్పుడు ఆ వ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు. సాక్ష్యాలనీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి. నా మనస్సాక్షి ఒక్కటే అతడికి అనుకూలం. వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది. కానీ సాక్ష్యాలుగా అవి చాలవు. వ్యాపారిని శిక్షించకుండా వదిలేస్తే నా తల కోటగుమ్మానికి వేలాడితే చూడాలని వువ్వీళ్ళూరే వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఇప్పటి వరకూ ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు చక్కబడుతున్నాయి. నా తలను గూర్చి నాకు బెంగ లేదు కానీ.. తమ మంచితనం వల్ల నాకు దక్కిన ఈ అవకాశాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని ఆత్రం మాత్రం ఉంది. ముందు ముందు నా విరోధులు మీ మనసు విరిచే ప్రమాదం ఉంది. అందుకే .. ఏ సంబంధం లేకపోయినా ఈ వ్యవహారంలో మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది. మీ ముందు అనుమతితోనే అనుకోండి. వ్యాపారి దృష్టిలోపం మీద ఒకసారి మీకు నమ్మకం కుదిరితే .. ఇక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని శంకించరన్న నమ్మకమే నా చేత ఈ సాహసం చేయించింది. మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైంది. ఇదీ నా సంజాయిషీ. ఇప్పుడు మీరే శిక్ష విధించినా శిరసావహించడానికి సిద్ధం మహారాజా!"

మందహాసం చేసి అన్నారు మహారాజు "నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన వాడిని వూరికే వదిలి పెట్టడం కల్ల. శిక్ష ఖాయం. అమలుకు గడువు దాకా వేచి చూడటం దేనికి? రేపే ముహూర్తం. సామాన్యులకు మా ద్వారా మరింత న్యాయం జరిగే అవకాశం ఇవ్వండి! మా ముఖ్య సలహాదారులుగా చేరడమే మీకు తగిన శిక్ష " అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మాహారాజు .*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు