అది ఒక ఎత్తైన కొండ. దాన్ని తాకుతూ పారుతోంది ఒక జలపాతపు ధార. పొద్దున మొదలెట్టి ఎలాగో కష్టపడి ఆ కొండ ఎక్కేసాను. ఈ కొండ ఎక్కింది రికార్డు లు బద్దలు కొట్టడానికి కాదు. పై నుంచి దూకి జీవితాన్ని అంతం చేసుకోడానికి వచ్చిన ఒక సాధారణ మనిషి నేను. ఆత్మహత్య చేసుకోడం తప్పు అని తెలిసినా తప్ప లేదు. ఈ జీవితం పెట్టిన కష్టాలు కన్నీళ్లు తెప్పించాయి. ఈ సమాజం చేసిన నష్టాలు మానసిక క్షోభ కి గురి చేసాయి. నీళ్ళు లేక బోర్లు ఎండిపోయినట్టు కన్నీళ్లు రాక నా కళ్ళు పొడిబారిపోయాయి. వర్షా కాలం ఎండలు మండినట్టు గుండెల దగ దగ మండి పోయింది. జీవితం మీద విరక్తి తో చావు నే పరిష్కారం గా ఎంచుకున్నాను. నా చావు న్యూస్ ఏ టివి చానల్ లో telecast అవ్వొద్దు, బ్రతికున్నప్పుడు చూపని సానుబూతి చనిపోయాక ఎక్కువగా చూపించే సమాజానికి నా చావు అందనంత దూరం గా వచ్చాను. కొండ చివరన నిలుచున్నాను. ఊపిరి గట్టిగా పీల్చుకున్నాను. దూకడానికి కావల్సిన ధైర్యం గుండెల నిండా నింపుకున్న. సరిగ్గా అప్పుడే ఇలాంటి జీవితం ఇచ్చిన దేవుడు గుర్తొచ్చాడు. ఆకాశం వైపు కోపం గా చూసాను.
ఓ దేవుడా నువ్వు ఎక్కడ వుంటావో ఎవరికీ తెలీదు. నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు నీ కోసం అందరూ ఆకాశం వైపు చూస్తారు. నువ్వు నిజం గా వుంటే నా శాపం నీకు తప్పకుండా తగులుతుంది. ఒక్క సారి మధ్య తరగతి మనిషి గా పుట్టి చూడు తెలుస్తుంది మేము ఇక్కడ పడే కష్టాలు. ఆల్రెడీ పుట్టాను అంటావు ఏమో!. భూమి మీద కూడా మళ్ళీ దేవుడి గా పుట్టడం కాదు, మనిషి లా అంటే నాలా పుట్టి చూడు తెలుస్తుంది. ఎందుకయ్యా నన్ను పుట్టించి చేతులు దులిపేసుకున్నావు. పుట్టిన రోజే అమ్మని తీసుకొని వెల్లావు. అమ్మ పాలు తెలియదు, మురిపాలు చూడనివ్వలేదు. చేయి పట్టుకొని నడిపించాల్సిన వయస్సులో నాన్న ని తీసుకొని వెళ్లిపోయావు. దారి చూపించే నాన్న లేక ఎక్కడంటే అక్కడ నడిచి కాళ్ళకి ముల్లు గుచ్చుకొని రక్తం కారుతున్నా కనికరం కలగ లేదు నీకు. ఇక అమ్మ నాన్న లేరు అనగానే బంధువులు కూడా రాబంధువులు అయిపోయారు. నేను ఎవరో తెలియనట్టే నటించారు. కనీసం నా బాధ్యత తీసుకోలేదు సరి మిగిలిన ఆస్తి ని మా నాన్న వాళ్ళ దగ్గర చేసిన అప్పుకు కి సమం చేశారు. నన్ను అనాధశ్రమం లో చేర్పించి ఒంటరి వాడిని చేసారు. ఎంత ఏడ్చానో కదా! ఒక్క సారి కూడా నీ మనస్సు కరగలేదా! దేవుడివి నువ్వు రాలేవు సరే .. నా చుట్టూ వున్న ఎవరైనా ఓదారుస్తారు అని చూసాను. నాకన్నా వాళ్ళే ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే లా రెండు చేతులు నా కన్నులు తుడిచాయి. ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావు అని ప్రేమ గా పలకరించాయి. అమ్మ కోసం అని చెప్పడానికి అమ్మ ప్రేమ ఎరుగను. నాన్న సగం లోనే తిరిగి రాని లోకం కి వెళ్లిపోయాడు అని కోపం. నా తలరాత ని ఆయనకే అర్ధం కాకుండా వ్రాసాడు అని దేవుడి మీద నమ్మకం లేదు. ఎందుకోసం ఏడుస్తున్నానో తెలియకుండానే ఏడుస్తున్నాను. ప్రేమగా పలకరించిన ఆ అక్క చేతులు నాకు మొదటి సారి గోరు ముద్దలు తినిపించాయి. మళ్ళీ కన్నీల్లే వచ్చాయి. కానీ అవి ఆనంద బాష్పాలు అని ఆ వయస్సులో నాకు తెలీదు. ఒడి లో పడుకోపెట్టుకొని జోల పాడింది. నా జీవితం నాకు మళ్ళీ దక్కినట్టే అనిపించింది. ప్రేమ గా ఒక్కరు పలకరించినా జీవితం మీద మళ్ళీ ఆశ కలుగుతుంది అనిపించింది.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. అర్ధ రాత్రి మెలుకవ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటి. అక్క అని పిలిచాను. సమాధానం లేదు. పక్కనే లేదు. చీకటి లోనే గోడ ని సాయం చేసుకొని ముందుకు నడుస్తున్నాను. ఒక కిటికీ దగ్గర కొంచెం వెలుతురు కనిపించింది. అటువైపు అడుగులు వేసాను. కిటికీ లోంచి వెలుతురు వైపు చూసాను. మొట్ట మొదటి సారి చీకటి లోంచి వెలుతురు ని చూసి భయం వేసింది. అక్కడ ఏమి జరుగుతుందో అర్ధం చేసుకొనే వయస్సు లేదు. నన్ను ప్రేమ గా పలకరించిన మనిషి మీద ఒక పశువు దాడి చేస్తోంది. నన్ను ఏడవొద్దు అని ఊరడించిన మనిషి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయినా ఆ పశువు కనికరించడం లేదు. చిన్న పిల్లని సారు నన్ను వదిలేయ్యండి అని బ్రతిమాలుతోంది. పశువు రూపం లో వున్న ఆ మనిషి కి ఆడపిల్ల కనిపిస్తోంది కానీ చిన్న పిల్ల అనిపించడం లేదు. అలసిపోయినట్టుంది కళ్ళు మూతపడ్డాయి. శాశ్వతం గా మూతపడ్డాయి. ఆ పశువు అలానే పడుకుంది. అది చూసి నేను అక్కడే పడిపోయాను. పొద్దునే కళ్ళు తెరిచేసరికి ఏదో హడావుడి కనిపించింది. మొట్ట మొదటి సారి పోలీసు ని చాలా దగ్గరగా చూసాను. న్యాయాన్ని రక్షించడమే వాళ్ళ పని అని ఊహ సరిగ్గా తెలియని వయస్సు లో మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక పోలీసు నా దగ్గరకి వచ్చాడు. నా ఎత్తుకు సరిపోయేలా నా ముందు కూర్చున్నాడు. రాత్రి ఏమి జరిగిందో చూసావా అన్నాడు. అవును అని నేను ఊపుతున్న తల ని మధ్య లోనే తన రెండు చేతుల తో గట్టిగా పట్టి ఆపేసాడు. నువ్వు ఏమి చూడ లేదు. చూసినా అది ఇప్పుడే ఈ క్షణమే మరచిపోయావు. ఒక చాక్లెట్ నా నోట్లో వేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మొట్ట మొదటి సారి అలా నోట్లో వేసుకున్న చాక్లెట్ చేదు గా అనిపించింది. వెంటనే ఉమ్మేసాను. ఆంబ్యులెన్స్ సౌండ్ విని ఆ వైపు పరిగెట్టాను. అందులోకి నన్ను ప్రేమ గా పలకరించని అక్క వెళ్లిపోతోంది. నా వైపే చెయ్యి చాపి నన్ను కూడా రమ్మని పిలుస్తున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు అర్ధం కాలేదు. నేను మళ్ళీ అనాధనే. మళ్ళీ ఏడుపు వచ్చింది. ఈ సారి నా చేతులే కన్నీళ్లని తుడిచేసాయి.
ఇక అప్పటి నుంచి జీవితం అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాను. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. నడిచేప్పుడు పడిపోతే లేచి నొప్పి తెలియకుండా కసి గా పరిగెట్టే వాడిని. తినే అన్నం లో నిర్జీవం గా వున్న పురుగుల్నీ పక్కకి నెట్టేసి తినడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడైనా రాత్రి పూట మెలుకవ వచ్చినప్పుడు కిటికీ లోంచి వస్తున్న వెలుతురు వైపు వెళ్ళాలి అనిపించ లేదు. ఎందుకంటే నా తో పాటు దేవుడు వి నువ్వు కూడా చూస్తున్నావు కదా! నిజం ఏంటో నీకు బాగా తెలుసు. చెడు ని ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? పేరు కి అనాధ ఆశ్రమం. అక్కడ ఎన్నో అక్రమాలు జరిగేవి. అవి అర్ధం చేసుకొనే వయస్సు లేదు. బయటకి పారిపోయి బతకొచ్చు అని తెలీదు. నాకన్నా కొంచెం వయస్సు లో పెద్దయిన కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. నన్ను కూడా ఆడమన్నారు. బంతి అందకుండా ఎక్కడైనా పడితే తీసుకొని వచ్చి ఇవ్వడం. అదే నేను ఆడాల్సిన ఆట. ఒకడు గట్టిగా కొట్టిన బంతి మేనేజర్ రూమ్ లో విలువైన వస్తువుల్ని పగల గొట్టింది. బంతి ఎవరు కొట్టారు అంటే కొట్టిన వాడి తో సహ అందరి నోళ్ళు మూసుకుపోయాయి. బంతి కోసం వెళ్ళిన నా చంప మాత్రం పగిలింది. మొదటి సారి తప్పు నాది కాదు అని ఎదురు తిరిగాను. మరుక్షణమే ఆశ్రమం నుంచి గెంటివేయ బడ్డాను. గేట్ అవతల నేను. గేట్ దూకి లోపలికి వెళ్లినా మిగతా అనాధల్లో నేనొక అనాధ ని. వెనక్కి తిరిగి వెళ్లినా కోట్ల మంది జనాభా లో కూడా అనాధ నే అని వెనక్కి వెళ్ళిన నాకు తెలియడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
ఒంటరి గా తిరిగాను. అప్పుడప్పుడు నాతో తోడు వస్తాను అని కుక్కలు వెంబడించాయి. చెత్త కుప్పల్లో నాతో కలిసి తినేవి. పార్క్ లో పడుకొనేవాడిని. ఒక్కో సారి Platform మీద, footpath, పార్క్ బెంచ్ ల మీద ఆ సమయం లో ఎక్కడ వుంటే అక్కడే పడుకొనే వాడిని. ఒక్కోసారి పిర్ర మీద గట్టి లాఠీ దెబ్బ తో లేచే వాడిని. ఇక్కడ పడుకోకూడదు లే అని తరిమేసేవాళ్ళు. మరి ఎక్కడ పడుకోవాలి అని గట్టిగా అడగాలి అనిపించేది. ఒక సారి అలానే అడిగితే రెండో పిర్ర మీద కూడా పీకారు. ఆ రోజు నేను పడుకున్న ప్లేస్ పక్కనే ఒక ఏటిఎం వుంది. దాన్ని దోచుకోడానికి ఒక దొంగల ముఠా వచ్చింది. వాళ్ళని నేను చూసాను. వాళ్ళు కూడా నన్ను తిరిగి వెళ్ళేప్పుడు చూసారు. అక్కడ నేను వుండడం నా తప్పు అయ్యింది. నేను పోలీసు లకి ఎక్కడ చెప్పేస్తాను అని నన్ను కూడా పట్టుకెళ్లిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు చేసిన ప్రతి దొంగతనం లో నాకు కూడా వాటా వుంది. దొంగతనం చెయ్యడం లో మాత్రమే వాటా. దోచుకున్న దాంట్లో వాటా లేదు. చిన్న పిల్లాడ్ని అని లోకువ. తినడానికి పెట్టేవాళ్లు. అది అరిగేదాక పని చేయించుకొనే వాళ్ళు. దొంగతనం తో పాటు భయంకరమైన నేరాలు చేసేవాళ్ళు. రాత్రి పూట ఇళ్లపై దాడి చేసేవాళ్ళు. మానం , ప్రాణం, ధనం అన్నీ దోచుకొనేవాళ్లు. అప్పుడు కూడా నేను ఏమి అనే వాడ్ని కాదు. ఎందుకు అంటే? నాతో పాటు దేవుడు కూడా ఇవన్నీ చూస్తూ వుంటాడు కదా! కొన్ని రోజులకి ఆ ముఠా దొరికిపోయింది. వాళ్ళ తో పాటు నేను కూడా. నన్ను బాల నేరస్తులు వుండే జైల్ కి పంపారు.
అదే నా జీవితం లో నువ్వు చేసిన మంచి పని అని నాకు అనిపించింది. చదువుకొనే అవకాశం వచ్చింది. అక్కడ కూడా కష్టాలు వున్నాయి. కానీ ఆ కష్టాలు దాటి నన్ను ఏదో శక్తి ముందుకు నడిపింది. జైల్లోనే చిన్న చిన్న పనులు చేసాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా మంచి గా నడుచుకున్నాను. జైల్ అధికారులు కూడా సహాయం చేసారు. అక్కడే పెరిగి పెద్దవాడినయ్యాను. ప్రయోజకుడినయ్యాను. కాదు ఒక జిల్లా కి కలెక్టర్ అయ్యాను. నేను పుట్టిన ఊరు ఆ జిల్లా లోనే వుంది. నాకు చాలా కసి గా అనిపించింది. చాలా మంచి చెయ్యాలి అనిపించింది. నేను మొదట అడుగు వేసిన అనాధశ్రమం నుంచి అది మొదలు పెట్టాను. ఒకప్పుడు చిన్న పిల్లాడిని. ఎవరు నా మాట వినలేదు. ఇప్పుడు నేను ఈ జిల్లా కి రాజు ని. నేను ఏది చెప్పినా అది చేస్తున్నారు. అందరూ నన్ను దేవుడి లా చూస్తున్నారు. చాలా సంతోషం గా వుంది. పెళ్లి సంబంధం కూడా కుదిరింది. నన్ను దేవుడు అనడం దేవుడి వి అయిన నీకు నచ్చ లేదు కదా! అందుకే నా జీవితం లోకి మళ్ళీ కష్టాల్ని వదిలావు. కనిపించకుండా ఆటలాడి నన్ను అగాతం లో పడేసి నవ్వుకుంటున్నావు కదా! వస్తున్నా చనిపోయి నీ ముందుకు వస్తున్నా. నా జీవితానికి సమాధానం చెప్పడానికి సిద్ధం గా వుండు. కళ్ళు మూసుకొని లోయలోకి దూకేసాడు.
అప్పుడు గుర్తుకు వచ్చింది. తాను మంచి చేద్దాం అని చూస్తుంటే, తనని అడ్డుకున్న దుష్ట శక్తులు, వాళ్ళు పన్నిన కుయుక్తులు. పేదోడి కోసం అని కొత్త పథకాలు ప్రవేశ పెడుతారు. అవి ఎలా మింగేయ్యాలని మళ్ళీ పథకాలు వేస్తారు.. తప్పు అని నిలదీసిన నాదే తప్పు. కావల్సినంత డబ్బు ఇస్తాం అన్నారు. నాకు ఆ జబ్బు లేదు అన్నాను. చంపేస్తాం అని బెదిరించారు. నాకు చావు అంటే భయం లేదు అని చెప్పాను. ప్రమోషన్ వచ్చేలా చేస్తాం అని ప్రలోభ పెట్టారు. మనిషి గా బ్రతికితే చాలు అన్నాను. నువ్వెక్కడ మనిషివి అన్నారు. ఒక చిరు నవ్వు సమాధానం గా ఇచ్చాను. దాన్నే దోచేసుకునారు. నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నీ దగ్గరకి పంపించేశారు. నేను మళ్ళీ అనాధనే. నా చుట్టూ వల పన్నారు. మోసం చేసి నన్ను దోషి ని చేసారు. ఉద్యోగం పోయింది. దేవుడు అన్న ప్రజలే మోసగాడు అన్నారు. నేను చేసిన తప్పు మంచి చెయ్యాలి అనుకోవడమే! ఇదంతా చూస్తూ నువ్వు ఎప్పటిలాగే నిశ్శబ్దం. ఉలకవు పలకవు. అందుకే నీ దగ్గరకు వచ్చేయ్యాలి నిర్ణయించుకున్నాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్దం గా వుండు. పెద్ద శబ్దం. వెంటనే కాసేపు నిశ్శబ్ధం. అంతా చీకటి. కళ్ళు తెరిచాడు. దూరం గా ఏదో వెలుతురు. చూడలేక పోతున్నాడు. గట్టిగా ప్రయత్నించాడు. ఎదురు గా ఎవరో మనిషి నిలబడి వున్నాడు. చాలా ప్రశాంతం గా వున్నాడు. ఎవరు నువ్వు? నువ్వు పిలిచావు అని వచ్చాను అని సమాధానం. నీ కోసం ఇంత దూరం వచ్చాక ఇలా అంటున్నావు. నేను ఎవరినీ పిలవ లేదు. నాకు ఎవ్వరూ లేరు. నేను ఒక అనాధని. నా మీద ఎందుకు అంత కోపం అని అతను అన్నాడు. నాకు ఎవరి మీద కోపం లేదు అన్నాను. దేవుడి మీద కోపం అన్నావు కదా! అంటే నువ్వు దేవుడి వా. దేవుడు చిన్నగా నవ్వాడు. నేను బోరున ఏడ్చాను. నన్ను దగ్గరకి తీసుకొని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. అది భూమి మీద పడ్డ కష్టాలన్నీ మరచి పోయేలా చేసింది. నా చేయి పట్టుకొని అక్కడ నుంచి దూరం గా తీసుకొని వెళ్ళాడు.
అదొక అద్బుతమైన ప్రదేశం. చుట్టూ జల పాతాలు. పచ్చని చెట్లు. అందమైన పూల మొక్కలు. ఇక నువ్వు ఇక్కడే వుండొచ్చు అన్నాడు. అక్కడ కనిపించిన ప్రతి మనిషి ముఖం మీద చిరు నవ్వే. వాళ్ళతో మాట కలిపాను. నా మాటలు కొన్ని వాళ్ళకి అర్ధం కాలేదు. మోసం, దు:ఖం, చెడు, చంపడం, ఏడ్వడం ఇలాంటి మాటలేవీ ఇక్కడి వాళ్ళకి తెలియదు. సంతోషం, సాయం, నవ్వడం, కలిసి మెలిసి వుండడం మాత్రమే వీళ్ళకి తెలుసు. సాయంత్రం అయినా ఇక్కడ పూలు వాడిపోలేదు. జలపాతాల్లో నీళ్ళు కల్మషం అవ్వడం లేదు. నా ముఖం లో చిరునవ్వు చూసి దేవుడు సంతోష పడ్డాడు. ఇదేమి లోకం అని ఆశ్చర్యం గా అడిగాను. నేను భూమి ని అందులో మనుషుల్ని సృస్టించినప్పుడు ఇలానే చేసాను. భూమి మీద ప్రతి సారి మనిషి కి అవసరం అయినప్పుడు నేను వెళ్లాల్సి వచ్చింది. మనిషి నా మీద పూర్తి గా ఆధార పడకూడదు అని తెలివి తేటలు ఇచ్చాను. పోను పోను మనిషి నన్ను మరచిపోయాడు. నేను రాసిన గీత దాటేసాడు. మోసం నేర్చాడు. ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. పాపాలు చేస్తున్నారు. అందుకే అక్కడ పూలు వాడి పోతున్నాయి. నీరు, గాలి, ఆకాశం అన్నీ కల్మషం, మనిషి మనస్సుల తో సహ. నేను సృస్టించిన మనుషుల మీద ప్రేమ నాకు ఇంకా తగ్గిపోలేదు. అది జరిగిన రోజు భూమి మీద మనిషిని అంతం చేసే బాధ్యత నాదే. అప్పుడు మళ్ళీ పునః సృష్టి చెయ్యడానికి ఇక్కడ మిగిలిన వీళ్ళే ఆధారం. ఈ సారి మనిషి కి తెలివితేటలు ఇవ్వను. నేను నవ్వాను. నా నవ్వు చూసి దేవుడు నవ్వాడు.