‘‘ లోకల్ ట్రెయిన్లలోనూ ఈ ఆకతాయిల బెడద తప్పటం లేదు. రోజూ రైలుప్రయాణం విసిగెత్తిస్తోంది....
రైలు ఫ్లాట్ ఫారం మీదకు వచ్చీ రాగానే.. గబుక్కున లోపలకి ఎక్కాను. గుమ్మం దగ్గర ఎవరో కావాలనే నన్ను తాకారనిపించింది. ఇబ్బందిగా అనిపించినా పట్టించుకోకుండా ముందుకు నడిచాను.
కంపార్టుమెంటంతా కిక్కిరిసిపోయి ఉంది. మనిషి అటూఇటూ కదలటానికి చోటులేదు. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బోగీ ఉన్నా అది సరిపోక మామూలు బోగీల్లో ఎక్కక తప్పటం లేదు.
ఏదో స్టేషనులో రైలు ఆగినట్టుంది.
చాలా మంది ఎక్కారు.
మనిషి నిలబడే సందు లేదు. ఫ్యాను గాలి అందటం లేదు. చెమటతో తడిసి శరీరం ముద్దయిపోయింది. మగవాళ్లమధ్య నిలబడటం ఇబ్బందిగా ఉంది.
కాస్త తేరిపార చూస్తే.. దూరంగా బుర్ఖా ధరించి ఉన్న కొందరు ఆడవాళ్లు గుంపుగా ఓ చోట నిలబడి కనిపించారు.
మెల్లగా జనాల్ని దాటుకుంటూ అక్కడికి చేరాను.
ఏ మాటకామాట చెప్పుకోవాలి.ఇరుకు రోడ్ల మీద అడుగడుగునా ట్రాఫిక్ జామ్ లను ఎదుర్కొంటూ.. సిటీ బస్సుల్లో గంటల తరబడి ప్రయాణించటం కంటే ఈ లోకల్ ట్రెయిన్లు సౌకర్యవంతం.
మూడునిముషాలకోమారు రైలు ఆగటం.. మళ్లీ కదలటం .. చకచకా స్టేషన్లు కదలుతున్నాయి.
నా వెనక ఎవరో తాకుతున్నట్టనిపించింది. గబుక్కున తలతిప్పి చూశాను.
ఎవరూ కనిపించలేదు.
అందరూ బుర్ఖాల్లో ఉన్న మహిళలే.
నేను అలా చూడటం వల్లనేమో.. కాస్త సర్దుకున్నారు.
‘హమ్మయ్య .. అని . నేను స్థిమితపడేలోగా.. మళ్లీ ముందుకొచ్చారు.
రైలు కుదుపులకి అన్నట్టు.. వెనక్కి జరిగినట్టే జరిగి ఈసారి దాదాపుగా నన్ను ఆనుకుని నిలబడ్డారు
చేతుల్ని ..నడుం మీదుగా.. సీటు మీదకు జార్చి.. .. ఏదేదో చేస్తున్నారు.
‘‘ అక్కడున్నది అందరూ ఆడవాళ్లే. మగవాళ్ల కంటే అదో రోగం. ..వీళ్లకేమొచ్చింది... ’’చిర్రెత్తుతోంది నాకు.
అటూ ఇటూ కదలటానికి లేదు. పూర్తిగా బంధించినట్టుగా ఉంది.
ఓపికపట్టలేకపోతున్నాను.
శరీరంమీద విషపురుగు పాకిన భావన. అంతే..నా చేతిని వెనక్కి జరిపి... అవతల చేతిని వినురుగా ఓ నెట్టు నెట్టాను.‘‘ ఎవరది.. దూరంగా జరగండి. మనిషి మీద నుంచుని గానీ ప్రయాణం చేయలేరా?’’
గట్టిగా కేకలేశాను. అంతకు మందెప్పుడూ అంత గట్టిగా మాట్లాడి ఎరగను.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.
క్షణాల్లో నాకు కుడి వైపున బుర్ఖాలు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు తమ ముసుగులు తొలగించి... నా వెనక ఆనుకుని నిలబడి ఉన్న వ్యక్తిని దొరకపుచ్చుకుని గుంపులో నుంచి బయటకు లాగారు.
ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడేం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి.
‘ఈ ఇద్దరూ మహిళా పోలీసులేమో’నాకు అర్ధం కాలేదు.
పిడికిలి బిగించి ఆ వ్యక్తి కడుపులో గుద్దారు.‘‘ రాస్కెల్.. ఇన్నాళ్లకు దొరికావు.. నీ దోస్తు వాడేడీ..’’ నిలదీశారు.వాడు విలవిలలాడుతూ.. పక్కనున్న బుర్ఖా వ్యక్తిని చూపించాడు.ఇద్దరినీ పక్కపక్కన నుంచో పెట్టి.. బలవంతంగా వాళ్లిద్దరి ముసుగులు తొలగించారు.ఇద్దరికీ పాతికేళ్ల లోపుంటాయి. నల్లగా ఉన్నారు. చూడగానే రౌడీ వెధవలన్న భావం కలుగుతుంది ఎవరికయినా.
‘‘ఈ బుర్ఖాలు వేసుకుని వచ్చి ఆడవాళ్లలో చేరి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నమాట’’ అనుకున్నాను.
‘‘ఆడవాళ్లలో కలిసిపోయి బంగారం, డబ్బులు లాంటివి దొంగిలించటం వీళ్లకి అలవాటు. గంట క్రితం ఎవరో తమ పాప నెక్లెస్ పోయిందని ఫిర్యాదు చేశారు. ఈ బోగీలోనే వీళ్లు ఉన్నట్లు గుర్తించి వలపన్నాం... ’ అన్నారు ఆ ఇద్దరు మహిళలు.‘‘ మమ్మల్ని చూడగానే జారుకుంటారని.. మేం కూడా వీళ్లలాగే బుర్ఖాలు ధరించి వచ్చాం’’ అన్నారు.
‘‘ మొత్తానికి భలే పట్టేశారు’’ ప్రశంసాపూర్వకంగా అన్నారెవరో...
‘‘నిజమే. గొప్పవిషయం. అయితే అందరూ బుర్ఖాల్లో ఉంటే..
దొంగల్ని ఎలా కనిపెట్టగలిగారో?’’ సందేహం వచ్చిందినాకు.
దానికి వాళ్లిద్దరే సమాధానం చెప్పారు.‘‘ఆ ఆకతాయిలిద్దరూ ఆడవాళ్లలా బుర్క్షా ధరించినా.. సాధారణంగా మగవాళ్లు వాడే హవాయి చెప్పులు వేసుకున్నారు. ఈ చెప్పుల్ని బట్టే గుంపులో ఉన్నా వీళ్లు మగవాళ్లని సునాయాసంగా గుర్తించగలిగారట.కేసు ఛేదించి దొంగల్ని పట్టుకోగలిగామన్న విజయగర్వం వారి మాటల్లో తొంగి చూస్తోంది.
‘‘ గతంలో ఓ సారి ముంబయ్ లోకల్ ట్రెయిన్లలో కూడా దొంగలు సరిగ్గా ఇలాగే పట్టుపడ్డారు. వీళ్లని పట్టుకోటానికి ఇదే వ్యూహాన్ని అమలు చేశాం’’ అన్నారు.
వాళ్ల తెలివి తేటలకు మేం ముచ్చట పడ్డాం.‘‘ మేము ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన షీ- బందం సభ్యులం.మేం పోలీసు దుస్తులు ధరించం. అందరి మధ్యలోనే తిరుగుతూ నేరగాళ్ల ఆనుపానులు కనిపెడతాం. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించే వారెవరయినా సరే అంతు చూస్తాం’’.. అన్నారు.
స్టేషన్ రాగానే ఆకతాయిలిద్దరిని దింపి తమ వెంట తీసుకుపోయారు.నాకు థ్రిల్లింగ్ గా అనిపించింది.పోలీసులు ఇలాంటి చర్యలు తరచూ చేపడితే తప్ప...
ఈవ్ టీజింగ్ కేసులు తగ్గుముఖం పట్టవు’’ అనుకుంటూ వాళ్లు వెళుతున్న వైపు అలా చూస్తుండిపోయాను.